ప్రశ్న: సమాజంలో పట్టి పీడిస్తున్న చెడుల్లో కుల/మత తత్వవాదాలు ప్రధానమైనవి. అసలు కులాలుగా/మతాలుగా లేదా వర్గాలుగా విడిపోవటం వల్లే కదా ప్రజల్లో ఈ రకమైన వివక్షలు బయలుదేరాయి. ఖురాన్ లో స్వయంగా దేవుడు “మేమే మిమ్మల్ని జాతులుగా, తెగలుగా విడగొట్టామని చెబుతున్నాడు”. ముస్లిముల్లోనూ వర్గపరమైన వివక్షలు ఉన్నాయి. దీనికి మీ సమాధానం.
వాట్స్ యాప్ లో ఓ సోదరుడు పంపిన ఈ ప్రశ్నకు సమాధానం:
అవును ఖురాన్ లో దేవుడు “మేమే మిమ్మల్ని జాతులుగా, తెగలుగా విడగొట్టామని చెబుతున్నాడు” ఎందుకంటే “మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవటానికి” మాత్రమే! అసలు కులాలు, వర్గాలు, మతాలుగా విడిపోవటమే తప్పుకాదా? అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. అదీ ఒకరకంగా తప్పుడు వాదనే!
సమాజంలో వృత్తులను బట్టి, వంశాలను బట్టి, విశ్వాసాలను బట్టి, భాషలు, అలవాట్లు, ప్రాంతాలను బట్టి ప్రజల్లో వర్గాలు, జాతులు, కులాలు, మతాలు అన్నవి ఏర్పడుతూ వచ్చాయి. నిజానికి వాటిని తొలగించటం అన్నది అసలు ఎప్పటికీ అసంభవమే! కాబట్టి తొలగించాల్సింది ఏమిటి? అన్నదే అసలు ప్రశ్న. వర్గ, మత, కులపరమైన వర్గీకరణ ఉండటం తప్పా? లేక ఆయా వర్గ, కుల, మత ప్రజల మధ్య ఉచ్చనీచ భావాలు చూపే కులతత్వవాదం/మత తత్వవాదం ఉండటం తప్పా? ఏది ఉండవచ్చు? ఏది ఉండకూడదు? అని ప్రశ్నించుకుంటే.. అనేక వర్గాలు, జాతులూ, కులాలు, మతాలు ఉండటం తప్పుకాదు వాటి మధ్య మేము అధికులం, మీరు అల్పులన్న ఉచ్చనీచ భావాలు ప్రదర్శించే మత/కుల తత్వమే అసలు ఉండకూడనిది.
ముస్లిం సమాజాన్ని తీసుకుంటే.. అందులోనూ సున్నీ, షియా, అహ్మదీలు, సయ్యద్ లు, ఖురైష్, ఖాన్, పఠాన్, నూర్ భాష ముస్లిములని ఎన్నో వర్గాలు, తెగలు చూడగలం. అయితే ఆ తెగలు ఉండటం తప్పా వారి మధ్య వర్గతత్వం ఉండటం తప్పా? దీనికి సమాధానం వర్గాలు ఎన్నయినా ఉండవచ్చు. ఉండకూడనిది ఉచ్చనీచ భావాలు ప్రదర్శించే వర్గతత్వమే!
ఉదాహరణకు: హిందూ ఫిలాసఫీలో చతుర్వర్ణ వ్యవస్థను తీసుకుంటే.. అక్కడ ప్రజల సామర్ధ్యాల ఆధారంగా.. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్న వర్గీకరణ చూడగలం తప్ప అది కులపరమైన వర్గీకరణ కాదు. నాలుగు సామర్థ్యాల వ్యక్తుల కలయిక ఒక పటిష్ట సమాజం నిర్మాణం (Society structure) కోసం తప్పనిసరి. వారు- 1. వైజ్ఞానికులు: వీరిని బ్రాహ్మణులు అని అభివర్ణించటం జరిగింది. అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన వారని కాదు. బ్రహ్మజ్ఞానం కలవారు అని అర్థం. సమాజంలో గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, సైంటిస్టులు, థియాలజియన్స్, డాక్టర్లు, ఇంజినీర్లు వగైరా జ్ఞాపరులైన వర్గీయులను బ్రాహ్మణులు అని అభివర్ణించటం జరిగింది. 2. రక్షణ వ్యవస్థ: సమాజాన్ని రక్షణ కలిగించే డిఫెన్స్ (రక్షణ) వ్యవస్థ తాలూకు దేహబలం వ్యక్తులను క్షత్రియులు అని అభివర్ణించటం జరిగింది. 3. ఆర్ధిక నిపుణులు: సమాజ ఆర్థికాభివృద్ధి కోసం ఆర్థిక సూత్రాలను, ప్రణాళికలను రచించే వారు/వ్యాపారస్తులను వైశ్యులు అని అభివర్ణించటం జరిగింది. 4. లేబర్/శ్రామికులు: ఎంతపెద్ద వ్యవస్థలో నైనా అది సజావుగా సాగాలంటే శ్రామికులు లేదా లేబర్ లేకుండా అది నడవదు. ఆ విధంగా సమాజంలో ఉండే శ్రామిక ప్రజలను శూద్రులు అన్నారు.
సమాజంలో ఈ నాలుగు రకాల వ్యక్తుల్లో ఎవర్ని తప్పించేసినా సమాజం సంతులనాన్ని (Balance) కోల్పోతుంది. ఒక ఇల్లు కట్టాలన్నా ఒక ఇంజినీర్ అవసరం, అది కట్టటానికి ఆర్థిక సహకారం అవసరం, అది నిర్మించటానికి శ్రామికులు అవసరం. కట్టేశాక సెక్యూరిటీ అవసరం అవుతుంది. అచ్చం ఇదే వ్యవస్థ (Structure) ను అటు సమాజ/దేశ నిర్మాణం వరకూ కొనసాగుతుంది.
నిజానికి హిందూ శాస్త్రాలైతే… “బ్రాహ్మణుని యందు, గోవుయందు, ఏనుగు యందు, కుక్కయందు ఆ కుక్క మాంసం వండుకుతినే వానియందు సమాన దృష్టి ఉండాలి (గీత 5:18)” తప్ప ఉచ్చనీచ భావాలు ప్రదర్శించకూడదని ఉంది.
తరువాతి కాలంలో ఎంతో హేతుబద్దమైన ఈ చతుర్వర్ణ వ్యవస్థకు మత రంగు పులమటం జరిగింది. అక్కడి నుండి కాలానుగుణంగా ఉచ్చనీచ భావాలు బయలుదేరాయి. జాత్యాహంకార ధోరణులు చోటు చేసుకున్నాయి. మత/కులతత్వవాదం బయలుదేరింది. ఇదే జాఢ్యం అటు ముస్లిం సమాజంలోనూ బయలుదేరింది. మేము సయ్యదులం, పఠాన్లం మీరు కేవలం నూర్ బాషాలు మాత్రమే అన్న చందంగా ఉచ్చనీచ భావాలు బయలుదేరాయి.
ఈ విధమైన వర్గతత్వవాదాన్ని, మతతత్వవాదాన్ని ఇస్లాం తీవ్రంగా ఖండిస్తుంది.
“మానవులారా! మేము మిమ్మల్ని ఒక స్త్రీ,పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగా, తెగలుగా చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో గొప్ప గౌరవపాత్రులు” – 49:13 అని తేల్చి చెప్పటం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (స) అయితే.. తెల్లవానికి నల్లవానిపైగానీ, అరబ్బుకు అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బు పైగానీ ఏ ఆధిక్యతా లేదని చెప్పి జాత్యాహంకారాన్ని, వర్గతత్వవాదాన్నీ ఏక కాలంలో ఖండించి పరేశారు.
