చాలా మంది దర్గా ప్రేమికులు చెప్పేదేమిటంటే- “దర్గాల దగ్గరకు మేము సమాధి ఆరాధన చేయటానికి కాదు వెళ్ళేది! వలియల్లాలకు దేవుడు దగ్గర సిఫారసు చేసే అధికారం ఉంటుంది కనుక మా బాధలు చెప్పుకుని, వారి ద్వారా సిఫారసు పొందటానికి వారిపై శాంతి (దరూద్) పంపటానికి వెళుతుంటాం అంతే!. ఆ విధంగా దర్గాల్లో వలీయల్లాహ్ ల సిఫారసు పొందటం కోసం ప్రయత్నించటం “వసీల” అవుతుందన్నది దర్గా ప్రేమికుల విశ్వాసం.
“వసీల” అన్న పదం ఖురాన్ లో 5:35, 17:57 వాక్యాల్లో చూడగలం. ఈ పదానికి అర్థం “దేవుని కారుణ్యాన్ని పొందే మార్గం అన్వేషించటం (Seeking a means of nearness)”. ఎలా అన్వేషించాలి? ఖురాన్, హదీసుల ప్రకారం “సదాచారణ” “ఉపవాసం” “నమాజ్” “జకాత్” ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవక్త ముహమ్మద్ (స) ఆచరణను యదాతధంగా ఆచరించటం ద్వారా దేవుని కారుణ్యాన్ని పొందటం (వసీలా) సాధ్యమవుతుంది. తప్పితే చనిపోయిన వ్యక్తుల దగ్గర పోయి “వసీల” (అల్లాహ్ ప్రసన్నత పొందే మార్గం) కోసం వెంపర్లాడటం వసీలా అవ్వదు. అలాంటి విధానం ఖురాన్ ప్రకారం నిషిద్ధం చెయ్యటం జరిగింది.
“సమాధులలో ఖననమైన వారికి నీవు వినిపించలేవు” – 35:22
“నీవు మృతులకు వినిపించలేవు” – 30:52
కానీ, పై వాస్తవాలకు భిన్నంగా “వలీయల్లాహ్ ల వద్ద సిఫారసు కోసం ప్రయత్నించటం “వసీల” అవుతుంది అన్నది మన దర్గా ప్రేమికుల విశ్వాసం. పైగా ఈ వాదన సమర్ధించుకోవటానికి ఈ క్రింది వాక్యం చూపుతూ ఉంటారు.
“… వారు నీ వద్దకు వచ్చి ఉండవలసింది, క్షమించు అని అల్లహ్ ను అర్థించి ఉండవలసింది, ఇంకా ప్రవక్త కూడా వారి మన్నింపుకై విజ్ఞాపన చేసి ఉండేవాడు” – 4:64
ఈ వాక్యం వాస్తవానికి ప్రవక్త (స) బ్రతికి ఉన్నప్పుడు విశ్వాసుల తరఫున ప్రార్ధన చెయ్యటం గురించి చెప్పబడింది. తప్పితే ఆయన (స) చనిపోయిన తరువాత చెప్పబడుతుంది కాదు. ఈ వాక్యాన్ని దర్గాల్లో సమాధుల వద్ద తాము చేసుకునే వేడుకోళ్లకు లింకు పెట్టటం మరీ విచిత్రం! ఈ సందర్భంలో అత్యంత ముఖ్యమైన ఓ హదీసును గమనించాల్సి ఉంది.
“కరువు సమయాల్లో ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ (రజి) వారు, అబ్బాస్ ఇబ్నె ముతల్లిబ్ (రజి) వారిని తమ తరఫున వర్షం కోసం అల్లాహ్ ను ప్రార్ధించమని అడిగేవారు. ఇంకా ఆయన స్వయంగా చెబుతున్నదేమిటంటే- ఓ అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (స) ఉన్నప్పటి కాలంలో మేము మా తరఫున నిన్ను ఆయన్ని వర్షం కోసం ప్రార్ధించాల్సిందిగా అడిగేవారం” – (సహీహ్ బుఖారి, Vol 2, అల్-ఇస్తిస్కా, హదీస్ 1010)
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే- ఉమర్ (రజి) వారు “వసీల”ను ప్రవక్త ముహమద్ (స) నుండి అబ్బాస్ (రజి) వారి వైపుకు ఎందుకు మార్చారు? అబ్బాస్ (రజి) వారు ప్రవక్త ముహమద్ (స) వారి కంటే గొప్పవారైతే కాదుకదా!? దీనికి సమాధానం చనిపోయిన తరువాత అది ప్రవక్త ముహమద్ (స) అయినా సరే ఎవరైనా సరే వారి “వసీల” లేక సిఫారసులు అనేవి చెల్లవు కాబట్టి! ఇంకా అప్పటికి అబ్బాస్ (రజి) బ్రతికి ఉండటం. ఒకవేళ వలియల్లాల ద్వారా వసీల చెయ్యటం పనికి వస్తుందంటే ఉమర్ (రజి) వారు ప్రవక్త ముహమద్ (స) సమాధి దగ్గర నిలబడి ఆయన్నే వేడుకునే వారు కదా!
పైగా “అల్లాహ్ మార్గంలో “చంపబడినవారిని” మృతులు అనకండి వారు సజీవులు” – 2:154 అని అల్లాహ్ యే చెబుతున్నాడు కనుక వలియల్లాహ్ లు సజీవులు మన వేడుకోళ్లు విని అల్లాహ్ వద్ద చేరవేస్తారు అని చెప్పే దర్గా ప్రేమికులు గమనించాల్సింది.. ఈ వాక్యం చెప్పబడింది- అల్లాహ్ మార్గంలో “చంపబడినవారిని (Martyrs)” లేదా ప్రాణ త్యాగం చేసిన వారి గురించి” తప్పితే సాధారణంగా చనిపోయిన” పుణ్యాత్ముల గురించి కాదు! అదికూడా అల్లాహ్ దృష్టిలో ఉన్న అత్యంత గొప్ప హోదా దృష్ట్యా “మృతులు అనకండి వారు సజీవులు” అన్నాడు తప్పితే చనిపోయిన ప్రతీ వలీయల్లాహ్ సమాధిలో బ్రతికి ఉంటాడు మీరు పోయి మీ వేడుకోళ్ల కోసం వారి దగ్గర మొర పెట్టుకుంటే వారు వింటుంటారని కాదు!
వలియల్లాలకు “సిఫారసు” చేసే అధికారం ఉంటుందా?
ప్రవక్త ముహమద్ (స) కు ముందు ఆజ్ఞాన కాలంలో మక్కా విగ్రహారాధకుల్లో తమ విగ్రహాలకు అల్లాహ్ దగ్గర సిఫారసు చేసే అధికారం ఉందీ అని నమ్మేవారు. ఈ అజ్ఞానకాలపు సిద్ధాంతం ఒకప్పుడు మక్కా విగ్రహారాధకుల్లో, యూదుల్లో ఉండేది ఈనాటికీ కూడా రెండు వర్గాల్లో కొనసాగుతున్నట్లు చూడగలం. వారు:- 1. దర్గా ప్రేమికులు 2. క్రైస్తవులు
అచ్చం క్రైస్తవులు యేసు మా కోసం దేవుని దగ్గర సిఫారసు చేసి రక్షించుకుంటాడు అని నమ్ముతున్నట్లే దర్గా ప్రేమికులు సైతం వలియల్లాలకు అల్లాహ్ దగ్గర సిఫారసు చేసే అధికారం ఉంటుంది కాబట్టి వారి ద్వారా వసిల చేయటంలో తప్పులేదని వాదిస్తుంటారు. కానీ ఖురాన్ లో ఈ ఇద్దరి అజ్ఞానపు సిద్ధాంతాలనూ ఖండించటం జరిగింది.
“ఇస్రాయేలు వంశీయులారా… ఎవరూ ఎవరికీ ఏ మాత్రం తోడ్పడలేని, ఎవరి సిఫారసు అంగీకరించబడని, పరిహారం తీసుకుని ఎవరినీ విడుదల చెయ్యని, అపరాధులకు సహాయం ఎక్కడనుండీ లభించని ఆ దినానికి మీరు భయపడండి” – 2:47,48
పై వాక్యంతో పాటు ఇంకా 6:51, 2:123, 2:166-167, 2:255, 6:70, 6:94 ఇంకా అనేక వాక్యాల్లో మొత్తం ఖురానులో దాదాపు 25 వాక్యాల్లో ఈ “సిఫారసు” సిద్ధాంతం ఖండించబడినట్లు చూడగలం. అయితే అదే ఖురాన్లో…
“అల్లాహ్ ఏ వ్యక్తి విషయంలో సిఫారసుకు అనుమతి ఇచ్చాడో ఆ వ్యక్తికి తప్ప మరెవరికి ఏ సిఫారసూ అల్లాహ్ సమక్షంలో లాభదాయకం కాదు” – 34:23
అన్న వాక్యాన్ని బట్టి కొందరు ఖురాన్ విమర్శకులు సిఫారసు గురించి ఖురాన్ పరస్పర విరుద్ధ సమాచారం కలిగి ఉంది అని విమర్శిస్తుంటే… ఇలాంటి వాక్యాల ఆధారంగా మన దర్గా ప్రేమికులు అల్లాహ్ దగ్గర ఆ సిఫారసు చేసేది ఎవరో కాదు దర్గాలకు మేము పోయివచ్చే వలియాల్లలే అని నమ్మేస్తుంటారు!
ఈ అపార్థానికి సమాధానం:-
“ఆ రోజున సిఫారసు ఏ మాత్రం పనిచెయ్యదు. అల్లాహ్ ఎవరికైనా దానికి అనుమతి ఇచ్చి అతని మాటను ఆలకించటానికి ఇష్టపడితే తప్ప” – 20:109
అన్న వాక్యాన్ని బట్టి సృష్టికర్త అయిన అల్లాహ్ సమక్షంలో ఎవరికీ స్వతహాగా నోరువిప్పి మాట్లాడే అధికారం సైతం ఉండదు అల్లాహ్ అనుమతి ఇస్తే తప్ప అని తెలుస్తుంది. ఇది అప్పటి అజ్ఞానకాలపు విగ్రహారాధకుల్లో “మా దేవతలు అల్లాహ్ సమక్షంలో మా కోసం మా తరఫున సిఫారసు చేసి మమ్మల్ని కాపాడుకుంటారు” అన్న వారి మూఢ విశ్వాసాన్ని ఖండించటం జరుగుతుంది. అల్లాహ్ ఎవరి సంజాయిషీ వినాలన్నా తాను ఇష్టపడితేనే తప్ప ఆయన కోర్టులో నిలబడి ఎవరికైనా స్వతహాగా నోరు విప్పే అధికారం, అవకాశం కించిత్తు కూడా ఉండదని చెప్పటమే ఈ వాక్యాల ఉద్దేశం తప్ప కొందరు తమకు తాముగా దేవుని ముందు నిలబడి సిఫారసు చేసే అధికారం కలిగి ఉంటారని కాదు.
మొత్తానికి “సిఫారసు” అవకాశం అల్లాహ్ ఇస్తానంటున్నాడు కదా!?
అసలు సర్వజ్ఞాని అయిన అల్లాహ్ కు సిఫారసుతో పనేమిటి? ఆయన సమక్షంలో హాజరైనోల్లలో ఎవరు పాపులో ఎవరు పుణ్యాత్ములో ఎవరిని క్షమించాలో ఎవరిని శిక్షించాలో అల్లాహ్ కు తెలియదా? ఇక్కడ అల్లాహ్ ఎవరికైనా సిఫారసు కోసం అనుమతి ఇవ్వటం అంటే- “ఫలానా వ్యక్తికి, జాతికి నేను సందేశం ఇచ్చాను వారు దాన్ని అంగీకరించారు కాబట్టి ఓ అల్లాహ్ దయజేసి నాపై నాజాతిపై కరుణా చూపు” అని బ్రతిమాలుకుంటూ ఎవరైనా ఏదైనా సంజాయిషీ చెప్పుకుంటే అల్లాహ్ వినాలనుకోవటం అంతే! తప్ప వ్యక్తిగతంగా దేవుని సమక్షంలో నిలబడి “ఫలానా అతన్ని నువ్వు క్షమించాలి” అని చెప్పే ధైర్యంగానీ, ఎవరికీ నోరు మెదిపే అవకాశం ఉండదు. చివరకు ప్రవక్త ముహమద్ (స) వారితో సహా! ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు.
“ఓ ఖురైష్ ప్రజలారా మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి నేనైతే మిమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడలేను, ఓ మనాఫ్ సంతానామా మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి నేనైతే మిమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడలేను, ఓ ప్రవక్త మేనత్త అయిన సఫియా నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో నేనైతే నిన్ను నరకాగ్ని నుండి కాపాడలేను, ఓ ప్రవక్త కూతురైన ఫాతిమా నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో నేనైతే నిన్ను నరకాగ్ని నుండి కాపాడలేను” -(సహీహ్ బుఖారి, Vol 4, Book 51, No. 16)
ఖురాన్ లో అయితే- “రేపు మీకు ఏమి జరుగనున్నదో, నాకు ఏమి కానున్నదో నాకైతే తెలియదు” – 46:9 అని అల్లాహ్ యే ప్రకటించమన్నాడు. వాస్తవం ఇదైతే ప్రవక్త ముహమ్మద్ (స) వారి సమాధి ముందో లేక పుణ్య పురుషుల (వలియాల్లాల) సమాధుల ముందో ఎంత సాగిలపడిపోయినా ఏ మాత్రం లాభం ఉండదు. వారు మా కోసం సిఫారసు చేస్తారని, మా విన్నపాలు చేరవేస్తారని నమ్మకం కలిగి ఉండటం అర్థరహితం అవుతుంది.
మొత్తానికి ఒకవేళ ప్రళయం రోజున ప్రవక్త ముహమ్మద్ (స) కు నిజంగా సిఫారసు అడిగే అనుమతి అల్లాహ్ ఆయనకు ఇచ్చినా కూడా ఎవరైతే ఖురాన్ ఆజ్ఞల ప్రకారం ప్రవర్తన చక్క దిద్దుకుని, ప్రవక్త ముహమ్మద్ (స) ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ, మరొకరిని వేడుకోకుండా ఒక్క అల్లాహ్ నే వేడుకుంటూ, ఒక్క అల్లాహ్ యే మంచీ, చెడులకు కారకుడు అని నమ్మి నైతిక ప్రవర్తన కలిగి ఉంటారో వారి తరఫున బహుశా ఆయన వేడుకుంటారేమో తప్ప, దర్గాల్లో వలియల్లాలు కూడా మా తరఫున సిఫారసు చేస్తారని కలలు కంటూ చనిపోయేవారి పరిస్థితి పరలోకంలో అత్యంత దారుణంగా పరిణమిస్తుందని చెప్పటం అతిశయోక్తి కాదు. చివరిగా గుర్తుంచుకోవలసింది అల్లాహ్ ఆదేశాల ప్రకారం చెయ్యాల్సిన ఆచరణలో లోపాలు పెట్టుకుని చనిపోయినొల్లను కాపాడటం చివరకు అల్లాహ్ సాంప్రదాయం కూడా కాదు
“వసీల” & “సిఫారసు”ల వాస్తవికత
