సున్నీ, షియా, ఖాన్, పఠాన్, షేక్, సయ్యద్, ఖురైష్ వగైరా అంటూ హిందూత్వంలో కులతత్వం మాదిరిగానే ముస్లిం సమాజంలో కూడా వర్గతత్వం లేదా? సున్నీ-షియాలకు మధ్య శతృత్వం, సున్నీ ముస్లిములకు దూదేకుల ముస్లిములంటే తక్కువ చూపు, ఖాన్, షేక్, సయ్యద్ వర్గాల మధ్య ఒకరంటే మరొకరికి చులకన భావం. అలాంటప్పుడు ఇస్లాం మానవులంతా సమానమనే దృక్పథాన్ని నేర్పుతుందన్నది ఎంతవరకు నిజం?
ఇది ఇస్లాం మానవులంతా సమానమే.. ఇస్లాం మానవులను జాతిని బట్టో, వర్గాన్ని బట్టో, రంగును బట్టో, భాషను బట్టో ఎటువంటి ప్రాముఖ్యతానివ్వటం లేదన్న అంశంపై ఏ వ్యాసం రాసినా చాలా మంది నుండి ఎదురయ్యే ప్రశ్నే కాక.. సోషల్ మీడియాలో కొందరు అభినవ అభ్యుయదవాదులు సైతం ఇస్లాంను విమర్శించటానికి లేవనెత్తే ప్రశ్నల్లో ఇదొకటి.
నిజమే ఇస్లాం- “అరబ్బునకు అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బుపై గానీ, తెల్లవానికి నల్లవానిపై గానీ, నల్లవానికి తెల్లవానిపై గానీ ఎటువంటి ఆధిక్యతా లేదు కేవలం మీ సదాచారణ ద్వారా తప్ప” అన్న ఆదేశాన్ని ఇస్తుంది.
అంతేకాదు.. నల్ల జాతివారిని సేవకులుగా మార్చి అత్యంత హీనంగా చూస్తూ వారిని సంతలో పశువుల మాదిరిగా అమ్ముతున్న నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్ (స) అప్పటికే మక్కాలో ఉన్న కాబా మసీదుపై ఎక్కి అజాన్ ఇచ్చే బాధ్యతను కేవలం ఖురైష్ వంశం మాత్రమే నిర్వహిస్తూ ఉండగా బిలాల్ అనే ఓ నల్ల నీగ్రో బానిసకు ఆ గొప్ప బాధ్యతను అప్పజెప్పి మనుషులను వారి రంగును బట్టి, వారి జాతిని బట్టి వర్గీకరించి చులకనగా చూసే జాఢ్యాన్ని ఆచరణాత్మకంగా కూకటి వేళ్లతో పెకిలించిపరేశారు.
దీనిని దృష్టిలో పెట్టుకుంటే సున్నీ, షియా, ఖాన్, పఠాన్, షేక్, సయ్యద్, ఖురైష్ వగైరా వర్గాల తాలూకు అధిక శాతం ముస్లిముల్లో ఉచ్చనీచ భావాలు ప్రదర్శించే జాఢ్యం ఏర్పడటానికి ప్రధాన కారణాలు- 1. సామాజిక ప్రభావం 2. సరైన ఇస్లాం పరిజ్ఞానం లేకపోవటం మాత్రమే! నేడు అధికశాతం ముస్లిముల్లో పెరుకుపోయిన ఉచ్చనీచ, నిమ్నోన్నతా భావాలు సైతం ఖురాన్ గ్రంథంలో ఉన్నాయా? ముస్లిం సమాజంలో ఉన్నాయా? అంటే.. నేటి అధికశాతం ముస్లిముల్లో ఏర్పడి ఉన్న వర్గపరమైన వేర్పాటువాదానికి ఇస్లాంతో ఎంతమాత్రం సంబంధం లేదన్న సమాధానమే లభిస్తుంది.
నిజానికి ఏ ధార్మిక గ్రంథమూ మనుషులను వారి జాతి, వర్ణం పేరున వర్గాలుగా విడగొట్టి.. ఉచ్చనీచ తారతమ్యాలు, నిమ్నోన్నతా భావాలు చూపమనవు.. అంటరాని తనాన్ని నేర్పవు. మరలాంటప్పుడు హైందవ శాస్త్రాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్న వర్గీకరణ ఎలా చెయ్యబడింది? ఈ రకమైన వర్ణ బేధం చూపటం తప్పుకాదా? అన్న ఓ ప్రశ్న కూడా ఎదురవ్వొచ్చు.
దీనికి సంక్షిప్త సమాధానం అచ్చం అధికశాతం ముస్లిముల్లో ఉన్న ఎన్నో జాఢ్యాలు ఇస్లాంలో లేనట్టే… అధిక శాతం హిందువుల్లో ఉన్న ఎన్నో జాఢ్యాలు అసలు వైదిక ధర్మంలో లేవు. నిజానికి హిందూ ధర్మం అన్న పదమే వేదోపనిషత్తులలో లేదు. అది వేరే విషయం దానిని ప్రక్కన పెడితే… బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నది నిజానికి జాతి పరమైన విభజన కాదు! ఇవి వ్యక్తుల సమార్థ్యాల తాలూకు విభజన (Classification) అని చెప్పవచ్చు. “బ్రాహ్మణ” అంటే సమాజంలో వైజ్ఞానికులు, విధ్యావేత్తలను సూచించే పదం.. క్షత్రియ అన్నది రక్షణ దళాలను సూచించే పదం.. వైశ్య అన్నది సమాజంలో ఆర్ధిక వేత్తలను సూచించే పదం.. శూద్ర అన్నది సమాజంలో కార్మికులను సూచించే పదం. ఒక పటిష్ట సమాజం ఏర్పడాలి అంటే ఈ నాలుగు సామర్థ్యాల తాలూకు వ్యక్తుల సమూహం తప్పనిసరి. అప్పుడే సమాజం నిర్మాణం (Society structure) ఏర్పడటం అన్నది సాధ్యపడుతుంది.
అయితే ఈ విభజన తరువాతి కాలంలో కులపరమైన విభజనకు ఆపాదించుకుని కొందరు కులతత్వవాదాన్ని, ఉచ్చనీచ, నిమ్నోన్నతా భావాలతో కూడిన చతుర్వర్ణవ్యవస్థను వెలుగులోకి తెచ్చారు. కాబట్టి ఒక సమాజంలో ఈ నాలుగు సామర్థ్యాల వ్యక్తులు ఉండటం సమస్య కాదు అసలు సమస్య ఒక వర్గాన్ని తక్కువ చూడటం మరొక వర్గాన్ని ఎక్కువగా చూడటం అన్న వర్గతత్వవాదం లేదా కులతత్వవాదమే అసలు సమస్య! అలాగని హిందూ సమాజంలో అందరూ కులతత్వ భావాలు కలిగి లేరు. ఈ జాధ్యం కొందరిలో ఉన్నప్పటికీ అందులో విశాల దృక్పథాలు కలిగిన వారెందరో ఉన్నారన్నది ఒప్పుకుతిరాల్సిన విషయం. అలాగే క్రైస్తవుల్లో ఉన్న వర్గపరమైన వేర్పాటువాదానికి సైతం బైబిల్ తో సంబంధం లేదు.
ఇక ముస్లిం సమాజంలో సున్నీ, షియా, ఖాన్, పఠాన్, షేక్, సయ్యద్ వగైరా వర్గాలు ఉండటం సమస్య కాదు. వర్గాలనేవి ఉండవచ్చు. కానీ వర్గతత్వం ఉండకూడదు. మేము పుట్టుకతో ఎక్కువ మీరు తక్కువ అన్న ఉచ్చనీచ భావాలు కలిగి ఉండటం, అంటరాని తనాన్ని ప్రదర్శించటం ఘోరమైన విషయం.
అలాగని పై ముస్లిం వర్గ ప్రజలందరిలో నూటికి నూరుశాతం మంది అలాంటి హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తున్నారని భావించటమూ తప్పే! ఆయా వర్గాలన్నిటిలో ఇస్లాం యొక్క వాస్తవ జ్ఞానాన్ని కలిగి జాత్యాహంకారాన్ని తొలగించటానికి కష్టపడే వ్యక్తులూ ఉన్నారన్నది ఒప్పుకుతీరాల్సిన విషయం. కానీ ఆయా వర్గాల్లో ఇస్లాం యొక్క వాస్తవ పరిజ్ఞానం లేని వారితోనే అసలు సమస్య. అలాంటివారు ముస్లిం సమాజంలో అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. అలాంటి కొందరు ప్రదర్శించే ఉచ్చనీచ భావాలను, అంటరాని పోకడలను చూసి ముస్లిమేతరులు ఇస్లాంనే అపార్థం చేసుకునే పరిస్థితి దాపురిస్తుంది. ముస్లిమేతరులు అలాంటి వారిని చూసినప్పుడల్లా పాపం ఇస్లాం కారణంగా వీళ్లు ఇలా వెనుకబడిపోయారని పెదవి విరుస్తుంటారు. నిజానికి అసలు సమస్య వారికి ఇస్లాం యొక్క సరైన జ్ఞానం లేకపోవటమే! ఈ రకమైన కొందరు ఇస్లాం అనవగాహనాపరులైన ముస్లిముల ద్వారా ముస్లిమేతరుల్లో ఇస్లాం పట్ల అనేక అపార్థాలు ఏర్పడిపోయాయి అన్నది నిర్వివాదం.
నేటి ముస్లిం సమాజంలో అనేక వర్గాల మధ్య ఏర్పడి ఉన్న వర్గపరమైన వేర్పాటువాదం వంటివి ఇస్లాం అరేబియాలో రాకపూర్వం అజ్ఞానకాలంలో ఉండేవి. తరువాత ప్రవక్త ముహమ్మద్ (స) వర్గపరమైన విభేదాలను, హెచ్చుతగ్గులను తీసిపారేశారు. ఒకవేళ అలాంటి జాఢ్యాలను ముస్లిం సమాజంలో ఏ వర్గంవారైనా ఇంకా మోసుకు తిరుగుతున్నారంటే… అలాంటి వారు ఇంకా ఒకనాటి అజ్ఞానకాలంలో ఉండిపోయారని వారి పట్ల జాలిచూపటం మినహా అలాంటి వారి ప్రవర్తనకు ఇస్లాంతో ముడిపెట్టి మాట్లాడటం అలా మాట్లాడేవారి అజ్ఞానం అవుతుంది.
ఖురాన్ ఎంతో స్పష్టంగా-
“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ, పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు” – 49:13
అని చెబుతుంది. మరో ప్రక్క భగవద్గీత-
“విద్య, వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని బ్రాహ్మణునియందు, గోవుయందు, ఏనుగునందు, కుక్కయందు, ఆ కుక్క మాంసం వండుకు తిను ఛండాలుని యందు సమదృష్టి కలవారే జ్ఞానులు అని చెప్పబడుదురు” – భగవద్గీత 5.18
అని చెబుతుంది. దీనిని బట్టి ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవలసింది- ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మానికీ.. కొందరు పండితులు తయారుచేసి నడుపుతున్న మూఢత్వ మత వ్యవస్థకూ అస్సలు పొంతన లేదన్నది. ఈ సున్నిత విషయాన్ని అవగాహనపరచటం నిజానికి ధార్మిక పండితుల బాధ్యత. కానీ వారి ఆనవాగాహనా, నిర్లక్ష్యమే నాస్తిక వర్గం అన్నది ఒకటి ఉనికి లోనికి రావటానికి ముఖ్య కారణమయ్యింది.
ఇస్లాంలో వర్గతత్వం లేదా?
