మతం – మతతత్వవాదం – ధర్మం

ఈ మూడింటికి మధ్య ఉన్న మౌలిక బేధాన్ని కనిపెట్టటంలో ఒక్క నాస్తికులే కాదు చాలా మంది ఆస్తికులు కూడా పొరబడుతుంటారనటం అతిశయోక్తికాదు! ధర్మం ధార్మిక గ్రంథాలలో ఇవ్వబడితే… మతాలు మతుల నుండి వెలువడిన భిన్న నమ్మకాలు మాత్రమే. వారిలో విభిన్న వ్యక్తుల తాలూకు వివిధ వృత్తుల ద్వారా ఏర్పడిన ‘వివిధ శాఖలే (Divisions) భిన్న కులాలు (Castes)! సమాజంలో ఎన్ని మతాలు, కులాలు, ఉన్నప్పటికీ ఆది నుండీ సకల ధార్మిక గ్రంథాలలో మటుకు ఒక్కటే “ధర్మం” ఇవ్వబడుతూ వచ్చింది.

సాధారణంగా సమాజంలో ఏదో ఒక నమ్మకం కలిగి ఉండే వ్యక్తుల తాలూకు ప్రతీ సమూహమూ మత వర్గంగానే పిలువబడుతుంది. అయితే ఆయా మత వర్గాలలో మా మతమే గొప్ప, మా ఆచారాలే గొప్ప, మా మత విశ్వాసాలే గొప్ప అంటూ ఉచ్చనీచ, నిమ్నోన్నతా భావాలను ప్రదర్శించటాన్నే “మతతత్వవాదం” లేదా “మతోన్మాదం” అంటారు.

సమాజంలో అనేక మతాలు, కులాలు ఉండటం సమస్య కానే కాదు, కానీ ఎన్ని మతాలున్నప్పటికీ అత్యంత ప్రమాదకరమైనది “మతతత్వవాదం”. అలాగే ఎన్ని కులాలున్నప్పటికీ అత్యంత ప్రమాదకరమైంది “కుల తత్వవాదం”. అసలు “నాస్తిక” వర్గం ఒకటి వెలుగులోకి రావటానికి ప్రధానకారణం- భిన్న మత వర్గాల్లో ధర్మం అవగాహనలేని కొందరు మూర్ఖులు ప్రదర్శించే మతతత్వవాదమే!

ఎంతో హేతుబద్దంగా ఆలోచించే ఈ నాస్తిక వర్గం భిన్న మత వర్గాల్లో కొందరు మూర్ఖులు కలిగి ఉండే మూఢ విశ్వాసాలను’, మూఢత్వ మతాచారాలను, అహేతుకమైన నమ్మకాలనూ.. వారు ఇతర మతస్తుల పట్ల ప్రదర్శించే మతతత్వవాదాన్ని చూసి వారలా తయారవ్వటానికి అసలు కారణం వారి దగ్గరున్న ధార్మిక గ్రంథాలేమోనన్న అపార్థానికి గురై మొత్తానికి హేతుబద్ధమైన దైవధర్మానికే దూరమైపోయి దేవుడూ లేడు అనే నిర్ణయానికి వచ్చేశారు. అసలు మతం అనేది ఒకటి వెలుగులోకి రావటానికి మతగ్రంథాలే కాబట్టి మత గ్రంథాల పట్ల ఏహ్య భావాన్ని పెంచుకున్నారు. నిజానికి అసలు ధార్మిక గ్రంథాల అవతరణ లక్ష్యమే మతవ్యవస్థలో పెరుకుపోయిన ముఢాచారాలను తొలగించి హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని నిర్మించటం అన్న వాస్తవాని గుర్తించటం నుండి వారు దూరమైపోయారు.

ఈ విధంగా “నాస్తిక వర్గం” అన్నది ఒకటి వెలుగులోకి రావటానికి ఆస్తికుల్లోనే ధార్మం అవగాహన లేని ఆస్తికులే కారణమయ్యారు. నిజానికి ధార్మిక గ్రంథాలు ప్రబోధిస్తున్న “శాస్త్రీయమైన ధర్మం” ఆదేశించని ముఢాచారాలను బోధిస్తూ మూఢ మతవ్యవస్థను నడిపే స్వార్థపరులు అన్ని మత వర్గాల్లోనూ ఉన్నారు.

అయితే నాస్తికులు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే.. కొందరు మతతత్వవాదులు ప్రదర్శించే మతతత్వవాదం, ముఢాచారాల పట్ల వెగటుతో మనిషి వ్యక్తిత్వ వికాశం, సమాజ హితవు కోసం ధార్మిక గ్రంథాలు నిర్దేశిస్తున్న అసలు శాస్త్రీయ ధర్మాన్నీ, మూఢ మతవిశ్వాసాలనూ ఒకే గాడిన కట్టేసి వ్యతిరేకించటం!

దానికి అసలు కారణం…

ఈ ముఢాచారాలతో కూడిన మతవ్యవస్థను నడిపే పండితులు ధార్మిక గ్రంథాలను తమ చేతుల్లో పట్టుకుని తాము బోధించేదంతా ధార్మిక గ్రంథాల్లో చదివి చెబుతున్నామన్న భ్రమను ప్రజల్లో కల్పించటమే! ఈ విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా వివరిస్తుంది.

“వారిలో కొందరు తాము చదివేది గ్రంథంలోని ఒక భాగమే అని మీరు భావించాలని గ్రంథం పఠిస్తూ తమ నాలుకలను మెలి త్రిప్పుతారు. కానీ వాస్తవంగా అది గ్రంథంలోని భాగం కాదు. వారు, “మేము చదివేదంతా దేవుని తరఫున వచ్చిందే” అని అంటారు. కానీ అది దేవుణ్ణి తరఫున రాలేదు. వారు బుద్ధిపూర్వకంగా దేవునికి అబద్ధాన్ని అంతగాడుతున్నారు” – 3:78

బైబిల్ సైతం ఇదే విషయం చెబుతుంది:-

“విండ్లను త్రోక్కి వచ్చునట్లు అబద్ధమాడుటకై వారు (అబద్ధబోధకులు) తమ నాలుకలను వంచుదురు” – ఇర్మియా 9:3

ఆ విధంగా కొందరు చలామణీ చేస్తున్న ముఢాచారాలతో కూడిన “మతం” అన్నది ఏర్పడటానికి కారణమే ధార్మిక గ్రంథాలు అన్న అపోహే కొందరిని ధర్మానికి, దైవానికి దూరం చేసే నాస్తికులుగా మార్చేసింది.

అందుకే ఏ నాస్తికుణ్ణి అయినా “మీరు ఈ విశ్వానికి ఒక సృష్టికర్త లేడు అని ఎలా చెబుతున్నారు? మీరు మొత్తం విశ్వాన్ని పరిశీలించి, ప్రయోగాలు చేసి చెబుతున్నారా? లేక మూఢత్వ మత వ్యవస్థ పట్ల వెగటుతో చెబుతున్నారా? అని ప్రశ్నిస్తే.. సమాధానం రెండవదే చెబుతాడు. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని పరిశీలించటం ఆధునిక సైన్స్ వల్లే సాధ్యం కాని పని కాబట్టి.

సృష్టికర్త అయిన దేవుని విషయంలో నాస్తికులు చేసే అతి పెద్ద రెండవ తప్పు- ధార్మిక గ్రంథాలు పరిచయం చేసే అసలు సృష్టికర్త అయిన దేవునికీ.. నేడు మత వ్యవస్థలో ప్రజలు విగ్రహాలుగా చేసుకుని ఆరాధిస్తున్న మిద్యా దైవాలకూ మధ్య తేడా గుర్తించక.. ప్రజలు గుడ్డి విశ్వాసాలు కలిగి ఆరాధిస్తున్న మిద్యా దైవాలతో పాటు అసలు సృష్టికర్త అయిన దేవుణ్ణి కూడా తిరస్కరించటం!

నిజానికి రామకృష్ణాదుల నుండి మోషే, యేసు, ముహమ్మద్ ల వరకూ ఎందరో ఋషులూ, ప్రవక్తలూ ఒకే సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేసి ఆయన్ని ఆరాధించిన వారే! కాలక్రమేణా ప్రజలు ఆయా ప్రవక్తలనే దేవుని అవాతారాలుగా చేసుకుని, స్వకల్పిత ముఢాచారాలను ఏర్పర్చుకున్నారు. కాలక్రమేణా మతాన్ని అడ్డం పెట్టుకుని జనాల జేబుల్లో డబ్బును తమ జేబుల్లో సులువుగా రాబట్టటానికి స్వంత విశ్వాసాలతో కూడిన మూఢత్వ మత వ్యవస్థను వెలుగులోకి తెచ్చి స్వార్థపరులైన మత పండితులు అపరదైవాలై కూర్చున్నారు. తరువాత వారిని అనుసరించే ఎందరో నకిలీ ఆస్తికులు బయలుదేరారు.

కానీ, దీనికి భిన్నంగా ధార్మిక గ్రంథాలు “మీరు సృష్టికర్తను ఎవరో చెబితే గుడ్డిగా నమ్మవద్దు కానీ.. మీకివ్వబడిన బుద్ధిని ఉపయోగించి, సశాస్త్రీయంగా సృష్టిని పరిశీలించి తద్వారా సృష్టికర్తను గుర్తించండి” అని ఎంతో హేతుబద్ధమైన విధానాన్ని నిర్దేశిస్తున్నాయి.

చివరిగా…
A. సమాజంలో రెండు రకాల ధర్మాలు చలామణిలో ఉన్నాయి.
ధార్మిక గ్రంథాలు నిర్దేశిస్తున్న “శాస్త్రీయ ధర్మం (Scriptural
Religion)” 2. కొందరు మత పండితులు తయారుచేసి పెట్టిన
“మత వ్యవస్థ. దీనిని మానవ నిర్మిత ధర్మం (Man Made
Religion) అని చెప్పవచ్చు.

B. అలాగే ఏదో ఒక మత విశ్వాసాలు కలిగిన వారంతా నాస్తికులు
కారు. సమాజంలో మానవ నిర్మిత మతవ్యవస్థలో ముఢాచారాలు
కలిగి ఉన్నవారే అధికులు ఉన్నారు. వీరిని “నకిలీ ఆస్తికులు”
అని చెప్పవచ్చు. అసలు ఆస్తికులు ఎవరంటే ధార్మిక
గ్రంథాలు నిర్దేశిస్తున్న “శాస్త్రీయ ధర్మాన్ని” అనుసరించేవారు
మాత్రమే అవుతారు.

C. సమాజంలో మూఢ మత విశ్వాసాలతో కూడిన మత
వ్యవస్థకూ.. ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మానికీ పొంతన లేదు.
అలాగే నేడు ప్రజలు ఆరాధిస్తున్న పుణ్య పురుషులెవరూ
సృష్టికర్త అవతారాలో దేవుళ్లో కారు. వారికీ ధార్మిక గ్రంథాల్లో
సర్వేశ్వరునిగా, యెహోవాగా, అల్లాహ్ గా పరిచయమైన
సృష్టికర్త అయిన దేవునికీ అస్సలు సంబంధం లేకపోగా పైగా
వారంతా దేవుని ద్వారా సృష్టించబడినవారు మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *