“ఓ దేవా నేను అలాంటి వ్యక్తుల నుండి శరణు వేడుతున్నాను వారు పైకి బాగా మాట్లాడుతుంటారు కానీ మనసులో ధ్వేషాన్ని కలిగి ఉంటారు, ఎప్పుడూ ఎదుటివారి తప్పులెన్నుతూ ఉంటారు, కానీ ఒకవేళ అవతలివారిలో మంచి కనిపించినా దానిని గురించి వారు మాట్లాడరు పూర్తిగా దాచిపెడతారు” – ప్రవక్త ముహమ్మద్ (స)
ఎప్పుడూ ఎదుటివారిలో లోపాల్ని, తప్పుల్ని ఎంచటంలో ఆశక్తి చూపటం, వాటిని ప్రజల్లో బహిర్గతపరచి, పైగా లేనిపోనివి ఇంకోనాలుగు జోడించి చెడుగా ప్రచారం చేసి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా మాట్లాడటం, వారి పట్ల ధ్వేషాన్ని రగిలించి ఓ రకమైన పైశాచిక ఆనందం పొందటం కొందరిలో ఉండే ఓ అతిపెద్ద మానసిక రోగం.
ఈ రకమైన మానసిక రోగం సామాన్యంగా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. వారు చాలా అలవోకగా ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడేస్తుంటారు, ఎదుటివారి గురించి కేరక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటారు కూడా.
ప్రవక్త ముహమ్మద్ (స) అయితే ఈ విషయంలో అతి తీవ్రంగా వారించారు. ఒకవేళ నిజంగా మీరు ఎదుటివారిలో ఏదైనా లోపాన్ని చూసినా దానిని మీరు ఉద్దేశపూర్వకంగా బహిర్గతపరచకండి, పైగా అతనిలో మంచిని గురించే ఇతరుల ముందు మాట్లాడండి తప్ప అతని గురించి చెడు మాట్లాడకండి అన్నారు. ఎందుకంటే ధ్వేషం వ్యక్తుల మధ్య సంబంధాలను పటిష్ట పరచదు ఓ సుందర సమాజాన్ని తయారు చెయ్యలేదు కాబట్టి
ఎదుటివారిలో లోపాలను ఎంచటం, పైగా వారి గురించి లేనిపోనివి కల్పించి ఇతరుల ముందు మాట్లాడటం, ఒక వ్యక్తి పట్ల ధ్వేషాన్ని పెంచి పోషించటం అత్యంత ఆటవికమే కాదు అలాంటి గుణాలు కలిగినవారు అనాగరికులు కూడా.
తీరా ఎదుటివారిలో తాము ఊహించుకున్న చెడులు లేవని బయటపడ్డాక గప్ చిప్ అయిపోతారు. వారిలో మంచిని గురించి మటుకు ప్రస్తావన చెయ్యరు. ఎందుకంటే ధ్వేషాన్ని ప్రచారం చేయటంలో దొరికే కిక్కు.. మంచిని ప్రచారం చేయటంలో లభించదు కాబట్టి.
తబ్లిగీ జమాతీయుల విషయంలో అనవసర ప్రచారం జరిగింది.. అనవసరంగా విదేశాల నుండి వచ్చిన తబ్లిక్ ముస్లిములను బలిపశువులు (Scapegoats) చేసారంటూ తీరా జరగాల్సిన చెడు ప్రచారం జరిగిపోయాక బాంబే హైకోర్ట్ ఇప్పుడు వారి తప్పేమీలేదని కేసు కొట్టేసింది.
మంచిదే! అయితే ఇంతకూ ఆ అనవసర ప్రచారం చేసినవారు ఎవరు? తమ టీ.ఆర్.పీ రేటింగుల కోసం విదేశాల నుండి కుట్రపూరితంగా ఇండియాలో అసలు కరోనా మోసుకొచ్చిందే తబ్లీకీయులు అన్న చందంగా ప్రజల్లో గాలి వార్తలను తీసుకెళ్లి, ధ్వేషాన్ని పెంచి పోషించింది ఎవరు? మీడియాలో లేనిపోనివి కల్పించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టింది ఎవరు? పైకి నాగరికుల వేషాలు ధరించిన ఆ అనాగరికులు ఎవరు?
ఇంతకీ బలిపశువులు చేసింది ఎవరు?
