వ్యాపార లావాదేవీల నుండి వ్యవహారాల వరకు.. మానవ సంబంధాల నుండి మార్కెటింగ్ వరకు నోటి మాటే అతిపెద్ద పాత్ర పోషించేది. కాబట్టే ఇతరులతో మాట్లాడటం కూడా అతి పెద్ద కళ అనేది.
మన భావాలను తోటివారికి చేరవేసే మాధ్యమం నోటి మాట, ఆ మాట తీరు ఎంత సక్రమంగా సంస్కారవంతంగా ఉందన్న దాని మీదే ఇతరుల నుండి తిరిగి మర్యాద, గౌరవం, ప్రేమాభిమానాలు పొందటం, పొందకపోవటం అన్నవి ఆధారపడి ఉంటాయి. భార్యాభర్తల మధ్య అయినా, ఇరుగు పొరుగువారి మధ్య అయినా, ఇరు దేశాల మధ్య అయినా సత్సంబంధాలు కొనసాగటం అన్నది నోటి మాట తీరు మీదే ఆధారపడి ఉంటుంది. బహుశా అందుకేనేమో ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని’ ఓ సామెత కూడా పుట్టుకొచ్చింది.
తోటి వారి పట్ల మనం మాట్లాడే మాట తీరు ఎలా ఉండాలి? అన్న విషయంలో ఖురాన్ నిర్దేశిస్తున్న నియమాలు ఏమిటంటే…
1. ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి
“ప్రజలతో మర్యాదగా మాట్లాడండి” – 2:83
2. కంఠస్వరాన్ని తగ్గించి మృదువుగా మాట్లాడాలి
“నీ కంఠస్వరాన్ని కొంచెం తగ్గించి మాట్లాడు” – 31:19
3. డొంకతిరుగుడుగా కాక సూటిగా మాట్లాడాలి
“విశ్వాసులారా! మాట్లాడితే సూటిగా మాట్లాడండి” – 33:70
4. ఎప్పుడూ పలికితే న్యాయమే పలకాలి
“పలికితే న్యాయమే పలకండి” -6:152
5. ప్రజలతో గర్వంతో మాట్లాడకూడదు
“ప్రజల ముందు గర్వంతో ముఖం త్రిప్పుకుని మాట్లాడకూడదు” -31:18
6. అబద్ధాలు పలుకకూడదు
“అబద్ధపు మాటలు పలుకకండి” – 22:30
7. అత్యంత మంచి మాటలనే పలుకుతూ ఉండాలి
“వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలి” -17:53
8. తలిదండ్రులతో కసురుకుంటూ మాట్లాడకూడదు
“తలిదండ్రులతో కసురుకుంటూ మాట్లాడకండి” – 17:23
9. మృదువుగా మాట్లాడాలి
“మృదువుగా మాట్లాడండి” – 20:44
10. సదా సత్యమే పలకండి
“విశ్వాసులు సదా సత్యమే పలుకుతారు” – 3:17
11. ఆజ్ఞానులతో వాదించకూడదు
“వారు ఆజ్ఞానులతో వాదించరు” – 28:55
నోటి నుండి వెలువడే మాట ఎంతో మర్యాదపూర్వకంగా, సూటిగా, నిగర్వంగా, సూటిగా, మృదువుగా, సంస్కారవంతంగా, న్యాయంగా మాట్లాడాలని… ఇతరులతో కేవలం మంచి మాటలే తప్ప బూతులతో కూడిన అమర్యాదపూర్వక మాటలు మాట్లాడకూడని ఖురాన్ ఆదేశిస్తుంది.
ఒకవేళ ఏదైనా విషయంలో వాదించాల్సి వస్తే…
వివేకంతో, చక్కని హితబోధతో, ప్రజలతో ఉత్తమోత్తమ రీతిలో వాదించు” – ఖుర్ఆన్ -16:125
అంటే… ఏ విషయాన్ని గురించైనా ఇతరులతో 1. వివేకంతో 2. చక్కని హితబోధతో 3. ఉత్తమోత్తమ రీతిలో వాదించాలి.
అలాగే.. చెడును తొలగించాలనుకున్నప్పుడు…
“నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీపట్ల శత్రు భావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణయోగం సహాన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ సుగుణ యోగం సహాన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ స్థానం మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు” – 41:34, 35
కాబట్టి అవతల వ్యక్తి మన పట్ల చెడుగా వ్యవహరిస్తున్నాడు, చెడుగా విమర్శిస్తున్నాడు కాబట్టి సహనం కోల్పోయి అవతల వ్యక్తితో పాటు సమానంగా దిగజారుడు విమర్శలు చేస్తూ కూర్చుంటే పై వాక్యాన్ని బట్టి దాని వల్ల జరిగే నష్టం- నీపట్ల శత్రు భావం కలవాడు మరింత శతృవైపోతాడనే కదా!
కాబట్టి అవతల వ్యక్తి ఎంత రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేసినా హుందాతనం, సహనం కోల్పోకుండా మాట్లాడగలగటం కూడా అందరికీ సాధ్యం కాదు. “ఈ సుగుణయోగం సహాన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు… మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు” అని స్వయంగా సృష్టికర్త అయిన దేవుడే చెప్పటాన్ని బట్టి సహనం కలిగి అదృష్టవంతులుగా ఉండాలా? సహనం కోల్పోయి దురదృష్టవంతులుగా ఉండాలా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి.
ఖురానిక్ స్పీకింగ్ స్కిల్స్
