నిజ విశ్వాసి ఆవేదన చెందాల్సిన విషయాల్లో భౌతిక కట్టడాలకు ఏ ప్రాముఖ్యతా లేదు ఉంటేగింటే నేను ఆ లాభనష్టాలకు కారకుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వసించి, ఆయన కోసం ఎక్కడున్నా క్రమం తప్పకుండా నమాజ్ చేస్తున్నానా? లేదా? అన్నదే అసలు ఆవేదన చెందాల్సిన అంశం. కాబట్టి నిజవిశ్వాసి భౌతిక కట్టడానికి ప్రాధాన్యత ఇచ్చే కంటే తన వ్యక్తిగత నైతిక కట్టడానికే ప్రాధ్యన్యత ఇస్తాడు.
1949 లో బాబ్రీ మసీదు మూతపడిపోయిన తరువాత ఆ చుట్టుప్రక్కన ఉన్న ముస్లిములు నమాజ్ అయితే మానేసి ఉండరు. ఎవరికి వారు ఇళ్లలోనో లేక సామూహికంగానో వేరే స్థలంలోనో మసీదులోనో చదువుతూనే ఉండి ఉంటారు. ఏ ఇద్దరు కలిసి ఎక్కడ చదివినా సామూహిక నమాజ్ అయిపోతుంది కనుక.
కాబట్టి ఇక్కడ ఆ మూతపడిన మసీదుకు అన్యాయం జరిగిందని బాధపడే కంటే ముందు నా వీధి చివర ఉన్న మసీదుకు నేను ఐదు పుట్లా నమాజ్ కు వెళ్లి దానికి న్యాయం చేస్తున్నానా? లేదా? ఒక్క శుక్రవారం పూట తప్ప మిగతా రోజుల్లో నమాజ్ కు రానివారితో ఖాళీగా పడి ఉంటున్న మసీదుకు నా తోటి ముస్లిములు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? అన్న ఆలోచనకే అసలు ప్రతీ ముస్లిం ప్రాధాన్యత ఇవాల్సింది.
నిజానికి చెప్పాలంటే అటు రామమందిరం కావాలని గొడవ చేస్తున్నోల్లలో సైతం సంవత్సరానికి ఒకసారి కూడా గుడి ముఖం చూడనోల్లే!
ఇక బాబ్రీ మసీదు అన్యాయంగా పడగొట్టబడిందని ఆవేదన చెందేవారు గమనించాల్సింది: 1992 లో బాబ్రీ మసీదు పడగొట్టిన కరసేవకులలో ‘బల్బీల్ సింగ్’ అన్న వ్యక్తి బాబ్రీ మసీదును పడగొట్టినందుకు గానూ ఎంతగానో పశ్చాత్తాపం చెందాడు. ఆ విధంగా అతను వేదన చెందటమే ఇస్లాంను లోతైన అధ్యయనం చెయ్యటం వైపు అతని దృష్టి మరల్చింది. తరువాత అతను ఇస్లాంను అధ్యయనం చేసి, ఇస్లాం స్వీకరించి… ఒక బాబ్రీ మసీదు పడగొట్టినందుకు గానూ 100 క్రొత్త మసీదులు నిర్మిస్తానని సంకల్పం చేసుకున్నాడు! ఈ 25 ఏళ్లలో అప్పుడే 90 మసీదులు నిర్మించేశాడు కూడా. ఒక విధంగా చెప్పాలంటే బాబ్రీ మసీదు కూర్చివెయ్యబడిన రోజే… 100 బాబ్రీ మసీదులు కట్టబడ్డాయనటం అతిశయోక్తికాదు కాదేమో!
బాబ్రీ మసీదు పడగొట్టటం అన్నది ముస్లిముల మనో భావాలను రగిల్చి మత రాజకీయాలు నడిపి అధికారంలోకి రావటానికి కొందరు వేర్పాటువాదులు పన్నిన కుట్ర తప్ప మరేమీ కాదు అన్నది సామాజిక విశ్లేషకులకు తెలిసిన విషయమే. 1980 కి ముందు అసలు భారతదేశంలో దాదాపు 90 శాతం సామాన్య ముస్లిం ప్రజానీకానికి బాబ్రీ మసీదు, రామజన్మ భూమి గొడవే తెలీదు! కానీ, ఓటు బ్యాంకు రాజకీయ కుట్రలో భాగంగా బాబ్రీ మసీదును కొందరు అడ్డాగా మార్చుకున్నారు ఇది జగమెరిగిన సత్యం. ఆ విధంగా ముస్లిముల భావోద్రేకాలను రెచ్చగొట్టటం అన్న ప్రక్రియ ద్వారా అధికశాతం సామాన్య ముస్లిములు బాబ్రీ మసీదు గొడవలోకి బలవంతంగా నెట్టబడ్డారని చెప్పవచ్చు. నిజానికి అది సార్వత్రిక ముస్లిం సమాజ సమస్య అయితే కాదు. అయితే చాల మంది ముస్లిములు, రాజ్యాంగ ప్రేమికులు బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకించింది అలా చెయ్యటం భారత రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టే
నిజానికి అల్లాహ్ ఆరాధనకు ఫలానా మసీదు అవసరం అన్న సెంటిమెంటు కూడా ఇస్లాంలో లేదు! నమాజ్ చదవాలన్న సంకల్పం బలంగా ఉన్న విశ్వాసికి సమస్త భూమిని మసీదుగా మార్చి వెయ్యటం జరిగిందని స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) వారే చెప్పటం జరిగింది.
“సమస్త భూమి మసీదుగా చెయ్యబడింది. శ్మశానవాటిక మరియు కాలకృత్యాలు తీర్చుకునే స్థలాలు తప్ప” – (జామియత్ తిర్మిదీ 317, సహీహ్).
వాస్తవం ఇదైనప్పుడు ఎవరో కొందరు మతతత్వవాదులు ఒక మసీదును కూల్చేసి పైశాచిక ఆనందం పొందటానికి కూడా అవకాశం లేదు. ఒక ముస్లింకు సమస్త భూమే మసీదుగా చెయ్యబడింది. నమాజ్ అన్నది సమస్త భూమిలో ఏదో ఒక మూల ప్రతీ సెకనూ ప్రతీ ముస్లిం ద్వారా ఎక్కడో చోట చదవబడుతూనే ఉంటుంది.
నిజానికి ఒక ముస్లిం అభిమానించదగ్గ మసీదు ఏదైనా ఉందంటే అది మక్కాలో ఉన్న కాబా మసీదే కాగలదు. తరువాత ప్రవక్త ముహమ్మద్ (స ) వారి ద్వారా మదీనాలో కట్టబడిన మస్జిదే నబవీ కాగలదు. ఇక కాబా మసీదు సైతం కేవలం ఒక మసీదే తప్ప కాబాను ఏ ముస్లిమూ ఆరాధించడు. దానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడటానికి కారణం- ప్రప్రథమంగా దైవారాధన చెయ్యటం కొరకు నిర్మించబడిన అతి ప్రాచీన ఆరాధనగృహం అవ్వటం మూలాన మాత్రమే. “విశ్వప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది” – 3:96 అని ఖురాన్ లో సృష్టికర్త అయిన దేవుడు సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి. కనుక ఒక ముస్లిం విశ్వాసంతో ముడిపడి ఉన్న భౌతిక కట్టడం ఇస్లాంలో ఏదైనా ఉందీ అంటే మక్కాలో ఉన్న కాబా మసీదే అవుతుంది. అదికూడా హజ్ చెయ్యటం ఇస్లాం మూల స్థంబాల్లో ఒకటిగా చెయ్యబడింది కాబట్టి.
ఆరాధనకు ఫలానా మసీదు అవసరమా?
