“జోరం వాన్ క్లావెరెన్” ఇస్లాం స్వీకరించటానికి కారణమైన “ఇస్లాం వ్యతిరేక రచన!”

కొన్నిసార్లు ఏ మాత్రం నమ్మశక్యంకాని చిత్ర విచిత్రమైన మరియు అద్భుతమైన సంఘటనలు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. అలాంటి ఓ అద్భుతమైన సంఘటనే ఇస్లాం పట్ల బద్ధ విరోధి, మరియు ఇస్లాంను ఓ అబద్ధ ధర్మంగా నిరూపించటానికి అహర్నిశలూ తీవ్రమైన కృషి సలుపుతూ, దాని కొరకు స్థాపించబడిన ఓ “యాంటీ-ఇస్లామిక్” సంస్థలో ప్రముఖ పాత్ర వహించిన “జోరం వాన్ క్లావెరెన్” తిరిగి ఇస్లాంను స్వీకరించటం అన్నది! నమ్మశక్యం కాని అత్యంత ఆశక్తికరమైన ఈ సంఘటనను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా వివరంగా చదివి తెలుసుకోవాల్సిందే!

“జోరం వాన్ క్లావెరెన్ (Joram van Klaveren)” పుట్టుకతోనే ప్రొటెస్టంట్ క్రిస్టియన్, మరియు నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ రాజకీయవేత్త, అంతేకాక “ఫార్-రైట్ పార్టీ ఫర్ ఫ్రీడం (PVV)” తరఫున 2010 నుండి 2014 వరకు “మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (MP)”గా కూడా పని చెయ్యటం జరిగింది! ఫార్-రైట్ డచ్ పార్టీలో అనేక సంవత్సరాలు పని చేస్తూనే “ఇస్లామోఫోబిక్” లీడర్ అయిన “గీర్ట్ విల్డెర్స్ (Geert Wilder)” ఆధ్వర్యంలో స్థాపించబడిన ఓ డచ్, “యాంటీ-ఇస్లామిక్” సంస్థలో అతనికి కుడి భుజంగా ఉంటూ, ఇస్లాంకు వ్యతిరేక ఉద్యమం (Anti-Islamic Movement) లో పని చేయటంలో తన వంతు పాత్రను ఎంతో వేగవంతంగా నిర్వర్తిస్తూ ఉండేవాడు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఇస్లాం పట్ల తీవ్ర విరోధం కలిగి ఉండటంలో “జోరం వాన్ క్లావెరెన్” కంటే మరొకరు ఉండరు అనటం అతీయోశక్తి కాదేమో!

“జోరం వాన్ క్లావెరెన్” చాలా సంవత్సరాలు ఇస్లాంకు వ్యతిరేకంగా అత్యంత దారుణమైన పదజాలం ఉపయోగిస్తూ ఎలాగైనా ఇస్లాంను అణచాలనే ఉద్దేశంతో అనేక ఇస్లాం వ్యతిరేక ప్రసంగాలను చేశాడు! ఒకానొక సమయంలో “జోరం వాన్ క్లావెరెన్” ఎంతో దారుణమైన పదజాలం ఉపయోగిస్తూ – “ఇస్లాం ఓ అబద్ధం, ప్రవక్త ముహమ్మద్ ఓ క్రిమినల్, ఖురాన్ ఓ విషపూరిత పుస్తకం!” అని చెప్పాడు. కేవలం మీడియా కథనాలు ఇస్లాంను ఓ ఉగ్రవాద మతంగా చిత్రీకరించటం కొందరు టెర్రరిస్టులను ఇస్లామిస్టులుగా చూపటంతో “జోరం వాన్ క్లావెరెన్” కు ముస్లిములు అంటే క్రైస్తవ్యాన్ని చంపేవారుగా ఉద్దేశించబడినవారనే అపోహకు గురవ్వటం జరిగింది. ఇంకా ఇస్లాం ఉగ్రావాదం ఆధారంగా ప్రపంచంలో వ్యాపించిందని, స్త్రీలను అణచివేస్తుందని వగైరా అన్ని రకాల అపోహలను బుర్రకెక్కించుకుని ఉండేవాడు. ఇవే అపార్థాలు “జోరం వాన్ క్లావెరెన్” ఇస్లాంకు వ్యతిరేకంగా పని చేయటానికి పురికొల్పింది. చివరకు డచ్ పార్లమెంట్ లో సైతం ముస్లిములను, నఖాబ్, మస్జిద్ లను దాని మీనార్లను నిషేధించాలని ఉధ్యమాన్ని లేవనెత్తాడు.

కానీ తానొకటి తాలిస్తే దైవం మరొకటి తలుస్తాడన్నట్లు అప్పటివరకూ “ఇస్లామోఫోబిక్” లీడర్ అయిన “గీర్ట్ విల్డెర్స్ (Geert Wilder)” కు కుడిభుజంగా ఉన్న “జోరం వాన్ క్లావెరెన్” అతను చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు నచ్చక అతనితో విడిపోయాడు. ఆ తరువాత “జోరం వాన్ క్లావెరెన్” ఇస్లాంకు వ్యతిరేకంగా ఓ “యాంటీ-ఇస్లామిక్ (Anti-Islaamic) పుస్తకాన్ని రచించే పనిలో పడ్డాడు. అదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేయ్యటానికి ఓ కారణం అవుతుందని అప్పటివరకూ “జోరం” పీడకల్లో సైతం ఊహించి ఉండడు.

అయితే ఇస్లాంకు వ్యతిరేకంగా పుస్తకం వ్రాయాలి అంటే ముందు ఇస్లాంకు చెందిన సాహిత్యం అవగాహన చేసుకుంటే ఇంకాబాగా వ్రాయవచ్చనే ఆలోచన “జోరం”కు కలిగింది. ఆ దిశగా అతను ఇస్లాం సాహిత్యం పై తన పరిశోధన ప్రారంభించాడు. ఒకానొక సందర్భంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్న అతని స్నేహితుడు అబ్దుల్ హకీం మురాద్ (ఇతను ఇస్లాం స్వీకరించక ముందు తిమోతీ వింటర్ అన్న పేరు కలిగి ఉండేవాడు) వద్ద ఇస్లాంకు చెందిన కొన్ని విషయాలు చర్చించటానికి అతని వద్దకు వెళ్లినప్పుడు “నువ్వు ఊహిస్తున్న ఇస్లాం వేరు! వాస్తవమైన ఇస్లాం వేరు” అని చెప్పినప్పుడు, “జోరం” అయితే అసలైన ఇస్లాం ఏమిటి? అని ప్రశ్నించాడు. దానికి అతను “జోరం”కు ఇస్లామిక్ సాహిత్యం, ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర చదవమని ఇచ్చాడు.

కొన్నాళ్ల తరువాత ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర చదివి “జోరం వాన్ క్లావెరెన్” ఏమని సాక్ష్యామిచ్చాడంటే-

“ఇస్లాం కు వ్యతిరేకంగా ఏవైతే అనేక పుస్తకాలు వ్రాయబడ్డాయో వాటికి ఏ ఆధారమూ (base) లేదు! నేను ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర చదవటం ప్రారంభించానో అప్పుడు నాకు ఎంతో సౌమ్యుడు, మృదుస్వభావి, ముస్లిములకైనా ముస్లిమేతరులకైనా ఎంతో సహాయపడే ఓ సరిక్రొత్త ముహమ్మద్ పరిచయం అయ్యాడు. అప్పటివరకూ నేను ఏదైతే ఇస్లాం గురించి ఊహించుకుంటూ ఉండేవాడినో అది అసలు ఇస్లామే కాదు” అని చెప్పాడు.

ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర, ఖురాన్ అధ్యయనం అతనికి ఇస్లాం పట్ల ఉన్న అపార్థాలన్నిటినీ ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేశాయి. “జోరం వాన్ క్లావెరెన్” అసలు ఇస్లాం అంటే ఏమిటో అది ఎంత శాంతి ధర్మమో తెలుసుకున్నాడు. మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం ఇస్లాంను కించపరచటానికి చెయ్యబడుతున్న ఓ ఆధారరహిత అబద్ధ సమాచారాలన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇక “జోరం వాన్ క్లావెరెన్” తక్షణమే ఇస్లాం స్వీకరించి, ముస్లింగా మారాడు. ఆవిధంగా అతను మొదలుపెట్టిన ఇస్లాం వ్యతిరేక రచనే అతన్ని ఇస్లాం స్వీకరించటానికి కారణం అయ్యింది. కొసమెరుపు ఏమిటంటే PVV పార్టీ లో పనిచేసిన “జోరం వాన్ క్లావెరెన్” ఇస్లాం స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి కాదు అంతకంటే ముందే అదే పార్టీలో సీనియర్ అయిన “ఆర్నౌద్ వాన్ దూరాన్” సైతం 2013 లోనే ఇస్లాం స్వీకరించి ఉన్నాడు. ఈ విధంగా ఇస్లాంకు ప్రతికూలంగా పనిచెయ్యటానికి ఏ సంస్థ అయితే స్థాపించబడిందో అందులో నుండే ఇస్లాంకు అనుకూలంగా పనిచేసేవారు బయలుదేరటం నిజంగా అద్భుతాల్లో కెల్లా ఓ అధ్బుతం అని చెప్పవచ్చు.

“జోరం వాన్ క్లావెరెన్” లాంటివారు మన మధ్య చాలా మంది ఉన్నారు!

అవును ఇస్లాంను అధ్యయనం చేయకుండానే ఇస్లాం పట్ల వినికిడి సమాచారం ఆధారం చేసుకుని, మీడియా చెప్పే కథనాలు నిజమని నమ్మి, అనేక అపార్థాలను తమ బుర్రకెక్కించుకుని, ఇస్లాం పట్ల తీవ్రమైన పదజాలంతో మాట్లాడేవారు, దాని పట్ల చులకన భావం కలిగినవారు, ప్రవక్త ముహమ్మద్ (స) వారి పై దారుణమైన వ్యాఖ్యలు చేసేవారు “జోరం వాన్ క్లావెరెన్” లాంటి వారు చాలా మంది మన మధ్యే ఉన్నారు. ఒకప్పుడు ఇస్లాం పట్ల తీవ్ర ధ్వేషంతో నిండి ఉండే “జోరం వాన్ క్లావెరెన్” తరువాత ఇస్లాం స్వీకరించటానికి అతనిని ఎవరూ బెదిరించలేదు, ప్రలోభపెట్టలేదు, ఎవరూ ఏ రకమైనా ఆశా చూపలేదు. అతను కేవలం చేసిందల్లా ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రను, ఖురాన్ ను అధ్యయనం చేశాడు. అదే అతనికి ఇస్లాం పట్ల ఉన్న సకల అపార్థాలను, ధ్వేషపూరిత ఆలోచనలను పటాపంచలు చేయటంలో సహాయపడింది. అదే విధమైన అధ్యయనాన్ని నేటి ఇస్లాం విమర్శకులు కూడా చెయ్యటం మొదలు పెడితే ఇస్లాం పట్ల వారు పెంచుకున్న ధ్వేష పూరిత ఆలోచనలు, అపార్థాలు ఎంత అర్థరహితమైనవో తెలుసుకోవటానికి పెద్ద సమయం పట్టదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *