ప్రవక్త ముహమ్మద్ (స) వారి ఉన్నత వ్యక్తిత్వం పట్ల సామాన్య ప్రజల దృష్టి ఆకర్షింపబడకుండా, ముస్లిమేతర పండితులు ముఖ్యంగా క్రైస్తవ బోధకులు ప్రవక్త ముహమ్మద్ (స) వారి మీద బురద జల్లటానికి ఎక్కువగా ఉపయోగించే అస్త్రం- “ముహమ్మద్ కేవలం 6 సం. చిన్న పిల్లను పెళ్లి చేసేసుకున్నారు! అలా పెళ్లిచేసుకునే వాడు అసలు ప్రవక్త ఎలా కాగలడు?” అన్నది. ఇలాంటి ఆరోపణలు చేసేవారికి సమాధానమే ఈ వ్యాసం.
ప్రవక్త ముహమ్మద్ (స) వారితో హజ్రత్ ఆయిషా (రజి) వివాహం జరిగేనాటికి ఆమె వయస్సు 9 సంవత్సరాలన్న అపార్థం క్రైస్తవులలోనే కాదు దాదాపు అధికశాతం ముస్లిములలో కూడా ఉందనటం అతిశయోక్తి కాదు. ప్రారంభంలో నేను సైతం అదే విధమైన భావనలో ఉండేవాడిని. దానికి కారణం కూడా కొన్ని హదీసుల్లో హజ్రత్ ఆయిషా (రజి) వారిని ప్రవక్త (స) వారు ఆరు సం. ల వయసు ఉన్నప్పుడే పెళ్లి కుదుర్చుకుని, 9 సం. వచ్చాకా ఆమెను పెళ్లి చేసుకున్నారని వ్రాయబడి ఉండటమే! అయితే ఈ హదీసులలో చెప్పబడింది ఎంతవరకు ప్రామాణికం? అన్న విషయం పై నా లోతైన పరిశీలనలో తేలిన అంశాలను అందరూ సులువుగా అర్థం చేసుకునేందుకు మీ ముందు ఉంచుతున్నాను. ప్రవక్త ముహమ్మద్ (స) వారితో హజ్రత్ ఆయిషా (రజి) వివాహం జరిగే నాటికి ఆమె వయస్సు సరిగ్గా లెక్కించటానికి బలమైన ఆధారాలను ఈ క్రింది గమనించగలరు.
మొదటి ఆధారం:
“సాబికూన్ అల్-అవ్వలూన్” అంటే “ఇస్లాం స్వీకరించిన ప్రారంభ వ్యక్తులు అని అర్థం” నాటి ఇస్లాం స్వీకరించిన ప్రారంభ వ్యక్తుల పేర్ల జాబితాలో హజ్రత్ ఆయిషా (రజి) వారి పేరు ఆమె కంటే వయసులో 10 సం. పెద్ద అయిన అక్క గారైన “హజ్రత్ అస్మా” (రజి) వారితో పాటు వ్రాయబడి ఉందన్నది గమనార్హం. ఇక “హజ్రత్ అస్మా” (రజి) వారు 595 సం. లో పుట్టి ఉన్నారు. ఆ జాబితాలో ఉన్నవారు ఇంకా ఉత్మాన్ ఇబ్నె అఫ్ఫాన్, జుబైర్ ఇబ్నె అవ్వామ్, అబ్దుర్రహ్మాన్ ఇబ్నె అవుఫ్, సాద్ ఇబ్నె అబీవక్కాస్, తల్హా ఇబ్నె ఉబయ్ దుల్లహ్, అబు ఉబయ్ దా ఇబ్నె జర్రా, అర్హం ఇబ్నె అబీ అల్ అర్కం, ఉత్మన్ ఇబ్నె మజూన్, ఉమైర్ ఇబ్నె అబీ వక్కాస్, అబ్దుల్లా ఇబ్నె మసూద్ వగైరా మరి కొందరితో పాటు హజ్రత్ ఆయిషా (రజి) వారి పేరు ఇస్లాం స్వీకరించిన ప్రారంభ వ్యక్తుల జాబితాలో వ్రాయబడి ఉన్నట్లుగా చూడగలం. అంటే ముహమ్మద్ (స) వారు 610 సం. లో ప్రవక్తగా నియమితులైనప్పటికే హజ్రత్ ఆయిషా (రజి) వారు పుట్టి ఉన్నారు. దీనిని బట్టి అప్పటికే ఆమె వయసు దాదాపు 5 సం. లు.
ముఖ్యంగా ఖురాన్ 54 వ సూరా “అల్-ఖమర్” ప్రారంభ వాక్యాలు ముహమ్మద్ (స) వారు 610 సం. లో ప్రవక్తగా నియమితులయ్యాక 4 సం. అనంతరం అవతరించాయి. అంటే 614 సంవత్సరంలో. “ఈ వాక్యాలు అవతరించే నాటికి “నేను ఆడుకునే పిల్లను (I was a child playing)” అని హజ్రత్ ఆయిషా (రజి) చెప్పినట్టు సహీహ్ అల్ బుఖారీ హదీస్ నెం. 4876 కితాబే తఫ్సీర్ లోనే వ్రాయబడి ఉంది. పై సమాచారాన్ని బట్టి ముహమ్మద్ (స) వారు 610 సం. లో ప్రవక్తగా నియమితులైనప్పటికే హజ్రత్ ఆయిషా (రజి) వారి వయస్సు 4, 5 సం. లు. మధ్య వయస్కురాలు. అంటే “అల్-ఖమర్” సూరా అవతరించే నాటికి ఆమె వయస్సు 8 సం. లు. దీనిని బట్టి ఆమె పుట్టింది 605 సం. లో అన్నది తేలిపోయింది. ఇక ప్రవక్త ముహమ్మద్ (స) వారు మక్కా లో ఉన్నది 13 సం. ఆ తరువాత 622 సం. లో ఆయన మదీనాకు హిజ్రత్ చేశారు. హిజ్రత్ అనంతరం దాదాపు 2 రెండు సం. తరువాత హజ్రత్ ఆయిషా వారిని పెళ్లిచేసుకున్నారు. వెరసి అప్పటికి హజ్రత్ ఆయిషా (రజి) వయస్సు 19 లేదా 20 సం. ల మహిళ తప్ప 9 సం. ల అమ్మాయి కాదు!!
రెండవ ఆధారం:
హజ్రత్ ఆయిషా (రజి) వారి అక్క గారైన “హజ్రత్ అస్మా” (రజి) వయసులో ఆమె కంటే 10 సం. లు పెద్ద అన్నది మనం పైన గమనించి ఉన్నాం. ఇక ప్రఖ్యాత “మిష్కాత్” గ్రంధకర్త అయిన “వలీయుద్దీన్ ముహమ్మద్ అబ్దుల్లా అల్-ఖతీబ్-అల్ అమ్రి తబ్రీజీ” వారు – “అస్మా ఉర్రిజాల్” లో ఎంతో స్పష్టంగా హజ్రత్ ఆయిషా (రజి) వారి కంటే 10 సం. పెద్ద అయిన హజ్రత్ అస్మా (రజి) వారు హిజ్రీ శకం 73 సం.లో చనిపోయారు, ఆమె చనిపోయేనాటికి ఆమె వయస్సు 100 సం. లు అని పేర్కొన్నారు. అందరికీ తెలిసిన విషయమే ఇస్లామిక్ కేలండర్ హిజ్రత్ జరిగిన నాటి నుండి ప్రారంభం అయిందని! 622 సం. లో హిజ్రత్ సంఘటన జరిగింది. ఇప్పుడు ఆమె చనిపోయేనాటికి 100 సం. వయసులో నుండి 73 సం. లు తీసివేస్తే ప్రవక్త ముహమ్మద్ (స) వారు హిజ్రత్ చేసే నాటికి ఆమె వయస్సు 27 సం.లు. ఇక హజ్రత్ ఆయిషా (రజి) వారి కంటే హజ్రత్ అస్మా (రజి) 10 సం. లు పెద్ద! అంటే హజ్రత్ ఆయిషా (రజి) వారి వయస్సు హిజ్రత్ జరిగేనాటికి 17 సం. లు. హిజ్రత్ అనంతరం దాదాపు 2 తరువాత ప్రవక్త ముహమ్మద్ (స) వారు హజ్రత్ ఆయిషా (రజి) వారిని పెళ్లి చేసుకున్నారు అని సకల హదీసు గ్రంధాలలో ఉంది. అంటే అప్పటికి ఆమె వయస్సు 17+2=19. వివరంగా చెప్పాలంటే దాదాపు 19 లేదా 20 సం. ల మహిళ! తప్ప 9 సం. ల అమ్మాయి కాదు!! చరిత్రలో ఉన్న ఈ వాస్తవాలు ఎలా కాదనగలం?
పైగా ప్రవక్త ముహమ్మద్ (స) వారు, హజ్రత్ ఆయిషా (రజి) వారిని వివాహం చేసుకోక మునుపే ఆమెకు జాబిర్ ఇబ్నె అల్ మొతిమ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగి, ఆ వ్యక్తి ధర్మం స్వీకరించని కారణంగా ఆ వివాహం రద్దు అయిపోతుంది. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ (స) వారితో వివాహం జరుగుతుంది. దీనిని బట్టి ప్రవక్త ముహమ్మద్ (స) వారు పెళ్లి చేసుకోకమునుపే హజ్రత్ ఆయిషా (రజి) వారు పెళ్లీడుకొచ్చిన మహిళ తప్ప ఏదో 9 సం. చిన్న అమ్మాయి కాదని చెప్పటానికి ఇదొక బలమైన ఆధారం.
పై సమాచారాన్ని బట్టి ప్రవక్త ముహమ్మద్ (స) వారితో హజ్రత్ ఆయిషా (రజి) వివాహం జరిగే నాటికి ఆమె 9 సం. ల వయస్సు ఉన్న అమ్మాయి కాదు! కానీ, 19 సం. ల వయసు ఉన్న మహిళ అన్న విషయం చారిత్రక ఆధారాలతో సహా సుస్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఇక్కడితో ప్రవక్త ముహమ్మద్ (స) వారు కేవలం 6 లేదా 9 సం. చిన్న అమ్మాయిని పెళ్లిచేసేసుకున్నారు అన్న నింద ఆయన మీద నుండి తొలగిపోయింది. అయితే ఇప్పుడు ఆయన దాదాపు 53 యేళ్ళ వయసులో 20 సం. మహిళను మాత్రం పెళ్లి చేసుకోవటం ఏమిటి? అనే రెండవ ప్రశ్న కొందరు లేవనెత్తవచ్చు. దీనికి సమాధానం తెలుసుకోగలరు.
1.దైవసేవకే అంకితమై ఉన్న ప్రవక్త ముహమ్మద్ (స) పూర్తి జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన వెనుక దేవుని తరఫున నిర్దేశించబడిన ఓ ప్రత్యేక ఉద్దేశం ఉంది. ముహమ్మద్ (స) 53 సం. వరకు కేవలం ఒకే భార్యను కలిగి ఉన్నారు. పైగా ఆమె ముహమ్మద్ (స) కంటే వయసులో 15 సం. లు పెద్ద. ఇక ఆ తరువాత ఆయనకు బహుభార్యత్వం అనుమతి ఇవ్వటం వెనుక కారణం అప్పట్లో అరబ్బు సమాజం అనేక వర్గాలుగా విడిపోయి ఏమాత్రం కలవటానికి ఇష్టపడే వారు కాదు. ఆ వర్గాలన్నిటినీ ఏకం చెయ్యగల మార్గం వర్గాంతర వివాహాలను ప్రోత్సహించటం ఒక్కటే! ఆ పని చేయటానికి ఎవరూ ముందుకు రానప్పుడు ఒక ప్రవక్తగా మాదిరి చూపవలసింది ఆయననే కదా! అందుకే ఆయనకు బహుభార్యత్వం అనుమతి ఇవ్వటం జరిగింది.
2. ఆయన పెళ్లిళ్లు చేసుకున్నది సైతం వితంతువులు, విడాకులు పొందిన స్త్రీలనే! ఇక హజ్రత్ ఆయిషా (రజి) వారు కేవలం దేవుని సేవ కొరకు దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ! తప్ప పెళ్లి, పిల్లలు, సంసారం అన్న ఉద్దేశంతో వారి పెళ్లి జరగలేదు. భావి తరాల వారికి ప్రవక్త ముహమ్మద్ (స) వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆదర్శాలను మహిళా లోకానికి అందజేసే బాధ్యత నిమిత్తం ఎన్నోకోబడిన స్త్రీ ఆమె! పైగా ఆమె చురుకైన వ్యక్తిత్వం, అపారమైన జ్ఞాపకశక్తి కలిగి ఉండేవారు. ఆమె 2210 హదీసులు ఎంతో అనర్గళంగా ఉల్లేఖించి ఉన్నారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ (స) సాంప్రదాయాలను, ధార్మికపరమైన గొప్ప సమాచారాన్ని ఆమె మహిళా లోకానికి అందజేశారు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ (స) వారు హజ్రత్ ఆయిషా (రజి) వారిని పెళ్లి చేసుకోవటం వెనుక ఏ దురుద్దేశమూ లేదు. కేవలం దైవ సందేశం విడిచిపెడితే చాలు మీకు అపారమైన నిధులు, అందమైన స్త్రీలు, అధికారం కట్టబెడతామని ఆనాటి ఖురైష్ లు ఆయన ముందు ప్రస్తావన తెచ్చినప్పుడు సైతం వాటన్నిటినీ తిరస్కరించించి కేవలం దేవసందేశం నిమిత్తమే జీవితాన్ని ధారబోసిన వ్యక్తిని ఈ నాటి కొందరు మతిలేని క్రైస్తవ బోధకులు ఆయనను స్త్రీ లోలుడని నిందించటం వారి ఎంత తెలివితక్కువతనమో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ప్రవక్త ముహమ్మద్ (స) వారిని విమర్శించే ముందు క్రైస్తవ పండితులు తెలుసుకోవలసిన విషయం- క్యాథలిక్ ఎన్ సైక్లోపీడియా ప్రకారం 12 సం. ల వయసులో ఉన్న కన్య మేరీని యెసేపు పెళ్లి చేసుకునే నాటికి అతని వయస్సు 90 సం. లు అన్నది. నిజానికి ఈ మాహిళలు దేవుని సేవకొరకు ఎన్నుకోబడ్డవారు మాత్రమే. కాబట్టి వారి జీవితాలను సామాన్య స్త్రీలతో, ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థతో పోల్చి తమకు తోచిన స్టేట్ మెంట్లు ఇవ్వటం అర్థరహితం అవుతుంది. ఇప్పటివరకూ మనం గమనించిన వివరణ వెలుగులో ప్రవక్త ముహమ్మద్ (స) వారితో హజ్రత్ ఆయిషా (రజి) వివాహం జరిగే నాటికి ఆమె వయస్సు 9 సం. కాదని, కానీ, 19 సం. లని తెలుసుకున్నాం. అంతే కాదు హజ్రత్ ఆయిషా (రజి) వివాహం దైవం తరఫున జరుపబడింది కేవలం దైవ సేవకొరకు మాత్రమే అన్న విషయాన్నీ తెలుసుకున్నాం.
ప్రవక్త ముహమ్మద్ (స) వారితో హజ్రత్ ఆయిషా (రజి) వివాహం జరిగే నాటికి ఆమె వయస్సు 9 సం. లా? 19 సం. లా?
