‘మస్జిదే – అక్సా’ అంటే ఏమిటి?

‘మస్జిదే – అక్సా’ అంటే మొదటి ఫోటోలో ‘బంగారు రంగు కప్పు’తో నిర్మించబడి “డోమ్ ఆఫ్ రాక్” గా పిలువబడే కట్టడమే అనుకుంటూ ఉంటారు చాలా మంది.

నిజానికి దాని పేరు “మస్జిదే-అస్ సఖ్రా” లేదా “కుబ అల్-సఖ్రా”. ఈ మస్జిదే “డోమ్ ఆఫ్ రాక్” పేరుతో ప్రసిద్ధికెక్కింది. దీనిని 685 AD లో ఖలీఫా అబ్దుల్ మాలిక్ ఇబ్నె మర్వాన్’ నిర్మించటం జరిగింది. సరిగ్గా ఆ బంగారు రంగు కప్పు క్రింది ఓ ఎత్తైన రాయి ఉంది. అక్కడి నుండే ప్రవక్త ముహమ్మద్ (స) మేరాజ్ యాత్ర చేసినట్టు చెబుతారు. సరిగ్గా ఆ రాయికి పై భాగంలో “డోమ్ (కప్పు)” నిర్మించటం కారణంగా “మస్జిదే-అస్ సఖ్రా”ను “డోమ్ ఆఫ్ రాక్” అని పిలువటం జరుగుతుంది.

మరి కొంత మందైతే… “మస్జిదే-అస్ సఖ్రా” లేదా “డోమ్ ఆఫ్ రాక్”కు కాస్త దూరంలో దక్షిణభాగాన (రెండవ ఫోటోలో కనపడుతున్న) “సిల్వర్ రంగు కప్పు”తో నిర్మించబడి ఉన్నదే “మస్జిదే – అక్సా” అనుకుంటూ ఉంటారు. అది కూడా తప్పే.

వాస్తవానికి అది కూడా ‘మస్జిదే అక్సా’ కాదు! దాని పేరు “అల్- మస్జిద్ అల్-కిబ్లీ”. దానిని రెండవ ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి) జెరూసలేం సందర్శించటానికి వెళ్లినప్పుడు నిర్మించటం జరిగింది.

ఈ విధంగా చాలా మంది ఈ రెండు మసీదుల్లో ఏదో ఒకదాన్ని పట్టుకుని ‘మస్జిదే – అక్సా’ అని పొరబడుతుంటారు. నిజానికి ఆ రెండు మసీదుల్లో ఏదీ ‘మస్జిదే అక్సా’ కాదు. మరి ‘మస్జిదే – అక్సా’ అంటే ఏది?

ఈ క్రింది మూడవ ఫోటోలో రెడ్ కలర్ మార్క్ లో కనపడుతున్న మొత్తం 36 ఎకరాల కాంపౌండ్ అంతా కలిపి ‘మస్జిదే – అక్సా’ లేదా ‘బైతుల్ మక్దిస్’ లేదా ‘అల్-హరమ్ అల్ షరీఫ్’ అనబడుతుంది.

వాస్తవానికి ‘మస్జిదే – అక్సా’ కాంపౌండులో ఒకటికాదు రెండు కాదు మొత్తం 5 మసీదులు నిర్మించబడి ఉన్నాయి! అవి: 1. మస్జిదే- మర్వానీ 2. అల్-కిబ్లీ మస్జిద్ 3. కుబ అల్-సఖ్రా 4. మస్జిదే – బురాక్ 5. మస్జిదే- ఖదీమ్.

ఈ ఐదు మసీదులు ఉన్న మొత్తం ఆ 36 ఎకరాల పవిత్ర ప్రాంతాన్నంతటిని కలిపి “మస్జిదే అల్-అక్సా” లేదా ‘బైతుల్ మక్దిస్’ అంటారన్నమాట!

ఒకప్పుడు ఆ 36 ఎకరాల పవిత్ర ప్రదేశంలో ప్రవక్త సోలోమన్ (అలై) ద్వారా 950 BC లో “మస్జిదే అల్-అక్సా” నిర్మించబడింది. దానినే బైబిల్లో ‘సోలోమన్ మందిరం’ అన్న పేరుతో చూడగలం.

కానీ, ఆ తరువాత 587 BC లో బాబిలోనియన్ల దండయాత్రల్లో అది పూర్తిగా ధ్వంసం చెయ్యబడింది. చివరకు 515 BC లో అదే స్థలంలో మిగిలి ఉన్న శిధిలాలపై తిరిగి సోలోమన్ మందిరాన్ని పునః స్థాపించటం జరిగింది. కానీ. 70 AD లో రోమన్ల కాలంలో రెండవసారి కూడా పూర్తిగా ధ్వంసం చెయ్యబడింది. ఆ తరువాత మిగిలి ఉన్న శిధిలాలపైనే ప్రస్తుతం ‘అల్- మస్జిద్ అల్-కిబ్లీ’ నిర్మించటం జరిగింది. అందుకే తరువాతి కాలాల్లో మస్జిద్ అల్-కిబ్లీ’కి ‘అల్ అక్సా’ అని కూడా పేరు పెట్టటం జరిగింది.

ఒకప్పుడు యూదుల్లో విశ్వాసులంతా మస్జిదే అక్సా ‘దిక్కు (ఖిబ్లా)’ వైపే తిరిగి నమాజ్ చేస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని బైబిల్లోనూ చూడగలం.

“… అతడు తన ఇంటికి వెళ్లి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు ‘యెరుషలేము తట్టునకు’ తెరవబడియుండగా తన దేవునికి ప్రార్ధన చేయుచూ ఆయనను స్తుతించుచువచ్చెను” – దానియెలూ 6:10

పై వాక్యంలో పూర్వం యూదులు యెరుషలేములో ఉన్న అక్సా మస్జిద్ నే ‘దిక్కు (ఖిబ్లా) గా చేసుకుని ఆరాధనలు చేసేవారని తెలుస్తుంది.

ప్రారంభంలో ప్రవక్త ముహమ్మద్ (స) ఆయన అనుచరులు సైతం ‘మస్జిదే అక్సా’ దిక్కువైపే తిరిగి ప్రార్ధనలు చేస్తూ ఉండేవారు. ఆ తరువాత ‘మస్జిదే అక్సా’ వైపు నుండి ‘మక్కా (బైబిల్లో బాకా)’ వైపునకు ‘ఖిబ్లా (దిక్కు)’ మార్చటం జరిగింది. అందుకే అటు యూదులకు, ముస్లిములకు ఉమ్మడి పవిత్ర ప్రదేశంగా “మస్జిదే అక్సా” ఉంటూ ఉంది.

ఖురాన్ ఆ మొత్తం 36 ఎకరాల పవిత్ర ప్రదేశాన్ని ఉద్దేశిస్తూనే “మస్జిదే – అక్సా” అని ప్రస్తావిస్తుంది. ప్రస్తుతం యూదులు ఆ “మస్జిదే – అక్సా” ప్రాంతాన్ని కబ్జా చేసి తిరిగి సోలోమన్ మందిరాన్ని పునః స్థాపిస్తే అక్కడ తమను పాలించే ‘మెస్సీయ’ అవతరిస్తాడన్నది వారిదో గుడ్డి నమ్మకం. యూదులు పాలస్తీనాలో ఉన్న జెరూసలేంను ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్రయత్నించటంలో అసలు రహస్యం ఇదే.

ఇక పాలస్తీనా భూభాగంలో ముస్లిములు ఎలా ప్రవేశించారన్న ఓ చవకబారు ప్రశ్నను కొందరు అరకొర జ్ఞానం ఉన్న క్రైస్తవులు ప్రశ్నిస్తూ ఉంటారు.

అటు ఇశ్రాయేలీయులకు (యూదులకు), ఇశ్మాయేలీయులకు (ముస్లిములకు) ఉమ్మడి మూల పురుషుడు ప్రవక్త అబ్రాహము ఒకప్పుడు ‘కనాను’గా పిలువబడే పాలస్తీనాలోనే నివాసం ఉండేవారు. మొదటి భార్య అయిన శారా, ఇస్సాకులు కనాను (పాలస్తీనా)లో, రెండవ భార్య హాగారు, ఇశ్మాయేలు పారాను (మక్కా)లో నివసిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఈ రెండు వంశావళుల నుండి వచ్చిన యూదులు, అరబ్ ముస్లిములకు పాలస్తీనా ఉమ్మడి పవిత్ర ప్రదేశంగా ఉంటూ రావటం జరిగింది.

అక్కడే ప్రవక్త సోలోమన్ కాలంలో మస్జిదే అక్సా సైతం నిర్మించబడింది. యూదులకు అప్పటికే పాలస్తీనాలో నివశిస్తున్న అమాలేకియులనే జాతి ప్రజల్ని తొలగించి ఆ ప్రదేశంలో నివసించాల్సిందిగా ఆజ్ఞాపించబడుతుంది. అది కూడా మంచి నడవడిక కలిగి ఉన్నంత వరకే ఆ భూభాగంలో ఉంటారన్న షరతుతో. తరువాతి కాలాల్లో యూదులు తమ వద్దకు పంపబడిన ప్రవక్తలను హత్యలు చేస్తూ అన్ని రకాల చెడుల్లో కూరుకుపోయినప్పుడు 70 AD లో రాజైన టైటాస్ దాడిలో యెరుషలేము ధ్వంశం చెయ్యబడుతుంది.

వారు యేసు నోట శపించబడినట్టే పాలస్తీనా పై అధికారం కోల్పోయి అక్కడ నుండి వెళ్లగొట్టబడి ప్రపంచంలో అనేక దేశాల్లో చెదిరిపోతారు.

రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రజి) కాలంలో యెరుషలేములో ఉన్న మస్జిదే అక్సా పునరుద్ధరించబడుతుంది. అలాగే 685 AD లో ఖలీఫా అబ్దుల్ ఇబ్నె మార్వాన్ ద్వారా “మస్జిదే అస్ సఖ్రా” నిర్మించబడుతుంది. అదే ఈనాడు “డోమ్ ఆఫ్ రాక్” పేరుతో ప్రసిద్ధిగాంచింది.

హజ్రత్ ఉమర్ మరియు యెరుషలేము స్థానిక క్రైస్తవ అధికారుల మధ్య జరిగిన శాంతి ఒప్పందాల తరువాత ముస్లిములు ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పర్చుకున్నారు. చిత్రం ఏమిటంటే ఈనాటికీ యూదులు యేసును మెస్సీయగా నమ్మనే నమ్మరు! కానీ, తమ కోసం ఒక మెస్సీయ రావలసి ఉందని నమ్ముతుంటారు. అతని రాకడ త్వరగా జరగాలని ఇప్పటికీ ఆ మస్జిదే అక్సా కు ఆనుకుని ఉన్న “వైలింగ్”వాల్ వద్ద పోగై నిత్యం తోరా చదువుతూ రోదిస్తూ ప్రార్ధనలు చేస్తుంటారు. క్రైస్తవులేమో యూదులు ఒకప్పుడు కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి సాధించాలని, తిరిగి తమ రాజ్యం స్థాపించాలని వారు బాగుండాలని బైబిల్ చదువుతూ వారి కోసం గుండెలు బాదుకుంటూ చర్చిల్లో రోదిస్తూ ప్రార్ధనలు చేస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *