ఈమె చేసింది ఇస్లాం వ్యతిరేక పోరాటమా?

ఇరాన్ లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి ఇటీవలే నోబుల్ పురస్కారాన్ని అందుకున్నందుకు గానూ నర్గీస్ ముహమ్మదీ అనే మానవ హక్కుల కార్యకర్త చేసిన పోరాటాన్ని కొందరు నాస్తికులు ఆమె చేసింది ఇస్లాంలో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం అన్నట్లు ఊహించుకుని తెగ ఆరాట పడిపోతున్నారు.

గత సంవత్సరం అదే ఇరాన్ లో ‘మహ్సా అమీని’ అనే ఓ 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించనందుకు అక్కడి పోలీసులు సెప్టెంబర్ 13 న అరెస్టు చెయ్యటం, రెండ్రోజుల తరువాత ఆమె చనిపోవటం, తరువాత ఆమె డెడ్ బాడీని అప్పగించటంతో ఇరాన్ లో నిరసనలు వెల్లువెత్తాయి. అప్పుడు కూడా సోషల్ మీడియాలో ‘హిజాబ్ బలవంతపు ఆచారమని, ఇస్లాం కఠినమైన చట్టాలు కలిగి ఉందని, ఇస్లాంలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్న వాదనలతో నాస్తిక అభ్యుదయవాదులు తెగ రెచ్చిపోయారు.

ఇరాన్ లో జరుగుతున్న ఈ పరిణామాలకు కారణం ఇరాన్ గవర్నమెంట్ ఇస్లామిక్ షరియా పాటించటం కాదు! ఇస్లాంలో లేని మతఛాందసవాదాన్ని ప్రోతహించటమే.

నర్గీస్ ముహమ్మదీ అనే మానవ హక్కుల కార్యకర్త 154 కొరడాదెబ్బలు శిక్షగా అనుభవించి, 13 సార్లు అరెస్టు అయి, 5 సార్లు శిక్షకు గురై, 31 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఆమె చేసిన పోరాటమైనా లేక గతంలో మహ్సా అమీని అనే మహిళ చనిపోవటంతో రియాక్షన్ గా ఇరాన్ మహిళలు జుట్లు కత్తిరించుకుని, హిజాబ్ లు తొలగించుకుని రోడ్లపై నిరసలు చేసినా అదంతా ఇరాన్ పాటించే మత ఛాందస వాదానికి వ్యతిరేకంగానే తప్ప ఇస్లాంకు వ్యతిరేకంగా కాదు.

అంతకంటే ముఖ్యంగా షియా వర్గం మెజారిటీగా ఉండే సోకాల్డ్ ముస్లిం కంట్రీ అయిన ఇరాన్ అనుసరించేది ఇస్లామిక్ షరియా అంతకంటే కాదన్నది గమనార్హం.
అలాగని ఇరాన్ ప్రభుత్వ మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ మహిళా కార్యకర్తలందరికీ పోనీ ఇస్లాం నాలెడ్జు ఉందా? అంటే అదీ లేదు. ఉంటే కచ్చితంగా వారు… “మీది నిజంగా ఇస్లామిక్ షరియానే పాటిస్తూ ఉంటే మీరు అమలు చేస్తున్న ఇలాంటి కఠినమైన మత ఛాందస విధానాలు, చట్టాలు ఇస్లాంలో ఎక్కడ రాసున్నాయి? ఒక ముస్లిం స్త్రీ హిజాబ్ ధరించనంత మాత్రాన అది ఆమెను అరెస్టు చేసి శిక్షించేంత పెద్ద నేరమని ఇస్లాంలో ఎక్కడ రాసుంది?

అసలు ఇస్లాంలో బలవంతం ఎక్కడ ఉంది? వేటి ఆధారంగా మీరు ఈ విధమైన కఠినమైన నియమాలు పాటిస్తున్నారు?” అని గట్టిగా ప్రశ్నించి ఉండేవారు.

పై ప్రశ్నలకు ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికీ సమాధానం చెప్పలేదు. నిజంగా ఇరాన్ ప్రభుత్వంపై పోరాడుతున్న మహిళా కార్యకర్తలు పై విధంగా ప్రశ్నించి ఉంటే ఇరాన్ ప్రభుత్వం నోరు మూయబడి ఉండేది. ప్రపంచం మొత్తానికి రియల్ ఇస్లాంకూ, ఇలాంటి కొందరి మత ఛాందసవాదుల విధానాలకూ మధ్య ఉన్న తేడా కూడా తెలిసేది. బాధాకరమైన విషయమేమిటంటే అక్కడి ప్రభుత్వానికీ ఇస్లాం పట్ల అవగహానలేదు సరికదా, అక్కడి ప్రజలకు అంతకంటే ఇస్లాం పూర్తి అవగాహనలేదు!

ముఖ్యంగా అతివాదాన్ని, మతోన్మాదాన్ని ప్రదర్శించేవారు ముస్లిములే కాదని చెబుతుంది ఖురాన్. ఎందుకంటే ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఖురాన్ “మధ్యస్థ సమాజం” (2:143) అని చెబుతుంది. “మధ్యస్థ సమాజం (Moderate society)” అంటే-

అతివాదానికీ, మితవాదానికీ ఆధ్యాత్మిక వాదానికీ, భౌతిక వాదానికీ ప్రతీ జీవన రంగంలో మధ్యే మార్గాన్ని అవలంబిస్తూ తమ అలోచనల్లో, ఆచరణల్లో సమతూకం (Balance) కనపరుస్తూ నీతీ, నిజాయితీ, న్యాయం కనపరిచే ఉత్తమ సమాజం అని అర్థం.

కాబట్టి ఇస్లాంను అనుసరించేవారు మతోన్మాదాన్ని ప్రదర్శిస్తే అది ఇస్లాం లోపం కాదు. ఆ మతోన్మాదాన్ని ప్రదర్శించేవారిదే తప్పు వారు ముస్లిం పేర్లు తగిలించుకుని ఎంత పెద్ద గెడ్డాలు పెంచినా సరే. వారి ప్రవర్తన ఇస్లాంతో సంబంధం లేనిది అని అర్థం చేసుకోవాలి.
అలాంటి మత ఛాందస భావాలతో కూడిన ఉన్మాదులు అన్ని మతాల్లోనూ ఉంటారు. ముస్లిం సమాజంలోనూ కొందరున్నారు. వీరిని తాలిబాన్, అల్-ఖైదా, ఐ‌ఎస్‌ఐ‌ఎస్ వగైరా తీవ్రవాద వర్గాల్లోనూ చూడవచ్చు. అలాగే మత ఛాందస విధానాలతో ప్రభుత్వం నడిపే ఇరాన్ లాంటి దేశాల్లోనూ చూడవచ్చు.

నిజానికి ఖురాన్, హదీసుల్లో ఉన్న ‘రియల్ ఇస్లాం’లో ఇలాంటి ఛాందస భావాలతో కూడిన విధానం లేదు. ఏ విషయంలోనూ ఇస్లాం వ్యక్తులను నిర్బంధించటం లేదు. అన్నివిషయాల్లోనూ ఇస్లాం స్వేచ్ఛనిస్తుంది. నిజానికి మనిషికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వటమూ ప్రమాదమే అలాగే పూర్తిగా నిర్బంధించినా ప్రమాదమే. కానీ ఇస్లాం ఈ రెండింటికి మధ్య నిర్బంధంతో కూడిన స్వేచ్చను ఇస్తుంది. “తినండి త్రాగండి కానీ మితిమీరకండి (7:31)” అని చెబుతుంది.

ఖురాన్ వ్యక్తిగత, సామాజిక జీవన విధానాలకు సంబంధించిన అనేక సూచనలను విధి-నిషేధాలను తెలియజేసి “మీకు ఇష్టమున్నా లేకపోయినా ఇస్లాంను చచ్చినా మీరు బలవంతంగానైనా అనుసరించాల్సిందే” అన్న కఠిన నియమాన్ని ఎక్కడా విధించదు సరికదా..

ధర్మంలో ఎటువంటి బలవంతం లేదు “ఇష్టపడిన వారు దీనిని విశ్వసించవచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు (ఖురాన్ 18:29)” అంటూ ఇస్లాం ధర్మాన్ని అనుసరించటం, అనుసరించకపోవటం అన్నది వ్యక్తుల ఇష్టాయిష్టాలకే వదిలిపెట్టేసింది.

కాబట్టి కొన్ని సోకాల్డ్ ముస్లిం ఆర్గనైజేషన్స్ కు, గవర్నమెంట్స్ పాటించే మత ఛాందస విధానాలకు ఇస్లాంకు సంబంధం లేదని తెలుసుకోవాలి. అలాగే ఇరాన్ లో గత కొన్నేళ్లుగా అనేక మహిళా కార్యకర్తలు తమపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం సైతం ఇరాన్ మత ఛాందస వాద విధానాలకు వ్యతిరేక పోరాటమే తప్ప ఇస్లాం వ్యతిరేక పోరాటం కాదు. ఎందుకంటే అప్పటికే మత ఛాందస విధానాల క్రింద అణచివేయబడుతున్న స్త్రీలకు అన్ని రకాల హక్కులను, స్వేచ్ఛను ఇస్లాం పద్నాలుగు వందల సం.లకు పూర్వమే కల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *