ఈ ఉన్మాదంతో ఇస్లాంకు సంబంధం లేదు

ధర్మాన్ని ఆచరించేవారిలో మానవత్వం ప్రతిబింబించాలి తప్ప హింస కాదు. ధర్మం శాంతిని, మానవత్వాన్ని నేర్పుతుంది తప్ప ఉన్మాదాన్ని కాదు. ధర్మం పేరుతో ఎవరైనా హింసాత్మక ధోరణులు అవలంబిస్తున్నారంటే.. అది భక్తి అవ్వదు ఉన్మాదం అవుతుంది.

అలాంటి ఉన్మాదం ‘మాతం’ పేరు మీద ప్రతీ సంవత్సరం ముహర్రం నెలలో ‘షియా’ వర్గపు నామమాత్ర ముస్లిముల ద్వారా రోడ్లపై ప్రదర్శించబడుతూ ఉంటుంది.

“మొహర్రం పండుగ” ఇస్లాం ఆదేశించని పండుగ

మొహర్రం నెలలో పదవ (ఆషూరా) రోజు హజ్రత్ హుస్సైన్ (ర) వారు దైవ మార్గంలో చంపబడ్డారు కాబట్టి దానికి సంతాపంగా ప్రతి సంవత్సరం నల్లటి వస్త్రాలు ధరించి చూడటానికే రోత పుట్టించేలా బ్లేడులతో, కత్తులతో, చైన్లతో శరీరమంతా రక్తం కారేలా పిచ్చెక్కినట్లు దారుణంగా కొట్టుకుంటూ హింసించుకునే ఓ చిత్రవిచిత్రమైన ఆచారాన్ని ‘మాతం’ పేరుతో ‘షియా’ వర్గీయులు ప్రవేశపెట్టారు.

అది చూసి ముస్లిమేతరులు అది ముస్లిముల ఆచారమని, ఇస్లాంలో భాగమని అపార్థం చేసుకుంటుంటారు. ఎందుకంటే వారు ముస్లిం సమాజాన్ని చూసి ఇస్లాంను అంచనా వేస్తుంటారు, తప్పితే వారికి ఇస్లాం గురించి అవగాహన ఉండదు. అంతకంటే ముఖ్యంగా నామమాత్ర ముస్లిములెవరు? నిజ ముస్లిములెవరు? అన్న అవగాహన ఉండదు కాబట్టి.. ఇంకా వారికి అవగాహన పరిచాలన్న ఆసక్తి కూడా చాలా మంది ముస్లిములకు ఉండదు కాబట్టి.

నిజానికి ఇస్లాం ఒక వ్యక్తిలో దానగుణాన్ని, త్యాగనిరతిని పెంపొందించటానికి ‘ఈదుల్ ఫిత్ర్ (దానాల పండుగ), ‘ఈదుల్ అద్ హా (త్యాగాల పండుగ)’ అనే రెండే రెండు పండుగలను నిర్దేశిస్తుంది. తప్పితే ముహర్రం పండుగను ఇస్లాం ఆదేశించటం లేదు.

ముహర్రం నెలలో ‘మాతం’ పేరు మీద ఒళ్లంతా రక్తాలు కారేలా బ్లేడ్లతో, చైన్లతో కొట్టుకోవటం, నిప్పుల్లో దూకటం, చిన్న పిల్లలని కూడా చూడకుండా వారిని కూడా రక్తాలు కారేలా హింసించటం వగైరా చేష్టలను చెయ్యమని ఇస్లాం అస్సలు ఎక్కడా చెప్పటం లేదు.

ఒక్క హుస్సైన్ (రజి) వారు మాత్రమే దైవ మార్గంలో చంపబడ్డారా?

హుస్సైన్ (ర) వారు గొప్ప దైవభక్తులు ఆయన కూడా దైవమార్గంలో ఆయన శత్రువుల ద్వారా యుద్ధంలో చంపబడ్డారనటంలో సందేహం లేదు! అయితే ఆయన తండ్రి గారైన అలీ (ర) వారు గొప్పవారు కారా? ఉమర్ (ర) వారు గొప్పవారు కాదా? లేక ఉత్మాన్ (ర) వారు గొప్పవారు కారా? మరి వీరందరూ కూడా దైవ మార్గంలో అన్యాయంగా చంపబడ్డవారే కదా?

అంతేకాక, ప్రవక్త ముహమ్మద్ (స) ఉన్నప్పుడే ఎందరో ప్రముఖులైన ప్రవక్త శిష్యులు “హమ్జా ఇబ్న్ అబ్దుల్ మూతల్లిబ్, జైద్ ఇబ్నె హారిత, జాఫర్ ఇబ్నె అబీతాలిబ్, అబుదుల్లాహ్ ఇబ్నె రావాహ్ (ర) వంటి ఎందరో ప్రముఖ ప్రవక్త శిష్యులు (సహాబాలు) ధర్మయుద్ధాల్లో చంపబడ్డారు. కానీ ప్రవక్త (స) శిష్యులు ధర్మమార్గంలో చంపబడ్డ వారి సంతాపంగా నేడు “మాతం” పేరుతో చేస్తున్న హింసాత్మక పనులు ఆనాడు ఎప్పుడూ చెయ్యలేదు.

హుస్సైన్ (రజి) వారి కంటే ముందే ఎందరో గొప్ప గొప్ప ప్రవక్త (స) శిష్యులు చంపబడినప్పుడు ప్రత్యేకంగా ఒక్క హుస్సైన్ (రజి) వారు మాత్రమే దైవ మార్గంలో చంపబడినట్టు ఆయనను మాత్రమే ప్రత్యేకంగా ఎన్నుకుని ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ ప్రతీ సంవత్సరం కత్తులతో, బ్లేడ్లతో రక్తం కారేలా కొట్టువటం కేవలం అజ్ఞానం మాత్రమే అవుతుంది.

ఇలాంటి పనులు చేసేవారి గురించి స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) చెబుతున్నదేమిటో గమనించగలరు.

“ఎవరైతే చెంప దెబ్బలు కొట్టుకుంటూ, బట్టలు చింపుకుని తమను తాము హింసించుకుంటూ అజ్ఞానకాలపు ఆచారాలు అవలంబిస్తారో వారు మనలోని వారు కారు”
– (సహీహ్ అల్-బుఖారీ 1294 / Vol.2, Book 23, 382)

పై హదీస్ ను బట్టి నేటి షియా వర్గం వారు “మాతం” పేరు మీద ప్రతీ సంవత్సరం మొహర్రం రోజు హుస్సైన్ (ర) వారు దైవ మార్గంలో చంపబడ్డారు కాబట్టి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దానికి సంతాపంగా నల్లటి వస్త్రాలు ధరించి బ్లేడులతో, కత్తులతో, చైన్లతో తమ బుగ్గలపై, చేతులపై, భుజాలు, వీపుల మీదా రక్తం కారేలా దారుణంగా కొట్టుకుంటూ, హింసించుకుంటూ చేస్తున్న పనులు కేవలం అజ్ఞానంతో కూడిన చర్యలని అర్థం అవుతుంది. పైగా ఇలాంటి పనులు చేసేవారు అసలు ముస్లిం సమాజానికి చెందినవారు కాదని ప్రవక్త ముహమ్మద్ (స) వారు తేల్చి చెప్పేశారు.

అంతేకాక ముస్లిం సమాజం ప్రామాణికంగా తీసుకునే నలుగురు ఇమాముల్లో (ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయి, ఇమామ్ హంబల్) ఎవరూ ఇలాంటి చేష్టలు చెయ్యవచ్చన్న అనుమతి సైతం ఇవ్వలేదు!

నిజంగా హుస్సైన్ (రజి) వారి పట్ల ప్రేమతో అలా హింసించుకోవటం పుణ్య కార్యమే అయితే దైవమార్గంలో చంపబడ్డ మిగతా అనేక మంది సహాబీల (ప్రవక్త ముహమ్మద్ (స) శిష్యుల) వీర మరణానికి సంతాపంగా వారందరి పేరుమీద అలానే హింసించుకుంటూ ఉండాలి. అప్పుడు రోజుకో ‘మాతం’ నిర్వహించుకోవాల్సి ఉంటుంది!! మరలా ఎందుకు చెయ్యటం లేదు? ‘మాతం’ పేరుతో జరుగుతున్న ఇలాంటి హింసాత్మక ధోరణులు ఇస్లాం నిర్దేశించనప్పుడు అది కేవలం ఉన్మాద చర్య కాదా? అసలు వారు అవలంబిస్తున్న విధానం ఏ ధర్మం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *