ఈ వ్యాసం ప్రత్యేకంగా నా ముస్లిం సోదరుల కోసం రాసింది కాబట్టి అనవసర భావావేశాలకు గురికాకుండా, నాకు కౌంటర్ ఇవ్వాలన్న హడావిడిలో కంగారు కంగారుగా చదివేసి ఏది పడితే అది కామెంట్ చేసెయ్యకుండా ప్రశాంతంగా చదివి అర్థం చేసుకుంటారని మనవి.
ఒక ప్రక్క అల్లాహ్ యే ఆరాధ్యుడు ఆయనను తప్ప ఎవర్నీ వేడుకోకూడదు అని చెబుతూనే బారాషహీద్ దర్గాకు వచ్చి ఇక్కడ వేడుకుంటే మీ ప్రార్థనలు అంగీకరించబడతాయని, రొట్టెల పండుగలో పాల్గొని రొట్టె విరిస్తే మీ కోరికలు తీరతాయని కొందరు ముస్లిం పెద్దల ప్రసంగాలు వింటుంటే వారి మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి.
ఒకవేళ వారి స్వలాభం కోసమో రాజకీయ భవిష్యత్ కోసమో “షిర్క్” మరియు “తౌహీద్”లను మిక్స్ చేసి విశ్వాస, అవిశ్వాసాలకు మధ్య ఓ క్రొత్త మార్గాన్ని కనిపెట్టే ఉద్దేశమే ఉంటే అది ఖురాన్ ప్రకారం అత్యంత ప్రమాదకరం అన్న విషయాన్ని గ్రహించాలి.
……..
ఇస్లాం చెప్పే “తౌహీద్”కు అర్థం “అల్లాహ్ ఒక్కడే దేవుడ”ని ఏ ముస్లిమైనా సమాధానం చెబితే అతనికి తౌహీద్ యొక్క అవగాహన పూర్తిగా లేదని చెప్పటం అతిశయోక్తి కాదు.
ఖురాన్, హదీసులు మొత్తం స్టడీ చేస్తే ఇస్లాం చెప్పే “తౌహీద్”కు అర్థం సంక్షిప్తంగా- అల్లాహ్ ఒక్కడే ఆరాధ్యుడు ఆయన తప్ప ఆరాధనకు ఎవరూ అర్హులు కారు. ప్రార్థనలు, కోరికలు, వేడుకోళ్లు అంగీకరించేది, తిరస్కరించేది ఒక్క అల్లాహ్ మాత్రమే. లాభ, నష్టాలకు, మంచీ-చెడులకు కారణం ఒక్క అల్లాహ్ మాత్రమే. కష్టాల నుండి, నష్టాల నుండి కాపాడేది ఒక్క అల్లాహ్ మాత్రమే తప్ప ఎవరూ కాదని బలంగా నమ్మటమే “తౌహీద్”ను అంగీకరించటం అంటే.
స్వయంగా అల్లాహ్ యే … “అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గానీ, లాభాన్ని గానీ కలిగించలేని ఏ శక్తినీ వేడుకోకు” – ఖురాన్ 10:106
అని చెప్పిన తరువాత కూడా బారాషహీద్ దర్గా అని, ఆ దర్గా ఈ దర్గాల చుట్టూ తిరగటం, బాబాలు, వలియల్లాలను కోరికలు తీర్చే మధ్యవర్తులుగా ఊహించుకుని వారి సమాధుల వద్ద వేడుకోవటం, కోరికలు తీరతాయని రొట్టెల పండుగలు చేసుకోవటం వగైరా కొత్త కొత్త నమ్మకాలు కనిపెట్టి కొందరు ముస్లిములు అవలంబిస్తున్న విధానం ఏ ధర్మం?
అది ఇస్లాం అయితే కాదు. అలాంటివారు అల్లాహ్ దృష్టిలో ముస్లిములు కూడా కారు. అలాంటి వారి ప్రార్థనలను, వేడుకోళ్లను తిరస్కరించేది కూడా అల్లాహ్ నే.
……..
ఈ నేపథ్యంలో కొందరికి అసలు దర్గాలకు వెళ్లటం అక్కడ వేడుకోవటం ఏ రకంగా “షిర్క్” అవుతుంది? అని అనుమానం కలగవచ్చు. నిజానికి స్వయంగా అల్లాహ్ యే ఒక్క తనను తప్ప మరెవర్నైనా తమ లాభ-నష్టాలకు కారకుగా భావించి, వారిని సంరక్షకులుగా చేసుకుంటే వారు చేసేది షిర్క్ అవుతుందని ఈ క్రింది ఖురాన్ వాక్యంలోనే చెబుతున్నాడు.
“ఇక అల్లాహ్ ను వదిలేసి ఇతరులను సంరక్షకులుగా
చేసుకున్నవారు, “వారు మమ్మల్ని అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము” అని అంటారు” – 39:3
పై ఖురాన్ వాక్యంలో అల్లాహ్ స్వయంగా కొందరు షిర్క్ చేస్తూనే తాము చేసే పనిని సమర్ధించుకోటానికి చూపే సాకును తెలియజేస్తున్నాడు.
ఆ సాకు ఏమిటంటే- “వారు అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము” అన్నది.
నేడు బారాషహీద్ దర్గాకో లేక మరొక దర్గాకో వెళ్లే ఏ ముస్లిమునైనా ఆపి “మీరు ఆ దర్గాకు ఎందుకు వెళుతున్నారు?” అని ప్రశ్నిస్తే… “వారు అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని వేడుకుంటున్నాము” అన్న సమాధానమే చెబుతారు.
వారి ఆ స్వంత నమ్మకాన్నే అల్లాహ్ “షిర్క్” అంటున్నాడు. ఇక “అల్లాహ్ దృష్టిలో షిర్కు ఒక్కటే క్షమార్హం కానిది” – ఖురాన్ 4:116
కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి?
“మేము దర్గాలకు వెళ్లటం, రొట్టెలు విరవటం వగైరా వన్నీ మా సెంటిమెంట్లు. మా సెంటిమెంట్లను హార్ట్ చేసే, వదులుకోమనే అధికారం మీకెక్కడిది? మీకు వెళ్లటం ఇష్టం లేకపోతే మీరు వెళ్లకండి కానీ మమ్మల్ని మటుకు కన్ఫ్యూజ్ చేసి ఆపకండి” అంటూ ఎవరైనా సీరియస్ అయితే వారు చెయ్యాల్సింది వారు తమ దర్గా, రొట్టెల సెంటిమెంట్లను చక్కగా కంటిన్యూ చేసుకోవచ్చు.
కానీ వాటిని ఇస్లాంలో భాగంగా అస్సలు భావించకూడదు. ఎందుకంటే ఆయా సెంటిమెంట్లకు ఇస్లాంకూ సంబంధం లేదు కాబట్టి.
పైగా ఒకప్రక్క అల్లాహ్ యే ఆరాధ్యుడు ఆయనను తప్ప ఎవర్నీ వేడుకోకూడదు అని చెబుతూనే, మరో ప్రక్క బారాషహీద్ దర్గాకో మరొక దర్గాకో వెళ్లి మీరు వేడుకుంటే మీ ప్రార్థనలు అంగీకరించబడతాయని “షిర్క్” మరియు “తౌహీద్”లను కలిపేసి స్పీచులు అస్సలు ఇవ్వకూడదు.
ఎందుకంటే “షిర్క్”ను “తౌహిద్”ను ఒకదానికొకటి కలగాపులగం చేసి ఒక క్రొత్త మార్గాన్ని కనిపెట్టటం అత్యంత ప్రమాదకరమే కాదు అలాంటి వారు పైకి ఎంత ముస్లిం పండితుల వేషాల్లో ఉన్నా అల్లాహ్ ఆగ్రహానికి గురికావలసి ఉంటుంది. పైగా “… అవిశ్వాస, విశ్వాసాలకు మధ్య ఒక (క్రొత్త) మార్గాన్ని కనిపెట్టాలనే ఉద్దేశ్యం కలవారు అందరూ పరమ అవిశ్వాసులే. అలాంటి అవిశ్వాసులకు అవమానకరమైన శిక్ష సిద్ధం చెయ్యబడి ఉంది” – ఖురాన్ 4:
