అసలు సమస్య మతోన్మాదం తప్ప సనాతన ధర్మం ఎంత మాత్రం కాదు. అంతం చెయ్యాల్సింది సనాతన ధర్మాన్ని కాదు మతం పేరుతో కొందరు ప్రదర్శిస్తున్న “మతోన్మాదాన్ని”! సమాజంలో మతం లేదా కులం అన్నవి ఎప్పటికీ అంతం కావు. కానీ అంతం చెయ్యాల్సినవి మతోన్మాదం, కులోన్మాదాలనే.
బహుశా నేడు నడుపబడుతున్న మతోన్మాద రాజకీయాలను బట్టో లేక ఏళ్ల తరబడి హిందూ సమాజంలో అగ్రవర్ణాలని ఫీలయ్యే కొన్ని వర్గాలు ప్రజల్లో కొందర్ని వెనుకబడిన వారిగా జమకట్టి కులవివక్ష, అంటరానితనం ప్రదర్శిస్తూ వచ్చిన దానిని బట్టో ఇవన్నీ అంతరించిపోవాలంటే సనాతన ధర్మం రద్దైపోతే సరిపోతుందని ఊహించి ఉదయనిధి స్థాలిన్ “సనాతన ధర్మాన్ని” అంతం చేసెయ్యాలని అవగాహన లేక చెప్పాడేమో కానీ, నిజానికి అతనన్న మాటల్లో అర్థం లేదు.
ఎందుకంటే, అగ్రవర్ణాలుగా తమనుతాము భావించుకుని కులవివక్ష, అంటరానితనం ప్రదర్శించేవారికి సనాధర్మ అవగాహన అస్సలు లేదు, అలాగే సనాతన ధర్మం అన్న పేరును వాడుకుంటూ ఫాసిస్టు రాజకీయాలు నడిపే కొందరు ఉదయనిధి స్థాలిన్ అన్న మాటలకు తెగ ఫీలైపోయి హార్ట్ అయిపోవటంలోనూ అర్థం లేదు.
వివరంగా చెప్పాలంటే మత విధ్వేషాలను రెచ్చగొడుతూ కుల-మతాల ఆధారంగా ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి, నేడు కొందరు ఫాసిస్టు రాజకీయ నాయకులు, వారి అనుచరగణం వేర్పాటువాద రాజకీయాలు నడపటానికి వాడుతున్న “హిందుత్వ ఐడియాలజి”కీ, ‘వైదిక ధర్మం’ లేదా ‘సనాతన ధర్మానికీ’ పొంతన లేదు. ఇది ముందు సామాన్య హిందూ ప్రజానీకం తెలుసుకోవాలి.
“అహింసా పరమో ధర్మః” అన్నది అసలు సనాతన ధర్మ దృక్పథం. “సర్వేజనాసుఖినోభవంతు” అన్నది ఆ సనాతన ధర్మం యొక్క అభిలష. ఇలాంటి ఉత్తమ దృక్పథాలు కలిగి ఉన్నదే ‘హిందూ ధర్మం’. ఇలాంటి ఉన్నత దృక్పథాలు బోధించే సనాతన ధర్మాన్ని ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటే ఒక్క హిందువులే కాదు నిజానికి భారతదేశంలో నివసించే ఏ మతస్తులైనా బాధపడాలి. అందరూ వ్యతిరేకించాలి. ఎందుకంటే సనాతన ధర్మం ఎలాంటి ఉత్తమ దృక్పథాన్ని ఇస్తుందో ఈ క్రింది వేద మంత్రంలో చదువగలరు.
“మన అందరి ఆశలు ఒక్కటిగా ఉండాలి, మన అందరి హృదయాలు ఒక్కటిగా ఉండాలి, మన అందరి ఆలోచనలు ఒక్క త్రాటిపై నడవాలి. మనమందరం ఒక్కటి అయి మంచి స్నేహితులం కావాలి” – ఋగ్వేదం 10:191:4
“మనమందరం” అంటే “మన హిందూ బంధువులంతా” అని కాదు! మానవులైన మనమంతా ఒక్కటిగా ఉండాలన్నది వైదిక ధర్మ అభిలాష. మనిషి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కాక అందరి పట్లా సమదృష్టి కలిగి ఉండాలన్నది సనాతన ధర్మాభిలాష కూడాను. అదెలాంటిదో ఈ క్రింది చదవండి.
“విద్య, వినయము గలిగియున్న బ్రాహ్మణుని యందు, గోవునందును, ఏనుగునందును, కుక్క యందును, కుక్క మాంసం తినే చెండాలుని యందును సమదృష్టి గలవారే జ్ఞానులు” – గీతా 5:18
ఇంకా ఆ సనాతన వైదిక ధర్మం – ముస్లిములనైనా, క్రైస్తవులనైనా లేక ఏ మతస్తులనైనా పరాయివాళ్లుగా చూడకుండా చూసి అంటరానితనం ప్రదర్శించకుండా ఉండాలని “మనుషులందరూ మను (ఆది మానవుని) సంతానం” – ఋగ్వేదం 1:45:1 అని చెబుతూ తోటి మనుషుల పట్ల ధ్వేషాన్ని కలిగి ఉండటం అనాగరికం అన్న విషయాన్ని స్పష్టపరుస్తుంది. ఈ విధంగా సనాతన ధర్మం ఏం చెబుతుంది అన్నది మూడు ముక్కల్లో చెప్పాలంటే…
1). ప్రజల పట్ల “సమదృష్టి” కలిగి ఉండాలని ఆదేశిస్తుంది. ఉచ్చనీచ భావాలు ప్రదర్శించకూడదని చెబుతుంది.
2). జన్మతః మానవులందరూ సమానమని చెబుతుంది. ఒకరు తక్కువా ఒకరు ఎక్కువా కాదని చెబుతుంది.
3). ఏ ఒక్కరిపట్లా ధ్వేషం కలిగి ఉండకూడదని అందరినీ సమానంగా గౌరవించాలని కూడా చెబుతుంది.
దీని ప్రకారం మానవుల్లో కొందర్ని అధములని, అల్పులని, దళితులని లెక్కకట్టి వివక్ష చూపటం, అంటరానితనం ప్రదర్శించటం, క్రైస్తవులు, ముస్లిములను శత్రువులుగా చూపుతూ వేర్పాటువాద రాజకీలు నడపటం, అల్ప సంఖ్యాకులపై సామూహిక జనహననాలు చేసేలా రెచ్చగొట్టే ప్రసంగాలివ్వటం వగైరా.. సనాతన ధర్మానికి పూర్తి వ్యతిరేకం అని తెలుస్తుంది.
సనాతన ధర్మం ఆధారంగా ఏర్పడిన హిందూత్వం వేరు. ప్రజలంతా వసుదైక కుటుంబంలా ఐక్యతతో అలరారాలన్న వేదవాంగ్మేయానికి సంబంధం లేకుండా ‘విభజించు పాలించు’ అన్న బ్రిటీషర్ల భావజాలం ఆధారంగా కేవలం ముస్లిం, క్రైస్తవ, కమ్యూనిస్ట్ వర్గాల పట్ల ధ్వేషాన్ని రగిలించటమే పునాదిగా 20 వ శతాబ్దంలో సావర్కర్, హెగ్డేవర్ల ద్వారా రూపకల్పన చెయ్యబడిన “హిందుత్వవాద” భావజాలం వేరు.
ఈ భావజాలాన్ని అనుసరించేవారు సనాతన ధర్మం ప్రకారం మానవులంతా ఒక్కటే తోటి మానవుల పట్ల అకారణంగా శత్రుత్వం ప్రదర్శించకూడదని ఎప్పుడూ చెప్పరు. కానీ, ఎప్పుడు చూసినా మైనార్టీలను హిందూ వ్యతిరేకులన్నట్టు ప్రజల మెదళ్లను వాట్స్ యాప్ ఫేక్ స్టోరీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ట్యూన్ చేస్తూ “హిందువులు ప్రమాదంలో ఉన్నారంటూ” ప్రజల్లో అర్థం లేని భయాల్ని సృష్టిస్తూ రాజకీయ లబ్ది పొందుతుంటారు. ఇది ఉన్మాద భావజాలంతో కూడింది.
కాబట్టి ఉదయనిధి స్థాలిన్ “సనాతన ధర్మాన్ని” రద్దు చేసెయ్యాలని చెప్పటం కంటే… ఇలాంటి వారు మన సనాతన ధర్మాన్ని ఎవరో ఏదో అన్నారని తెగ ఫీలైపోయి రెచ్చిపోవటంలో అసలు అర్థమే లేదు.
ఈ అంశాలపై సామాన్య హిందూ ప్రజానికి ఓ స్పష్టమైన క్లారిటీ ఎప్పుడూ ఉండాలి.
సమస్య సనాతన ధర్మమా? /-
