సనాతన ధర్మాన్ని రక్షించటం ఎలా?

సనాతన ధర్మాన్ని కచ్చితంగా రక్షించుకోవలసిందే! దానికి మార్గం ఒకొక్కరూ నాలుగురేసి పిల్లల్ని కనటమో, మందిని పెంచుకోవటమో కాదు!! ఎంతమంది ఉన్నా వారిలో ధార్మిక పరిజ్ఞానాన్ని పెంపొందించటం ద్వారానే ధర్మం రక్షించబడుతుంది. లేదంటే ధార్మిక అవగాహన లేని ఓ పెద్ద గుంపు తయారవుతుంది తప్ప వారి ద్వారా ధర్మం రక్షించబడటం అన్నది నేతిబీరకాయలో నేతిని ఆశించటం లాంటిదే అవుతుంది.

కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించాలని ఆవేశంగా మాట్లాడేవారెవరైనా ముందు అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం మూలాలు ఏవి? వాటిని ఎవరెవరు బోధించారు? సనాతన ధర్మం” యొక్క మౌలిక విశ్వాసాలేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి.

***

సనాతన ధర్మం అంటే ఏమిటి?

నిజానికి “సనాతన ధర్మం” అంటే.. “అనాదిగా వస్తున్న ధర్మము” అని అర్థం. దానినే “వైదిక ధర్మము” లేక “ఆర్ష ధర్మము” అంటారు. అంటే “అనాదిగా రుషుల ద్వారా బోధించబడుతూ వస్తున్న ధర్మం” అని అర్థం. నిజానికి “హిందూ ధర్మం” అన్నది వేదాల్లో ఎక్కడా లేని పదం. పైగా “హిందూ” అన్న పదం “సింధూ” అన్న పదం నుండి రూపాంతరం చెందిన “నైసర్గిక పేరు (Geographical term)” తప్ప, మతపరమైన పదం (Religious term)” ఎంతమాత్రం కాదు.

ఇక సనాతన ధర్మానికి ఉన్న మూడు ప్రత్యేకతలు 1. సర్వకాలికం 2. సర్వజనీనం 3. హేతుబద్ధం. ఈ సనాతన ధర్మానికీ నేడు మతవ్యవస్థలో కొందరు మత పండితులు ప్రవేశపెట్టిన మూఢనమ్మకాలకూ పొంతనలేదు. ఈ విషయాన్ని స్వయంగా స్వామీ వివేకానంద మాటల్లోనే గమనిద్ధాం:

“ప్రవక్తలు వేరు; మతాచార్యులు/పురోహిత వర్గం లేదా మత ప్రచారకులు వేరు. మూఢ విశ్వాసాలను వ్యతిరేకించటం ప్రవక్తల పని కాగా, మూఢ నమ్మకాలను పెంచేందుకు నడుం కట్టింది పురోహిత వర్గం. ఈ ప్రత్యేక వర్గానికి ప్రపంచంలో మరేదీ పట్టదు. నిజానికి ఈ ప్రపంచం ప్రకృతి ప్రసాదం. దార్శనికులైన ప్రవక్తలు మూఢ విశ్వాసాలను సవాలు చేసినవాళ్లు. కాగా, మతాచార్యులు లేదా పురోహిత వర్గమే 2000 రకాల ఆచారాలనూ, కర్మకాండలనూ సృష్టించారు”

కాబట్టి ప్రవక్తలు అందించిన శాస్త్రీయమైన ధర్మానికీ, కొన్ని గుడ్డి నమ్మకాల ఆధారంగా మతపండితుల ద్వారా కల్పించబడిన మూఢత్వ మత వ్యవస్థకూ సంబంధంలేదు. అలాంటి గుడ్డి నమ్మకాలను ప్రజలు నమ్మటం వలన ఒక్క మతాచార్యులు, పూజారులకు తప్ప సామాన్య భక్తులకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు.

***

సనాతన ధర్మం మూలాలు ఏవి? వాటిని ఎవరెవరు బోధించారు?

హిందూ శాస్త్రాలని చెప్పబడుతున్న వాటన్నిటినీ వర్గీకరిస్తే… 1. శ్రుతులు 2. స్మృతులు అని చెప్పబడతాయి. “శ్రుతులు” అంటే “శబ్దం (Voice)” రూపంలో సర్వేశ్వరుని ద్వారా వినిపించబడ్డ గ్రంథాలు అవే వేదోపనిషత్తులు. వీటిని “అపౌరషేయాలు” అంటే “పురుష ప్రమేయం లేనివి” అని కూడా అంటారు. ఇవి ప్రామాణిక గ్రంథాలు తరువాత వేదోపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను కూడా ప్రామాణిక గ్రంథంగా తీసుకోబడుతుంది. రామాయణం, భారతం, భాగవతం వగైరావన్నీ ఇతిహాసాలవుతాయి. ప్రాచీన కాలంలో వైదిక సమాచారమంతా “వాంగ్మేయం” అంటే పఠన రూపంలో ఉండేది. వారినే “స్మర్తలు” అంటారు. అసలు విగ్రహాలు గానీ, విగ్రహారాధన కానీ లేనిదే వేదకాలం. అందుకే వేదాల్లో ఎక్కడా సర్వేశ్వరుడైన దేవుణ్ణి విగ్రహం ద్వారా ఆరాధించాలనే ఒక్క మంత్రం కనపడదు.

ఆ సనాతన ధర్మం పరంపరగా బోధించబడుతూ వచ్చిందన్న విషయాన్ని గీతాశాస్త్రంలో చూడగలం:

“నాశరహితమగు ఈ నిష్కామ కర్మ యోగమును పూర్వము నేను సూర్యునకు చెప్పితిని, సూర్యుడు వైవస్వత మనువునకు.. మునువు ఇక్ష్వాకునకు బోధించెను. ఈ విధంగా పరంపరగా వచ్చిన ఈ నిష్కామ కర్మ యోగమును రాజర్షులు తెలుసుకున్నారు. చాలా కాలము గడిచినందున ఆ యోగమిపుడీ లోకమున అదృశ్యమైనది. నీవు భక్తుడుగను, మిత్రుడుగా ఉన్నావు. కావున ఆ పురాతన నిష్కామ కర్మ యోగమును తిరిగి నీకు అప్పజెప్పితిని” – గీతా 4:1-3

ఈ విధంగా ఒకే ధర్మం ఆది నుండీ పరంపరగా బోధించబడుతూ వస్తుందన్న పై భగవద్గీతలో చెప్పబడుతున్న విషయమే ఖురాన్ ధృవీకరిస్తుంది.

“నూహ్ కు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాము, ఏదైతే మేము ఇబ్రాహీంకు, ముసాకు, ఈసాకు బోధించామో దానినే (ఓ ముహమ్మద్) ఇప్పుడు ని వైపునకు మేము “వహీ (శృతి)” ద్వారా పంపాము” – 42:13

కాబట్టి సనాతన ధర్మాన్ని ఎవరెవరు బోధిస్తూ వచ్చారు? అన్న ప్రశ్నకు సమాధానం అన్ని కాలాల్లోనూ సర్వేశ్వరుడైన దేవుని ద్వారా ఎన్నుకోబడిన సకల రుషిశ్వరులు లేక ప్రవక్తలూ బోధిస్తూ వచ్చారు.

సనాతన ధర్మం” యొక్క మౌలిక విశ్వాసాలేమిటి?

సనాతన ధర్మానికి ఆధారం “ఏకేశ్వరోపాసన”! అంటే ఈ సమస్త సృష్టికీ ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన్ని తప్ప “ప్రాకృతిక వస్తువులను (అంటే ప్రకృతిలో ఉన్న గాలీ, నీరు, నిప్పు, సూర్యచంద్రాదులూ వగైరా) పూజిస్తారో వారు చీకటి (నరకం) లో ప్రవేశిస్తారు” అని వేదం (యజుర్వేదం 40:9) హెచ్చరిస్తుంది.

ఇదే విషయం బైబిల్ ల్లో కూడా ఎంతో స్పష్టంగా చెప్పబడింది. ఖురాన్ సైతం ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో హెచ్చరిస్తూ వచ్చింది.

అలాగే గీతాశాస్త్రాన్ని, మహాభారతాన్ని, రామాయణాన్ని పరిశీలనగా చదివినా శ్రీకృష్ణుడు, శ్రీరాముడు తమకు అతీతంగా ఉన్న సర్వేశ్వరుణ్ణే దైవంగా పరిచయం చేసిన సందర్భాలు కనపడతాయి. బైబిల్ క్రొత్తనిబంధనను చదివినా యేసు తనకు అతీతంగా ఉన్న సర్వేశ్వరుణ్ణే ‘యెహోవా’ అన్న పేరుతో పరిచయం అనేక చేసిన సందర్భాలు కనపడతాయి. సర్వేశ్వరునిగా, యెహోవాగా పిలువబడిన దైవాన్నే ప్రవక్త ముహమ్మద్(స) ‘అల్లాహ్’ అని అరబ్బీ భాషలో పరిచయం చేయటం జరిగింది.

ఈ విధంగా “ఏకదేవుని విధేయతా” ధర్మాన్నే సకల ప్రవక్తలు బోధించిన వైనాన్ని మనం సకల ధార్మిక గ్రంథాల్లో చూడగలం. తప్ప ఏ రుషిగానీ, ఏ ప్రవక్త గాన్ని ఏనాడూ “నేనే దేవుణ్ణి నన్ను ఆరాధించమని” చెప్పలేదు. ఈ ఏక విధేయతా ధర్మమే వైదిక ధర్మంగా, సనాతన ధర్మంగా, ఆర్ష ధర్మంగా, పురాతన ధర్మంగా, ఇస్లాంగా అనేక కాలాల్లో సకల ప్రవక్తల దారా బోధించబడుతూ వచ్చింది.

కాబట్టి నిజంగా సనాతన ధర్మాన్ని రక్షించాలని ఆశపడేవారు సకల ధార్మిక గ్రంథాలలో అనాదిగా చెప్పబడుతూ వస్తున్న సనాతన ధర్మం తాలూకు మౌలిక విశ్వాసాలను ధార్మిక గ్రంథాల ఆధారంగా పరిశీలనగా చదివి అర్థం చేసుకుని తూ.చ తప్పక ఆచరిస్తూ.. ఇతరులకు చెప్పి ఆచరింపజేయటమే సనాతన ధర్మపరిరక్షణ అవుతుంది. తప్పితే ఒకొక్కరూ నలుగురేసిని కాదుకదా నలభై మందిని కన్నా ధర్మావగాహన లేని వ్యక్తులతో కూడిన పెద్ద మూర్ఖుల గుంపు తయారవుతుంది. అలాంటి వారి ద్వారా ధర్మం రక్షించబడటం ప్రక్కన పెడితే ధర్మం నాశనం అవుతుంది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *