సూర్యచంద్రుల పట్ల మూఢ నమ్మకాలు కలిగి ఉండటం, వాటికి పేర్లు పెట్టి దైవత్వం అంటగట్టి పూజించటం, వాటి వల్ల ఏదో మంచి జరుగుతుందన్న గుడ్డి విశ్వాసాలు ఈనాడే కాదు ఒకప్పటి రోము, గ్రీకు విగ్రహారాధకులలో ఇంకా ఒకనాటి అనాగరిక అరబ్బులలో కూడా ఉండేవి.
కానీ, ప్రవక్త ముహమ్మద్(స) ఇస్లాం బోధించటం మొదలెట్టిన తరువాత అరేబియా స్థితిగతులు మారిపోయాయి. ఖురాన్, సూర్యచంద్రుల పట్ల ప్రజలు కలిగి ఉండే మూఢ నమ్మకాలను తీవ్రంగా ఖండించటమే కాక, అసలు చంద్రుడి నియామక లక్ష్యం ఏమిటో కూడా శాస్త్రీయ పద్దతిలో తెలియజేస్తూ, సూర్యచంద్రాదులను ఆరాధించే గుడ్డి నమ్మకాన్ని తీవ్రంగా ఖండించి ప్రజల్లో శాస్త్రీయ అవగాహన కలిగించింది.
ప్రవక్తా! తరిగే పెరిగే చంద్రుని రూపాలను గురించి ప్రజలు నిన్ను అడుగుతుంటారు. నీవు వారికి ఇలా తెలుపు : ‘‘తేదీల లెక్కకూ, హజ్ కాల నిర్ణయానికీ అవి గుర్తులు. (2:189)
చంద్రుడి తరిగే, పెరిగే దశలకు కారణం దానికేవో దైవిక శక్తులు ఉండటం కాదు కానీ… “తద్వారా మీరు సంవత్సరాల, తేదీల లెక్కలను తెలుసుకోవాలని” – 10:5 అంటూ చంద్ర గ్రహం యొక్క వాస్తవ నియామక లక్ష్యాన్ని తెలుపటం జరిగింది.
భూమి తనచుట్టూ తాను తిరగుతూనే సూర్యుడు తిరగటం.. సూర్యుడు స్వయం ప్రకాశితంగా ఉంటూ దాని వెలుగు చంద్రుడిపై పడటం, దాని తరిగే పెరిగే దశల ప్రక్రియ ఆధారంగానే నేడు క్యాలండర్ డేట్స్, టైమ్ క్యాలుక్యులేషన్ అన్నవి చెయ్యబడుతున్నాయి. అదే విషయాన్ని ఖురాన్ తెలియజేస్తుంది.
సూర్యచంద్రాదుల లక్ష్యాన్ని ఖురాన్ వివరించటమే కాక, వాటికి దైవత్వం అంటగట్టి పూజించవద్దని ఖురాన్ తీవ్రంగా ఖండిస్తుంది.
“ఈ రేయింబవళ్లూ, ఈ సూర్యచంద్రాదులూ సృష్టికర్త సూచనలోనివే. సూర్యచంద్రాదులకు సాష్టాంగ పడకండి; వాటిని సృష్టించిన దేవునికి సాష్టాంగపడండి” -41:37
ఒకప్పుడు సూర్యుడు మాదిరిగానే చంద్రుడు సైతం స్వయం ప్రకాశితం అనే ఓ గుడ్డి నమ్మకం ప్రజల్లో ఉండేది. దానిని కూడా ఖురాన్- సూర్యుడు మాత్రమే స్వయం ప్రకాశం గలవాడు, చంద్రునికి కేవలం వెలుగు ఇవ్వబడుతుందని ఈ క్రింది విధంగా వివరించటం జరిగింది.
“సూర్యుణ్ణి కాంతిమంతునిగా చేసినవాడు ఆయనే. చంద్రుడికి వెలుగును ఇచ్చినవాడు ఆయనే. చంద్రుని పెరిగే తరిగే దశలను కచ్చితంగా నిర్ణయించినవాడూ అల్లాహ్ యే. తద్వారా మీరు సంవత్సరాల, తేదీల లెక్క తెలుసుకోవాలని. ”- (ఖురాన్ 10:5)
అని చెప్పటమే కాక, సూర్యచంద్రులు కొన్ని పటిష్ట నియమాలకు కట్టుబడి “నిర్ణీత కక్ష్యల్లో ఉంటూ తిరుగుతూ ఉన్నాయి” (ఖురాన్ 39:5) అని ఖురాన్ ఎంతో శాస్త్రీయ పద్ధతిలో వివరిస్తుంది.
