చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ అవ్వటం భారత జాతి గర్వించదగ్గ విషయం. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి దేశ ప్రజలంతా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఇది ఒక రకంగా ఆధునిక సైన్స్ సాధించిన మరొక అద్భుత విజయమని చెప్పాలి.
మానవుడు కేవలం గుడ్డి నమ్మకాలు, మూఢ విశ్వాసాలతో మట్టిని విగ్రహాలుగా మలచి వాటిని కేవలం పూజిస్తూ, సూర్యా చంద్రులను దైవాలుగా భావించి వాటిని ఆరాధిస్తున్నంత కాలం అతను ఏ విధంగానూ అభివృద్ధి చెందలేకపోయాడు. కానీ అతను ఆ మట్టిని, భూమిని, సూర్య చంద్రాదులను “శాస్త్రీయ దృష్టి (Scientific point of view)” తో ఎప్పుడైతే పరిశీలించటం మొదలు పెట్టాడో అతను భౌతిక ప్రపంచంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేయటం మొదలెట్టాడు. అన్ని విధాలుగా అతను అభివృద్ధి చెందుతూ వచ్చాడు.
అయితే ఈ విధమైన “శాస్త్రీయ ఆలోచనా విధానం” కలిగి ఉండాలంటే దానికోసం మనం “సైన్స్“నే నమ్ముకోవాలి తప్ప సృష్టికర్త, దేవుడు, ధర్మం వంటి మూఢ నమ్మకాలు కలిగి ఉండకూడదు, అవన్నీ మనిషిని హేతుబద్ధమైన ఆలోచనల నుండి, శాస్త్రీయ ఆలోచన నుండి దూరం చేసేసి అతన్నో మూర్ఖుడిగా మార్చిపడేస్తాయని చాలా సందర్భాల్లో పాపం నాస్తికులు నెత్తీ నోరే కాక ఏదిపడితే అది బాదుకుని తెగ గోల పెడుతుంటారు.
కానీ విశ్వం పట్ల గుడ్డి నమ్మకాలను కాక శాస్త్రీయ ఆలోచనలా విధానం (Scientific thought process) కలిగి ఉండాల్సిందిగా ధార్మిక గ్రంథాలు ఏనాడో ఆహ్వానం పలికాయి. ఉదాహరణకు ఖురాన్ లోని ఈ క్రింది వాక్యం గమనిస్తే…
“భూమ్యాకాశాల పనితీరు గురించి ఎప్పుడూ యోచన చేయలేదా?” – 7:185
అంటూ మనిషిని విశ్వ రహాస్యాలను శాస్త్రీయంగా ఆలోచించి తెలుసుకోమంటుంది ఖురాన్. అంతేకాదు “భూమిలో ఆకాశాలలో ఎన్ని సూచనలు లేవు? కానీ, వారు చూస్తూ ఉండిపోతారు. కొంచెమైన గమనించరు” – 12:102 అంటూ మనిషిని ఈ సృష్టి పట్ల శాస్త్రీయ ఆలోచనా కలిగి ఉండాల్సిందిగా ఆదేశిస్తుంది.
“భూమిలోనూ, ఆకాశాలలోనూ ఉన్నటువంటి దానిని కళ్లు తెరచి చూడండి” – 10:101 అంటూ ఖురాన్ మనిషి శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని తట్టి లేపుతుంది.
“భూమీ ఆకాశాల నిర్మాణం గురించి ఆలోచించే వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి” – 3:190 అని చెబుతూ విశ్వం పట్ల గుడ్డి నమ్మకాలు కాకుండా శాస్త్రీయ దృష్టిని కలిగి ఉండాలని ఖురాన్ సూచిస్తుంది.
చెయ్యాల్సింది సూర్య-చంద్రులను పూజించటం కాదు!
ఈ మాట చెబుతుంది ఎవరో నాస్తిక నాయకుడు కాదు స్వయంగా ఖురానే!
“ఈ రేయింబవళ్లూ, ఈ సూర్యచంద్రాదులూ అల్లాహ్ సూచనలోనివే. సూర్యచంద్రాదులకు సాష్టాంగ పడకండి; వాటిని సృష్టించిన దేవునికి సాష్టాంగపడండి” -41:37
అంతేకాదు, చంద్రుడి తరిగే, పెరిగే దశలకు కారణం దానికేవో దైవిక శక్తులు ఉండటం కాదు కానీ… “చంద్రుని తరిగే పెరిగే దశలను కచ్చితంగా నిర్ణయించినవాడు ఆయనే. తద్వారా మీరు సంవత్సరాల, తేదీల లెక్కలను తెలుసుకోవాలని” – 10:5 అంటూ చంద్రుని నియామక లక్ష్యం తేదీల లెక్కల కోసం నిర్ణయించబడ్డాయన్న శాస్త్రీయ అంశాన్ని ఖురాన్ తెలియజేస్తుంది. తప్పితే చంద్రుణ్ణి పూజించటం మూర్ఖత్వం అని చెబుతుంది.
ధర్మం మనిషిని హేతుబద్ధమైన ఆలోచన నుండి దూరం చేసేసి గుడ్డి విశ్వాసిగా మార్చిపరేస్తుంది. ఆలోచన చెయ్యగలగటం అన్నది ఒక్క నాస్తికత్వం ద్వారానే సాధ్యం” అన్నది నాస్తికుల మూఢ నమ్మకం. కానీ వారి ఈ టైపు వాదనలకు పూర్తి భిన్నంగా ఖురాన్…
“అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి” – 2: 44
అంటూ మనిషిని తన బుద్ధిని ఉపయోగించాలని అతని ఆలోచనలను తట్టి లేపుతుంది. అంతేకాదు.. “తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో నీచాతినీచమైన కోవకు చెందిన జంతువులు” – 8:22 అంటూ స్వంత మెదడు ఉన్నప్పటికీ బుద్ధిని ఉపయోగించని వారిని చెవిటివారిగా, మూగవారిగా అభివర్ణిస్తుంది ఖురాన్.
తమ బుద్ధిని ఉపయోగించకుండా తమకు తట్టిందే నిజమని భావించేవారిని, తాము ఊహించిందే నిజమనుకునే వారిని, స్వంత తెలివి ఉపయోగించకుండా ఎదుటివారిని గుడ్డిగా ఫాలో అయ్యే వారిని ఖురాన్ నీచాతి నీచమైన జంతువుల కోవలోకి జమకడుతుంది.
గుడ్డి నమ్మకాలు కలిగి ఉండకూడదు!
“ఊహా, అనుమానాల ఆధారంగా నిర్ణయం చేసేవారు నాశనమగుదురుగాక” – 51:10 అంటూ శాస్త్రీయ పరిశీలనా దృష్టితో కాక కేవలం ఊహా, అనుమానాల ఆధారంగా గుడ్డి నమ్మకాలను కలిగి ఉండేవారు నాశనమవుతారని కూడా చెబుతుంది ఏ నాస్తికుడో కాదు ఖురానే!
ఇంతకూ “శాస్త్రీయ ఆలోచనా విధానం” అంటే..?
అన్నది ప్రశ్నించుకుంటే… నాస్తికులు చెబుతున్నట్లు ఈ విశ్వం మొత్తం ఏదో గాలివాటంగా దానికదే తయారైపోయింది. ఈ విశ్వం వెనుక, విశ్వంలో క్రమం, క్రమబద్ధత (Discipline)తో పని చెయ్యటం వెనుక, ఈ విశ్వం ఒక అద్భుతమైన టెక్నాలజీతో పనిచెయ్యటం వెనుక ఏ మేధాస్సూ పనిచెయ్యటం లేదు, ఏ సృష్టికర్తా లేడు అని కొట్టిపరెయ్యటం “శాస్త్రీయ ఆలోచనా విధానం” అవుతుందా?
… లేక….
ఇంత క్రమబద్ధతతో పనిచేస్తున్న విశ్వం ఎలా ప్రారంభమయింది? ఇంత అద్భుతంగా, ఎలా పనిచేస్తుంది? విశ్వాన్ని విశ్వమే సృష్టించుకుని తనను తానుగా తెలివిగా నిర్వహించుకుంటుందా? లేక ఈ సమస్త విశ్వాన్ని ఒక మేధస్సు సృష్టించి నిర్వహిస్తుందా? అన్నది పరిశీలన చెయ్యటం “శాస్త్రీయ ఆలోచనా విధానం” అవుతుందా? ఒకసారి ఆలోచించండి.
కాబట్టి శాస్త్రీయ ఆలోచనా విధానం నుండి ధార్మిక గ్రంథాల ధర్మం మనిషిని దూరం చెయ్యటం లేదు కానీ ప్రోత్సహిస్తుంది. విశ్వంలో ఉన్న సూర్య చంద్రాదులను, ఇతర గ్రహాలను పూజించటమో, వాటిని మనిషి అదృష్ట దురదృష్టాలకు, మంచీ-చెడులకు లింకు పెట్టి గుడ్డి నమ్మకాలు కలిగి ఉండటమో కాదు కానీ, వాటి పట్ల శాస్త్రబద్ధమైన ఆలోచన చెయ్యాలన్నది ధార్మిక గ్రంథాల ఆదేశం. తద్వారా ఇప్పుడు చంద్రయాన్ 3 మాత్రమే కాదు భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుత ఆవిష్కరణలు విజయవంతంగా జరుగుతాయి.
“భూమీ ఆకాశాల నిర్మాణం గురించి ఆలోచించే వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి” – ఖురాన్ 3:190

