స్వతంత్ర ఉధ్యమంలో ‘జిహాద్’ చేసిన ముస్లిములు

‘జిహాద్’ అన్న అరబీ పదానికి ‘తీవ్రవాదం’ అన్నట్టు మీడియా బ్రెయిన్ వాష్ చేస్తూ రావటం వల్ల చాలా మందిలో ‘జిహాద్’ అంటే ‘దౌర్జన్యం’ ‘ఉగ్రవాదం’ అన్న అపార్థమే ఏర్పడిపోయింది.

నిజానికి ‘జిహాద్’ అంటే ‘చెడుకు, అన్యాయానికి, దౌర్జన్యానికి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటం’ మరియు సమాజం శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం సమాజంలో ‘శాంతి స్థాపనకు తీవ్రంగా కృషి చెయ్యటం’ అని అర్థం.
‘జిహాద్ మౌలిక లక్ష్యం (Basic objective of Jihad)’ నిర్మాణం (Construction) మాత్రమే తప్పితే.. విచ్ఛిన్నం (Destruction) కాదు.

నిజానికి ఒక వ్యక్తి తన చెడు తలంపులతో పోరాడటం జిహాద్. వృద్ధ తలిదండ్రులకు సేవ చెయ్యటం జిహాద్. నిజాయితీగా ప్రజాసేవ చెయ్యటం జిహాద్. ప్రజల శ్రేయస్సు కొరకు నిజాయితీగా ఉద్యమం చెయ్యటం కూడా జిహాదే! చివరకు ఒక వ్యక్తి తన దేశాన్ని దౌర్జన్య పరుల కబంధ హస్తాల నుండి కాపాడుకోవటానికి చేసే పోరాటం కూడా జిహాదే!

స్వాతంత్రోధ్యమంలో పోరాడిన ముస్లిములు – జిహాదీలు!

అన్యాయంగా ఈ దేశ సంపదను దోచుకొని, ఈ దేశ ప్రజలను అణచివేతకు గురిచేస్తూ వచ్చిన బ్రిటిష్ ప్రభుత్వపు బానిస సంకెళ్ళ నుండి భారత దేశాన్ని విముక్తి చేయటానికి, వారి దౌర్జన్యానికి వ్యతిరేకంగా తమ తోటి హిందూ సోదరులతో భుజం కలిపి పొరాడి ఈ దేశం కోసం తృణప్రాయంగా తమ ప్రాణాలను విడిచి పెట్టేసిన ముస్లిములందరూ వాస్తవానికి జిహాదీలే.

తప్పితే జిహాదిలంటే టోపీలు గెడ్డాలు పెట్టుకుని ముస్లిం పేర్లు తగిలించుకుని తీవ్రవాదం చేసి ప్రజల ప్రాణాలను అన్యాయంగా తీసే ఉన్మాదులు కారు!

ఈ దేశాన్ని ఆక్రమించి 200 సం.లు ఆంగ్లేయులు చేసిన దౌర్జన్యం ఉగ్రవాదమైతే.. వారి కబంధ హస్తాల నుండి దేశాన్ని, కులమతాలకతీతంగా దేశ ప్రజలను కాపాడటానికి వారికి వ్యతిరేకంగా ముస్లిములు చేసిన పోరాటం ‘జిహాద్’ అవుతుంది.

ఈ దేశం కోసం ‘జిహాద్’ చేయటానికి సిద్ధపడిన వీరులు అనేక మంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా హైదర్ అలీ, టిప్పుసుల్తాన్ లాంటి వీరుల కంటే ముందే బెంగాల్ నవాబ్ “సిరాజుద్దౌలా” 1757 ఫ్లాసీలో బ్రిటీషర్లకు ఎదురు తిరిగిన మొట్టమొదటి రెబలియన్ అన్న విషయం ఎంత మందికి తెలుసు? టిప్పుసుల్తాన్ నాలుగు సార్లు బ్రిటీషర్లతో యుద్ధానికి తలపడి ప్రాణాలు అర్పించటం జరిగింది. ఆయన చేసిన యుద్ధాలు “ఆంగ్లో మైసూర్ వార్స్” అన్న పేరుతో వినుతికెక్కాయి. 1857 లో మొదలైన “ఇండియన్ రెబలియన్ మూవ్మెంట్” అది “గదర్” అన్న పేరుతో వినుతికెక్కింది.

1857 లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మద్రాసా ముస్లిం పండితుల జిహాద్!

ఈ సందర్భంలో బ్రిటీషర్ల దౌర్జన్యానికి ఎదురు తిరిగిన ‘మదర్సా పండితులను’ ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 1831 లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని భారతదేశంలో ఉన్న మదర్సా లలో ఉన్న ఉలేమాలందరూ నిర్ణయించుకున్నారు. 1856 లో ఆల్ ఇండియా ఉలేమాల మీటింగ్ కూడా జరిగింది. మదర్సా ముస్లిం పండితులు తమకు ఎదురు తిరిగారన్న నెపంతో బ్రిటిష్ ప్రభుత్వం 1864 నుండి 67 మధ్య ఢిల్లీలో చాందిని చౌక్ నుండి ఖైబర్ వరకు అక్షరాలా 14000 మంది ముస్లిం పండితులను చెట్లకు ఉరేసి వ్రేలడదీసి చంపారు. ఉలేమాల తల వ్రేలాడబడని ఒక్క చెట్టు కూడా వదలబడలేదు.
* * * *

అలాగే ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ 1929 లో ప్రారంభించిన “ఖుదాయే ఖిత్మత్ గార్ మూవ్ మెంట్” ఎంతమందికి తెలుసు? ఈ యోధుడు అక్షరాలా ఒక లక్షమంది ముస్లిములను ఏకం చేస్తే వారిపై పెషావర్ లో జరిపిన బహిరంగ కాల్పుల్లో 250 మంది ముస్లిములు తమ ప్రాణాలను అర్పించారు.

పైన చెప్పిన త్యాగధనులే కాక, ఆనాడు బ్రిటీషర్లకు ఎదురుతిరిగి అష్ఫాఖుల్లా ఖాన్ ప్రాణాలు అర్పించి ఉండకపోతే, మౌలానా పీర్ అలీఖాన్, మౌల్వీ అహ్మదుల్లాహ్ షా, బఖ్త్ ఖాన్, పీర్ ఆలీ ఖాన్ ఉరికంబాలు ఎక్కి ఉరితాళ్లాను ముద్దాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి ఉండకపోయి ఉంటే, ఎందరో ముస్లిం వీరులు బ్రిటీషర్ల తుపాకీ గుళ్లకు బలై ప్రాణాలు తమ అర్పించకపోయి ఉంటే దేశ స్వతంత్రం పొందటం అన్నది పీడ కల్లో సైతం ఊహించుకోవటానికి సాధ్యం కాకపోయి ఉండేదేమో!

అలాగే “తుర్రే బాజ్ ఖాన్” బ్రిటీషర్లకు ఎదురు తిరిగిన మొట్టమొదటి హైదరాబాదీ రెబలియన్! తూప్రాన్ వద్ద బంధించినప్పుడు అక్కడ నుండి తుర్రే బాజ్ ఖాన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా కాల్చి చంపటమే కాక హైదరాబాదుకు ఆయన శవాన్ని మోసుకొచ్చి ప్రజల ముందు ఉరి వేసి మరీ పైశాచిక ఆనందం పొందారు.
మౌల్వీ ముహమ్మద్ బాకీర్ ను తోపు గొట్టం ముందు కట్టి పేల్చేసి ఆయన శరీరాన్ని ఛిద్రం చేశారు.

1857 లో మౌలానా ఫజ్లే హాఖ్ ఖైరబందీ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జిహాద్ ప్రకటిస్తూ ఫత్వా జారీ చేశారు. అలాగే.. వాక్కమ్ మజీద్, బతఖ్ మియా, సైఫుద్దీన్ కిచ్లు, మౌలానా హుస్సైన్ అహ్మద్ మదనీ, సయ్యద్ ఫజ్లుల్ హాసన్ హస్రత్ మొహానీ, మౌలానా ముహమ్మద్ అలీ జహూర్, ముక్తార్ అహ్మద్ అన్సారీ, మగ్బూల్ అహ్మద్ అజాజీ, బేగం హజ్రత్ మహల్, అబ్బాస్ అలీ, అబ్దుర్రహ్మాన్, మౌలానా మజ్హరుల్ హక్, ముహమ్మద్ హసన్ దేవ్ బందీ, ఉబైదుల్లా సింధీ, సయ్యద్ అల్లావుద్దీన్ హైదరీ, బటఖ్ మియా, అల్లా బక్ష్ సూమ్రు, ఖాన్ బహదూర్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్… వగైరా ఎందరో వీరులు 200 సం.లు సాగిన బ్రిటీషు ఉగ్రవాదానికి ఎదురు తిరిగి ‘జిహాద్’ చెయ్యకపోయి ఉంటే భారతదేశ స్వతంత్రం ఓ తీరని కలగానే మిగిలిపోయేదేమో అనటం అతిశయోక్తి కాదు! కానీ వీరందరిచరిత్ర మరుగున పడిపోయింది.

భారత జాతి కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేసిన ఎందరో ముస్లిం వీరుల చరిత్ర మరుగున పడిపోయింది. ఇది ఈనాటి ముస్లిం సమాజ విమర్శకులకు ఏ మాత్రం తెలియదు. పైగా మతోన్మాద పైత్యం తలకెక్కిన కొందరైతే ముస్లిములను దేశద్రోహులుగా చిత్రీకరించటానికి కూడా సిగ్గుపడటం లేదు.

ఈనాడు భారతదేశంలో మనమంతా స్వేచ్చగా, స్వతంత్రంగా తిరుగుతున్నది ఆనాడు అనేక ముస్లిం స్వతంత్ర సమరయోధులు బ్రిటిషర్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా తోటి హిందువులతో భుజం కలిపి ఈ భరతజాతి కోసం ‘జిహాద్’ చేసి ఎన్నో ఆత్మ బలిదానాలు అర్పించి చిందించిన రక్తంతో తడిచిన నేలపైనే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *