మదర్సా లను ఉగ్రవాదం నేర్పే పాఠశాలన్నట్టు, ముస్లిం పండితుల్ని ఉగ్రవాదం ప్రేరేపించేవారన్నట్టు వాట్స్ యాప్ ఫేక్ స్టోరీలు సృష్టించి ఫార్వార్డ్ చేసే ఎంతమందికి తెలుసు “సిల్క్ లెటర్ ఉద్యమం” గురించి?
1857 లో తిరుగుబాటు తరువాత ముస్లిం దేశాల సహాయం తీసుకుని భారతదేశాన్ని బ్రిటీషు వారి కబంధ హస్తాల నుండి కాపాడటానికి ప్రాణాలకు సైతం లెక్క చెయ్యకుండా 1913-20 సం.ల మధ్యలో దేవ్ బంద్ మదర్సా ముస్లిం పండితుల (ఉలేమాల) చే వ్యూహాత్మకంగా రూపొందించబండిదే “సిల్క్ లెటర్ ఉద్యమం (రేష్మీ రుమాల్ ఆందోళన్)”
దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ మద్రాసా పండితులైన మౌలానా మహ్ మూద్ హాసన్, మహమ్మద్ మియాన్ మన్సూర్ అన్సారీ, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీ, మహమ్మద్ ఉబైదుల్లా సింధీ వగైరా ముస్లిం పండితులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
దేవ్ బంద్ ముస్లిం పండితులు మరియు ఇతర ముస్లిం పండితులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చటానికి వ్యూహాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రీ, వాలంటీర్ల నియామకం వగైరా వాటి గురించిన సమాచారం రహస్యంగా పట్టు వస్త్రాలపై రాసుకుని చేరవేసుకునేవారు. దాని కారణంగానే దానికి “సిల్క్ లెటర్ మూమెంట్” అనే పేరు వచ్చింది.
నిజానికి ఇది ఏదో సామాన్యమైన ఉద్యమం కాదు టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, జర్మనీ వగైరా దేశాల ఆర్ధిక, ఆయుధ సహకారంతో పెద్ద ఎత్తున మొదలైన ఉద్యమం. అయితే దురదృష్టవశాత్తు ఆ లేఖలు బ్రిటిష్ వారికి చిక్కటంతో ఆ వ్యూహం విఫలమైంది. దానితో ఈ ఉద్యమాన్ని రూపొందించిన ఎంతో మంది మదర్సా పండితులు ఏళ్ల కొద్దీ జైలు శిక్షలు అనుభవించారు.
ఇక్కడ ముఖ్యంగా బ్రిటీషర్లకు ఎదురు తిరిగి ప్రాణాలర్పించిన ఈ దేశ మదర్సా ముస్లిం పండితులను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. ఈ దేశం కోసం మదర్సా ముస్లిం పండితులు చేసిన ప్రాణత్యాగాల గురించి చెప్పుకోవాలంటే… ఆంగ్ల చరిత్రకారుడైన థాంసన్ తన పుస్తకంలో ఈ విధంగా రాసుకొచ్చాడు: 1864 నుండి 67 మధ్యలో బ్రిటీషు గవర్నమెంట్ తమకు ఎదురు తిరిగిన ముస్లిం ఉలామాలు (పండితులను) జనహననం చెయ్యాల్సిందిగా నిర్ణయం తీసుకుంది.
తమకు ఎదురు తిరిగారన్న కారణంతో అక్షరాలా 14000 మంది ముస్లిం ఉలామాలను ఢిల్లీ చాందీ చౌక్ నుండి ఖైబర్ వరకు చెట్ల కొమ్మలకు ఉరి తాళ్లు బిగించి వ్రేలాడదీసి చంపారు. ఉలేమాల తల వ్రేలాడబడని ఒక్క చెట్టు కూడా వదలబడలేదు.
అయితే చరిత్రలో మరుగున పడిపోయిన ఆనాటి గొప్ప ఉద్యమాన్ని గుర్తించి జనవరి 11, 2013 న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ “సిల్క్ లెటర్ ఉద్యమం”పై స్మారక స్టాంపును సైతం విడుదల చెయ్యటం జరిగింది.
అంతేకాదు ప్రణబ్ ముఖర్జీ ఆనాటి సిల్క్ లెటర్ ఉద్యమాన్ని “భారతీయ స్వతంత్ర పోరాట చరిత్రలో అద్భుతమైన ఆద్యాయం (A glorious chapter of Indian’s history of freedom struggle)” గా అభివర్ణించటం జరిగింది.
ఆనాటి మదర్సా పండితులు నిర్వహించిన సిల్క్ లెటర్ ఉద్యమానికి గుర్తుగా “సిల్క్ లెటర్ మూవ్మెంట్”ను మూడు భాషల్లో రాసి విడుదల చేసిన స్టాంపును ఈ క్రింది చూడవచ్చు.
“సిల్క్ లెటర్ ఉద్యమం” మీకు తెలుసా /-
