యూదుల్ని పాలస్తీనా నుండి తరిమికొట్టింది ముస్లిములా?

ప్రస్తుత ఇశ్రాయీల్, పాలస్తీనా యుద్ధ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు యూట్యూబర్లు, క్రైస్తవుల అత్యుత్సాహం ఎంతవరకు వెళ్లిపోయిందంటే “పాలస్తీనా అనాదిగా యూదుల స్వంత భూమి, యూదులందరి కోసం అక్కడ సోలోమన్ అనే రాజు వారి కోసం మందిరం కట్టించాడు, తరువాత ముస్లిములు యూదుల్ని దౌర్జన్యంగా పాలస్తీనా నుండి తరిమికొట్టేసి, అక్కడి సోలోమోన్ మందిరాన్ని కూల్చేసి దాని బదులు “మస్జిదే అక్సా” నిర్మించేసుకున్నారన్న రేంజులోకి వెళ్లిపోయింది.

తమ యూట్యూబ్ వీడియోలు, వ్యాసాల లైకులు, వ్యూస్ కోసం చరిత్రను ఇంత దారుణంగా వక్రీకరించటం దిగజారుడు తనమే అవుతుంది.
***

ఇలాంటి వీడియోలు, వ్యాసాలు చూసి పాపం యూదులు అమాయకులన్నట్టు, వారిపై దౌర్జన్యం చేసి పాలస్తీనా ముస్లిములు వారి భూభాగం ఆక్రమించేసుకున్నట్టు ఊహించేసుకుని కొందరు “వీ స్టాండ్ విత్ ఇశ్రాయీల్” అన్న స్లోగన్లను సోషల్ మీడియాలో వదలటం వింతగానే కాదు రోతగా కూడా అనిపిస్తుంది.

“సోలోమన్ మందిరం” “మస్జిదే అక్సా” వేరువేరా?

ఇంతకూ “మస్జిదే అక్సా” అంటే ఏమిటి? “సోలోమన్ మందిరం” మరియు “మస్జిదే అక్సా” అన్నవి రెండూ వేరువేరా? అన్నది గమనించే ముందు సంక్షిప్తంగా తెలుసుకోవలసింది-

“మస్జిదే అక్సా” అంటే ఏమిటి?

ఒకప్పుడు అక్కడ సోలోమన్ మందిరం ఉండేదని ఆ స్థలంలో “మస్జిదే అక్సా” అన్న పేరుతో ముస్లిములు మసీదు నిర్మించుకున్నారని తలాతోకా లేని వాదనలు చేసేవారు గమనించాల్సిన విషయాలు- ప్రవక్త సోలోమన్ (అలై) ద్వారా ఒకప్పుడు 950 BC లో ప్రస్తుత పాలస్తీనాలో ఉన్న జెరూసలేంలో 36 ఎకరాల స్థలంలో “సోలోమన్ మందిరం” నిర్మించటం జరిగింది. ఆ స్థలాన్నే యూదులు “టెంపుల్ మౌంట్” అని కూడా పిలుస్తుంటారు.

కానీ, 587 BC లో బాబిలోనియన్లు పాలస్తీనాపై దండయాత్రలు చేసి, సోలోమన్ మందిరం ఒక్క గోడ కూడా మిగల కూడా పూర్తిగా ధ్వంసం చెయ్యటమే కాక, యూదులను పాలస్తీనా నుండి వెళ్లగొట్టటం జరుగుతుంది. తరువాత ఎప్పుడైతే బాబిలోను రాజ్యం పతనం అయిందో తిరిగి యూదులు పాలస్తీనాకు రావటంతో చివరకు 515 BC లో అదే స్థలంలో మిగిలి ఉన్న శిధిలాలపై తిరిగి యూదులచే మందిరం పునః స్థాపించటం జరుగుతుంది.

తిరిగి 70 AD లో రోమన్ రాజైన టైటస్ చేసిన దాడిలో యెరుషలేము మరలా పూర్తిగా ధ్వంసం చెయ్యబడి రోమన్ల పాలన లోకి వెళ్లిపోతుంది. లక్షల కొద్దీ యూదులు చంపబడతారు. సోలోమన్ మందిరం స్థానంలో కట్టబడిన రెండవ మందిరం కూడా పూర్తిగా నేల మట్టం చెయ్యబడుతుంది, పాలస్తీనాలో నివశిస్తున్న మొత్తం యూదులందరూ తరిమివేయబడి అనేక దేశాల్లో చెదిరిపోతారు.

క్రీ.శ 313 నుండి పాలస్తీనా రోమన్ క్రైస్తవుల ద్వారా పాలించబడుతుంది. ఆ తరువాత పాలస్తీనా 628 లో బైజాంటైన్ రాజు హెర్క్యులస్ చేజిక్కించుకోవటం జరుగుతుంది. దాని తరువాత అరేబియా నుండి ఇస్లామిక్ పాలన పారంభమైన తరువాత 638 లో పాలస్తీనాలో స్థానిక క్రైస్తవులు, యూదులు బైజాంటైన్ బదులుగా హజ్రత్ ఉమర్ (రజి) పాలన కోరుకుంటారు. ఎటువంటి యుద్ధం జరగకుండానే పాలస్తీనాలో బైజాంటైన్ అధికారి ‘పాట్రియార్క్ సోఫ్రోనియస్’ ఆయనను సాదరంగా పాలస్తీనా ఆహ్వానించటం జరుగుతుంది. వారిద్దరి మధ్య శాంతి ఒప్పందం జరిగిన తరువాత పాలస్తీనా ముస్లిం పాలన క్రింద రావటం జరుగుతుంది.

హజ్రత్ ఉమర్ (రజి) పాలస్తీనాలో ప్రవేశించినపటికే ఆ 36 ఎకరాల స్థలంలో ఒకప్పుడు ప్రవక్త సోలోమన్ ద్వారా నిర్మించబడ్డ మందిర ప్రాంతం శిధిలావస్థలో ఉంటుంది. హజ్రత్ ఉమర్ (రజి) నమాజ్ చదివిన స్థలంలోనే 12 వ శతాబ్దంలో సలాహుద్దీన్ పాలనలో “మస్జిదే ఉమర్”లేదా “మస్జిదే కిబ్లీ” నిర్మించబడుతుంది. ఇక ప్రసిద్ధమైన “డోమ్ ఆఫ్ రాక్”ను 685 AD లో ఖలీఫా ‘అబ్దుల్ మాలిక్ ఇబ్నె మర్వాన్’ నిర్మించటం జరిగింది. దానినే “మస్జిదే-అస్ సఖ్రా” లేదా “కుబ అల్-సఖ్రా” అని కూడా అంటారు.

చాలా మంది ఈ రెండు మసీదుల్లో ఏదో ఒకదాన్ని పట్టుకుని ‘మస్జిదే – అక్సా’ అని పొరబడుతుంటారు. నిజానికి ఆ రెండు మసీదుల్లో ఏదీ ‘మస్జిదే అక్సా’ కాదు.

మరి ‘మస్జిదే – అక్సా’ అంటే ఏది?

ఆ 36 ఎకరాల మొత్తం ప్రాచీన భూభాగాన్నే ‘మస్జిదే – అక్సా’ లేదా ‘బైతుల్ మక్దిస్’ లేదా ‘అల్-హరమ్ అల్ షరీఫ్’ అనటం జరుగుతుంది. ఆ 36 ఎకరాల కాంపౌండ్ మొత్తాన్ని కలిపి ఖురాన్ “మస్జిదే అక్సా” అని ప్రస్తావిస్తుంది.

వాస్తవానికి ‘మస్జిదే – అక్సా’ కాంపౌండులో ఒకటికాదు రెండు కాదు మొత్తం 5 మసీదులు నిర్మించబడి ఉన్నాయి! అవి: 1. మస్జిదే- మర్వానీ 2. అల్-కిబ్లీ మస్జిద్ 3. కుబ అల్-సఖ్రా 4. మస్జిదే – బురాక్ 5. మస్జిదే- ఖదీమ్.

ఆ తరువాత 1095 లో ‘పోప్ అర్బన్-2’ పాలస్తీనాలో ముస్లిములకు వ్యతిరేకంగా క్రుసేడ్లు నిర్వహించాలని పిలుపునిస్తాడు. 1099 లో జరిగిన క్రైస్తవ క్రుసేడర్ల భయంకరమైన దాడుల్లో అప్పటివరకూ పాలస్తీనాలో ప్రశాంతంగా కలిసి బ్రతుకుతున్న ముస్లింలు, యూదులను అతి దారుణంగా హతమార్చి పాలస్తీనాను క్రైస్తవ పాలకులు చేజిక్కించుకుంటారు.
క్రీ.శ 1187 లో క్రుసేడర్లు చేసిన దారుణాలకు ప్రతీకారంగా ‘సలాహ్ ఉద్దీన్’ వారిపై దండెత్తి తిరిగి పాలస్తీనాను స్వాధీన పరచుకోవటం జరుగుతుంది. కానీ సలాహ్ ఉద్దీన్ పాలస్తీనాలో నివసించే క్రైస్తవులపై ఎటువంటి ప్రతీకారం తీర్చుకోకుండా వారందర్నీ పాలస్తీనాలో నివసించటానికి అనుమతి నివ్వటం జరుగుతుంది.

తరువాత 15 వ శతాబ్దం నుండి పాలస్తీనా ‘ఒట్టోమోన్ ఎంపైర్’ పాలనలో సైతం ఎంతో ప్రశాంతంగా పాలించబడుతుంది. ఆ భూభాగంలో ముస్లిములు, క్రైస్తవులు, యూదులు సైతం కలిసి మెలసి జీవించటం జరుగుతుంది. 19 వ శతాబ్దం లో బ్రిటిషర్ల రాజకీయంతో “జియోనిజం” పురుడు పోసుకున్న తరువాతే పాలస్తీనా రక్తసిక్తం అవ్వటం మొదలయ్యింది.

పాలస్తీనా దేవునిచే యూదులకు ఆశీర్వదించబడిన వాగ్దాన భూమికదా?

ఈ వాదన ఈనాడు చాలామంది క్రైస్తవులు, ప్రో-ఇశ్రాయీల్ ముస్లిమేతరులు లేవనెత్తుతుంటారు. క్రైస్తవులైతే యూదులు దేవునిచే ఎన్నుకోబడిన వాగ్దాన పుత్రులు, పాలస్తీనా వారికోసం శాశ్వతంగా రాసిచ్చేసిన స్వంత భూమి అన్న స్థాయిలో ఊహించుకుని వారి కోసం కన్నీటి ప్రార్ధనలు చేస్తుంటారు.

ఏ దేవుడైతే యూదులకు అనేక ఆశీర్వాదాలిచ్చాదో ఆ యెహోవా దేవుడే యూదుల దుర్మార్గతను బట్టి “ఈ పట్టణము (పాలస్తీనా భూభాగం)లో నుండి మిమ్మును వెళ్లగొట్టుదును” – యెహెజ్కెలు 11:7 అని శపించాడు కూడా!

యూదులు, యేసును చంపటానికి అనేక విఫలయత్నాలు చేసి యేసు నోట సైతం కూడా “దేవుని రాజ్యం మీ నుండి తొలగించబడును (మత్తయి 21:37-43)” అని శపించబడ్డారు. ఆ శాపాన్ని బట్టే యెరుషలేము 70 AD లో రోమన్ల ద్వారా ధ్వంసం చెయ్యబడి, యూదులు ఆ భూభాగం నుండి వెళ్లగొట్టబడ్డారు.

ఆ విధంగా యూదుల్ని ఆ భూభాగం నుండి తరిమి వేసింది.. ఒకప్పుడు ఆ భూభాగాన్ని ప్రసాదించిన యెహోవానే! తప్పితే ముస్లిములు కాదుకదా! పాలస్తీనా భూభాగం యూదులకు ఇచ్చింది స్వయంగా యెహోవానే, అది కూడా వారు మంచి నడవడిక కలిగి ఉన్నంత వరకే అక్కడ నివసిస్తారన్న “షరతు (Condition)” పై “తాత్కాలికం (Temporary)” గా మాత్రమే ఇవ్వటం జరిగింది! తప్ప శాశ్వతంగా వారికి ఆ భూభాగం రాసి ఇవ్వటం అన్నది జరగలేదని బైబిలే చెబుతుంది.

ఇన్ని వాస్తవాలు బైబిల్లోనే ఉన్నప్పటికీ ఈనాడు ముస్లిములు దౌర్జన్యంగా యూదుల నుండి పాలస్తీనా లాగేసుకున్నట్టు, బలవంతంగా మస్జిదే అక్సా నిర్మించేసుకున్నట్లు ఊహించుకుని “ఐ స్టాండ్ విత్ ఇశ్రాయీల్” అనటం యూదులు చేస్తున్న ఉగ్రవాదంలో పాలు పంచుకోవటం కాదా?

ఈ మొత్తం చరిత్రలో ఎక్కడా ముస్లిములు బలవంతంగా యూదుల్ని పాలస్తీనా నుండి వెళ్లగొట్టిన ఒక్క సంఘటన లేదు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం.

సోలోమన్ టెంపుల్ – మస్జిదే అక్సా!

ఇప్పుడున్న మస్జిదే అక్సా కాంపౌండ్ నే ప్రవక్త సోలోమన్(అలై) ద్వారా “సోలోమోన్ మందిరం” కట్టబడినట్లు బైబిల్లో చూడగలం. ఇంతకూ సోలోమన్ మందిరం అంటే ఏమిటి? అన్నది గమనిస్తే… సోలోమన్ మందిరం కట్టించింది యెహోవా (అల్లాహ్) ఆరాధన కోసమే అని1 దినవృత్తాంతములు 22:11 వాక్యం ద్వారా తెలుస్తుంది.

అంటే అది ఒకప్పటి యూదుల్లో యెహోవా (అల్లాహ్)ను ఆరాధించే విశ్వాసుల కోసం కట్టించబడిన ఆరాధనా మందిరం అని తెలుస్తుంది.
ఇక్కడ సోలోమన్ మస్జిదే అక్సా నిర్మించారని, అంతకు ముందే అబ్రహాము నిర్మించారని కొందరు ముస్లిం పండితుల్లో ఒక వాదన ఉంది. సరే, ఇక్కడ అసలు వాదన అది కూడా కాదు. ఎవరు నిర్మించినా ఆ సోలోమన్ మందిరంలో ఆరాధించబడింది ఎవరు? అన్నదే గమనించాల్సింది.

నిజానికి ఒకప్పుడు యూదుల్లో విశ్వాసులంతా మస్జిదే అక్సా ‘దిక్కు (ఖిబ్లా)’ వైపే తిరిగి నమాజ్ చేస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని బైబిల్లోనూ చూడగలం.

“… అతడు తన ఇంటికి వెళ్లి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు ‘యెరుషలేము తట్టునకు’ తెరవబడియుండగా తన దేవునికి ప్రార్ధన చేయుచూ ఆయనను స్తుతించుచువచ్చెను” – దానియెలూ 6:10

పై వాక్యంలో పూర్వం యూదులు యెరుషలేములో ఉన్న అక్సా మస్జిద్ నే ‘దిక్కు (ఖిబ్లా) గా చేసుకుని ఆరాధనలు చేసేవారని తెలుస్తుంది.

ప్రారంభంలో ప్రవక్త ముహమ్మద్ (స) ఆయన అనుచరులు సైతం ‘మస్జిదే అక్సా’ దిక్కువైపే తిరిగి ప్రార్ధనలు చేస్తూ ఉండేవారు. ఆ తరువాత ‘మస్జిదే అక్సా’ వైపు నుండి ‘మక్కా (బైబిల్లో బాకా)’ వైపునకు ‘ఖిబ్లా (దిక్కు)’ మార్చటం జరిగింది.

కాబట్టి సోలోమన్ టెంపుల్ అంటే యూదుల దేవుడు కోసం నిర్మించబడిన ఆలయం, మస్జిదే అక్సా అంటే ముస్లిముల దేవుడు కోసం నిర్మించబడిన ఆలయం అని కాదు. సోలోమన్ మందిరమైనా… మస్జిదే అక్సా అయినా ఒక్కటే! అక్కడ యెహోవా లేదా అల్లాహ్ అన్న పేర్లతో ఆరాధించబడిన దేవుడు ఒక్కడే.

అంతేకాదు, ఏ పాలస్తీనానైతే దేవుడు, యూదులకు ప్రసాదించాడో… అక్కడ నుండి యూదుల దుర్మార్గత వల్ల వారు తరిమి కొట్టబడింది కూడా ఆ యూదుల దేవుడైన యెహోవా ద్వారానే… తప్ప వారిని పాలస్తీనా నుండి తరిమి కొట్టింది ముస్లిములు కారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *