టీపూ సుల్తాన్ – “హిందూ ధర్మ పరిరక్షకుడు”

ఈ మాట చెబుతుంది ఎవరో కాదు కర్ణాటక మంగుళూరుకు చెందిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు “భాస్కర్ ఆనంద్ సాలెటోర్”. కానీ కుల, మతాలకు అతీతంతా మతసామరస్యం పాటిస్తూ గొప్ప దేశభక్తి కలిగి బ్రిటిష్ దౌర్జన్యాలకు ఎదురోడి ప్రాణాలు అర్పించిన టీపూ సుల్తాన్ లాంటి యోధుడు ఒక ముస్లిం అవడం హిందుత్వ మతోన్మాద వేర్పాటువాదులకు మింగుడు పడని విషయం.
నేడు ఏ సరైన ఆధారం లేని చరిత్రను పట్టుకుని టీపూ సుల్తాన్ ను హిందూ వ్యతిరేకిగా, ఆలయాల-విగ్రహాల విధ్వంసకుడిగా, దేశద్రోహిగా చిత్రీకరించటం జరుగుతుంది. చరిత్రను నిస్పక్షపాతంగా పరిశీలిస్తే.. టీపూ సుల్తాన్ ఒక ముస్లిం అయినప్పటికీ అతని లౌకికవాద పాలనలో హిందూ దేవాలయాలు అభివృద్ధి చెందాయి. కుల, మతాలకు అతీతంగా హిందూ-ముస్లిములందరూ ఐక్యతతో ప్రశాంత జీవనం కొనసాగించారని, ముఖ్యంగా హిందూత్వం సురక్షితంగా కాపాడబడిందని తెలుసుకోగలం. ఈ క్రింది పేర్కొన్న అంశాలను జారత్తగా చదివితే నేడు కొందరు మతోన్మాదులు విమర్శిస్తున్నట్టు టిప్పు సుల్తాన్ హిందూ ధర్మ వ్యతిరేకిగానో, ఆలయాల విధ్వంసకుడిగానో కాక, “హిందూ ధర్మ పరిరక్షకుడు” అన్న విషయం గ్రహించగలం.

1. టీపూ సుల్తాన్ ఆలయాలను ధ్వంసం చేశాడన్న నిరాధార
ఆరోపణలను ప్రక్కనపెడితే.. నిజానికి ఆయన ఎన్నో హిందూ
దేవాలయాలకు భారీ నిధులు, విరాళాలు సమకూర్చటం జరిగింది, దేవాలయాలను పునరుద్ధరించటం జరిగింది. ముఖ్యంగా- శృంగేరీ శరాదా దేవాలయం, మెల్కుట్ నరసింహస్వామీ దేవాలయం, శ్రీరంగ పట్నంలోని శ్రీరంగనాధ స్వామీ దేవాలయం, శృంగేరి మఠం, చామరాజ్ నగర్ దేవాలయం, కాలాలే లోని లక్ష్మీకాంత దేవాలయం.. వగైరా తన రాజ్యంలో ఉన్న ఎన్నో ప్రముఖ దేవాలయాల నిర్వహణకు భారీ నిధులు, నగలు సమకూర్చటం జరిగింది.

2. కర్ణాటక గెజిటీర్ ఎడిటర్ అయిన శ్రీకాంతయ్య ప్రకారం టీపూ సుల్తాన్ 156 దేవాలయాల నిర్వహణకు క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం నిధులు మంజూరు చెయ్యటం జరిగేది. 1782 1799 మధ్య తన రాజ్యంలో 34 దేవాలయ మాన్యాల (భూముల) తాలూకు దస్తావేజులను మంజూరు చెయ్యటంతో పాటు భారీ విరాళాలు ఇవ్వటం జరిగింది.

3. నంజన్ గూడలో శ్రీ కంతేశ్వర దేవాలయానికి 10,000 బంగారు నాణాలు బహుకరించటం జరిగింది. శృంగేరీ శరాదా పీఠానికి బంగారునగలతో పాటు భారీమొత్తంలో ఆర్ధిక సహాయం చెయ్యటం జరిగింది. కాలాలే లోని లక్ష్మీకాంత దేవాలయానికి నగలను బహుకరించటం జరిగింది. టీపూ సుల్తాన్ ఎటువంటి విచక్షణా చూపకుండా తన రాజ్యంలో ఉన్న హిందూ-ముస్లిముల మత సంస్థలన్నిటికీ సమానంగా నిధులు, విరాళాలు మంజూరు చేయించటం జరిగేది.

4. ఏ టీపూ సుల్తాన్ గురించైతే కొందరు దేవాలయాల విధ్వంశకుడని నేడు విమర్శిస్తున్నారో అతను తన ప్యాలస్‌ను శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామి ఆలయానికి అతి దగ్గరగా నిర్మించటమే కాక ఆ ఆయల నిర్వహణకు నిధులు కూడా సమకూర్చటం జరిగేది. “టెంపుల్ టౌన్ (Temple town)” గా పిలువబడే శ్రీరంగపట్నాన్నే టీపూ సుల్తాన్ చివరివరకూ రాజధానిగా చేసుకుని పాలించటం జరిగింది. ఈ రోజు టిప్పు సుల్తాన్ సమాధి సైతం ఆ ఆలయానికి దగ్గర్లోనే శ్రీరంగ పట్నంలోనే ఉంది.

5. టీపూ సుల్తాన్ ఎంతమాత్రం విగ్రహాల లేదా దేవాలయాల విధ్వంసకుడు కాదు పైగా తన రాజ్యంలో ఉన్న దేవాలయాలన్నిటికీ భూములు, నగలు, నిధులు విస్తారంగా మంజూరు చెయ్యటం ద్వారా హిందూ దేవాలయాలు అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు. నిజంగా అతను ఆలయాల విధ్వంసకుడే అయితే తన రాజమందిరానికి దగ్గర్లోనే ఉన్న రంగనాథ స్వామి ఆలయాన్నే కూల్చేయ్యవచ్చు కదా?

6. పైగా టీపూ సుల్తాన్ పాలనలో శ్రీరంగ పట్నం పై మరాఠా రాజులు దాడి చేసి అక్కడ ఉన్న శృంగేరీ దేవాలయాన్ని కూలగొట్టి దేవీ శారదా విగ్రహాన్నీ అందులో సంపదనూ దొచుకెళ్లిపోయారు. తిరిగి ఆ దేవాలయాన్ని టిప్పూసుల్తాన్ పునరుద్ధరించటం జరిగింది.

7. అంతేకాదు టీపూ సుల్తాన్ రెవిన్యూ శాఖాధికారుల్లో ఒకడైన మయోన్ కురిక్కల్ కేరళ లోని మంజేరీ ఆలయంపై దాడి చేసి తగలబెట్టటం జరుగుతుంది. దానితో టీపూ సుల్తాన్ అతన్ని జైల్లో పెట్టటమే కాక, మంజేరీ కున్నత్ దేవాలయ పునర్నిర్మాణానికి 194.5 ఎకరాలను టాక్స్ రహిత భూమిగా దానం చెయ్యటం జరిగింది. ఇంకా టీపూ సుల్తాన్ పాలనలో బ్రాహ్మణులకు స్వర్ణయుగం గడిచిందని చెప్పవచ్చు. బ్రహ్మణవర్గానికి అగ్రహారాలను, ఇనామ్ భూములను బహుకరించటంతో ఆయన పాలనలో బ్రాహ్మణులు సుఖశాంతులతో జీవనం కొనసాగించేవారు.

8. టీపూ సుల్తాన్ తన ప్రభుత్వ పరిపాలనలో పూర్ణయ్య, కృష్ణ రావ్ లను ఆర్ధిక మంత్రిగా, రాష్ట్ర కోశాధికారిగా నియమించటమే కాక.. షమయ్య అయ్యంగార్, రంగ అయ్యంగార్, మూల్చంద్, సుజన్ రాయ్, సుబ్బారావ్ వగైరా అనుభవజ్ఞులైన హిందువులను అనేక శాఖల్లో సీనియర్ ఆఫీసర్లుగా నియమించటం జరిగింది. అతని సైన్యంలో అధికశాతం శూద్రులను నియమించటం జరిగింది.

ఈ విధంగా నిజంగా నేడు కొందరు విమర్శిస్తున్నట్టు టీపూ సుల్తాన్ హిందూ వ్యతిరేకి, ఆలయాల విధ్వంసకుడే అయితే.. తన అధికారాన్ని ఉపయోగించి మైసూర్ రాజ్యంలో ఉన్న గుళ్లన్నిటినీ పడగొట్టేయటానికి అతనికి ఒకరోజు కూడా పట్టదు. కానీ, టిప్పు సుల్తాన్ చేసింది మత ఆధారిత పాలన కాదు లౌకికవాద పాలన. అందుకే ఆయన దేవాలయాల నిర్వహణ కోసం జాగీర్లు, భారీ నగదు బహుమతులు జారీ చేయించటం జరిగేది.

ఇక టీపూ సుల్తాన్ హిందువులను ఊచకోత కోసి మతమార్పిడి చేశాడని, మంగుళూర్ లో క్రైస్తవులపై దాడి చేశాడని నేడు కొందరు ఎత్తిచూపుతున్న సంఘటనలను గమనిస్తే.. అవి టీపూ సుల్తాన్ మతోన్మాదంతో చేసిన దాడులు కావు కానీ వారు టీపూ సుల్తాన్ రాజ్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో చెయ్యి కలిపి కుట్రలు పన్నటం కారణంగానే టీపూ సుల్తాన్ వారిపై దాడి చెయ్యటం జరిగింది. ఆ తరువాత వారు లౌకికవాది అయిన టీపూ సుల్తాన్ ను మతోన్మాదవాదిగా చిత్రీకరిస్తూ రాసిన వక్రీకరించబడిన చరిత్రనే నేటి హిందుత్వ వేర్పాటువాదులు ఉపయోగిస్తున్నది.

చరిత్ర పరిశీలిస్తే.. మధ్యయుగాల్లో ఒక్క ముస్లిం పాలకులే కాదు.. హిందూ పాలకులు సైతం ఎన్నో దేవాలయాలు ధ్వంశం చేశారన్న విషయం నేటి హిందుత్వ వేర్పాటువాదులకు తెలీదనే చెప్పాలి.
ప్రముఖ చరిత్రకారుడు భారతదేశం యొక్క పురాతన మధ్య యుగాల చరిత్ర నిపుణుడైన DN Jha తన “Against the Grain: Notes on Identity, Intolerance and History” పుస్తకంలో ఇస్లాం పూర్వ యుగంలో అశోకుని పాలన ముగిసిన తరువాత బ్రాహ్మణ పాలకులు అనేక బౌద్ధ మందిరాలు, మఠాలు, స్థూపాలను నాశం చేసి దేవాలయాలు నిర్మించారని పేర్కొన్నాడు.

ఆ విధంగా అప్పట్లో హిందూ-ముస్లిం రాజుల ద్వారా దేవాలయాలు కూల్చబడటానికి కారణం వారి రాజ్య విస్తరణ కాంక్ష తప్ప మతోన్మాదం కాదు. మధ్య యుగాల్లో ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించినప్పుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాజ్య దేవతను, ధ్వంశం చెయ్యాటమో, తరలించుకుపోయి తమ రాజ్యంలో కలుపుకునేవారు. అలా చెయ్యటం యుద్ధాన్ని నెగ్గటానికి, వారి రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకోవటానికి సంకేతంగా (Symbolic) భావించేవారు. ఆ విధంగా రాజ్యాలకు రాజ్యాలకూ మధ్య జరిగిన అనేక యుద్ధల్లో ఒక్క ముస్లిం రాజులే కాదు అనేక హిందూ రాజులు సైతం ఆలయాలను ధ్వంశం చేసిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు.

నిజానికి ఒక్క టీపూ సుల్తానే కాక ఎందరో ముస్లిం పాలకులు భారతదేశంలో ఎన్నో హిందూ దేవాలయాలు కట్టించటం, పునరుద్ధరించటం జరిగింది.
***

చివరిగా టీపూ సుల్తాన్ నేడు కొందరు విమర్శిస్తున్నట్టు హిందూ వ్యతిరేకియా? లేక చరిత్రకారులు చెబుతున్నట్టు ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడా? అని ప్రశ్నించుకుంటే.. టిప్పు సుల్తాన్ పాలనలో ఆయన ద్వారా పునరుద్ధరించబడిన మరియు ఆయన మంజూరు చేయగా భారీ నిధులతో నిర్వహించబడి నేటికీ నిలబడి ఉన్న దేవాలయాలే.. ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడని, మతసామరస్యం కలిగి ఉన్న గొప్ప లౌకికవాది అని సమాధానం చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *