ఊపిరితిత్తుల్లో శ్వాస ఆరోగ్యవంతంగా ఆడుతున్నంత కాలం మనిషికి లభించే ప్రతీ సెకనూ హ్యాపీ న్యూ ఇయరే! మనిషి పుట్టిన మరు క్షణం నుండే అతని మరణానికి కౌంట్ డౌన్ మొదలైపోతుంది. ఆ కౌంట్ డౌన్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు. దాన్ని పొడిగించే శక్తి ఎంత అపర మేధావి అయిన సైంటిస్టుకైనా సాధ్యం కాని పని! సో, క్యాలండర్ లో ఒక సంవత్సరం పూర్తై మరో సంవత్సరం మొదలవ్వటమంటే లైఫ్ టైమ్ కౌంట్ డౌన్ లో ఒక సంవత్సరం పూర్తయిపోయినట్టే లెక్క.
డిసెంబర్ 31 st నుండి జనవరి 1 కి క్యాలండర్ మారినంత మాత్రానా వ్యక్తిగత, సామాజిక జీవితంలో అంతా మంచే జరిగిపోదని.. విధి వ్రాత మారిపోయి అద్భుతాలేమీ జరిగిపోవన్న విషయం 31 st నైట్ తాగి తూగేసి న్యూ ఇయర్ సంబరాలు జరుపుకునేవారికి సైతం బాగా తెలిసిన విషయమే.
వాస్తవం ఇదైనప్పుడు న్యూ ఇయర్ సంబరాలు జరుపుకోటంలో లాజిక్ ఏమిటో ఎప్పటికీ అర్థం కాని విషయమే!
వ్యక్తుల జీవితాలలో, సమాజంలో మార్పు అన్నది క్యాలండర్ డేటు మారటాన్ని బట్టో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టటాన్ని బట్టో సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిన పచ్చి నిజం. గత సంవత్సరం 31 st హ్యాపీ న్యూ ఇయర్ సంబరాలు జరుపుకున్న ఎందరో ఈ 31 st రాత్రికి ఈ లోకంలో లేరు.
మనిషికి లభించే ప్రతీ సెకనూ న్యూ ఇయరే. తన జీవితాన్ని ఎంతో అర్థవంతంగా సృష్టించి, తన సేవ కోసం సమస్త విశ్వాన్నీ సృష్టించిన ఆ సృష్టికర్తను మనిషి ఎప్పుడైతే హేతుబద్ధంగా ఆలోచన చేసి గుర్తించగలుగుతాడో ఆ క్షణమే అతనికి నిజమైన హ్యాపీ న్యూ ఇయర్. తన బలహీనతల్ని వదిలి పెట్టగలిగి వ్యక్తిగతంగా ప్రవర్తన మార్చుకోగలుగుతాడో ఆ క్షణమే అతనికి నిజమైన హ్యాపీ న్యూ ఇయర్.
లైఫ్ కౌంట్ డౌన్ ఎప్పుడు పూర్తయిపోతుందో తెలీని గ్యారంటీ లేని జీవితాన్ని అన్నీ తనకు తెలిసినట్లు పెద్ద తోపులా విర్రవీగుతూ నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్టు గడుపుతూ సడన్ గా చావు కళ్లెదురుగా వచ్చి నిలబడ్డాక చివరి క్షణాల్లోనైనా అతని ఆత్మ అతన్ని ప్రశ్నించక మానదు.. “నువ్వు నీ సృష్టికర్తను గురించి ఎందుకు ఆలోచన చెయ్యలేకపోయావని ఎందుకు నిర్లక్ష్యం వహించావని, నిన్ను నువ్వు ఎందుకు మార్చుకోలేకపోయావని”
న్యూ ఇయర్ క్యాలండర్ మారినంత మాత్రాన లేని సంతోషాలు వచ్చి పడవు రావలసిన కష్టనష్టాలూ తప్పిపోవు, జీవితంలో మార్పూ జరిగిపోదు. అతను హేతుబద్ధంగా సృష్టికర్తను ఆలోచించి గుర్తించనంత వరకు, అతని వ్యక్తిగత ప్రవర్తన మార్చుకోనంత వరకు, తోటి వ్యక్తులను సంస్కరించనంత వరకు, సామాజిక సంస్కరణ చెయ్యనంత వరకు ఎన్ని సంవత్సరాలు మారినా అది క్యాలండర్ వరకే.
ఇదే విషయం ఖురాన్ ఈ క్రింది విధంగా చెబుతుంది.
“కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహాన బోధ చేసుకునేవారు తప్ప” – 103: 1-3
Md Nooruddin
ప్రతి సెకనూ హ్యాపీ న్యూ ఇయరే…
