విశ్వవ్యవస్థతో పాటు భూమిపై ఉన్న ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన “సమతూకం (Balance)” ను చూడగలం. అది తప్పనంత వరకూ పర్లేదు కానీ ఎప్పుడైతే పర్యావరణ సమతుకాన్ని భంగపరచటం మొదలెడతామో విధ్వాంసాన్ని చేతులారా కొని తెచ్చుకోవటమే అవుతుంది.
కేవలం అడవుల్ని నరికేయటం, ఖనిజ సంపద కోసం కొండల్నీ, భూముల్నీ తవ్వేయటం, పచ్చటి చెట్లను విచక్షణా రహితంగా నరికెయ్యటం, కాలుష్యం, ప్లాస్టిక్, వ్యర్థాలతో పర్యావరణంలో కాలుష్యాన్ని పెంచెయ్యటం మాత్రమే కాదు..
ఉళ్ళల్లో నగరాల్లో ఉండే చెరువులను, కాలువలను పుడ్చేసి లే-అవుట్లు గా మార్చిపరేసి అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టేసుకోవటం, నదీ పరీవాహక ప్రాంతాల్ని ఆక్రమించేసి ‘లేక్ వ్యూ అపార్ట్మెంట్ల’ పేరుతో కట్టడాలు నిర్మించెయ్యటం కూడా ‘పర్యావరణ సమతుకాన్ని (Ecological Balance)’ ను భంగపరచటంలో భాగమే!
ఇన్నాళ్లుగా ఆ సమతూకాన్ని భంగపరుస్తూ వచ్చిన దాని ఫలితమే నేడు హైదారాబాద్ లో జలప్రళయం రూపంలో వచ్చిపడిన విధ్వంసం. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు మాత్రమే కాకుండా ఒకప్పుడు పదుల సంఖ్యలో చెరువులుండేవి. అవన్నీ ఈనాడు మాయమైపోయాయి. అవి కప్పబడి వాటిపై అక్రమ కట్టడాల రూపంలో కాంక్రీటు అడవులు లేచాయి. కొన్ని ఆయా చెరువుల పేర్లతోనే సెంటర్లు వెలిశాయి.
నేడు ఆ ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయి చెరువులుగా మారిపోయాయి. అక్కడ కట్టేసిన ఇళ్లన్నీ ఆ నీళ్లలో మునిగిపోయాయి. వారి వాహనాలు నీటిలో తేలుతున్నాయి. ఇప్పుడక్కడ పడవలు నడుస్తున్నాయి.
దీనికి వరుణుడు ఆగ్రహించాడని, దేవుడు శపిస్తున్నాడని పేర్లు పెట్టటం ఎందుకు? వచ్చిన నీరు వెళ్లటానికి చెరువుల్లేకుండా.. ఇంకటానికి మట్టి లేకుండా అంతా కాంక్రీటు మయం చేసిపరేసినప్పుడు ఏమైపోయింది ఈ బుద్ది? అందుకే సృష్టికర్త అయిన దేవుడు హెచ్చరిస్తున్నదేమిటంటే..
మీరు సమతూకాన్ని (Balance) భంగపరచకండి – ఖురాన్ 55:9
సమతూకాన్ని కాపాడకపోతే విధ్వంసమే
