అంబేడ్కర్ – స్ఫూర్తి ప్రదాత

“దాస్య శృంఖలాల క్రింద యుగయుగాలుగా మగ్గిపోతున్న పీడిత వర్గాల ప్రజలను నా జీవితకాలంలో పాలకులుగా చూడాలి, అదే నా జీవిత లక్ష్యం” అని తన జీవిత లక్ష్యాన్ని ఎలుగెత్తి చాటిన ఏకైక రాజకీయ, సామాజిక దార్శనికుడు- డా. బి.ఆర్. అంబేడ్కర్. ఒక్క దళితుల కోసమే కాదు, మొత్తం భారతదేశంలోని అన్ని వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. ఆయన అణచివేతకు గురైన వారికి స్ఫూర్తి ప్రదాత. దళిత వర్గాలకు రిజర్వేషన్లన్నవి ఊహకు కూడా అందని కాలంలో ఆయన ఎటువంటి నైరాస్యానికి గురికాకుండా అణచివేత అనే మహా ప్రవాహానికి ఎదురీది దాన్ని మలచినటువంటి ధీశాలి.

అయితే రిజర్వేషన్స్ ఉంటేనే మన అభివృద్ధి చెందుతాం అనుకునేవాళ్లు కొందరైతే, రిజర్వేషన్స్ అందిపుచ్చుకుని ఎదిగేవాళ్ళు కొందరుంటారు, అసలు రిజర్వేషన్సే లేని కాలంలో తనను తాను ఉద్ధరించుకుని ఎదిగేవారు ఇంకెంత గొప్ప! అలాంటి గొప్ప అరుదైన వ్యాక్తుల్లో అంబేడ్కర్ ఒకరని చెప్పుకోవచ్చు. కాబట్టే అంబేడ్కర్ ఈనాటి యువతకు స్ఫూర్తి ప్రదాత అనటంలో ఏమాత్రం సందేహపడనక్కర్లేదు.

కాకపోతే మన భారతదేశంలో ఉన్న ఒక దౌర్భాగ్యం ఏమిటంటే- మహనీయులు, గొప్ప వ్యక్తుల ఆదర్శాలను అనుసరించటానికి బదులు జనాలు వల్లమాలిన అభిమానం పెంచుకుని, ఒకటి- ఆయా వ్యక్తుల విగ్రహాలకు పులహారాలు వేసి, పాలాభిషేకాలు చేస్తారు, లేదా దేవుళ్లుగా చేసుకుని పూజించేస్తారు! తప్ప వారి ఆదర్శాలు పాటించరు. అందుకే ఎందరో మహనీయులు పుట్టిన భారతదేశంలో వారి విగ్రహాలు రోడ్ల ప్రక్కన మిగిలిపోయాయి, వారి ఆదర్శాలు చరిత్ర పుస్తకాలుగా మారి లైబ్రరీల్లో మగ్గుతున్నాయి.

రాజ్యాంగం పూర్తయ్యాక ఆయన చెప్పిన ఒక గొప్ప మాట ఏమిటంటే- “రాజ్యాంగం ఎంత గొప్పదైనప్పటికీ దాన్ని అమలు పరచేనవారు ఉత్తములు కాకపోతే ఆ రాజ్యాంగంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఒకవేళ రాజ్యాంగం లోపభూయిష్టమైనదైనప్పటికీ దాన్ని అమలు పరిచేవారు ఉత్తములైతే దానివల్ల ప్రజలకు మేలే చేకూరుతుంది” అన్నది.

ఆయన చెప్పిన పై మాటలు నేటి భారతదేశ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. .
ముఖ్యంగా అంబేడ్కర్ చెప్పిన పై మాట ఇటు హిందూ, ముస్లిం, క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. అదెలాగంటే- వారి వద్ధ ఎంత గొప్ప ధార్మిక గ్రంథాలు ఉన్నప్పటికి అవి ఎంత గొప్ప ధర్మం ప్రబోధిస్తున్నప్పటికీ వాటిని కలిగి ఉన్న హిందువుల్లో అనేక కులాలుగా, క్రైస్తవుల్లో అనేక సంఘాలుగా, ముస్లిముల్లో విభిన్న వర్గాలుగా చీలిపోయి ఒకరికొరకు కొట్టుకుచచ్చే పరిస్థితి నేడు కొనసాగుతుంది. నిజానికి ఆ గ్రంథాలు- “మానవులంతా ఒకే జంట సంతానమని, అందరికీ ఒకటే ధర్మమని, అందరికీ ఒక్కడే దేవుడని” చెబుతున్నాయి. దీనిని బట్టి లోపం ఎవరిలో ఉంది? గ్రంథాల్లోనా? వాటిని అనుసరించే వ్యక్తుల్లోనా? కాబట్టి రాజ్యాంగమైన, ధార్మిక గ్రంథమైనా అది ఎంత గొప్పదైనప్పటికీ దాన్ని అమలు పరచేనవారు ఉత్తములు కాకపోతే అర్థం చేసుకోవాల్సిన విధంగా వాటిని అర్థం చేసుకోలేని మూర్ఖులైతే ఆయా గ్రంథాల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. నేడు జరుగుతుంది అదే!

“ప్రజాస్వామ్యం అన్న ముసుగులో నియంతృత్వం సాగుతుందేమో అని నేను భయపడుతున్నాను” అని ఆనాడే అంబేడ్కర్ సందేహం వెలిబుచ్చటాన్ని బట్టి ఆయన ఓ గొప్ప “దీర్ఘదర్శి” అని కూడా చెప్పటం అతిశయోక్తి కాదు.

ఒక రకంగా ఈనాటి సామాజిక పరిస్థితిని ఆయన ఆనాడే ఊహించారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే- “ఎక్కడైతే సామాజిక ఆర్ధిక, రాజకీయ, సమానత్వం లభిస్తుందో అక్కడ ప్రజాస్వామ్యం ప్రఢవిల్లుతున్నట్టు” అని అర్థం. నిజంగా ఇలాంటి ప్రజాస్వామ్యమే నేడు దేశంలో అమలులో ఉందా? అన్నది గమనిస్తే, ముందుగా రాజకీయ రంగంలో సమానత్వం ఉందా అంటే నేడు రాజకీయంలో అగ్రవర్ణాలవారు, ధనికులు, ప్రత్యేక వర్గం వారే ఏలుతున్న పరిస్థితి, పోనీ దేశంలో ఆర్థిక సమానత్వం ఉందా అంటే- ఆర్థికంగా ధనికులు మరింత ధనికులైపోతున్నారు, అధికశాతం బీదలు అవకాశాలు అందిపుచ్చుకోలేక బీదలుగానే వెనుకబడిన వారిగా ఉండిపోతున్నారు. ఇక సామాజిక సమానత్వం అన్నది అగ్ర-అధమ వర్ణాల, కులతత్వవాదం-మతతత్వవాదాల ప్రవాహాలలో ఎప్పుడో కొట్టుకుపోయిందన్నది ఒప్పుకోవలసిన వాస్తవం.

స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం వంటివి ప్రజల్లో వెల్లివిరియాలంటే, సామాజిక అభివృద్ది జరగాలంటే దానికి మార్గం భారతదేశంలో కులాల ఆధారంగా కాక, నైపుణ్యత, జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యపడుతుందని ఆనాడే అంబేడ్కర్ అభిలషించేవారు.

ఇక్కడ ఒక సున్నిత విషయం అందరూ గమనించాలి- “కులం, మతం అనేవి ఎప్పుడూ ఉండేవే కానీ, కులతత్వం, మతత్వం అన్నవి అత్యంత ప్రమాదం. మనిషికి ఆత్మాభిమానం ఉండొచ్చుకానీ అహంకారం ఉండకూడదు, అలాగే జాత్యాభిమానం ఉండొచ్చు గానీ జాత్యాహంకారం ఉండకూడదు అలాగే కులాలు ఉన్నప్పటికీ కులతత్వం ఉండకూడదు, మతాలు ఉన్నప్పటికీ మతత్వం ఉండకూడదు అది ఎప్పటికీ ప్రమాదమే. దానివల్లే ఎందరో అసలు ధర్మానికి దూరమైపోయింది. నిజానికి కులతత్వవాదం, మతతత్వవాదాలే ఒకనాడు దళితులను విపరీతంగా అణచివేతకు గురిచేసింది. దానిమీదే అంబేడ్కర్ పోరాటం కొనసాగింది.

ఇక వ్యక్తుల ప్రతిభను బట్టి, జ్ఞానాన్ని నైపుణ్యాలను బట్టి కాక కులాలు, వర్ణాల ఆధారంగా అవకాశాలు ఇవ్వబడే సమాజం పైకి ఎంత అందంగా కనపడినప్పటికీ అది ఎప్పటికీ అంతర్గతంగా డొల్లతనమే కలిగి ఉంటుంది. ఇలాంటి అసమానతలు లేనినాడు, ప్రతిభకు పట్టంకట్టిననాడే ప్రజలకు విద్యా, పారిశ్రామిక, ఉద్యోగ వ్యవస్థల్లో స్థానం లభిస్తుందని, కులం, వర్ణం పునాదుల మీద ఒక ఉత్తమ సమాజం నిర్మించటం సాధ్యంకాదన్న విషయాన్ని అంబేడ్కర్ చెప్పటం జరిగింది.

“చదువు – సమీకరించు – పోరాడు” అన్నది అంబేడ్కర్ చెప్పిన అతి గొప్పవిషయాల్లో ఒకటి. కులం ద్వారానో, మతం ద్వారానో, అధికారం ద్వారానో, వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిపాస్తుల ద్వారానో మనిషి వ్యక్తిగతంగా ఉన్నతుడు కాలేడు. కానీ, అక్షరం ద్వారా ఎవరైనా జ్ఞానిగా ఎదగొచ్చని, ప్రజలు భిక్షగాళ్లుగా మార కూడదు కానీ, శ్రమ ద్వారా, ఆత్మగౌరవం ద్వారా, మేథో సంపదను పెంచుకోవడం ద్వారానే ప్రజలు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందగలరని ఆయన అనేక సందర్భాలలో చెబుతూ ఉండేవారు.

కాబట్టి ఈనాడు కావలసింది అంబేడ్కర్ ను కేవలం అభిమానించేవారు వారు కాదు ఆయన భవిష్యత్తరాలకు ఇచ్చిన స్ఫూర్తిని, ఆయన ఆదర్శాలను అచరణాత్మకంగా ముందుకు తీసుకెళ్ళేవారు అలాంటి వారే నిజమైన అంబేడ్కరిస్టులు కాగలరు.


Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *