చార్లెస్ డార్విన్ తన “ఆరిజన్ ఆఫ్ స్పెషిస్”లో సైతం అన్ని జీవులకు ఉమ్మడి పూర్వీకుడు/ఆ ప్రారంభ జీవి ఒక్కటే అని చెప్పగలిగాడే తప్ప ఆ అన్ని జాతులకు మూలమైన ‘మొదటి జీవి’ లేదా ‘ఉమ్మడి పూర్వీకుడు (Common ancestor)’ ఎలా ఉనికిలోకి రావటం జరిగింది అన్నది తన పుస్తకంలో వివరించలేకపోయాడు.
నిర్జీవ పదార్థం నుండి జీవకణం ఎలా పుట్టింది? అన్న ప్రశ్నకు సమాధానం నాస్తికులకే కాదు సైన్స్ కు సైతం అంతుచిక్కని మిస్టరీనే.
మధ్యయుగాల నుండి దాదాపుగా అందరూ నిర్జీవ పదార్థం నుండి జీవులు లేదా జీవం ఉద్భవించటం సాధ్యమే అనే సిద్ధాంతాన్నే ఆమోదించటం జరిగింది. మిగిలిపోయి కుళ్లిపోయిన ఆహారం నుండి కీటకాలు, గోధుమల నుండి ఎలుకలు, నిర్జీవ పదార్థాల నుండి బాక్టీరియా వగైరా జీవులు ఆవిర్భవించాయన్న థియరీలే ప్రజల్లో ఉండేవి.
చివరకు చార్లెస్ డార్విన్ తాను ప్రతిపాదించిన “నాచురల్ సెలెక్షన్” థియరీ ప్రకారం “నిర్ధిష్టమైన జాతుల నుండి జన్యు మార్పులు చెంది యాదృచ్ఛికంగా మరికొన్ని కొత్త జాతులు పుట్టుకొచ్చాయని చెప్పుకొచ్చాడు.
సరిగ్గా చార్లెస్ డార్విన్ రాసిన “ఆరిజన్ ఆఫ్ స్పెషిస్” పుస్తకం విడుదలైన అయిదేళ్లకు ‘లూయిస్ పాశ్చర్’ అనే సైంటిస్ట్ సుదీర్ఘమైన అధ్యయనాలు, అనేక ప్రయోగాల అనంతరం చెప్పి నిరూపించిన విషయం ఏమిటంటే- “నిర్జీవ పదార్థం నుండి యాదృచ్ఛికంగా ‘జీవకణం’ రూపొందదు” అన్నది.
ఇంకా చెప్పాలంటే లూయిస్ పాశ్చర్ ప్రయోగాలు డార్విన్ పరిణామ సిద్ధాంతానికి మూలమైన “యాదృచ్ఛికంగా కొత్త జాతుల ఆవిర్భావం (Spontaneous generation)” సాధ్యం” అన్న వాదనను పూర్తిగా నిర్వీర్యం చేసిపరేశాయనే చెప్పాలి.
లూయిస్ పాశ్చర్ 1864 లో తన విజయవంతమైన ఉపన్యాసంలో మాట్లాడుతూ “నేను చేసిన ప్రయోగాలు యాదృచ్ఛికంగా కొత్త జాతుల ఆవిర్భావం సాధ్యమన్న సిద్ధాంతాన్ని చావు దెబ్బ కొట్టిందని” పేర్కొనటం గమనార్హం.
పరిణామ సిద్ధాంతవాదులు వాదించేదేమిటంటే- “3.8 బిలియన్ సంవత్సరాల క్రితం యాదృచ్ఛికంగా ఏకకణజీవులు (ప్రోకార్యోట్లు) ఉద్భవించాయి. కాలక్రమేణా అతిక్లిష్టమైన బహుకణ జీవులు (యూకర్యోట్స్) ఉద్భవించాయి అన్నది. డార్వినిజం ప్రకారం ప్రకృతి శక్తులు సాధారణ నిర్జీవ పదార్థాల నుండి క్లిష్టతరమైన జీవులను రూపొందించాయి అన్నది. కానీ అప్పటివరకూ చాలా మంది నమ్ముతున్న “నిర్జీవ పదార్థం నుండి క్లిష్టతరమైన జీవులు సృష్టించబడ్డాయన్న” మూఢ నమ్మకాన్ని లూయిస్ పాశ్చర్ పూర్తిగా తప్పని నిరూపించాడు.
చార్లెస్ డార్విన్ తన “ఆరిజన్ ఆఫ్ స్పెషిస్”లో పేర్కొన్న పరిణామ సిద్ధాంతం ఎంత లోపభూయిష్టమైనదో ప్రయోగాత్మకంగా ఖండించిన మరో శాస్త్రవేత్త గ్రేగర్ మెండల్.
డార్విన్ పరిణామ సిద్ధాంతంలో మరొక ముఖ్యమైన అంశం “జీవులలో “ఉపయోగకరమైన లక్షణాలు” ఎంపిక చేయబడి అవి తరువాత తరాలకు ప్రసారం చెయ్యబడతాయి. అలా కాలక్రమేణా జన్యుమార్పుల ద్వారా కొత్త జాతులు పుట్టుకొచ్చాయి అన్నది.
గ్రేగర్ మెండల్ నిరూపించిందేమిటంటే జన్యు చట్టాల (Genetic Laws ) ప్రకారం జీవులలో జన్యువులు మార్పు చెందవు అన్నది. కాలక్రమేణా జీవులలో జన్యువులు (Genes) మార్పు చెంది మరో కొత్త జీవులు ఉద్భవించటం అన్నది జరగదు ఆవులు ఎప్పటికీ ఆవులుగానే ఉంటాయి, జింకలు జింకలు గానే ఉంటాయి తప్ప వాటి జన్యువులు మార్పులు చెందుతూ అవి మరో కొత్తరకం జీవులుగానే పరిణామం చెందవు అన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపణ చేసి 1865 లో ఈ విషయాన్ని ‘జర్నల్ ఆఫ్ హెరిడిటీ’లో పేర్కొనటం జరిగింది.
ఈ ప్రయోగం అప్పటివరకూ డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారందరి విశ్వాసాన్ని కుప్పకూల్చేసింది. డార్విన్ సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన సైంటిస్టులు ఎలాగైనా ఈ డార్విజాన్ని కాపాడుకోవాలన్న ఆరాటంతో ‘జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో 1941 లో డార్విన్ సిద్ధాంతానికి కొన్ని రిపేర్లు చేసి తయారు చేసిందే “నియో-డార్వినిజం”. దీని వివరణ మరెప్పుడైనా వేరే వ్యాసంలో చర్చించుకుందాం.
నిర్జీవ పదార్థం నుండి జీవకణం ఎలా పుట్టింది? అన్న ప్రశ్నకు సమాధానం నాస్తికులకు, సైన్స్ కు సైతం అంతుచిక్కని మిస్టరీ. ఎక్కడవరకైతే సైన్స్ ఆగిపోయిందో అక్కడ నుండి ధార్మిక గ్రంథాలు సమాధానాన్ని ఇస్తున్నాయి.
మానవ ఊహకు అందని మరియు సమస్త విశ్వానికి అతీతమైన ఒక శక్తి నిర్జీవ పదార్థాన్ని ఉనికిలోకి తెచ్చి దాని నుండి అనేక గ్రహాలను, మండే అగ్ని గోళాలను, నక్షత్రాలను నిర్దిష్ట ఆకారాలలో నిర్మించి వాటికి పటిష్టమైన కక్ష్యలలో ప్రయాణించేలా దశ దిశలను నిర్దేశించటం జరిగింది. ఆ శక్తినే సామాన్య పరిభాషలో ‘సృష్టికర్త’ అని పేర్కొనటం జరిగింది.
ఆయనే ఆ నిర్జీవ పదార్థం నుండి జీవాన్ని సైతం సృష్టించాడని, అనేక జీవులను ఉనికిలోనికి తెచ్చి వాటికి కొంత సమయం జీవించే అవకాశం కల్పించి, ఆయనే వాటికి చావును కూడా ఇస్తున్నాడన్న విషయాన్ని వివరిస్తున్నాయి.
ఒకవేళ ఈ వాదన తప్పు! విశ్వాన్ని బయట నుండి ఏ శక్తీ సృష్టించలేదు నిర్జీవ పదార్థం యాదృచ్ఛికంగానే ఉనికిలోకి వచ్చింది దానికదే జీవకణాన్ని రూపొందించుకుంది, యాక్సిడెంటల్ గానే విశ్వం దానిపై జీవులు ఉద్భవించాయి అని వాదించేవారు “విశ్వానికి తనకు తానుగా సృష్టించుకునేంత తెలివితేటలు ఉన్నాయన్న” విషయాన్ని నిరూపించాలి. అది నిరూపించలేకపోతే బయట నుండి ఏదో శక్తి ఈ విశ్వాన్ని సృష్టించి దానిని నిర్వహిస్తుంది అన్న విషయాన్ని ఒప్పుకోవాలి.
నిర్జీవ పదార్థం నుండి జీవం ఎలా పుట్టింది?
