భూమి బల్లపరుపుగా ఉందని ఖురాన్ చెబుతుందా?

కొన్నిసార్లు పదే పదే ప్రచారం కాబడే అబద్ధం కూడా ప్రజలు వినగా వినగా కొన్నాళ్లకు అది నిజమేనేమో అని వారు భావించే స్థాయికి వెళిపోతుంది.

ఏదైనా ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లే గొప్ప టెక్నిక్ ఓ నలుగురు కలిసి నాలుగువైపుల నుండి దాన్ని విపరీతంగా ప్రచారంలోకి తేవటమే. ఆ విధంగా చాలా మంది నిజమేనేమో అని భావించేలా విపరీతంగా ప్రచారంలోకి తేబడిన హాస్యాస్పదమైన అబద్ధం- “ఖురాన్ భూమిని బల్లపరుపుగా ఉంది” అని చెబుతుందన్నది.

నిజానికి ఖురాన్ లో ఎక్కడా భూమి “బల్లపరుపుగా ఉంది” అని గానీ, లేదా “చతురస్రాకారం” ఉందని గానీ ఒక్కటంటే ఒక్క వాక్యం లేదు.
………

మరి ఈ అపార్థం ఎలా పుట్టుకొచ్చింది?

అక్కడక్కడి ఖురాన్ వాక్యాలను పట్టుకుని ఏదో ఊహించుకుని వాటికి స్వంత అర్థాలు తొడిగటం వల్లే ఖురాన్ భూమిని బల్లపరుపుగా ఉందని చెబుతుందన్న అపార్థం సర్వసామాన్యం అవ్వటానికి కారణమయ్యింది. ఆ వాక్యాలు ఏమిటో చూద్దాం.

“అల్లాహ్ మీ కొరకు భూమిని పాన్పు మాదిరిగా పరిచాడు; మీరు దానిపై ఉన్న విశాల మార్గాలలో నడవటానికి” – ఖురాన్ 71: 19, 20

“భూమిని చూడరా అది ఎలా పరచబడి ఉందో?” – ఖురాన్ 88:20

పై వాక్యాలను బట్టి “భూమి పాన్పు మాదిరిగా పరచబడి ఉందంటే అది బల్లపరుపు (Flat) గా ఉందనే కదా అర్థం! అని ఊహించుకోవటమే కాక, దానికి కొందరు ఎంత వరకూ ప్రచారం కల్పించారంటే “ఖురాన్ భూమి బల్లపరుపుగా ఉందని చెబుతుంది” అని చెప్పటమే కాక దానికి ఆధారంగా పై రెండు వాక్యాలు చూపించే వరకు వెళ్లిపోయారు.

“పాన్పు మాదిరిగా” అంటే బల్లపరుపని అర్థమా?

ఖురాన్- భూమిని పాన్పు “ఆకారం”లో చేశామని చెబుతుందా? పాన్పు “మాదిరి”గా చేశామని చెబుతుందా? పాన్పు అన్నది దేనికి సంకేతం? కూర్చోటానికి, పడుకోటానికి, విశ్రాంతి తీసుకోటానికి అనువుగా పాన్పు ఏ విధంగా ఉపయోగపడుతుందో అలాగే మనుషులకు నివాసయోగ్యంగా ఉంటూ వారు హాయిగా బ్రతకటానికి భూమిని పాన్పు మాదిరిగా పరచటం జరిగిందని చెప్పటం ఖురాన్ ఉద్దేశం.
భూమిని పాన్పుగా దేనికి పరిచాడు? అంటే.. “ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా పరిచాడు దానిపై మీరు నడిచేందుకు మార్గాలను నిర్మించాడు (20:)”. ఈ విధంగా చెప్పటంలో ఉద్దేశం భూగోళంపై మనుషులకు నివాసయోగ్యంగా ఉండే విధంగా దానిపై భూమిని పాన్పు మాదిరిగా పరచటం జరిగిందన్నది. తప్పితే భూమి బల్లపరుపుగా చెయ్యబడిందని కాదు.

ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఖురాన్ లో మరోకచోట “మీ కొరకు భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ సృష్టించినవాడు ఆయనే (2:22)” అన్న వాక్యాన్ని గమనించాలి.

దీని అర్థం- భూమిని మనుషులు నివసించటానికి నివాసయోగ్యంగా చెయ్యటమే కాక, వారి కోసం ఆకాశం కప్పుగా చెయ్యబడింది అంటే- వారిని సంరక్షించటానికి వారి అనేక ప్రయోజనాల కోసం భూమి చుట్టూ ఓజోన్ పొరతో సహా నక్షత్రాలు, సూర్యచంద్రాదులు, మేఘాలు వగైరా అనేక వాటితో కూడిన ఆకాశాన్ని కప్పుగా పెట్టటం జరిగింది అని అర్థం.

తప్పితే “కప్పు” అర్థ గోళాకారంలో ఉంటుంది కాబట్టి ఖురాన్ ఆకాశాన్ని గోళాకారంగా ఉందని చెబుతుందని, “పాన్పు” బల్లపరుపుగా ఉంటుంది కాబట్టి ఖురాన్ భూమిని బల్లపరుపుగా ఉందని చెబుతుందని ఊహించుకోవటం మరీ ఆటవిక జ్ఞానం అయిపోతుందన్నమాట.

పరచటం అంటే?

భూగోళం (Glob) గమనిస్తే అది చుట్టూ నీళ్లతో నిండి ఉండి, దాని ఉపరితలం పై చూడటానికి మనుషులు నివసించే భూభాగం ఏదో కార్పెట్ పరచినట్టుగా ఉంటుంది. మొత్తం భూగోళం (Glob) లో మూడొంతులు నీళ్లు ఉంటే దాని ఉపరితలం పై మనుషులు నివసించే భూమి ఒకవంతు మాత్రమే నీళ్లపై తేలియాడుతున్నట్టు ఉంటుంది. అందుకే ఒకప్పటి ఖండాలు విడిపోతూ ప్రస్తుతం ఉన్న స్థితిలోకి ప్రపంచ భూభాగం వచ్చింది. అదే విషయాన్ని ఖురాన్ “భూమిని చూడరా అది ఎలా పరచబడి ఉందో” అని ప్రశ్నిస్తుంది.
………

భూమి గోళాకారంలో ఉందనే ఖురాన్ చెబుతుంది!

ఈ విషయాన్ని ఖురాన్ అత్యంత శాస్త్రీయమైన పద్ధతిలో పైగా సమాచారాత్మకంగా వివరిస్తుంది.

“ఆయనే రెండు తూర్పు దిక్కులకు, రెండు పడమర దిక్కులకు ప్రభువు” – ఖురాన్ 55:17

“రెండు తూర్పులు – రెండు పడమరలు”

భూమి యొక్క రెండు అర్థగోళాల్లో.. ఒక భాగం వైపు సూర్యోదయం అవుతుంటే సరిగ్గా భూమధ్య రేఖకు రెండవ భాగం వైపు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. అలాగే భూమికి రెండవ భాగంలో సూర్యోదయం అవుతూ ఉంటే భూమధ్య రేఖకు మొదటి భాగంలో సూర్యాస్తమయం అవుతూ ఉంటుందన్నది సైన్స్ చెబుతున్న విషయమే! ఈ ప్రక్రియ భూమి గోళాకారంలో ఉన్నప్పుడే సాధ్యపడుతుందన్నది నిర్వివాదం.

ఈ విధంగా ఒక రోజులో భూమి యొక్క రెండు అర్థ గోళాలపై ఏర్పడే రెండు సూర్యోదయ స్థానాలు, రెండు సూర్యాస్తమయ స్థానాలను సూచిస్తూనే.. “ఆయనే రెండు తూర్పు దిక్కులకు, రెండు పడమర దిక్కులకు ప్రభువు” అని ప్రస్తావించటం జరిగింది.

భూగోళం చుట్టూ ఏర్పడే రాత్రింబవళ్లను సూచిస్తూ ఇదే విషయాన్ని మరొక చోట ఈ క్రింది విధంగా చెప్పటం జరిగింది.

“ఆయనే పగటిని రేయితోనూ, రేయిని పగటితోనూ చుట్టి వేస్తాడు. ఆయనే సూర్యుణ్ణి, చంద్రుణ్ణీ నియమబద్ధులుగా చేసి ఉంచాడు” – ఖురాన్ 39:5

నిత్యం పగలూ, రేయి దేనికి చుట్టబడుతున్నాయి? సూర్యచంద్రాదుల వల్ల ఏర్పడే పగలూ రాత్రుళ్లూ భూగోళానికి నిత్యం చుట్టబడుతున్న విషయాన్ని మనం చూడటం లేదా? ఖురాన్ దృష్టిలో భూమి బల్లపరుపుగా ఉంటే ఇలాంటి శాస్త్రీయ విషయాలు చెప్పటం సాధ్యమేనా? ఆ మాత్రం ఆలోచన ఖురాన్ విమర్శకులకు ఉండదా?

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *