మనిషి నుదురు వద్ద ఉండే మెదడు ముందటి భాగాన్నే మెడికల్ సైన్స్ పరిభాషలో ‘ఫ్రంటల్ కార్టెక్స్’ లేదా ‘ఫ్రంటల్లోబ్’ అంటారు.
మనిషి తీసుకునే నిర్ణయాలు, అతను చేసే తీర్పులు, సత్యం- అబద్ధం, మంచీ-చెడులు, పాపం-ధర్మం వగైరా సకల చర్యలన్నీ నియంత్రించబడే మెదడులోని అతి కీలక భాగం ఇది.
అంతేకాదు మనిషి వ్యక్తిత్వంతో ముడిపడి ఉండే “అనుకూల మరియు ప్రతికూల ఆలోచనలు” అతని ప్రణాళికలు, తర్కం, హేతుబద్ధమైన ఆలోచనలు, జ్ఞాపకశక్తి వగైరా ఎన్నో చర్యలన్నీ నియంత్రించబడే అతి కీలక భాగం మనిషి నుదురు వద్ద ఉండే మెదడు ముందటి భాగమైన “ఫ్రంటల్లోబ్” అనే విషయాన్ని నేటి ఆధునిక శారీర నిర్మాణ శాస్త్రం (Human Anatomy) ఎంతో వివరంగా చెబుతుంది.
మెదడు తాలూకు ఈ పనితీరు గురించిన ఇంత కీలకమైన సమాచారాన్ని ఖురాన్ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎలా ప్రస్తావించగలిగింది? అన్నదే ఆలోచించాల్సిన ప్రశ్న. ఖురాన్ మనిషి నుదురు భాగం (ఫ్రంటల్ లోబ్) గురించి ఈ క్రింది విధంగా ప్రస్తావిస్తుందన్న విషయం ఎంత మందికి తెలుసు?
نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ
“అబద్ధానికి, ఘోర పాపానికి పాల్పడిన నుదురు అది” – 96: 16
పై ఖురాన్ వాక్యం అరబ్బీ మూలంలో ناصِيَة (నాసియత్) అనే పదాన్ని చూడగలం. దీనికి నుదురు, తల ముందు భాగం అనే అర్థాలున్నాయి. అయితే ఖురాన్ సింపుల్ గా మనిషి అబద్ధానికి, ఘోరపాపానికి పాల్పడ్డవాడని చెప్పి వదిలేయకుండా అతని నుదురు (ఫ్రంటల్ లోబ్) భాగాన్ని ఉద్దేశిస్తూ “అబద్ధం, పాపానికి పాల్పడిన నుదురు అది” ఎందుకు చెబుతుంది? మనిషి చెప్పే అబద్ధాలకూ అతని ప్రతికూల ఆలోచనలకూ తల ముందు భాగంతో సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు ఏ కాస్త హ్యూమన్ అనాటమీ గురించి పరిజ్ఞానం ఉన్నోల్లైనా పైన ఇచ్చిన సమాచారాన్నే ఠక్కున చెబుతారు.
ప్రొఫెసర్. కేత్. ఎల్. మ్యూర్ ఖురాన్ చెబుతున్న ఈ సమాచారాన్ని ఉద్దేశిస్తూ ఖురాన్ అవతరించిన కాలం నాటికి మనిషి మెదడు తాలూకు చర్యలకు సంబంధించిన ఇంత కీలకమైన సమాచారాన్ని చరిత్రలో ఎవ్వరూ కనుగొనలేదు అనే విషయాన్ని చెబుతున్నారు.
మనిషి తీసుకునే మంచి చెడు నిర్ణయాలు, అతని అనుకూల ప్రతికూల ఆలోచనలన్నీ నియంత్రించబడే ప్రదేశం అతని మెదడులోని నుదురు భాగం (ఫ్రాంటల్లోబ్) అనే విషయం నేటి ఆధునిక మెడికల్ సైన్స్ కనుగొనక ముందు ఓ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అరేబియా ఎడారిలో మారుమూల గ్రామంలో నివసించిన నిరక్షరాసి అయిన ముహమ్మద్ అనే వ్యక్తిపై అవతరించిన ఖురాన్ గ్రంథంలో ఎలా ప్రస్తావించబడి ఉంది? అనేదే ఆలోచించాల్సిన అంశం.
అది మహా వివేకి, గొప్ప జ్ఞాని తరఫు నుండి అవతరించిన గ్రంథం అయి ఉంటేనే తప్ప ఇంతటి కీలక సమాచారం అందులో ఉండటం సాధ్యం కాదనే విషయం కేవలం ఆలోచనా పరులకు మాత్రమే అర్థమయ్యే విషయం.
“ఫ్రంటల్లోబ్” గురించి ఖురాన్ ఎలా ప్రస్తావించగలిగింది?
