‘జంటల సిద్ధాంతం (Theory of Pairs)’ & ఖురాన్

విశ్వంలో అణువు నుండి బ్రహ్మాండం వరకూ ప్రతీ వస్తువూ “జంటలు (Pairs)” గా సృష్టించబడి ఉన్నాయన్నదే సైన్స్ పరిభాషలో ‘Pairs theory (జంటల సిద్ధాంతం). బహుశా చాలా మందికి ఈ విషయం గురించి అవగాహన ఉండి ఉండకపోవచ్చు.

కేంబ్రిడ్జ్‌ లోని ‘లూకాసియన్ చైర్ ఆఫ్ మ్యాథమెటిక్స్’ ప్రొఫెసర్ మరియు న్యూటన్ వారసులలో ఒకరైన “పాల్ డిరాక్” (1902-1984) 20 వ శతాబ్దపు గొప్ప భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరు. ఎన్నో ఆధునిక భౌతిక శాస్త్ర (Physical science) సిద్ధాంతాలను ప్రతిపాదించి 1933 లో నోబుల్ ప్రైజ్ తో సత్కరించబడ్డ ఈ భౌతిక శాస్త్రవేత్త మొట్టమొదటసారి ఆవిష్కరించిన గొప్ప సిద్ధాంతం- సృష్టిలో ప్రతీ వస్తువు తాలూకు పదార్థం (Matter) జంటల సముదాయం అన్నది. దానినే “Theory of Pairs” అనగా “జంటల సిద్ధాంతం” అని పేర్కొనటం జరిగింది.

కాస్త వివరంగా చెప్పాలంటే…

విశ్వంలో ప్రతీ ప్రాణీ, ప్రతీ వస్తువూ “అణువుల (Atoms)” సముదాయంతో సృష్టించబడి ఉన్నది! కొన్ని వస్తువులు మరికొన్ని వస్తువులతో జతపడి ఉన్నాయి. ఈ లోకంలో మరొక వస్తువు జతగా లేనటువంటి వస్తువు ఏదీ లేదు. ఉదాహరణకు: అణువు నిరాణాన్నే తీసుకుంటే.. అణువులో న్యూక్లియస్ అనే కేంద్రకంతో పాటు ‘ఎలక్ట్రాన్’ ‘ప్రొటాన్స్’ ‘న్యూట్రాన్స్’ అనే కణాలు (Particles) తో కూడిన వ్యవస్థ ఉంటుంది. వీటిలో ఎలెక్ట్రాన్స్ అనబడేవి “ప్రతికూల విధ్యుత్ శక్తి (Negatively-charged) కణాలైతే… వాటికి జంటగా ‘అనుకూల విధ్యుత్ శక్తి (Positively-charged) కణాలు ప్రొటాన్స్ ఉంటాయన్న మాట. ఈ జంట కణాల వ్యవస్థనే సైన్స్ పరిభాషలో ‘Matter – Anti matter’ అనటం జరుగుతుంది.

చివరకు ఆదిలో విశ్వం సైతం ‘Particles’ మరియు ‘Anti particle’ అనబడే “అనుకూల-ప్రతికూల” జంట కణాల సముదాయంతోనే ప్రారంభమైందని సైంటిస్టులు తేల్చటమైంది. ఒక్క మాటలో సింపుల్ గా చెప్పాలంటే.. ఈ సృష్టిలో ప్రతీ వస్తువూ కూడా ‘పదార్థం (Matter)’, ‘ప్రతిపదార్థం (Antimatter)’ అనే “జంట కణాల (Pair particles)” తో కూడిన “అణువుల (Atoms)” సముదాయంతో సృష్టించబడి ఉందన్న మాట.
…………..

కంటికి కానరాని అణువు వ్యవస్థలో “అనుకూల-ప్రతికూల” జంట కణాల నుండి మొదలుకుని.. వీర్యకణం, అండం జంటల ఫలదీకరణం ద్వారా పిండం.. ఇంకా X-X లేదా X-Y అనే రెండు ‘జంట’ క్రోమోజోముల ద్వారా స్త్రీ, పురుషుల లింగబేధం.. అలాగే ధనావేశం (Positive) – రుణావేశము (Negative) ‘జంటల’ ద్వారా విధ్యుత్తు (electricity).. హైడ్రోజన్-ఆక్సిజన్ జంట ‘అణువుల’ (H2O) ద్వారా నీరు.. సూర్యునిపై హీలియం-హైడ్రోజన్ ‘జంట’ వాయువుల ద్వారా వెలుతురు.. ఆక్సిజన్-నైట్రోజన్ జంటల వాయువుల ద్వారా గాలి వరకు.. ఇలా ప్రతీదీ జంటలుజంటలుగా సృష్టించబడి ఉన్నాయి.

అలాగే మానవ దేహ’ నిర్మాణంలోనూ జంటలను చూడగలం. ఉదాహరణకు స్త్రీ-పురుషుడు, వారి వ్యతిరేక కామోద్రేకాలు, ఎగువ శ్వాసకోశాలు-దిగువ శ్వాసకోశాలు, కుడి మెదడు-ఎడమ మెదడు, చిన్న ప్రేగు-పెద్ద ప్రేగు, తెల్ల రక్త కణాలు-ఎర్ర రక్త కణాలు, మంచి కొవ్వు (HDL)-చెడు కొవ్వు (LDL), మంచి-చెడు బాక్టీరియా, సిరలు-ధమనులు, కుడి-ఎడమ కనులు, చేతులు, కాళ్లు వగైరా…

అలాగే మంచి-చెడు ఆలోచనలు, మంచి-చెడు క్రియలు, శ్రమ-విశ్రాంతి, వేడి-చలి, ఆరోగ్యం-అనారోగ్యం, సంతోషం-దుఃఖం, బాధ-ఆనందం, క్రోధం-శాంతం, స్వార్థం-నిస్వార్థం, మానవత్వం-అమానవత్వం, యవ్వనం-వృధ్యాప్యం ఇలా మనిషి దేహా నిర్మాణంలో.. అతని ఆలోచనల్లో సైతం జంటలు (Pairs) ను చూడగలం

అలాగే విశ్వ ఆరంభం ‘పదార్థం-శక్తి (Matter and Energy) ల సమ్మేళనంతో.. విశ్వంలో గ్రహాలు, నక్షత్రాలు వగైరా వస్తువులన్నీ “అనుకూల-ప్రతికూల” జంట కణాల సముదాయంతో నిర్మించబడ్డావే! ఆకర్షణ-వికర్షణ అయస్కాంత శక్తులు, రాత్రి-పగలు ఇలా విశ్వంలో అతి సూక్ష అణు వ్యవస్థ నుండి బ్రహ్మాండం వరకు ప్రతీ గోచర-అగోచర వస్తువులన్నిటిని జంటలు (Pairs) గా సృష్టించబడి ఉండటాన్ని చూడగలం.

ఉదాహరణకు వైరస్, బాక్టీరియా, ఫంగస్ లాంటి కంటికి కనపడని జీవులనే తీసుకుంటే.. వైరన్ సైతం “న్యూక్లియిక్ యాసిడ్ మరియు ప్రోటీన్” కణాల జంటలు కలిగి ఉండటం ద్వారానే తన మనుగడ సాగిస్తుంది.. అలాగే బాక్టీరియా లో సైతం న్యూక్లియడ్, రైబోజోమ్స్, సైటోప్లాజమ్, పెప్టిడోగ్లైకాన్ ల కలయిక.. ఫంగస్ సైతం గ్లూకాన్స్, చిటిన్ అనే జంటకణాలతో జీవిస్తుంది. ఇవి మానవుల, జంతువుల కణాలతో జంట కట్టినప్పుడు తమ సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి.
ఈ విషయం ఖురాన్ ముందే ప్రకటించింది:

ఈ 20 వ శతాబ్దంలో ఏ ఆధునిక భౌతిక శాస్త్రం (physical science) అయితే “విశ్వంలో ప్రతీదీ జంటలుగా సృష్టించబడి ఉన్నాయన్న “జంటల సిద్ధాంతం Theory of Pairs” ప్రతిపాదిస్తుందో ఆ సిద్ధాంతాన్ని ఖురాన్ 1400 సం.ల క్రితమే ఆవిష్కరించిందన్నది

“ప్రతీ వస్తువును మేము జంటలుగా సృష్టించాము” – 51:49

“And of everything We have created pairs” -Al-Qur’aan 51:49
వృక్షాల్లోనూ జంటలు ఉన్నాయి – ఖురాన్ ప్రకటన

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1790 వరకూ ‘క్రిస్టియన్ కొన్రాడ్ స్ప్రెంజెల్’ అనే జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త (naturalist) ఆడ-మగ అన్న జంటలు (Pairs) మొక్కల్లో కూడా ఉన్నాయని చెప్పేవరకూ మనుషులు, జంతువుల్లో మాత్రమే ఆడ-మగ జంటలు (Pairs) ఉంటాయని అనుకునేవారు. కానీ మొక్కల్లో కూడా ఆడ-మగ అన్న జంటలు ఉంటాయని వాటి మధ్య పరాపరాగ సంపర్కం జరుగుతుందన్న విషయం ఆధునిక వృక్షశాస్త్రం (botanical science) అభివృద్ధి చెందే వరకూ ఎవరికీ అవగాహన లేదు.

ఈ ఆధునిక వృక్షశాస్త్రం (botanical science) చెబుతున్న విషయాన్నే ఖురాన్ 1400 సం.ల క్రితమే ఎంతో స్పష్టంగా ఈ క్రింది వాక్యాలలో తెలియజేయటం జరిగింది.

“ఆయనే అన్ని రకాల ఫలాలను రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు” – 13:3

“అన్ని రకాలా జంటలను సృష్టించిన ఆయన పరిశుద్ధుడు. అవి భూమిలో నుండి పుట్టే వృక్షరాసులలోని వైనా సరే లేదా స్వయంగా వారి జాతి (మానవులు)లో నుండి అయినా సరే లేదా వారు అసలే ఎరుగని వస్తువులలో నుండి అయినా సరే” – 36:36

ఈ విధంగా ఖురాన్ – భూమిలో పుట్టే వృక్షరాసులు, మానవులు, ఇతర జీవులే కాక, విశ్వంలో ప్రతిదీ జంటలుగా సృష్టించబడి ఉన్నాయని ప్రకటించటమే కాక, మానవుని గ్రహణ పరిధిలోనికి ఇంకా రానివి సైతం జంటలుగా సృష్టించబడి ఉన్నాయని ప్రకటించటం అత్యంత గమనార్హం

ఈ విషయాలు ఖురాన్ ప్రస్తావించటం వెనుక ఉద్దేశం..?

అధ్యాత్మికత పేరుతో కొందరు స్వార్థపరులు మత వ్యవస్థను తయారు చేసి కొన్ని గుడ్డి నమ్మకాలు, మూఢ విశ్వాసాల వైపునకు ప్రజలను ఆహ్వానిస్తుంటే… ధార్మిక గ్రంథాలు మనిషిని శాస్త్రీయ పరిశీలవైపునకు ఆహ్వానిస్తున్నాయి. ఖురాన్ లో జంటల సిద్ధాంత ప్రస్తావనే కాక, బిగ్ బ్యాంగ్ గురించి, పిండ నిర్మాణం గురించి, సౌర వ్యవస్థ గురించి వగైరా ఎన్నో విషయాల ప్రస్తావనను చూడగలం. ఎందుకంటే.. మనిషి గుడ్డి విశ్వాసాల ఆధారంగా కాక, సమస్త సృష్టిని శాస్త్రీయ పరిశీలన చేసి హేతుబద్ధమైన ఆలోచన ఆధారంగా ఈ సృష్టిని ఉనికిలోకి తెచ్చి, క్రమబద్ధంగా నడుపుతున్న ఆ అసాధారణమైన మేధస్సు (Supernatural intelligence) కలిగిన సృష్టికర్తను గుర్తించటం కోసమే.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *