ఖురాన్ లో “రెండు తూర్పు-పడమరల” ప్రస్తావన దేనికి?

“ఆయనే రెండు తూర్పు దిక్కులకు, రెండు పడమర దిక్కులకు ప్రభువు” – ఖురాన్ 55:17

ఈ వాక్యం అర్థం కాక, “రెండు తూర్పు దిక్కులు, రెండు పడమర దిక్కులేమిటి? ఇదేదో విచిత్రంగా ఉందే అని హేళన చేసే ఖురాన్ విమర్శకులూ కొందరున్నారు. ఈ వాక్య ప్రకటన వెనుక ఉన్న అసలు శాస్త్రీయ కోణాన్ని అర్థం చేసుకునే వారూ ఉన్నారు.

ఖురాన్ అశాస్త్రీయ విషయాలను ప్రకటిస్తుందని ఏదోలా నిరూపించటానికి నానా తంటాలు పడే కొందరు “ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా పరిచాడు” – 20:53 అన్న ఈ వాక్యాన్ని పట్టుకుని భూమిని పాన్పుగా పరచటం ఏమిటి? అంటే ఖురాన్ భూమి బల్లపరుపుగా ఉందని చెబుతుందని విమర్శిస్తూ అదోరకమైన తృప్తి చెందుతుంటారు.

ఇలాంటి చవకబారు వాదనలకు సమాధానం చెబుతూనే.. “ఆయనే రెండు తూర్పు దిక్కులకు, రెండు పడమర దిక్కులకు ప్రభువు” అనే వాక్యం అవతరించింది.

ఈ వాక్యంలో “రెండు తూర్పు దిక్కులు, రెండు పడమరలు” అంటే.. భూగోళంపై ఏర్పడే రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాల గురించి అన్నమాట!

వివరంగా చెప్పాలంటే.. భూమి యొక్క రెండు అర్థగోళాల్లో.. ఒక భాగం వైపు సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు.. సరిగ్గా భూమధ్య రేఖకు రెండవ భాగం వైపు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది.. అలాగే భూమికి రెండవ భాగంలో సూర్యోదయం అవుతూ ఉంటే.. భూమధ్య రేఖకు మొదటి భాగంలో సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ భూమి గోళాకారంలో ఉన్నప్పుడే సాధ్యపడుతుందన్నది నిర్వివాదం.

ఈ విధంగా ఇరవై నాలుగు గంటల్లో నిత్యం భూమి యొక్క రెండు అర్థ గోళాలపై ఏర్పడే రెండు సూర్యోదయ స్థానాలు, రెండు సూర్యాస్తమయ స్థానాలను సూచిస్తూనే.. “ఆయనే రెండు తూర్పు దిక్కులకు, రెండు పడమర దిక్కులకు ప్రభువు” అని ప్రస్తావించటం జరిగింది.

ఈ విధంగా ఈ వాక్యం భూమి గోళాకారంలో ఉందనే విషయాన్ని శాస్త్రీయంగా నిరూపిస్తూనే.. కొందరు విమర్శకుల నోళ్లు మూయించటానికే భూమి రెండు అర్థగోళాల్లో ఏర్పడే రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయ స్థానాలను సూచిస్తూ రెండు తూర్పు దిక్కులకు, రెండు పడమర దిక్కులకు సృష్టికర్త యజమాని, ప్రభువు అని చెప్పటం జరిగింది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *