ఖురాన్- “వెన్నెముక’ మరియు ప్రక్కటెముకల మధ్య నుండి వెలువడే వీర్యం నుండి మానవుడు పుట్టించబడ్డాడ”ని చెబుతుందా?

ఇస్లాం విమర్శకులు లేవనెత్తే చిత్రవిచిత్రమైన విమర్శల్లో ఒకటేమిమిటంటే- “మానవుని వెన్నెముకకు మరియు ప్రక్కటెముకల మధ్య నుండి వెలువడే వీర్యం నుండి మానవుడు పుట్టించబడ్డాడని ఖురాన్ 86:6-8 వాక్యాలలో చెబుతుంది. అసలు మానవుని వెన్నెముకకు మరియు ప్రక్కటెముకల మధ్య వీర్యం తయారవుతుందని చెప్పటం శాస్త్ర విరుద్ధ ప్రకటన కదా? ఇది పూర్తిగా వైధ్యశాస్త్రానికి విరుద్ధమైన ప్రకటన! అటువంటి శాస్త్రవిరుద్ధ ప్రకటన చేసేదేదైనా దైవ గ్రంథంగా ఎలా పరిగణించబడుతుంది? అన్నది.

మొదట్లో ఈ విమర్శ చాలాసార్లు విన్నప్పుడల్లా నాకు కూడా అవును నిజమే కదా వీర్యం అన్నది సాధారణంగా పురుషునికి ‘వృషణాల (Testis)లో’నే కదా తయారయ్యేది! మరి ఖురాన్లో వెన్నెముకకు మరియు ప్రక్కటెముకల మధ్య నుండి వెలువడుతుందని ఉండటం ఏంటి? అనే సందేహం కలిగేది! చాలా మందికి అదే సందేహం కలగవచ్చు కూడా! అయితే… నేను కేవలం ధార్మిక గ్రంథాల పరిశోధన చెయ్యటమే కాక, ఉద్యోగరీత్యా మెడికల్ ప్రొఫెషన్ లో ఉండటం కారణంగా చాలా అనాటమీ (Anatomy) క్లాసెస్ లో ట్రైనింగ్ అవ్వటం మూలనా “మానవ దేహ నిర్మాణానికి సంబంధించి కాస్తోకూస్తూ జ్ఞానం ఉండటం వలన ఖురాన్ వైధ్యశాస్త్రానికి వ్యతిరేకమైన సిద్ధాంతం చెబుతుందనే విమర్శ నేను విన్నప్పుడు ఖురాన్ 86:6-8 వాక్యాలను నాకున్న ‘మానవ శరీర నిర్మాణ శాస్త్ర (Human Anatomy)’ జ్ఞాన పరిధిలోనే నిస్పక్షపాతంగా పరిశోధించాను.
ఖురాన్ చెబుతున్న అసలు విషయం ఏమిటో గ్రహించిన తరువాత ఖురాన్ 86:6-8 వాక్యాల విషయంలో నేడు కొందరు చేస్తున్న విమర్శ ఎంత గ్రుడ్డిదో నాకర్థమైయ్యింది. అంతే కాదు మానవ శరీర నిర్మాణ శాస్త్రం (Human Anatomy) ఏదైతే చెబుతుందో.. దానిని పద్నాలుగు వందల సంవత్సరాలకు ముందే ఖురాన్ యదాతథంగా ఎలా చెప్పగలిగిందని ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను.

అయితే మానవ శరీర నిర్మాణ శాస్త్రం గురించి అయితే లోతైన వివరణ కాక, కాస్త అందరికీ అర్థమయ్యే విధంగానే సంక్షిప్తంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు ఖురాన్ లోని ఈ క్రింది రెండు వాక్యాలను జాగ్రత్తగా గమనించగలరు.

“మేము మానవుణ్ణి పరీక్షించటానికి అతనిని ‘ఒక మిశ్రమ వీర్య బిందువు’ (mingled sperm) తో సృష్టించాము” – ఖురాన్ 76:3

“మానవుడు తాను ఎలాంటి వస్తువుతో పుట్టించబడ్డాడో కొంచెం ఆలోచించాలి. వెన్నెముకకు, ప్రక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ‘ఒక ద్రవపదార్ధం’ (a gushing fluid) తో అతడు పుట్టించబడ్డాడు” – ఖురాన్ 86:6-8

మొదటి వాక్యం మరియు రెండవవాక్యం కలిపి చదివితే ఆ రెండు వాక్యాలలో దేవుడు మనిషిని వీర్యం నుండి సృష్టించాడన్న భావనే కలుగుతుంది. వాస్తవానికి పై ఖురాన్ 86:6-8 వాక్యాలలో వెన్నెముకకు, ప్రక్కటెముకలకు మధ్య నుండి వచ్చే వీర్యం నుండి మానవుడు పుట్టించబడ్డాడు అని చెప్పటంలేదు.
పై వాటిలో మొదటివాక్యం అరబ్బీ మూలం గమనిస్తే- అందులో “వీర్యము” అన్న దానికి “అనుత్ఫా (anutfa)” అన్న పదం ఉన్నట్టు చూడగలం. రెండవ వాక్యం గమనిస్తే “దూకుడుగా వెలువడే ఒక ద్రవపదార్ధం” అన్నదానికి “సల్బ్ (sulb)” అన్న పదం ఉన్నట్టు చూడగలం. “sulb” అంటే “వీర్యం” కాదు! “a gushing fluid” అనగా “దూకుడుగా వెలువడే ఒక ద్రవపదార్ధం!” అని అర్ధం. ఏమిటా “ద్రవ పదార్ధం”? ఇది ఎక్కడ తయారై వస్తుంది? ఇది ఏ యే పదార్ధాలు కలిగి ఉంటుంది? అన్నది తెలుసుకునే ముందు అసలు “మానవ వీర్యం” ఎలా రూపుదిద్దుకుంటుందో తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసింది- పురుషునిలో వీర్యం అన్నది ఒక్క వృషణాలలోనే తయారవ్వదు! మానవునిలోనుండి బయటకు దూకుడుగా వచ్చే వీర్యం (స్పెర్మ్ [Sperm]) అన్నది- వృషణాలలో వృద్ధి అయ్యే వీర్యకణాలు మరియు వివిధ రకాల గ్రంధులు (Glands) నుండి విడుదలయ్యే అనేక పదార్ధాలు కలగలసి వెలువడే “ద్రవము” (సెమినల్ ఫ్లూయిడ్ [Seminal fluid]) తో కలిసి ఏర్పడ్డ మిశ్రమం అన్నది!

కాస్త వివరంగా గమనిస్తే: వృషణాలలో ఉండే “SEMINIFEROUS TUBES (సెమినిఫెరస్ ట్యూబ్స్)” నుండి “వీర్యకణాలు (Sperm cells)” మాత్రమే ఉత్పత్తి అవుతాయి. వీర్యకణాలు ఉత్పత్తి అయ్యాక అవి వృషణాలలో పై భాగమైన “EPIDIDYMIS (ఎపిడిడిమిస్)” కి చేరుకుంటాయి. ఆ తరువాత “VAS DEFERENCE (వాస్ డిఫెరెన్స్)” ద్వారా “AMBULA GLAND (అంబులా గ్లాండ్)” కి చేరుకోవటం జరుగుతుంది. ఆ తరువాత వీర్యకణాలను బలోపేతం చేయటానికి అనేక గ్రంధుల నుండి ‘Seminal fluid’ అనే ద్రవం ఉత్పత్తి అవుతుంది. దానినే “SEMEN (సెమెన్)” అంటాం. ఈ ద్రవంలో 90% నుండి 98% వరకు “Prostaglandins, fructose, zinc, lipids, steroid hormones, enzymes, amino acids, minerals” వంటి అతి ముఖ్యమైన పదార్ధాలు (ingredients) ఉంటాయి. ఈ ‘SEMEN’ ఉత్పత్తి అవటానికి మూడు రకాల గ్రంధులు (Glands) ప్రధాన కారణం అవుతాయి – 1. SEMINAL VESICLES 2. PROSTATE GLAND 3. COWPERS GLANDS.

ఈ విధంగా వివిధ గ్రంధుల నుండి ఉత్పత్తి అయ్యే అనేక రకాల పదార్థాల (ingredients) కలిసిన ద్రవం “Seminal fluid (సెమినల్ ఫ్లూయిడ్)” మరియు వీర్యకణాల (Sperm cells)” మిశ్రమమే “వీర్యం” (Sperm) అన్నమాట. తప్పితే “Seminal fluid” అన్నది వృషణాలలో తయారవ్వదు. అలాగే “Seminal fluid” అన్నది వీర్యమూ కాదు.

ఇక ప్రక్కటెముకలు (Rib cage), వెన్నెపూస (spinal card) ల నిర్మాణం గురించి గమనిస్తే- వాస్తవానికి ప్రక్కటెముకలు మొత్తం 24 జతలు ఉంటాయి. పన్నెండు కుడి ప్రక్క, పన్నెండు ఎడమ ప్రక్కా వీపుకు క్రింద భాగం వరకు చుట్టు ప్రక్కలా వ్యాపించి ఉంటాయి. 12 వ ప్రక్కటెముక దాదాపుగా నడుము క్రింద భాగం వరకూ ఉంటుంది. అలాగే వెన్నపూస అన్నది 31 జతలు కలిగి ఉంటుంది. దానిలో L1, L2, L3, L4, L5 అనే విభాగాలు నడుము దగ్గర… S1, S2, S3, S4, S5 అనే విభాగాలు పిరుదులకు పైభాగం వరకు అంటే పొత్తికడుపు వెనుక భాగం వరకు ఉంటాయన్నమాట.

ఇప్పుడు “Seminal fluids” ఉత్పత్తి అయ్యే ప్రాంతం సుమారుగా మనిషి నడుము భాగపు వెన్నముక యొక్క “Lumber vertebrae (లుంబర్ వెర్టిబ్రా)” విభాగానికి, మరియు “sacral segments” విభాగానికి మరియు 12 వ ప్రక్కటెముక క్రింది భాగంలో ఉన్న ప్రాంతం అని చెప్పవచ్చు. ఆ ప్రాంతాన్నే “వెన్నెముకకు ప్రక్కటెముకల మధ్య” అని ఖురాన్లో చెప్పటం జరిగింది. ఇక్కడ సుమారుగా ఆ ప్రాంతం (Location) గురించి చెప్పటం జరుగుతుంది. వాస్తవానికి ఖురాన్ మెడికల్ సైన్సు పుస్తకమూ కాదు అనాటమీ పుస్తకమూ కాదు కదా మానవ దేహా నిర్మాణాని గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పటానికి! ఇక్కడ అసలు తీసుకోవలసిన విషయం- మనిషి వివిధ గ్రంధుల నుండి ఉత్పత్తి అయ్యే “Seminal fluid” ద్వారా పుట్టించబడతాడన్న విషయాన్ని ఖురాన్ ప్రస్తావిస్తుందన్నది. ఇది అసలు ఎంతో గొప్ప విషయం. దానిని “దూకుడుగా వెలువడే ద్రవం” అని అలంకారికంగా చెబుతుంది. అందుకే ఖురాన్ –

“వెన్నెముకకు, ప్రక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవపదార్ధం ( a gushing fluid or Seminal fluid) తో అతడు పుట్టించబడ్డాడు” – ఖురాన్ 86:6-8 అని ప్రకటించటం జరిగింది.
అంతే తప్ప “వెన్నెముకకు, ప్రక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే వీర్యం” నుండి మానవుడు పుట్టించబడ్డాడని చెప్పటం లేదు కదా కొందరు విమర్శిస్తున్నట్టు! అయినా విమర్శించటమే పనిగా పెట్టుకున్నోల్ల కళ్ళకు ఇలాంటి వాస్తవాలు కనపడనే కనపడవు అది వేరే విషయం

ఇప్పుడు పై వివరణ అంతా సులువుగా చెప్పాలంటే – ప్రక్కటెముకలు, వెన్నెపూసకు మద్యభాగం నుండి దూకుడుగా వెలువడే ద్రవం- “Seminal fluid” మరియు వృషణాల నుండి వృద్ధి చెందే “Sperm cells” ల మిశ్రమం ద్వారానే మనిషి పుట్టుక జరుగుతుంది. ఇక వీర్యకణాలు వృషణాలలో వృద్ధిచెందితే దానిని బలోపేతం చేసే ఎన్నో పదార్దాలు కలిసిన “ద్రవం (Seminal fluid)” ప్రక్కటెముకలు, వెన్నెపూసకు మధ్యభాగపు ప్రాతంలో ఉండే వివిధ గ్రంధుల నుండి నుండి వెలువడతాయి. దీనినే ఖురాన్- “వెన్నెముకకు, ప్రక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవపదార్ధం (a gushing fluid) తో అతడు పుట్టించబడ్డాడు” అని చెబుతుంది.

ఈనాడు ఆధునిక మెడికల్ సైన్స్ ఎన్నో పరిశోధనలు చేసి చెప్పిన విషయాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఖురాన్లో ఎలా స్పష్టం చయ్యబడిందన్నదే అసలు ఆలోచించాల్సిన విషయం. మనిషి కేవలం వీర్యం ద్వారా పుట్టించబడ్డాడని సింపుల్ గా ఖురాన్ చెప్పి ఉంటే అది అప్పటికే అందరికీ తెలిసిన విషయమే ప్రస్తావించినట్టు అయ్యేది. కానీ, “Seminal fluids” ఉత్పత్తి గురించి చెప్పటం, దాని స్థానం (location) కూడా ఎంతో వివరంగా చెప్పట్టాన్ని బట్టి నేటి ఆధునిక సైన్సు కు ఖురాన్ ఎంతమాత్రం వ్యతిరేకం కాదన్న విషయం తేలిపోయింది. ఈ విషయం ఇస్లాం విమర్శకులకు కాస్త బాధ పెట్టె విషయమే అయినప్పటికీ నిజం అంగీకరించక తప్పదు.

నిజానికి ఖురాన్ అవతరించి ఏ యాభై సంవత్సరాలో, వంద సంవత్సరాలో కాలేదు, పద్నాలుగు వందల సంవత్సరాలు అయింది! నేటి ఇస్లాం విమర్శకులు ఊహిస్తున్నట్టు ఖురాన్ ను ఎవరో కొందరు చదువు రానోల్లు, పొలం పనులు చేసుకునేటోల్లు, ఏమీ తెలియని అమాయకులు కాదు నమ్ముతుంది ప్రపంచవ్యాప్తంగా మూడొంతుల్లో ఒక వంతు జనాభా నమ్మటమే కాదు అందులో ఎందరో ఆధునిక విధ్యావేత్తలు, అనేకరంగాల్లో ప్రగతి సాధించిన సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఇంకా అనేక శాస్త్రాల్లో పేరొందిన నిపుణులు వగైరా ఇలా ఎందరో ఖురాన్ ను శాస్త్రీయంగా చదివి, పరిశోధించి ఇస్లాం ను స్వీకరించినవారు ఉన్నారు. నిజంగా నేటి కొందరు ఇస్లాం విమర్శకులు లేవనెత్తే విమర్శలే నిజమే అయి ఉంటే… నేడు 1.8 బిలియన్ల ప్రజల ద్వారా ఖురాన్ అనుసరించబడటం అసలు సాధ్యమేనా? కాస్త ఆలోచించండి

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *