“మతాలు, ముల్లాలు, పీఠాలూ, సన్యాసులూ, సాధువులు, బిషప్పులు, బాబాల దగ్గర ప్రాణాంతక కరోనా వ్యాధికి ఏ మందూ లేదు అలాగే గుళ్లూ, గోపురాలూ, చర్చీలు అన్నీ మూతబడ్డాయి. నమ్ముకోవలసింది దేవుణ్ణి కాదు సైన్సును, డాక్టర్లనే. మనల్ని కాపాడేది సైన్సే తప్ప దేవుళ్లు కారు”
ప్రస్తుత నేపథ్యంలో కొందరు నాస్తికులు, హేతువాదులు పై విధంగా మాట్లాడటం కొంతవరకు కరెక్టే అయినప్పటికీ వారు అలా మాట్లాడటం వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి:
1. ప్రస్తుత సమాజంలో హేతువిరుద్ధమైన మూఢాచారాలతో కూడిన మత వ్యవస్థ ఏదైతే నడుపబడుతుందో అదే ధార్మిక గ్రంథాలు పరిచయం చేస్తున్న అసలు ‘శాస్త్రీయ ధర్మం’ అన్న అపోహకు గురై ఉండటం.
2. పీఠాలూ, సన్యాసులూ, సాధువులు, బిషప్పులు, బాబాల ద్వారా అనేక పేర్లతో ప్రార్థించబడుతున్న బహుదైవాలకూ అసలు సృష్టికర్త అయిన దేవునికి మధ్య బేధం గుర్తించకపోవటం.
***
సౌకర్యవంతమైన మానవ ప్రశాంత మనుగడకు సైన్స్ తప్పనిసరన్నది కాదనలేని వాస్తవం. కానీ, సమస్తాన్నీ సైన్సే కాపాడుతుంది అన్నప్పుడు… భూకంపాలు, సునామీలు, తుఫానులు, హరికేన్లకు లక్షలాది మంది చనిపోతున్నప్పుడు సైంటిస్టులు ప్రకృతిని తమ కంట్రోల్లో తీసుకుని ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఈనాడు కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతున్న దేశాలు సైన్స్ లో వెనుకబడిన దేశాలా? సైన్స్ లో ఎంతో అభివృద్ది చెందిన దేశాలా? అటువంటపుడు ఆగ్రరాజ్యాలను సైతం ఆధునిక సైన్స్ ఎందుకు కాపాడలేకపోతుంది? అన్న ప్రశ్నలు ముందుకు వస్తాయి
ఈ నేపథ్యంలో కాస్త ఆలోచనా పరులు జాగ్రత్తగా ఆలోచనా చెయ్యాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే… ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారిలో మరణాల రేటు 2 నుండి 4% మాత్రమే ఉంటే, మిగతా వారంతా సహజంగా ఉండే “రోగనిరోధక వ్యవస్థ” (Immunity power) వల్ల కోలుకుంటున్నారు అని WHO ప్రకటించింది. మరి ఇప్పుడు వచ్చిన ‘నోవల్ కరోనా వైరస్’ కు వ్యాక్సిన్ రానప్పటికీ ఆ వైరస్ తో పోరాడే రోగనిరోధక శక్తి (Immunity power) ని ఏర్పాటు చేసింది ఏ దేశపు సైన్స్? దాని వెనుక పనిచేస్తున్న మేధస్సు (Intelligence) ఎవరిది?
ప్లాస్మా థెరపీ ద్వారా కోలుకున్న రోగి తాలూకు ‘యాంటీ-బాడీస్’ ప్రవేశపెట్టి ఎందరినో బ్రతికిస్తున్నారు. మానవ శరీరంలో ఎన్నో రోగాలతో పోరాడుతూ సమర్థవంతంగా పనిచేస్తున్న ‘యాంటీబాడీస్ (antibodies)’ అనే రక్షణ వ్యవస్థ వెనుక ఏ మేధస్సూ లేకుండానే పని చేస్తుందా?
కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ను ఎవరో ఒకరు కనిపెట్టినప్పటికీ… ఆ వ్యాక్సిన్ పని చెయ్యటం కూడా మనిషి రోగనిరోధక వ్యవస్థపై ఆధారపడి మాత్రమే అన్నది కాస్త మెడికల్ సైన్స్ పరిచయం ఉన్నోల్లకు తెలిసిన విషయమే. మానవ శరీరంలో సహజంగానే ఏర్పాటు చేయబడ్డ ఆ రోగనిరోధక వ్యవస్థ వెనుక పనిచేస్తున్న మేధస్సు ఎవరిది? అన్నవి.
దీనిని బట్టి ఇక్కడ రెండు రకాల మేధస్సులు పని చేస్తున్నట్టు తెలుస్తుంది:
1. కృత్రిమ వ్యాక్సిన్లు తయారు చేసే శాస్త్రవేత్తల తాలూకు “మానవ మేధస్సు” (Human Intelligence) ఒకటైతే…
2. ఆ వ్యాక్సిన్ పని చెయ్యటానికి కావలసిన రోగనిరోధక వ్యవస్థను సహజంగానే అందరిలో ఏర్పాటు చేసిన “మానవ మేధస్సుకు అతీతమైన అసాధారణ మేధస్సు (Supernatural intelligence beyond human intelligence)” రెండవది.
ఈ “మానవ మేధస్సుకు అతీతంగా పనిచేస్తున్న అసాధారణ మేధస్సు’ను సృష్టికర్త అని పేరు పెట్టాలా? దేవుడని పేరు పెట్టాలా లేక ఒక “పవర్” అని పేరు పెట్టాలా? అన్నది సమస్య కాదు.
ఏ పేరుతో పిలిచినా మొత్తానికి ఈ సృష్టి అనే ‘వ్యవస్థ (System)’ ను “మానవ మేధస్సుకు అతీతమైన అసాధారణ మేధస్సు ఎంతో క్రమబద్ధంగా సమర్థవంతంగా నడుపుతున్న మరియు నియంత్రిస్తున్న వైనాన్ని అయితే గ్రహించగలం
దానిని బట్టే సైంటిస్టులు “There is some Power”అంటే సృష్టికి అతీతంగా ఏదో “ఏదో ఒక శక్తి ఉంది” అన్న నిర్థారణకు వచ్చారు. ఈ నిర్ధారణకు వారు ఖురాన్ నో, బైబిల్ నో, భగవద్గీత నో చదవలేదు. కానీ సృష్టి అనే తెరచిన గ్రంథాన్ని చదివారు.
ఆ పవరే ధార్మిక గ్రంథాల్లో “సర్వ సృష్టికర్త (The Creator)” అని, సర్వేశ్వరుడు అని, యెహోవా అని, అల్లాహ్ అని వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలువబడ్డాడు. ఇక్కడ అసలు గమనించాల్సిన విషయం ఏమిటంటే- ఆ ‘పవర్’ లేదా ‘సృష్టికర్త’కూ నేడు కొందరు సన్యాసులూ, సాధువులు, బిషప్పులు, బాబాల ద్వారా అనేక పేర్లతో ప్రార్ధించబడుతున్న బహుదైవాలకూ ఏమాత్రం కించిత్తు సంబంధం లేదన్నది.
Md Nooruddin
దేవుడు, సైన్స్ & కరోనా
