తల్లి పాల ప్రాముఖ్యత! ముందే తెలియజేసిన ఖుర్ఆన్

నిజానికి పధ్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఖుర్ఆన్ గ్రంథం ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా అరేబియా దేశంలో అవతరించిందని మాత్రమే చాలామందికి తెలుసు! కానీ ఈ ఇరవైయ్యవ శతాబ్దంలో అనేక ప్రయోగాల అనంతరం ఆధునిక సైన్స్ ద్వారా ఏ విషయాలైతే ఆవిష్కరించబడుతున్నాయో వాటిలో ఎన్నో విషయాలు పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే ఖురాన్ లో చెప్పబడ్డాయని, ఇంకా భవిష్యత్తులో ఆవిష్కరించబడే ఏ యే శాస్త్రీయ (Scientific) అంశాలనైతే ఖురాన్ ఏనాడో చెప్పిందో, అవన్నీ ఈనాటి ఆధునిక సైన్స్ ద్వారా ధృవీకరించబడడ్డాయన్న విషయం సైతం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు! అందుకే ఖురాన్ లో సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నాడంటే…

“మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది” – 41:53

పై వాక్యంలో సృష్టికర్త అయిన దేవుడు భవిష్యత్తులో తన సూచనలను చుట్టూ ఉన్న ప్రపంచంలో మరియు స్వయంగా వారిలోనూ చూపటం ద్వారా ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి అంటే దానిని విమర్శించేవారికి విశదమైపోతుందని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యంలో సృష్టికర్త అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నట్టే… ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే- “పిండ నిర్మాణ క్రమం (Embryology)”, “బిగ్ బ్యాంగ్” థియరీ (Big bang Theory)”, మనిషి పుట్టుకకు కారణమయ్యే “సెమినల్ ఫ్లూయిడ్స్ (Seminal fluids)” నిర్మాణం గురించి, విశ్వవ్యవస్థకు సంబంధించి, భూమ్యాకాశాల నిర్మాణం గురించి వగైరా ఎన్నో శాస్త్రీయ వింతలు (Scientific wonders) ఏవైతే ఈ ఇరవైయ్యవ శతాబ్దంలో ఆధునిక సైన్స్ ద్వారా ఆవిష్కరింపబడ్డాయో, అవన్నీ పధ్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే ఖురాన్లో చెప్పబడ్డాయి అంటే నిజంగా ఖురాన్ అద్భుతాల్లో కెల్లా అద్భుతమే అని చెప్పవచ్చు!

వాస్తవానికి ఖురాన్ అవతరించేనాటికి అందులో చెప్పబడ్డ శాస్త్రీయ విషయాలు ఆనాడు ఎవ్వరికీ ఏమీ తెలియదు! అలాగని ఖురాన్ సైన్స్ పుస్తకమని చెప్పటం లేదు, కానీ ఖురాన్ మానవ దేహనిర్మాణం గురించి, ఖగోళ సంబంధమైన విషయాల గురించి ఇంకా ఏ శాస్త్రీయమైన విషయాలను గురించి అయితే చెబుతుందో అవి ఈ ఇరవైయ్యవ శతాబ్దంలో ఆధునిక సైన్స్ చెబుతున్న దానికి సరిగ్గా సరిపోతుందన్నది. ఈ విషయాన్ని నేటి ఖురాన్ విమర్శకులు జాగ్రత్తగా గమనించాలి. దీనిని బట్టి ఖురాన్ ఏదో సాధారణమైన గ్రంథం కాదు కానీ అది విశ్వపాలకుని తరఫునుండి అవతరించిన మహత్తరమైన దైవగ్రంథం అన్న విషయం నిరూపణ అవుతుంది.

ఈనాడు ఆధునిక సైన్స్ ద్వారా చెప్పబడుతున్న ప్రముఖ విషయాల్లో ఒకటి తల్లి పాల (Breast Milk) ప్రాముఖ్యత అన్నది. ఎన్నో ప్రయోగాల అనంతరం ఈనాడు ఆధునిక సైన్స్ తల్లి పాల ప్రాముఖ్యతను గురించి చెబుతుంది. దానికి కారణం మనం సాధారణంగా నిత్యం వింటూ ఉండే “తల్లి పాలు (Breast Milk)” అన్నది నిజంగా ఓ అద్భుతం అన్న విషయం ఈనాడు బయల్పడటమే! ఈనాడు ఆధునిక సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ తల్లి పాలకు ప్రత్యామ్నాయం (alternative) కనిపెట్టలేకపోవటం ప్రక్కన పెడితే, అసలు తల్లి పాలలో ఉన్న పదార్ధాలు (Ingredients) సైతం మొత్తం ఎన్ని ఉన్నాయి? అన్న విషయం పై కూడా ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు తల్లిపాలలో 200 భిన్న రకాలైన పదార్థాలను (Ingredients) శాస్త్రవేత్తలు తాము కనుగొన్నట్లు చెబుతున్నారు.

ఇక శాస్త్రవేత్తలు అసలు తల్లి పాలలో ఏమున్నాయి? అని చెబుతున్నారంటే 1. మిలయన్ల కొద్దీ జీవకణాలు (live cells) ఉన్నాయి. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే తెల్ల రక్తకణాలు, అలాగే మూల కణాలూ (Stem cells). ఇవి ముఖ్యంగా శిశువు అవయవాలు ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందటానికి పనిచేస్తాయి. 2. శిశువు పెరగటానికి మరియు రోగనిరోధక వ్యవస్థను క్రమబద్దీకరించటానికి అవసరమైన 1000 కి పైగా ప్రోటీనులు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్, లిపిడ్స్, యాంటీ బాడీస్ (Immunoglobulins), హార్మోన్స్, ఇంకా 20 కన్నా ఎక్కువగా అమెనో యాసిడ్స్, ప్రీ బయోటిక్స్ 40 కి పైగా విభిన్న రకాలైన ఎంజైములు ఉన్నాయి. ఇవి రసాయన ప్రతిచర్యలు (Chemical reactions) వేగవంతం చేసే ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. ఇంకా జీర్ణక్రియ మరియు రోగనిరోధక వ్యవస్థ క్రమబద్ధీకరించబడటంతో పాటు శరీరం ఇనుము (Iron) ను గ్రహించడంలో ఉపయోగపడతాయి.

ముఖ్యంగా రొమ్ము పాలు శిశువులకు సరైన పోషణను అందించటంతో పాటు ఇంకా శిశువు పెరగడానికి అవసరమమయ్యేందుకు కావలసిన విటమిన్లు, మాంసకృత్తులు మరియు కొవ్వులు సంపూర్ణంగా తల్లిపాలలో కలిగి ఉన్నాయి. అంతేకాక అనేక రకాల వైరస్ లు, మరియు బ్యాక్టీరియాలనుండి పోరాడటానికి సహాయపడే ప్రతిరోధకాలు (Antibodies) రొమ్ము పాలలో ఉన్నాయి. ఇంకా ఉబ్బసం లేదా అలెర్జీలతో బాధపడే శిశువులకు ఏర్పడే ప్రమాదాన్ని తల్లిపాలు తగ్గిస్తుంది. ఇంకా చెవి ఇన్ఫెక్షన్లు , శ్వాసకోశ వ్యాధులు, మరియు అతిసారం వగైరా ఎన్నో రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. SIDS / sudden infant death syndrome (ఆకస్మిక శిశు మరణాల) నివారణకు తల్లి పాలివ్వడం ముఖ్య పాత్ర పోషిస్తుందని కూడా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) తెలిపింది. అలాగే “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్స్ (National Institutes of Environmental Health Science)” చెప్పేదేమిటంటే తల్లిపాలు త్రాగటం వలన 28 రోజుల నుండి సంవత్సరం మద్య ఉండే శిశువుల మరణాల రేటును తగ్గించవచ్చని చెబుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) మరియు అమెరికన్ కాలేజ్ ఆఫ్ ప్రసూతి వైద్యులు మరియు గైనకాలజిస్టులు సహా పలువురు వైద్య నిపుణులు తల్లిపాలను కచ్చితంగా 2 సంవత్సరాల వరకు ఇవాల్సిందే అని చెబుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే తల్లి పాల ప్రాముఖ్యత గురించి, అది ఎంతకాలం కనీసం (Minimum) నుండి గరిష్టం (Maximum) వరకు పట్టాలి అన్న విషయాన్ని ఈనాటి ఆధునిక వైద్యశాస్త్రానికంటే ముందే ఖురాన్ ఎంతో స్పష్టంగా ఈ క్రింది విధంగా చెప్పి ఉండటం నిజంగా ఓ అద్భుతం!

“తమ సంతానం యొక్క పాలు పట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ బిడ్డలకు రెండు సంవత్సరాలు పాలు పట్టాలి” – 2:233

“మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని తల్లి బలహీనతలపై బలహీనతను సహించి అతనిని తన కడుపులో మోసింది. అతను పాలు విడిచి పెట్టటానికి రెండు సంవత్సరాలు పట్టింది” – 31:14

“మేము మానవునికి అతని తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలని ఉపదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భంలో పెట్టుకుని మోసింది; ఎంతో శ్రమతోనే అతనిని కన్నది. అతనిని గర్భంలో పెట్టుకుని మోసేందుకు, అతనిచే పాలు మాన్పించేందుకు ముప్ఫై మాసాలు పట్టింది” – 46:15

“తల్లులు తమ బిడ్డలకు రెండు సంవత్సరాలు పాలు పట్టాలి” అని ఈనాడు ఎవరు చెబుతున్నారు? ఈనాడు తల్లి పాల ప్రాముఖ్యతను కనిపెట్టిన వైద్యశాస్త్ర నిపుణులు కచ్చితంగా రెండు సంవత్సరాలు తల్లి పాలు పట్టాలి అని చెబుతూ దాని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. ఖురాన్లో పై మూడు వాక్యాలు చదివితే 46:15 వాక్యంలో “అతనిని గర్భంలో పెట్టుకుని మోసేందుకు, అతనిచే పాలు మాన్పించేందుకు ముప్ఫై మాసాలు పట్టింది” అన్న వాక్య భాగంలో ఇక్కడ పాలు పట్టే కనీస గడువు (Minimum) 21 మాసాలు అని చెబుతుంది. 2:233, 46:15 వాక్యాల్లో తమ బిడ్డలకు గరిష్టంగా (Maximum) రెండు సంవత్సరాలు పాలు పట్టాలన్న విషయాన్ని ప్రస్తావిస్తుంది. ఈ గడువుకంటే తక్కువగా ఏ తల్లులైతే తమ బిడ్డలకు పాలు పడతారో, ఆ పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండదని, జ్ఞాపకశక్తి సరిగా ఉండదని, , శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి (Immunity power) ఉండదని తద్వారా అనేక రకాలైన వైరస్ ల బారిన పడటం, అనేక ఇన్ఫెక్షన్లు (Infections) సోకటం వలన వివిధ రకాలైన అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని ఈనాడు ఆధునిక వైధ్యశాస్త్రం ఎన్నో హెచ్చరికలను చేస్తుంది. కానీ, ఖురాన్ పధ్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, దాని పట్టే గడువుతో సహా చెప్పి ఉందన్నది గమనార్హం. అందుకే ఖురాన్ చెబుతున్నదేమిటంటే –

“మానవులారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం వచ్చేసింది. అది హృదయాల వ్యాధులకు స్వస్థత. దానిని స్వీకరించేవారికి అది మార్గదర్శకత్వం, కారుణ్యం. ప్రవక్తా ఇలా అను: “అల్లాహ్ తన అనుగ్రహం వల్ల తన కారుణ్యం వల్ల దానిని పంపాడు. దానికి ప్రజలు సంబరపడాలి. ప్రజలు కూడబెట్టే వాటన్నిటికంటే అది (ఖురాన్) ఉత్తమమైనది” – 10:57,58

నిజమే! ప్రజలు కూడబెట్టే వాటన్నిటికంటే అది (ఖురాన్) ఎంతో ఉత్తమమైనది. అందుకే ఎంతోమంది జ్ఞానవంతులు, విధ్యావంతులు ఈనాడు ఖురాన్ ను చదివి అర్థం చేసుకుంటున్నారు గనుకనే ప్రపంచ వ్యాప్తంగా ఖురాన్ ను సత్యమని నమ్మి దానిని స్వీకరించే వారి సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతూపోతుంది.

Md Nooruddin 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *