సైన్సును, సైన్స్ ఆవిష్కరణలను ఆస్తికులు కొట్టి పారేస్తుంటారు. ధర్మం, ధార్మిక గ్రంథాలూ, సైన్స్ కు వ్యతిరేకం అన్నది నాస్తికుల భావన. నిజానికి ఖురాన్ ను గమనిస్తే ఆధునిక సైన్స్ ఏ ఆవిష్కరణలనైతే చేసిందో వాటిని ఖురాన్ 1400 సం.ల క్రితమే ప్రస్తావించింది.
1). జంటల సిద్ధాంతం:
విశ్వంలో అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతీ వస్తువూ “జంటలు”గా సృష్టించబడి ఉన్నాయన్న గొప్ప రహాస్యాన్ని 20 వ శతాబ్దపు గొప్ప భౌతిక శాస్త్రవేత్త, నోబుల్ ప్రైజ్ గ్రహీత మరియు న్యూటన్ వారసుడైన “పాల్ డిరాక్” మొట్టమొదట ప్రతిపాదించటం జరిగింది. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే- 1400 సం.లకు పూర్వమే ఖురాన్ సృష్టిలో ప్రతీ వస్తువూ జంటలు సృష్టించబడి ఉన్నాయన్న “జంటల సిద్ధాంతాన్ని (‘Pairs theory)” ప్రకటించింది.
“ప్రతీ వస్తువును మేము జంటలుగా సృష్టించాము” – 51:49
మరీ ముఖ్యంగా 1790 వరకూ మానవులు, జంతువుల్లో మాత్రమే ఆడ-మగ జంటలు (Pairs) ఉంటాయని అనుకునేవారు. కానీ 1790 లో ‘క్రిస్టియన్ కొన్రాడ్ స్ప్రెంజెల్’ అనే జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త (naturalist) ఆడ-మగ అన్న జంటలు (Pairs) మొక్కల్లో కూడా ఉంటాయని, వాటి మధ్య పరాపరాగ సంపర్కం జరుగుతుందన్న విషయాన్ని ఆవిష్కరించటం జరిగింది. కానీ, ఆధునిక వృక్షశాస్త్రం (Botanical Science) చెబుతున్న ఈ విషయం 1400 సం.లకు పూర్వమే ఖురాన్ ప్రకటించింది.
“ఆయనే అన్ని రకాల ఫలాలను రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు” – 13:3
“అన్ని రకాలా జంటలను సృష్టించిన ఆయన పరిశుద్ధుడు. అవి భూమిలో నుండి పుట్టే వృక్షరాసులలోని వైనా సరే లేదా స్వయంగా వారి జాతి (మానవులు)లో నుండి అయినా సరే లేదా వారు అసలే ఎరుగని వస్తువులలో నుండి అయినా సరే” – 36:36
*****
2). బిగ్ బ్యాంగ్ థియరీ:
‘జార్జ్ లామాటైర్’ 1920 లో “బిగ్ బ్యాంగ్” థియరీని ప్రతిపాదించాడు. దీనిని బట్టి 13 వందల కోట్ల సం.ల క్రితం విశ్వం శూన్యం నుండి ఆవిర్భవించిందని.. ప్రారంభంలో హైడ్రోజన్, హీలియం పరమాణువులతో ఒక “పొగతో కూడిన మబ్బుల”తో శూన్య ప్రదేశం నిండి ఉండేదని దానినే “ప్రైమరీ నెబ్యూలా” అంటారని అందులో గురుత్వాకర్షణ శక్తి ద్వారా కోట్ల కొలదీ నక్షత్రాలూ, గ్రహాలూ ఏర్పడ్డాయని సైన్స్ అనేక పరోశోధనలు చేసి చెబుతుంది. కానీ 1400 సం.లకు పూర్వమే ఖురాన్ ఈ విషయాన్ని ఆవిష్కరించింది.
“తిరస్కరించినవారు ఈ విషయాలను గురించి ఆలోచించరా ఆకాశాలూ, భూమీ పరస్పరం కలిసి ఉండేవానీ, తరువాత మేము వాటిని వేరు చేశామనీ?” – 21:30
“తరువాత పొగగా ఉన్న ఆకాశం వైపునకు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు. ఆయన ఆకాశాన్ని, భూమినీ ఉద్దేశించి ఇలా అన్నాడు “ఉనికి లోకి రండి మీకు ఇష్టమైనా, కాకపోయినా సరే” – 41:11
*****
3). భూమి గోళాకారంలో ఉంది:
1577 లో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ మొట్టమొదటిసారి భూమి చుట్టూ ప్రయాణం చేసివచ్చి, భూమి గోళాకారంలో ఉందని ప్రతిపాదించాడు. కానీ, ఈ విషయం ఖురాన్ 1400 సం.లకు పూర్వమే ప్రకటించింది.
“… ఆయనే పగటిని రేయితోనూ, రేయిని పగటితోనూ చుట్టి వేస్తాడు. ఆయనే సూర్య చంద్రులను నియమబద్దులుగా చేసి ఉంచాడు” – 39:5
అంతరిక్షం నుండి గమనిస్తే… భూమి బంతి మాదిరిగా తిగుతూ ఉన్నప్పుడు ఒక అర్థ గోళం చీకటి తోనూ, రెండవ గోళం ప్రకాశవంతమైన కాంతితోనూ నిరంతరం చుట్టబడుతూనే ఉన్నట్లు గమనించగలం.
మరొక వాక్యంలో “ఆయనే రెండు తూర్పు దిక్కులకు, రెండు పడమర దిక్కులకు ప్రభువు” – ఖురాన్ 55:17 అని చూడగలం. “రెండు తూర్పు దిక్కులు, రెండు పడమరలు” అంటే.. భూగోళంపై ఏర్పడే రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాల గురించి అన్నమాట!
వివరంగా చెప్పాలంటే.. భూమి యొక్క రెండు అర్థగోళాల్లో.. ఒక భాగం వైపు సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు.. సరిగ్గా భూమధ్య రేఖకు రెండవ భాగం వైపు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది.. అలాగే భూమికి రెండవ భాగంలో సూర్యోదయం అవుతూ ఉంటే.. భూమధ్య రేఖకు మొదటి భాగంలో సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ భూమి గోళాకారంలో ఉన్నప్పుడే సాధ్యపడుతుందన్నది నిర్వివాదం. ఈ విధంగా ఖురాన్ ఎంతో శాస్త్రీయ పద్ధతిలో భూమి గోళాకారంలో ఉండటాన్ని, సూర్యోదయాలు, సూర్యాస్తమయాల గురించి వివరిస్తుంది.
*****
4). విశ్వంలో గ్రహాలన్నీ తమ కక్ష్యల్లో తిరుగుతున్నాయి:
1543 లో నికోలస్ కోపర్నికస్ మొట్టమొదటిసారి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందన్న విషయం కనిపెట్టాడు. కానీ, 1609 లో జొన్నస్ కెప్లర్ సోలార్ సిస్టమ్ లో కేవలం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందనే కాక సూర్యచంద్రులతో సహా ఇతర గ్రహాలన్నీ తమ తమ కక్ష్యల్లో ఉంటూ తామంతట తాము తిరుగుతున్నాయని ప్రతిపాదించాడు. ఉదాహరణకు సూర్యుడు సైతం ఒకసారి తన చుట్టూ తాను తిరగటానికి 25 రోజులు పడుతుంది.. కానీ, ఈ విషయం ఖురాన్ 1400 సం.లకు పూర్వమే ప్రకటించింది.
“ఆయనే సూర్యచంద్రులను పుట్టించినవాడు. అవన్నీ తమ తమ కక్ష్యల్లో ఉంటూ తిగుతున్నాయి” – 21:33
“ఆయనే పగటిని రేయితోనూ, రేయిని పగటితోనూ చుట్టివేస్తాడు. ఆయనే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతీ ఒక్కటీ నిర్ణీత కక్ష్యల్లో ఉంటూ తిరుగుతూ ఉన్నాయి” – 39:5
“చంద్రుణ్ణి అందుకోవటం సూర్యుడి తరం కాదు, అదే విధంగా రాత్రి, పగటిని దాటిపోజాలదు. అవన్నీ (గ్రహాలన్నీ) వేర్వేరు ఉంటూ కక్ష్యల్లో (తామంతట తాము) తిరుగుతున్నాయి” – 36:40
గ్రహాలన్నీ తమ కక్ష్యల్లో ఉంటూ తిరగటం అన్నది అవి గోళాకారాల్లో ఉన్నప్పుడే సాధ్యం అన్నది గమనించాలి.
*****
5). సూర్యుడు మాత్రమే స్వయం ప్రకాశితం:
ఒకప్పుడు ప్రజలు సూర్యుడు మాదిరిగానే చంద్రుడు సైతం స్వతహాగా ప్రకాశిస్తుందని భావించేవారు. కానీ, ఖురాన్ సూర్యుడు మాత్రమే స్వతహాగా కాంతిని ఇస్తుంది మరియు చంద్రుడు దాని వెలుగుతో మెరుస్తున్నాడు అన్న విషయాన్ని తెలియజేసింది.
“సూర్యుణ్ణి కాంతిమంతునిగా చేసినవాడు ఆయనే. చంద్రుడికి వెలుగును ఇచ్చినవాడు ఆయనే” – 10:5
“ఆకాశాలలో బురుజులను నిర్మించినవాడూ, అందులో ఒక దీపాన్ని (సూర్యుణ్ణి) ఒక మెరిసే చంద్రున్ని వెలిగించినవాడు ఎంతో శుభపద్రుడు” – 25:61
*****
6). పిండ నిర్మాణ దశలు:
1604 సం. లో ఫాక్సికస్ అనే శాస్త్రవేత్త పిండం యొక్క కొన్ని అద్భుతమైన చిత్రాలను మొట్టమొదట ఆవిష్కరించాడు. ఆ తరువాత 1672 సం.లో ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డ ‘మాల్ఫిగి’ పిండోత్పత్తి దశల (Embryonic stages) కు సంబంధించిన మరికొన్ని ఆధునిక చిత్రాలను ఆవిష్కరించాడు. మొత్తానికి 17 వ శతాబ్దంలో మొట్టమొదటి మైక్రో బయాలజిస్ట్ అయిన ‘లియువెన్హోక్’ సూక్ష్మదర్శిని (Microscope) ని కనుగొన్న తరువాతే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం అభివృద్ధి అయిందని చెప్పవచ్చు. ఇక ‘ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology Science) ఏదైతే పిండ దశలను గురించి వివరిస్తుందో దానినే ఖురాన్ 1400 సం.లకు పూర్వమే ప్రకటించింది.
“మేము మానవుణ్ణి మట్టి యొక్క సారం నుండి సృష్టించాము; తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే ఒక వీర్య బిందువుగా మార్చాము, ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము, ఆ పైన ఆ ముద్దను కండగా చేశాము, తరువాత ఆ మాంసపు కండను ఎముకలుగా చేశాము, ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తోడిగాము, ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. కనుక అల్లాహ్ ఎంతో శుభప్రదుడు” – 23: 12-14
పిండ నిర్మాణం – మూడు చీకటి తెరలు
ముఖ్యంగా ప్రత్యత్పత్తి వీర్య కణము (spermatozoon) ద్వారా అండం ఎలా ఫలదీకరణ చెందుతుంది అన్న అంశానికి సంబంధించి 1940 సం. తరువాతే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం ద్వారా క్రొత్త క్రొత్త ఆవిష్కరణలు జరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఖురాన్, స్త్రీ గర్భంలో పిండోత్పత్తి… పిండ నిర్మాణం తాలూకు వివిధ దశలను గురించి 1400 సం.లకు పూర్వమే ఆవిష్కరించింది.
“వాస్తవానికి ఆయన మిమ్మల్ని వివిధ దశల్లో సృష్టించాడు” – 71:14
“మేము మానవుణ్ణి “ఒక మిశ్రమ వీర్య బిందువు (a mixture sperm-drop)” తో సృష్టించాము” – 76:2
“ఆయన మానవుణ్ణి స్వల్పమైన వీర్యబిందువు (a sperm) తో సృష్టించాడు” – 16:4
స్త్రీ గర్భంలో పిండం రూపుదాల్చటం అనే ప్రక్రియ ప్రారంభం మొదలుకుని గర్భంలో పిండం ముఖ్యంగా మూడు దశలు దాటుకుంటూ పెరుగుతుందని ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర మూల గ్రంథమైన “Basic Human Embryology” చెబుతుంది. ఆ మూడు దశలనే ఖురాన్ మూడు చీకటి తెరలని ప్రస్తావిస్తుంది. మూడు చీకటి తెరలు అంటే 1. Anterior abdominal wall (ఉదరకోశ గోడ) 2. the uterine wall (గర్భాశయ గోడ) 3. Amnio-chorionic membrane (అమినో క్రోనిక్ పొర). ఈ విధంగా గర్భంలో పిండం మూడు చీకటి తెరల్లో రూపుదిద్దుకుంటుందని ‘ఆధునిక పిండోత్పత్తి శాస్త్రం (Modern Embryology Science)’ చెబుతున్న విషయాన్ని కూడా ఖురాన్ 1400 సం.లకు పూర్వమే ప్రస్తావించింది.
“ఆయన మీ తల్లుల గర్భాలలో మూడేసి చీకటి తెరలలో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు” -ఖురాన్ 39:6
***
7). పర్వతాలు “మేకుల” వలె పాతబడి ఉన్నాయి
భూమి ఉపరితలంపై కనపడుతున్న పర్వతాలు యొక్క మూలాలు భూమి లోపల పది నుండి పదిహేను రెట్లు లోతులో మేకుల మాదిరిగా పాతబడి ఉన్నాయన్న విషయాన్ని మోడ్రన్ జియోలజీ అనేక పరిశోధనల తరువాత తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఖురాన్ 1400 స.ల క్రితమే ధృవీకరించింది. అంతేకాదు… పర్వతాలు అలా ఎందుకు పాతబడ్డాయో అదే వాక్యంలో చెప్పబడింది “భూమి మిమ్మల్ని తీసుకుని దొర్లిపోకుండా ఉండాలని” అని.
“మోడ్రన్ థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టోనిక్” చెబుతున్న విషయం కూడా అదే. పర్వతాలు భూమిని స్థిరగా ఉంచటంలో “స్టెబిలైజర్స్” మాదిరిగా సహాయపడుతున్నాయని చెప్పటం జరిగింది. 20 వ శతాబ్దంలో ఆవిష్కరించబడిన ఈ విషయాన్ని ఖురాన్ ఏనాడో ధృవీకరించింది.
ఇదంతా చదివి కొందరు.. “అంటే ఖురాన్ లో సైన్స్ ఉందా?” అని హేళన చేసి కొట్టి పరేయ్యొచ్చు. ఖురాన్ సైన్స్ పుస్తకమైతే కాదు. అలాగని నేడు సైన్స్ చెబుతున్న విషయాలకు విరుద్ధమైన విషయాలు కూడా ఖురాన్ లో లేవు. మరి నేడు ఆధునిక సైన్స్ చెబుతున్న విషయాలు ఖురాన్ లో ఎందుకున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం.. సృష్టికర్త అయిన దేవుడు తన పట్ల మనిషి ఏవో గుడ్డి నమ్మకాలను కాక, సృష్టిని సశాస్త్రీయంగా పరిశీలన చేసి హేతుబద్ధమైన విశ్వాసం కలిగి ఉండాలని అభిలషించాడు. అందుకే.. ఖురాన్ లో సృష్టికర్త అయిన దేవుడు సృష్టి ఆవిర్భావం నుండి మనిషి పుట్టుక వరకు అనేక రహాస్యాలను తన గ్రంథాల్లో బయల్పరిచాడు. నేడు ఆధునిక సైన్స్ అనేక పరిశోధనలు చేశాక చెబుతుంది కూడా అదే.
సైన్స్ ఆవిష్కరణలు – ఖురాన్ ధృవీకరణ
