ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం స్వయంగా ముస్లిములను ధ్వేషించే మతోన్మాదుల దగ్గరే ఉండదంటే అది అతిశయోక్తి కాదేమో! ముస్లిములను ధ్వేషిస్తున్న ఏ హిందుత్వవాదినైనా నిలబెట్టి ఒక పెన్ను పేపరు చేతిలో పెట్టి మీరు ముస్లిములను ధ్వేషించటానికి గల ఓ ఐదు కారణాలు రాసి ఇమ్మని అడిగితే తెల్ల ముఖం వేసుకుని పిచ్చి చూపులు చూస్తూ మహాలేదంటే అప్పుడెప్పుడో మధ్య యుగాల్లో ముస్లిం రాజులు మా భారతదేశంలో దేవాలయాలు పడగొట్టేశారు, భారతదేశంలో ముస్లిములు నాలుగేసి పెళ్లిళ్లు చేసేకుని వారి సంఖ్యబలం పెంచేసుకుని ఈ దేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చేసుకుంటారు అదే ముస్లిముల లక్ష్యం కాబట్టి ముస్లిముల వల్ల హిందుత్వం ప్రమాదంలో ఉందంటూ వాట్స్ యాప్పుల్లో ఫార్వర్డ్ చెయ్యబడే గాసిప్పులలో దొరికే గాలి సమాచారాన్నే సమాధానాలుగా రాసివ్వటం జరుగుతుంది తప్పితే పర్టీక్యులర్ గా ఫలానా విషయం కారణంగా మేము ముస్లిములను ధ్వేషిస్తున్నాము అని చెప్పే స్థితిలో నేటి ముస్లిం ధ్వేషకులైన మతోన్మాదులు లేరనటంలో సందేహం లేదు.
ఈ దేశంలో హిందూత్వాన్ని కాపాడుకోవాలంటే ముస్లిములు ఈ దేశంలో ఉండకూడదు, వారి వల్లే హిందుత్వం ప్రమాదంలో ఉందంటూ మతోన్మాదం తలకెక్కిన కొందరు నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వటమే కాక, మతతత్వవాదం తలకెక్కిన కొందరు సామాన్య హిందూ ప్రజల బుర్రల్లో వక్రీకరించబడిన చరిత్రలను నూరిపోస్తూ ఏనాడో మధ్యయుగంలో తుగ్లక్, గజనీ, ఘోరీల్లాంటి కొందరు ముస్లిం రాజులు చేసిన అత్యాచారాలకు, అక్కడెక్కడో అల్-ఖైదా, ISIS వగైరా పేర్లు పెట్టుకుని చేసిన ఉగ్రవాద చర్యలకు ఇక్కడున్న ముస్లిములే బాధ్యులు అన్నట్టుగా ఒకరకమైన ఉన్మాద భావజాలాన్ని పెంపొందిస్తూ చాలామంది సామాన్య హిందువులలో ముస్లిముల పట్ల అర్థం లేని కోపాన్ని, కారణం లేని శతృత్వాన్ని, నిరాధారమైన ప్రతీకార భావాన్ని, కృత్తిమ ఉద్రేకాన్ని రగిల్చి తోటి ముస్లిం సోదరుల పట్ల ధ్వేషంతో నిండిన విషాన్ని చిమ్మే సంస్కృతిలో నడపటం మొదలెట్టారు.
హిందూ-ముస్లిముల తగాదా రాజకీయ ఎత్తుగడలో ఒక భాగం మాత్రమే!
సామాన్య హిందూ ప్రజానీకాన్ని తమ వైపు త్రిప్పుకుని, మెజార్టీ హిందువుల ఓటు బ్యాంకును సాధించాలన్న ఎత్తుగడలో భాగంగా కొందరు మతోన్మాద నాయకులచే సృష్టించబడిందే హిందూ vs ముస్లిం విభజన రాజకీయ వాదం. ఈ ప్రక్రియ సాఫీగా జరిగిపోవటానికి ద్విజాతి సిద్ధాంతానికి ప్రతిరూపకమైన “హిందూ జాతీయవాదం” అనే పరికరాన్ని మతోన్మాద రాజకీయ నాయకులు ఉపయోగిస్తూ రావటం జరిగింది. ఈ హిందుత్వ వాదం ఎలా బలపడుతూ వచ్చిందన్నది గమనిస్తే ఒక ప్రక్క ముహమ్మద్ అలిజిన్నా ముస్లిం లీగ్ పార్టీ స్థాపించి, ప్రత్యేక ముస్లిం దేశంగా పాకిస్తాన్ ఏర్పర్చాలని ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో మరో ప్రక్క హిందువుల సంరక్షణార్థం అన్నట్టు నాథురాం గాడ్సే, సావర్కార్ ల అధ్వర్యంలో ‘హిందూ మహాసభ’ రూపుదిద్దుకోవటం అన్న ప్రక్రియ మొదలైనది. ఎవరైతే హిందూ జాతి, హిందూ మతం, హిందూ సంస్కృతి, హిందూ భాషకు సంబంధించని వారో, వారు నిజమైన జాతీయ జీవనానికి సహజంగానే దూరం అవుతారన్నది మరొక హిందూత్వ సిద్ధాంతకర్త గోల్వాల్కర్ వాదన. ద్విజాతి సిద్ధాంతానికి కారకులైన సావర్కార్ ప్రకారం- హిందూ జాతి ఇతర భారతీయులను పాలిస్తూ హిందూ మత ఆకాంక్షలను ముందుకు తీసుకొనిపోయే ఒక ప్రత్యేకమైన జాతియే హిందూత్వ జాతి అన్నది. హిందూ భావనను బలోపేతం చేయడం, హిందూ జాతి, హిందూ రాజ్యం ఘనకీర్తిని పెంచుతూ, ఆ లక్ష్యాలను ఎవరైతే చేరుకుంటారో వారే జాతీయతా భావాలు కలిగిన దేశభక్తులు, మిగిలిన వారంతా హిందూ జాతికి కుట్రదారులు లేదా శత్రువులైనా అన్నది గోల్వాల్కర్ ప్రతిపాదించిన హిందుత్వ జాతీయ వాదంలో ప్రధానాంశం. ఆ విధంగా అతివాద భావజాలం ఆధారంగా ఉనికిలోకి తేబడిన హిందుత్వవాదం ప్రారంభం అవ్వటం నుండే హిందూ vs ముస్లిం విభజన రాజకీయాలు ఈ దేశంలో ప్రారంభమయ్యాయి.
హిందూ మహా సభ ఎజండా సింగిల్ లైన్ లో చెప్పాలంటే- ముస్లిముల జనాభా భారతదేశంలో అనేక హిందువులను ముస్లిములుగా మార్చేసుకోవటం ద్వారా పెరిగిపోయింది, వారి జనాభా పెరుగుతూ పోతే దేశం ఇస్లామిక్ కంట్రీగా ముస్లిములు మార్చేసుకుంటారు. కాబట్టి ఎడారి మతాల (ఇస్లాం, క్రిస్టియానిటీ) నుండి దేశాన్ని కాపాడుకోవాలి అన్నది. ఈ హిందుత్వ వాదపు విషపు బీజాన్నే దశాబ్దాలు నాటుతూ వచ్చారు. తరువాత 1977 ప్రాంతంలో ఎమర్జన్సీ ఏర్పడిన నేపథ్యంలో ఆర్.ఎస్.ఎస్ భావజాలంతో రూపుదిద్దుకున్న బీ.జే.పీ ఒక పార్టీగా రూపుదిద్దుకున్న తరువాత అది గోవాల్కర్ తీసుకొచ్చిన హిందుత్వ జాతీయవాదం ఏజండానే ప్రధానాంశంగా పెట్టుకుని హిందూ vs ముస్లిం విభజన రాజకీయాల ఆధారంగా బీజేపీ ప్రజల్లోకి క్రమంగా బలపడుతూ వెళ్లింది.
చిత్రం ఏమిటంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు ముస్లిం రాజులు ఈ దేశాన్ని పరిపాలించినప్పటికీ ఈ దేశాన్ని హిందుస్తాన్ గా పేరు పెట్టిందే ముస్లిములు అన్న విషయాన్ని గమనించకుండా, నిజంగా ఈ దేశాన్ని ఏ ముస్లిం కంట్రీ గానో మార్చేయాలన్నదే ముస్లిముల ఉద్దేశమైతే ముస్లిం రాజుల క్రింద పరిపాలించబడుతున్నప్పుడే ఆ పని చేసి ఉండేవారుకదా!? అన్న కనీస ఆలోచన నేటి ముస్లిం ధ్వేషకులు కలిగి లేకపోవటం.
ప్రారంభం నుండీ గోవాల్కర్ తెచ్చిన ద్విజాతి సిద్ధాంతమైన హిందుత్వ జాతీయ వాదం ఏజండా ప్రాతిపదిక మీదనే అది పని చేస్తూ వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత, గోద్రా రైలు దహనం, గుజరాత్ అల్లర్లు, రామ్ మందిర్ వగైరా అంశాలను తెరమీదకు తెచ్చి హిందుత్వ సింటిమెంట్ ఆధారంగానే బీ.జే.పీ అది నుండీ పనిచేస్తూ వచ్చింది. హిందుత్వ సెంటిమెంటును రెచ్చగొట్టటానికి కావలసినంత కంటెంట్ ఉన్న అంశం రామ్ మందిర్. అది ఎప్పుడైతే ఓ కొలిక్కి వచ్చి, సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటం, ముస్లిములు సైతం ఆ తీర్పుకు గౌరవించటంతో ముగిసిపోయిందో ఇక 2019 సం. చివర్లో హిందూ vs ముస్లిం విభజన రాజకీయాలను ఓ క్రొత్త మలుపు తిప్పటానికి తెరమీదకు క్రొత్తగా తీసుకురాబడినవే NRC/CAA చట్టాలు!
ఈ రెండు చట్టాలు కంబైన్డ్ గా రావటం వల్ల ప్రాథమికంగా నష్టపోయేది ముస్లిం సమాజమే అన్న స్ట్రాటజీ ప్రకారం రూపొందించటం జరిగింది. పైకి పౌరసత్వ సవరణ చట్టం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ల నుండి ఈ దేశానికి వచ్చేవారికి పౌరసత్వం కల్పించే చట్టం మాత్రమే అని చెబుతూనే, హిందువులు ముస్లిం దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో వేధించబడుతున్నారు, వారి సంఖ్య తగ్గిపోతుంది అన్న వాదన లేవనెత్తటం ద్వారా ముస్లిముల మెజార్టీ ఉండటం ఎప్పటికైనా హిందువులకు నష్టమే అన్న విషపు బీజాలను బీజేపీ ప్రజల హృదయాల్లో క్రమంగా నాటటం మొదలెట్టింది. మొత్తానికి హిందుత్వ ఏజండాను చక్కగా అమలు పరచటానికి, హిందూ vs ముస్లిం విభజన రాజకీయాలు నడపటానికి ఈ NRC/CAA చట్టాలు చక్కటి మాధ్యమాలుగా మారిపోయాయి.
ఓ ప్రక్క హిందుత్వ వాదాన్ని తమ స్పోక్ పర్సన్స్ ద్వారా, బిజీపీ ప్రత్యేక IT సెల్, మీడియా ద్వారా ప్రచారంలో పెడుతూనే, ముస్లిం వ్యతిరేక నినాదాలు ఇప్పిస్తూనే మరోప్రక్క ఈ చట్టాలను వెలుగులోకి తేవటం పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లిములను తప్పించటం, దానితో దేశవ్యాప్తంగా ముస్లిములు ఆందోళనకు దిగటం, దాన్ని అదునుగా చేసుకుని బీజేపీ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాలను సమర్ధించే వారు అన్నట్టుగా మరొక వర్గాన్ని వెలుగులోకి తేవటం, వారి ద్వారా ఈ చట్టాలను సమర్ధిస్తూ ర్యాలీలు తీయించటం వెరసి వేడెక్కిన వాతావరణం ఫలితమే ఢిల్లీ లో జరిగిన మారణహోమం! ఆ విధంగా 2002 గుజరాత్ మారణ హోమానికి మూలం బాబ్రీ మసీదు అయితే 2020 లో ఢిల్లీ లో జరిగిన మారణహోమానికి మూలం పౌరసత్వ సవరణ చట్టం అయింది.
ఇదంతా ఇక్కడ సంక్షిప్తంగా ఎందుకు ప్రస్తావించటం జరిగిందంటే- హిందూ, ముస్లిముల మధ్య తగాదాలకు లేక హిందుత్వ వాదులు, ముస్లిములపై పెంచుకున్న ధ్వేషానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదు కేవలం రాజకీయ కోణమే తప్ప అన్నది వివరించటమే! కేవలం హిందూ vs ముస్లిం విభజన రాజకీయాలే ఊపిరిగా చేసుకుని తమ ఉనికిని కాపాడుకునే రాజకీయ పార్టీలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికశాతం హిందువులను హిందుత్వ వాదులుగా మార్చి వారిలో ముస్లిముల పట్ల అర్థం లేని కోపాన్ని, కారణం లేని శతృత్వాన్ని, నిరాధారమైన ప్రతీకార భావాన్ని, కృత్తిమ ఉద్రేకాన్ని పెంచి పోషిస్తూ వస్తున్నాయి అన్నది స్పష్టపరచటమే!
ముస్లిములపై సాగుతున్న ఈ ప్రతీకారం వల్ల హిందుత్వానికే ప్రమాదం!
పవిత్ర వేదోపనిషత్తులు ప్రభోదిస్తున్న సనాతన వైదిక ధర్మానికి, ఈ 20 వ శతాబ్దంలో మైనారిటీల పట్ల ధ్వేషభావంతో సావర్కర్, గోవల్కర్ల ద్వారా ఉనికిలోకి వచ్చిన హిందుత్వ వాదానికి అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే “సర్వేజనా సుఖినోభవంతు” అన్న భావజాలాన్ని వైదిక ధర్మం నేర్పుతుంటే దీనికి భిన్నంగా ఒక్క హిందువులు మాత్రమే రాజ్యం చెయ్యాలి మిగతావారంతా వారి చెప్పుచేతల్లో మెలగాలి అన్న ఒక రకమైన సుపీరియారిటీ కాంప్లెక్స్ తో కూడిన భావజాలాన్ని హిందుత్వవాదం నేర్పుతుంది. కాబట్టి ఒకనాటి వైదిక ధర్మానికి ప్రస్తుతం కొందరు నడుపుతున్న హిందుత్వ వాదానికి పొంతనే లేదన్నది ప్రతీ హైందవ సోదరుడూ అర్థం చేసుకోవాలి.
ముస్లిములు, క్రైస్తవులు శత్రువులుగా, దురాక్రమణ దారులుగా ఈ దేశంలోకి ప్రవేశించారు, వారు ఒకటి హిందూ జాతిని, సంస్కృతిని ఉన్నతమైనదిగా స్తుతిస్తూ, తమ ఉనికిని వదులుకొని జాతికి లొంగి ఉండాలి లేదా ఈ దేశం వదిలి బయటకు పోవాలన్న ఒకనాటి గోవల్కర్ భావజాలానికి ఆచరణ రూపమిస్తూ ఈనాడు సమాజంలో మతతత్వవాదాన్ని రెచ్చగొడుతూ దేశం మొత్తంలో గుజరాత్ వాతావరణాన్ని పునరావృత్తం చేయటానికి ఇది 2002 అయితే కాదు కానీ 2020 అన్నది ఈనాటి మతతత్వవాదులు గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో సామాన్యులు కూడా ఆలోచించగలుగుతున్నారు. నిజానిజాలేమిటన్నది పరిశీలించి వాస్తవాలు గ్రహించగలుగుతున్నారు. అది తెలుసుకోకుండా ఒకనాటి గోవల్కర్ ప్రతిపాదించిన హిందుత్వ వాదనకు ఆచరణ రూపమిస్తూ, మధ్య యుగాలనాటి చరిత్రల ద్వారా పగా, ప్రతీకరాలు నూరిపోస్తూ, తమ మతం కాని వారి పట్ల విషాన్ని ఎగజిమ్మే సంస్కృతిలో నడిపిస్తూ పోతే కొన్నాళ్లకు మొత్తానికి హిందూత్వం మీదే వెగటు పుట్టి సామాన్య ప్రజలు హిందూత్వానికే దూరమైపోయే ప్రమాదమైతే లేకపోలేదు.
ఎంత ముస్లిములను ధ్వేషించేవావారిగా, దేశ ద్రోహులుగా చిత్రీకరించటానికి ప్రయత్నించినా ఈ దేశాన్ని ఆక్రమించిన ఒకనాటి బ్రిటిషర్లను ఎదిరించి, ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన ముస్లిం వీరుల తాలూకు చరిత్ర ఎప్పటికీ చెరగిపోదు. ఏ ఇస్లాం అయితే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని నేటి ఇస్లాం విమర్శకులు అంటున్నారో ఆ ఇస్లాంను అనుసరించిన ముస్లిములే నాటి స్వతంత్ర ఉధ్యమంలో పాల్గొని, ఈ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించేశారు. ఆనాడు అధికార కాంక్షతోనే రాజకీయంగా పాకిస్తాన్ ను వేరుచేసినప్పటికీ ఈ దేశంలో చాలా మంది ముస్లిములే దానిని వ్యతిరేకించి, ఈ దేశంలో పుట్టి ఈ నేలను ప్రేమిస్తూ అవసరమైతే ఈ దేసం కోసం ప్రాణాలు ఆర్పిస్తామని ఇక్కడే ఉండిపోయారు. వారు అన్నట్టుగానే బ్రిటిషర్లు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఇక్కడ హిందువులతో భుజం భుజం కలిపి వేలల్లో బలిదానాలు చేసేశారు. చిత్రం ఏమిటంటే ఈనాడు ముస్లిములను ఏదో పరాయి దేశస్తులుగా, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న సావర్కర్ శిష్యులకు తెలియనిది వారి అది గురువు సావర్కర్ బ్రిటిషు వారి దయాదాక్షిణ్యాల కోసం రాతపూర్వక పత్రం ఇచ్చి జైలు నుండి విడుదలయ్యాడని ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో RSS పాత్ర సున్నా అన్నది.
కాబట్టి భిన్న మతాలు, భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశ సమగ్రతకు దాని సర్వతోముఖ వికాసానికి ఈ దేశంలో నివశిస్తున్న భిన్న వర్గాల మధ్య సమైక్యత అత్యంత ఆవశ్యకం. ప్రస్తుత హిందూ-ముస్లిం వేర్పాటువాద రాజకీయాలు జోరుగా సాగుతున్న తరుణంలో, తమ స్వార్థ ప్రయోజనాల నిమిత్తం పనికట్టుకుని కొందరు హిందూ-ముస్లిముల మధ్య మతోన్మాదాన్ని, విధ్వేషాన్ని రెచ్చగొడుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఈ రెండు అతి పెద్ద వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించటానికి ప్రస్తుతం మాన్యుల నుండి సామాన్యుల వరకు ప్రయత్నించటం అత్యంతావశ్యకం.
ముస్లిముల పై ఈ ధ్వేషానికి కారణం ఏమిటి? –
