హిందూ ధర్మ పరిరక్షణ అంటే పరమతాలను ధ్వేషించటమా?

నాకు తెలిసీ “హిందూ” అంటే “హింసాయాం దుషయతి ఖండయతి ఇతి హిందూ” – “ఎక్కడైతే హింస, పాపములు ఉన్నాయో వాటిని ఖండించేవాడే హిందువు” దానికి భిన్నంగా హింసను, దౌర్జన్యాన్ని, పాపక్రియలను సమర్ధించేవాడు హిందూ ధర్మ వ్యతిరేకిగా పరిగణించబడతాడు.

***

హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఏమిటి?

హిందూ ధర్మాన్ని పరిరక్షించటం అంటే పరమతాలను ధ్వేషించటమా? పరమతస్తులను హింసించి మేము మాత్రమే సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మిగతా మతస్తులందరినీ తన్ని తరిమేయాలని కోరుకోవటమా? తమ వర్ణం కానివారిని పట్ల అంటరాని తనంతో వ్యవహరించటమా?

జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ జనాలను చావకొట్టటమా? జై శ్రీరామ్ పేరు స్మరిస్తూనే బూతులు వల్లిస్తూ భూతదయ కోల్పోయి దౌర్జన్యానికి తెగబడటమా?

జైశ్రీరామ్ అని నినదిస్తూనే మానవత్వం కోల్పోయి ఉన్మాదాన్ని సంతరించుకుని పరమతస్తుల చర్చీ, మసీదులను కాల్చిపారేసి, వాటిపై తమ జండాలు పాతటమా? పరమతస్తుల బుర్రలు బద్దలుగొడుతూ క్రూరంగా హింసించి చంపుతూ రక్తచరిత్ర సృష్టించటమా?

ఈ విధంగా హిందూ ధర్మాన్ని రక్షించమని ఏ వేదం చెబుతుంది?
ఈ ప్రక్రియ హిందూ ధర్మాన్ని రక్షించటం అవుతుందా? హిందూ ధర్మాన్ని మంట కలపటం అవుతుందా?

వేదోపనిషత్తులు, గీతా శాస్త్రాల్లో నేను చదివిన హిందూ ధర్మం వేరు. ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో కొందరు మతోన్మాద మూకలు సృష్టించిన సో కాల్డ్ హిందూ ధర్మం వేరు!

నేను హైందవ శాస్త్రాల్లో గమనించిన హిందూ ధర్మం – ఎంతో సంస్కారంతో కూడిన, హుందాతనం కలిగిన అహింసను నేర్పే శాంతిపూర్వక ధర్మం అది – “సర్వే జనాసుఖినోభవంతు” (సకల జనులు సుఖంగా ఉండాలి) అన్న గొప్ప భావజాలాన్ని నేర్పుతుంది. తప్పితే “హైందవ జనే సుఖినోభవంతు (ఒక్క హిందూ జనాలే సుఖంగా ఉండాలి)” అన్న పక్షపాత సిద్ధాంతం నేర్పటం లేదు.
“మానవసేవయే మాధవసేవ” అని చెబుతుంది తప్ప “హిందూ సేవయే మాధవసేవ” అని చెప్పటం లేదు.

“అహింసా పరమో ధర్మః
ధర్మ హింసా తదివచ”

అని చెబుతుంది. అంటే- “అహింస అన్ని ధర్మాల్లో కెల్లా ఉత్తమమైనది అని. కానీ, ధర్మోద్ధరణ కోసం అహింసాకారుల పై మాత్రమే హింసా ప్రయోగం పరమోత్తమమైనది”. సంక్షిప్తంగా చెప్పాలంటే-

“హింస” అంటే శారీరకంగానే కాదు మానసికంగా బాధపెట్టటమూ హింసే!
అహింసా వాదులపై ఎవరైనా తెగబడితే అటువంటి దౌర్జన్య పరులపై హింసా ప్రయోగం అనుమతివ్వబడింది తప్ప అమాయకులపై కారణం లేని కోపం, అర్థం లేని శత్రుత్వం పెంచుకుని హింసించటానికి, దౌర్జన్యం చేయటానికి హిందూ ధర్మం అనుమతి ఇవ్వటం లేదు.

హిందూ పరిరక్షకులన్న వేషం ధరించి, సోషల్ మీడియాలో “కట్టర్ హిందూ” అంటూ ట్యాగ్ లు తగిలించుకుని పరమత ధ్వేషాన్ని ప్రదర్శిస్తూ ఇతర మతాలను కించపరుస్తూ దిగజారుడు మాటలు మాట్లాడుతూ, బూతుపురాణం వల్లించే మనువాదుల వల్ల, ఇతర మతస్తులలో అమాయకుల ప్రాణాలు తీస్తూ, వారి తలలు బద్దలుకొడుతూ, మసీదులు, చర్చీలు పగలగొడుతు, సమాజంలో హింసాత్మక వాతావరణం సృష్టిస్తూ తమ ఈ ఉన్మాదాన్నే వీరత్వమన్నట్టు ఫీలై, ఇదే హిందూ పరిరక్షణ అనుకుంటున్న మతోన్మాదుల వల్ల హిందుత్వం రక్షించబడటానికి బదులు పరువును పోగొట్టుకుంటుందన్నది తెలుసుకోవాలి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *