భిన్న మతాలు, భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశ సమగ్రతకు దాని సర్వతోముఖ వికాసానికి ఈ దేశంలో నివశిస్తున్న భిన్న వర్గాల మధ్య సమైక్యత అత్యంత ఆవశ్యకం. ప్రస్తుత హిందూ-ముస్లిం వేర్పాటువాద రాజకీయాలు జోరుగా సాగుతున్న తరుణంలో, తమ స్వార్థ ప్రయోజనాల నిమిత్తం పనికట్టుకుని కొందరు హిందూ-ముస్లిముల మధ్య మతోన్మాదాన్ని, విధ్వేషాన్ని రెచ్చగొడుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఈ రెండు అతి పెద్ద వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించటానికి ప్రయత్నించటం మరీ ముఖ్యం. అది హిందూ-ముస్లిముల మధ్య భావ సారూప్యత ద్వారానే సాధ్యమవుతుంది.
***
మతోన్మాదం తలకెక్కిన కొందరు ఇస్లాం ధ్వేషకులు హిందూ-ముస్లిముల మధ్య ఐక్యతను నాశనం చెయ్యటానికి ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని, అది ప్రాచీన వైదిక ధర్మానికి విరుద్ధమైన ధర్మమని సామాన్య హిందూ ప్రజానీకంలో ముస్లిముల పట్ల ధ్వేషాన్ని నాటటంలో కొంతవరకు సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు. తద్వారా హిందూ-ముస్లిం వర్గాల్లో చాలా మంది వైదిక-ఇస్లాం భావజాలాలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధమన్న అపార్థానికి లోనైపోయారు.
వాస్తవానికి అటు వేదోపనిషత్తులు గమనించినా ఇటు ఖురాన్ గ్రంథాన్ని చదివినా వాటి మౌలిక సందేశం విషయంలో కించిత్తు భేదాన్ని గమనించలేము. అటు వేదాలను, ఇటు ఖురాన్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే అవి సృష్టికర్త అయిన దేవుని ఏకత్వాన్నే స్పష్టంగా బోధిస్తున్నాయి. అంతేకాదు ఏకదైవారాధన, పరలోక భావనలకు సంబంధించిన బోధల్లో సైతం ఎక్కడా వైరుద్ధ్యాన్ని చూడలేము. ఈ అవగాహన ఉన్నవారెవరైనా ఒకాటి వైదిక ధర్మం, ఇస్లాం పరస్పర విరుద్ధ బోధలు కలిగిన ధర్మాలు అని చెప్పే సాహసం చేయలేరు. ఈ లోతైన అవగాహన ఉండబట్టే స్వామీ వివేకానందా హిందూ-ముస్లిముల ఐక్యతను అభిలాషిస్తూ చెబుతున్నదేమిటో ఈ క్రింది గమనించగలరు.
“మన మాతృ భూమి కొరకు వేదాంతం, ఇస్లాం – ఈ రెండిటి విధానాల కలయిక, అంటే వేదాంతమే మేధస్సుగానూ, ఇస్లాం శరీరంగానూ జోడింపబడినదే శరణ్యం అనిపిస్తుంది. భారతదేశం ఉన్న క్లిష్ట పరిస్థితుల నుండి వేదాంతమే మస్తిష్కంగానూ, ఇస్లాం దేహంగానూ భాసిస్తూ ‘విజయవంతమైన, ప్రతిష్ఠాత్మకమైన సంపూర్ణ దేశంగా’ భవిష్యత్తులో వెలవగలదని నాకు స్పష్టంగా గోచరిస్తుంది” – స్వామీ వివేకానంద (నా భారతం అమర భారతం, పేజి నెం.113)
స్వామీ వివేకానంద చెబుతున్న పై మాటను బట్టి వైదిక-ఇస్లాం ధర్మాలు పరస్పర విరుద్ధం ఎంతమాత్రం కాదని సుస్పష్టమవుతుంది. దీనిని బట్టి హిందూ-ముస్లిం వర్గాలలో కొందరి మధ్య ఏర్పడి ఉన్న అనైక్యతకు వైదిక-ఇస్లాం ధార్మిక దృక్పథాల మధ్య వైరుధ్యం కలిగి ఉండటం కాదు కానీ, వాటి మధ్య సమన్వయం (Co-ordination) చేయటంలో లోపం అని అర్థమౌతుంది. అది గనుక చేయగలిగితే మన దేశం ‘విజయవంతమైన, ప్రతిష్ఠాత్మకమైన సంపూర్ణ దేశంగా’ కాగలదన్న స్వామి వివేకానంద అభిలాష కచ్చితంగా సాధ్యమై తీరుతుంది.
ఒకనాటి వైదిక ధర్మానికి ఇస్లాం ఎంతో సారూప్యత కలిగి ఉన్నప్పటికీ వాటిని నమ్మేఅధికశాతం ప్రజల మధ్య ఐక్యత ఎందుకు లేదు అన్నది గమనిస్తే దానికి రెండు కారణాలు మన ముందుకొస్తున్నాయి. అవి: 1. హిందూ-ముస్లిం వర్గాల్లో ప్రజలు తమ వద్ద ఉన్న ధార్మిక గ్రంధాలను పరిశీలనగా చదవకపోవటం 2. ఆయా ధార్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్న విశ్వాసాల ఆధారంగా కాక, స్వయం కల్పిత విశ్వాసాల ఆధారంగా కొందరు శాస్త్రులు సృష్టించిన మూఢాచారలతో కూడిన కాల్పనిక ధర్మాన్ని అనుసరించటం. ఈ ముఢాచారాలతో కూడిన కాల్పనిక ధర్మమే ధార్మిక గ్రంథాలు బోధిస్తున్న అసలు ధర్మమని అపోహపడి కొందరు విధ్యావంతులు మొత్తానికి ధర్మానికే దూరమైపోయి నాస్తికులుగా మారిపోయారు. ప్రస్తుత కాలంలో ధర్మం అంటే చాలా మందికి వెగటు పుట్టటానికి ధార్మిక గ్రంధాలు కావు, కానీ కొందరు స్వార్థపరులు సృష్టించిన కాల్పనిక ధర్మం, దాని తాలూకు మూఢ విశ్వాసాలు మూధాచారాలే!
కాబట్టి నిజమైన వైదిక ధర్మాన్ని తెలుసుకోవాలంటే హిందూ సమాజాన్ని కాదు వేదోపనిషత్తులు చదవాలి, అలాగే ఇస్లాం గురించి యదార్థంగా తెలుసుకోవాలంటే ముస్లిం సమాజాన్ని కాదు ఖురాన్-హదీసులు చదవాలి.
ఈ గ్రంథాలు చదివితే చివరకు తేలే విషయం ఒక్కటే అది- “మానవులంతా ఒకే జంట సంతానం, అందరి ధర్మం ఒక్కటే, అందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే” అన్నది. ఈ సత్యాన్ని అటు హిందూ సమాజంలో ఇటు ముస్లిం సమాజంలో మాన్యుల నుండి సామాన్యుల వరకు అవగాహన చేసుకున్నప్పుడు ఇరువర్గాల్లో భావసారూప్యత అన్నది ఏర్పడుతుంది. అప్పుడే వివేకానందుని అభిలాష ప్రకారం ‘విజయవంతమైన, ప్రతిష్ఠాత్మకమైన సంపూర్ణ దేశం’ నిర్మించటం సాధ్యపడుతుంది.
Md Nooruddin
హిందూ, ముస్లిముల ఐక్యత – వివేకానందుని అభిలాష
