అదేంటి… యేసు ప్రత్యక్షంగా దేవుడు కాదా? మళ్లా దేవుడు, యేసును పుట్టించటమేంటి? దేవుడే కదా శరీరధారిగా మారి యేసులా పుట్టింది? అలాంటప్పుడు దేవుడు, యేసును పుట్టించటమేంటి? కానీ, “దేవుడు, యేసును పుట్టించెను” అని చెబుతుంది ఎవరో కాదు స్వయంగా పౌలే!
“అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను” -అ.పో.కా 13:23
“దేవుడు తన సేవకుడైన యేసును పుట్టించెను (అ.పో.కా 3:26)” అన్నది బైబిల్ ప్రకటిస్తున్న విషయం. “యేసు, దేవుని వలన కలిగెను (యోహాను 1:14)” అంటూ యోహాను సువార్తీకుడు సైతం ‘యేసు, దేవుని ద్వారా పుట్టించబడ్డార’ని స్పష్టం చెయ్యటం జరుగుతుంది.
ఇదే విషయాన్ని స్వయంగా యేసు- “నా అంతట నేను రాలేదు ఆ దేవుడే నన్ను పంపాడని (యోహాను 8:42)” చెప్పటాన్ని బట్టి యేసు, తండ్రి అయిన యెహోవా దేవుని ద్వారా పుట్టించబడ్డ మానవ మాత్రుడని తేలిపోతుంది.
కానీ, అధికశాతం మంది క్రైస్తవులు యేసు పుట్టుక విషయంలో అపార్థానికి గురైపోయారు. ఆయన భౌతిక తండ్రి లేకుండా కన్యకు పుట్టటం వల్ల ఆ తండ్రి స్థానంలో దేవుడైన యెహోవాను భర్తీ చేసెయ్యటమే కాక, ‘ఒక్క యేసు మాత్రమే దేవునికి ఏకైక కుమారుడు’, ‘దేవుడైన యెహోవా ఆయనకు స్వంత తండ్రి‘ అని ఊహించుకునేంత వరకు వెళ్లిపోయారు.
తరువాతి కాలాల్లో కొందరు బోధకులు తండ్రి, కుమారుడితో పాటు పరిశుద్ధాత్మను కూడా జత కలిపి, అంతకు ముందు నుండే అన్య జాతుల్లో ఉండే త్రిత్వ సిద్ధాంతాన్ని ఎరువు తెచ్చుకుని, దానికనుగుణంగా బైబిల్ వాక్యాలను కుదించి త్రిత్వాన్ని (Trinity) బోధించటం మొదలెట్టారు.
“రాళ్లవలన సైతం దేవుడు పిల్లలను పుట్టింపగలడని (మత్తయి 3:9)” చెబుతున్న బైబిల్ ప్రకటనను పెడచెవిని పెట్టి, భౌతిక తండ్రి లేకుండా యేసు పుట్టటం ఆయనకున్న ప్రత్యేక దైవిక శక్తి వల్లే సాధ్యపడిందని క్రైస్తవ్యంలో చాలా మంది భావించి, ఆయనకు లేని దైవత్వాన్ని అంటగట్టారు.
యేసు పుట్టటానికి పూర్వం నుండే యూదుల్లో దేవుణ్ణి ‘తండ్రి’ అని సంబోధించే ఆచారం ఉండేదని పాతనిబంధనలో సైతం చూడగలం (మలాకీ 3:10). స్వయంగా యేసు తన సువార్తలో దేవుడు “నా తండ్రి మరియు మీ తండ్రి కూడా (యోహాను 20:17)” అని చెబుతూ దేవుడు నాకే కాదు మీకు కూడా తండ్రే అన్న విషయాన్ని తేల్చిపరేశారు.
ఈ లోకంలో మానవ మాత్రుడిగా దేవునిచే పుట్టించబడ్డ యేసుక్రీస్తు రాకడ లోని లక్ష్యమే “సత్యవంతుడైన దేవుణ్ణి (అంటే యోహోవాను) ప్రజలు ఎరగవలెనని ‘వివేకము’ను అనుగ్రహించటం (1 యోహాన్ 5:20)” అన్నది బైబిల్ చదివే వారికి ఎరుకే.
అందుకే భవిష్యత్తులో తన అనుచరులు దేవుడు ఎవరు? అన్న విషయంలో ఎక్కడ అపార్థాలకు లోనవుతారో అని.. “భూమి మీద తండ్రి (అంటే దేవుడు) అని ఎవరికీ పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు ఆయన పరలోకంలో ఉన్నాడు (మత్తయి 23:9)” అని స్పష్టపరిచారు.
అంతేకాదు, తన విషయంలో ఏ కన్ఫ్యూజన్ లేకుండా “నేను క్రీస్తనబడిన మెస్సియ (యోహాను 4:25)”ను మాత్రమే అని తేల్చి చెప్పేశారు. సరిగ్గా ఈ విషయంలోనే సాతాను క్రైస్తవుల్లో చాలా మందిని గందరగోళంలో పడేశాడు. వారికి యేసును దేవుడన్న అపార్థానికి గురిచేసేశాడు.
“తండ్రి” – “కుమారుడు” అంటే..?
స్వయంగా దేవుడైన యెహోవా పాతనిబంధనలో అనేక వాక్యాల్లో సమస్త ఇశ్రాయేలు ప్రజలకు నేను తండ్రిని (యిర్మియా 31:9) అని ప్రకటించినట్టు చూడగలం. అంతేకాదు సమస్త ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి “నేను కన్న ప్రజలు (ద్వితీ 32:18)” అని సైతం సంబోధించినట్టు చూడగలం.
ప్రవక్త సోలోమోనును “నా కుమారునిగా ఏర్పర్చుకున్నాను (1 దిన 28:6)” అని స్వయంగా దేవుడైన యెహోవా ప్రకటించటమే కాక, “మీరందరూ నా కుమారులు (కీర్తనలు 82:6)” అని చెప్పటాన్ని బట్టి కొందరు క్రైస్తవ పండితులు యేసుకు ఆపాదించిన “దేవుని ఏకైక కన్న కుమారుడు” అన్న సిద్ధాంతం ఎంత అర్థరహితమో తేలిపోతుంది.
Note: బైబిల్లో “తండ్రి” అన్నది “పాలకుడు, పోషకుడు” అన్న అర్థాల్లో అలంకారికంగా చెప్పబడిన పదం. “కుమారుడు” అన్నది ఆ దేవునికి “ఇష్టుడు” అన్న అర్థంలో వాడబడిన అలంకారిక పదం. తప్పితే కుమారుడు అంటే దేవునిలో నుండి ఊడి పడ్డవాడనో, ఆయన స్వయంగా కన్న కుమారుడనో కాదు!
బైబిల్ దేవుడు, పుట్టుక లేనివాడు, చనిపోనివాడు!
“నేను పరిశుద్ధ దేవుడను గానీ మనుష్యుడను కాను” (హోషేయ 11:6) అన్న బైబిల్ వాక్యంలో స్వయంగా యెహోవా దేవుడే ‘నేను మానవ మాత్రుడిగా పుట్టేవాడిని కాను’ అని బహిరంగ ప్రకటన చేస్తున్నాడు. “యెహోవా నరుడు కాడు (1 సమూ 15:29)” ఆయన “చనిపోనివాడు” (రోమా 1:23) అన్నది బైబిల్ చేస్తున్న స్పష్టమైన ప్రకటన.
డిసెంబరు 25 న యేసు పుట్టిన రోజును జరిపే ఆచారం ఎవరు కనిపెట్టారో గానీ ఈ ఆచారం ద్వారా వారు “యేసే దేవుడు” అన్న అపార్థాన్ని పటాపంచలు చేసిపరేశారనే చెప్పాలి! కారణం బైబిల్లో దేవుడు “పుట్టుక ఉన్న నరుడు కాడు, ఇంకా ఆయన చనిపోయే మనుష్యుడు కాడు” కాబట్టి!
చాలా మందిలో ఈ అవగాహన లోపమే చావు, పుట్టుకలు లేని దేవుడైన యెహోవా, యేసు రూపంలో కన్యక గర్భం ద్వారా ఈ లోకంలో పుట్టేశాడని ఊహించుకునేంత ‘గొప్ప పాపం’ వారి ద్వారా చేయించటానికి సాతానుకు మార్గం శులభతరం అయిపోయింది.
కాబట్టి ఈలోకంలో పుట్టిన యేసు, దేవుని ద్వారా పుట్టించబడిన “క్రీస్తు” లేక “మెస్సియ” అని గుర్తించి, ఆయన్ని పుట్టించిన యెహోవా మానవ మాత్రుడిగా పుట్టని, చనిపోని సర్వశక్తిగల దేవుడని తెలుసుకుని ఆయన్ని మాత్రమే ఆరాధించే నిజ క్రైస్తవులుగా మారాలని ఆశిస్తూ క్రైస్తవ మిత్రులందరికీ హ్యాపీ క్రిస్ మస్
దేవుడు, యేసును పుట్టించెను /-
