మిరకిల్ వర్కర్స్ //-

ఇక్కడ ఒప్పుకుతీరాల్సిన విషయం ఏమిటంటే క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా బీదలకు సేవ చెయ్యటం, అప్పటికే దేవాలయాలలో ప్రవేశం నిషిద్ధం చెయ్యబడి అంటరానివారిగా చూడబడుతున్న దళితులను, వెనుకబడిన వర్గాల వారిని దగ్గర తీసుకుని తమ చర్చీ తలుపులను వారికోసం తెరవటం అన్న రెండు అంశాలూ బీద బలహీన వర్గాల ప్రజలను క్రైస్తవ్యానికి దగ్గర చేసినప్పటికీ, రెండొందల సంవత్సరాల బ్రిటిష్ పాలకుల దారుణమైన దౌర్జన్యాల తరువాత కూడా వారు పాటించే మతమైన ‘క్రైస్తవ్యం’ భారతీయుల ద్వారా ధ్వేషించబడటానికి బదులు అనేకమంది ద్వారా అత్యంత వేగంగా స్వీకరించబడటం వెనుక ప్రధాన కారణంగా పని చేసింది మటుకు “స్వస్థత సువార్తా కూటములు” పేరట కొందరు పాస్టర్స్ “మిరకిల్ వర్కర్స్”గా అవతారమెత్తి ప్రజలను క్రైస్తవ్యం వైపు ఆకర్షింపజేయటమే!

తమ జీవితాలను స్వచ్ఛందంగా సువార్త కోసమే ధారబోసి, సమాజ సేవ చేసే సేవకులు క్రైస్తవంలో కొందరున్నప్పటికీ.. అటు క్రైస్తవ సువార్తను ఒక లాభసాటి వ్యాపారంగా మార్చేసి ఇటు ప్రజల్ని అద్భుతాలు, స్వస్థతల పేరట క్రైస్తవం వైపు ఆకర్షింపజేసే సోకాల్డ్ సువార్తీకులు అధిక శాతం మంది ఉన్నారన్నది సైతం ఒప్పుకోక తప్పదు.

కూటముల పేరట తొలి బియ్యం, తొలి కోడిగుడ్లు, తొలి తోటకురలు, పప్పులు ఉప్పులు, దశమ భాగాలు వగైరా వాటిని ప్రజల నుండి రాబట్టుకోవటమే కాక, డైరెక్టు ప్రార్ధనకు ఒకరేటు, టీవీ, ఫోనుల్లో ప్రార్ధనలకు ఇంత రేటని నిర్ణయించి ప్రజల నుండి డబ్బు వసూలు చెయ్యటం నుండి.. ‘స్వస్థత శాలలు’ కట్టి మేము ప్రార్ధించిన ప్రేయర్ ఆయిల్ రాసుకుంటే చాలు ఎలాంటి రోగాలైనా మాయమైపోతాయని, దయ్యాలు పారిపోతాయని ప్రజలను మభ్య పెట్టి “ప్రేయర్ ఆయిల్ (కొబ్బరి నూనె)” సీసాలు, హోలీవాటర్ బాటిళ్లను అమ్ముటం వరకు కోట్ల రూపాయల వ్యాపారం ఒకవైపు జరిగిపోతుంటుంది.

మరో వైపు “స్వస్థత సువార్త కూడికలు/సభలు” పేర్లతో భీభత్సమైన లౌడ్ స్పీకర్లూ, గ్రూప్ సాంగ్స్, లైటింగులతో భారీస్థాయిలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి కుంటి వారు నడవగలుగుతారు, గుడ్డి వారు చూడగలుగుతారని, అద్భుతాలు జరుగుతాయని, ఎలాంటి రోగాలైనా ఫలానా “బ్రదర్” ప్రార్ధిస్తే చాలు బాగుపడిపోతారని కరపత్రాలు పంచి ప్రజలను ఆడిటోరియమ్స్ లో పోగుచేసి క్రైస్తవ్యం వైపునకు ప్రజలను ఆకర్షించే హై డ్రామా పెద్ద స్థాయి రెవరెండ్లు, పాస్టర్ల ద్వారా నిర్వహించబడుతూ ఉంటుంది.

“మిరకిల్ వర్కర్స్” గా అవతారమెత్తి “ప్రోఫెట్స్” లేదా “బ్రదర్స్” అన్న ట్యాగ్ లు తగిలించుకుని ప్రజల్లో ఫేమస్సై స్వయంగా వారు దేవుని దూతలనట్టు, దేవునితో తమకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు దేవునితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతుంటామన్నట్టు ప్రజలకు మభ్య పెడుతుంటారు. వారు వేసుకునే ఖరీదైన కోట్లూ బూట్లూ, వారు చేసే హడావిడి చూసి సామాన్య ప్రజలు కూడా నిజంగానే వీళ్లకు నిజంగానే ఏవో అద్భుతాలు చెయ్యగలిగే మహిమలున్నాయని నమ్మేసి తమ కష్టాలు వారి ముందు చెప్పుకుంటే వారు దేవుడితో మాట్లాడేసి ఆ కష్టాల నుండి బయటపడవేస్తారని నమ్ముతుంటారు.

“స్వస్థత సువార్త కూడికలు/సభలు” పేర్లతో ఏర్పాటు చెయ్యబడే సభల్లో కొందర్ని కుంటి వారిగా, కేన్సర్ రోగులుగా, గుడ్డి వారుగా ఇంకా ఏవో రోగాలున్నవారిగా నటింపజేస్తూ ప్రవేశపెట్టటం జరుగుతుంది. వీళ్లతో ముందుగానే రిహార్సల్స్ చేయించటం జరుగుతుంది. అంత మంది జనంలో ఆ ‘క్రిస్టియన్ బ్రదర్స్’ పేర్లు పెట్టి వీళ్లనే ప్రత్యేకంగా పిలుస్తారు.
వాళ్లు తమకు ఫలానా కేన్సర్ రోగం ఉందనో, షుగర్ రోగం ఉందనో, నడవలేకపోతున్నామనో రోదిస్తూ చెప్పగానే బ్రదర్ “ఓ కేన్సర్ రోగామా పారిపో”, “ఓ షుగర్ రోగమా విడిచిపెట్టి పో, ఓ దయ్యమా విడిచిపెట్టి పో.. ఉష్” అని చెబుతూ.. “షుర్మబక్బర్మర్సిగ్మర్సుర్మర్హుష్”.. అంటూ ఏవో కొన్ని అర్థం పర్థం లేని వింత పదాలను మంత్రాల మాదిరి వల్లిస్తూ చేతిని వాళ్ల నుదుటిపై పెట్టి “టచ్” అనగానే ఆ సోకాల్డ్ రోగులు తమకు రోగం బాగైపోయిందని, కాళ్లొచ్చేశాయి, కళ్లొచ్చేశాయనిపెద్ద పెద్ద కేకలతో కేరింతలు పెడుతూ మైకం ఆవహించినట్టు కింద పడి దొల్లేస్తుంటారు.

ఒకప్రక్క పెద్ద పెద్ద శబ్దాలతో మ్యూజిక్ మరియు పాటలతో ఆ ఆడిటోరియం హోరెత్తిపోతుంది. మరోప్రక్క మిరకిల్స్ జరిగిపోతున్నాయని ‘హిలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.. హల్లెలూయ’ అంటూ గొంతు చించుకుని బ్రదర్లు పెట్టే పిచ్చి కేకలకు అక్కడ ఒకరకమైన ఉన్మాద వాతావరణం ఏర్పడిపోతుంది. అక్కడ పోగయ్యే జనాలను ఆయా క్రిస్టియన్ బ్రదర్స్ “మీపై పరిశుద్ధాత్మ వాలిపోయిందీ.. హల్లెలుయా, హల్లెలుయా” అంటూ కేకలు పెడుతూ వారందరినీ ఒకరకమైన “ట్రాన్స్”లోకి తీసుకెళ్లిపోవటం జరుగుతుంది. అక్కడ పోగయ్యే జనాలు కూడా “హిస్టీరియా అటాక్”కు గురైపోయి సైకిక్ వైబ్రేషన్ తో పిచ్చిగా పిచ్చిగా చప్పట్లు కొడుతూ డ్యాన్సులు కట్టేయటం, గుండెల మీద బాదేసుకుంటూ కిందపడి దొల్లేయటం మొదలెడతారు.

అరుపులూ కేకలు కేరింతలతో కూడిన అలాంటి ఉన్మాద వాతావరణంలో మనిషి ఒకరకమైన సైకిక్ వైబ్రేషన్ కు గురై వింతగా ప్రవర్తించటం చాలా చోట్ల మనం చూడవచ్చు. ఉదాహరణకు మహంకాళీ జాతరల్లో పూనకాలొచ్చి, ముహర్రంనాడు చేసే మాతంలో సైతం ఉన్మాదంతో ఊగిపోయేవారిని చూడగలం.

ముందుగానే రిహార్సల్ చేసిపెట్టుకున్న సోకాల్డ్ రోగులను స్టేజిల పై పిలిచి వారితో పరిగెట్టించటం, మీ మోకాలి నొప్పులు మాయమైపోయాయని గెంతులేయించటం, గుంజీలు తీయించటం, నుదుటిపై చేతులు పెట్టి మీకు కళ్లొచ్చేశాయని వారితో సాక్ష్యాలిప్పించటం వగైరా వింత విన్యాసాలను చూసే సామాన్య ప్రజలు నిజంగానే అక్కడ ఏవో అద్భుతాలు జరిగిపోతున్నాయని నమ్మేస్తుంటారు. కానీ ఈ వ్యవహారం వెనుక కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగిపోతుందని పాపం వారికి తెలీదు.
*****

ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే… తమ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పుకునే ఈ మిరకిల్ వర్కర్స్ స్వయంగా తమకొచ్చే రోగాలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు!
తమకుండే షుగర్, బీపీ రోగాలకు మెట్ఫార్మిన్, ఆమ్లోడిపిన్ మాత్రాలే వాడుతుంటారు! హార్ట్ లో వాల్వ్స్ మూసుకుపోతే ఆపరేషన్ చేయించుకుని స్టంట్లు పెట్టించుకుంటారు తప్ప ప్రేయర్ ఆయిల్ త్రాగి బాగుచేసుకోరు!
తమ భార్యా, పిల్లలకు ఏదైనా రోగమొస్తే హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారే తప్ప వారిని ప్రేయర్ చేసో, ప్రేయర్ ఆయిల్ పూసో బాగుచెయ్యరు.
స్టేజీలపై అంతమందిని బాగు చేసే ఈ ‘సోకాల్డ్ మిరకిల్ హీలర్స్’ అదేదో గవర్నమెంట్ హాస్పిటల్ లో పడి ఉన్న రోగుల్ని బాగు చేసి చూపించవచ్చుకదా? పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా నిర్వహించబడే హాస్పిటళ్లలో ఎం.బీ.బీ.ఎస్, ఎం.డీ చదివిన డాక్టర్లే ఉంటారు తప్ప ఈ మిరకిల్ వర్కర్స్ ఎందుకుండరు?

ఒకప్పుడు సైకిళ్ల పై బైబిల్ పట్టుకుని తిరిగే సామాన్య స్థాయి బోధకులు కూడా “మిరకిల్ వర్కర్స్”గా అవతారమెత్తి కల్లిబొల్లి మాటలతో కోట్ల రూపాయలకు అధిపతులైపోయి ఆడి కార్లలో తిరుగుతున్నా చాలా మంది వీరిని గుడ్డిగా నమ్మేయటం కొసమెరుపు.

మరి తమ రోగాలు బాగుపడ్డాయని కొందరిచ్చే సాక్ష్యాల సంగతేంటి? ఇలాంటి సాక్ష్యాలు బాబాల్నీ, స్వాముల్నీ సమాధులు, చెట్లను, పుట్టలను పూజించేవాళ్లు కూడా ఇస్తుంటారు. దానికి కారణం ఫలానా దాన్ని నమ్ముకుంటే నాకు బాగైపోతుందన్న సైకాలజీ నుండి ఏర్పడే “ప్లాసీబో ఎఫెక్ట్ (Placebo effect)” ప్రధాన కారణం.

అదెలాగంటే ఫలానా మందు వాడితే మీ రోగం బాగైపోతుందని బలంగా నమ్మించి ఇచ్చే నకిలీ మందు సైతం పేషంట్ సైకలాజి ఆధారంగా పని చేస్తుంది. దీనినే మెడికల్ టెర్మినాలజీలో “ప్లాసీబో ఎఫెక్ట్” అంటారు. వివరంగా చెప్పాలంటే.. ఒక వ్యక్తికి ఏదైనా రోగం నయమవ్వటం అన్నది 90 శాతం అతని అంతర్గత శక్తిపై, అతను నమ్మే మందుపై ఉండే గట్టి నమ్మకమే పని చేస్తుంది.
ఈ రకంగా రోగి యొక్క సైకాలజీ ఆధారంగా రోగం నయం చేసే వైద్య విధానాన్నే “ప్లాసీబో ఎఫెక్ట్” అంటారు! ఈ సైకాలజీ ఆధారంగానే క్రిస్టియన్ బ్రదర్స్ నుండి బాబాలూ, స్వాములు, మసీదుల ముందు తాయెత్తులు అమ్ముకునేవాళ్ల వరకు తమను నమ్మి వచ్చే రోగుల్ని బాగుచేస్తామని నమ్మిస్తుంటారు. నిజానికి అది వారి దగ్గరుండే మహిమలు కారణం కాదు. ప్రజల్లో ఉండే మూఢభక్తి మాత్రమే!

బ్రదర్స్ నుండి బాబాల వరకు ప్రజల్ని గొర్రెలుగా చేసి ఎలా ఆడించగలుగుతున్నారు? దానికి ప్రధాన కారణం ప్రజలు తమ దగ్గరున్న ధార్మిక గ్రంథాలు తెరచి చదవకపోవటం. క్రైస్తవులు చదివే బైబిల్లోనే “అబద్ధపు ప్రవక్తలు వచ్చి ప్రజల్ని మోసపుచ్చటానికి సూచక క్రియలు, మహాత్కార్యాలు చూపుతారు జాగ్రత్తగా ఉండండి (మార్కు 13:21,23)” అని స్పష్టంగా రాసి ఉంది.
అనేక అద్భుతాలు చేసి, దయ్యాలు వెళ్లగొట్టామని చెప్పేవారిని స్వయంగా యేసే “అక్రమములు చెయ్యువారలారా పొండని (మత్తయి 7:22,23)” శపించటం జరుగుతుందని బైబిల్ హెచ్చరిస్తుంది. ఈ విధంగా బైబిల్ అద్భుతాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టేవారిని అబద్ధ ప్రవక్తలని చెబుతుంది.

చివరిగా అర్థం చేసుకోవలసింది అద్భుతాల పేరుతో ప్రజల్ని బకరాలు చేసే “బ్రదర్స్” నుండి బాబాలు, మసీదుల ముందు తాయెత్తులు అమ్ముకునేవారి వరకు ప్రజల అజ్ఞానంతో కూడిన సెంటిమెంట్స్ ఆధారంగా వ్యాపారం చేసేవారే!

నిజానికి కొందరు క్రైస్తవ బోధకులు స్టేజీలపై అద్భుతాల పేరుతో చేసే విన్యాసాలను బైబిల్ జ్ఞానమున్న చాలా మంది నిజ క్రైస్తవ బోధకులే ఖండిస్తూ ఉంటారు. మొత్తం క్రైస్తవ్యంలో అందరు బోధకులూ ఇలానే ఉంటారని అనుకోవటం కూడా తప్పే. వారిలో జీవితాలను ప్రజల సేవ కొరకే అంకితం చేసేసిన ఎందరో మాహానుభావులూ ఉన్నారు. కాకపోతే, ప్రజల్ని మభ్యపెట్టి డబ్బు సంపాదించే ఇలాంటి మిరకిల్ వర్కర్స్ గురించి అవగాహన కలిగి ఉండటంతో పాటు, గుడ్డి నమ్మకాలకు, ధార్మిక గ్రంథాల విశ్వాసాలకు మధ్య ఉన్న తేడా ఏమిటన్న అవగాహన సైతం ప్రతిఒక్కరు కలిగి ఉండాలి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *