బైబిల్ దేవుడు పుడతాడా? // –

డిశంబర్ 25 అంటే అధికశాతం క్రైస్తవులు తాము దేవునిగా భావించే యేసు పుట్టిన రోజు. కానీ, ఏ యేసునైతే అధికశాతం క్రైస్తవులు దేవునిగా భావిస్తూ ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటారో ఆ యేసు చావు, పుట్టుకలు లేని సృష్టికర్త అయిన దేవుని గురించి ప్రజలకు ఆనాడు బోధిస్తూ ఉండేవారన్న విషయం ఈనాటి అధికశాతం క్రైస్తవులకు తెలియదంటే అతిశయోక్తి కాదు.

అసలు యేసు క్రీస్తు రాకడ లోని లక్ష్యమే “సత్యవంతుడైన దేవుణ్ణి (అంటే యోహోవాను) ప్రజలు ఎరగవలెనని వివేకము అనుగ్రహించటం (1 యోహాన్ 5:20)” అన్నది బైబిల్ చదివినోల్లకు తెలుస్తుంది.

అందుకే భవిష్యత్తులో తన అనుచరులు దేవుడు ఎవరు? అన్న విషయంలో ఎక్కడ అపార్థాలకు లోనౌతారో అని.. “భూమి మీద తండ్రి (అంటే దేవుడు) అని ఎవరికీ పేరు పెట్టవద్దు.. ఒక్కడే మీ దేవుడు ఆయన పరలోకంలో ఉన్నాడు (మత్తయి 7:23)” అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు తన విషయంలో ఏ కన్ఫ్యూజన్ లేకుండా “నేను క్రీస్తనబడిన మెస్సియ” అని కూడా తేల్చి చెప్పేశారు.

ఇక డిశంబర్ 25 అసలు యేసు పుట్టిన రోజా? కాదా? అన్న విషయంలోనూ క్రైస్తవ పండితుల మధ్యనే వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. నిజానికి వారంతా అసలు పరిశీలించాల్సిన అంశం యేసు డిశంబర్ 25 పుట్టారా? పుట్టలేదా? అన్నది కాదు. డిశంబర్ 25 కాకపోతే సంవత్సరం మొత్తంలో ఆయన ఏదో ఒకరోజు పుట్టే ఉండిఉంటారు కదా. అది ప్రక్కన పెడితే మొత్తానికైతే యేసు పుట్టారు కదా! అలాంటప్పుడు ఇంతకూ యేసు దేవుడా? బైబిల్ దేవుడు పుడతాడా? అన్నవి వారు అసలు సమాధానం వెతకాలిసిన ప్రశ్నలు.
అసలు ఏనాడూ నేను పుట్టలేదు.. అంతెందుకు అసలు నేను నరుడినే కాను అన్నది బైబిల్ దేవుని ప్రకటన.

“నేను పరిశుద్ధ దేవుడను గానీ మనుష్యుడను కాను” – హోషేయ 11:6

బైబిల్లో పై ప్రకటన చేస్తుంది సృష్టికర్త అయిన యెహోవా దేవుడన్నది గమనార్హం. యెహోవా అంటే “Everlasting God” అని అర్థం. అంటే నిత్యం ఉనికిలో ఉండేవాడు.. పుట్టని వాడు, చనిపోని వాడు అని అర్థం. ఈయన్నే ఆనాడు యేసు స్వయంగా ప్రార్ధిస్తూ ప్రజలకు కూడా దేవునిగా పరిచయం చేస్తూ ఉండేవారు. తప్పితే పాపం ఏనాడూ యేసు- నేను దేవుణ్ణి మీరంతా కలిసి నన్ను ప్రార్ధించుకోండని చెప్పలేదు.

కానీ, బాధాకరమైన విషయం ఏమిటంటే.. చావూ, పుట్టుకలు లేని దేవుడైన యెహోవాను పరిచయం చేయటానికి వచ్చిన యేసునే చాలా మంది క్రైస్తవులు దేవునిగా ప్రతిష్టించుకుని ఆయన పుట్టిన రోజును, చనిపోయిన రోజును సెలబ్రేట్ చేసుకోవటమే కాక.. ఫలానా తేదీ మా దేవుడి పుట్టిన రోజు.. ఫలానా తేదీ మా దేవుడి చనిపోయిన రోజని చెప్పుకోవటం!

కానీ, బైబిల్లో యేసు పరిచయం చేసిన దేవుడు “మనుష్యుడు కాదు” అని తెలుస్తుంది. ఇదే విషయాన్ని బైబిల్ ఎంతో స్పష్టంగా మరొక చోట –“ఆయన నరుడు కాదు” – 1 సమూయేలూ 15:29 అని ఎలుగెత్తి ప్రకటిస్తుంది. మరీ ముఖ్యంగా బైబిల్లో అనేక చోట్ల “యెహోవా అక్షయుడు (రోమా 1:23)” అంటే ఎప్పటికీ చనిపోయి క్షీణించని వాడు అని చూడగలం. పుడితేనే కదా చావు ఉండేది.

కాబట్టి బైబిల్లో అనేక ప్రవక్తలూ, యేసు ద్వారా దేవునిగా ప్రకటించబడుతున్న యెహోవా అనే అస్తిత్వం చనిపోనిది అంటే ఎప్పుడూ పుట్టనే పుట్టలేదనే విషయం సుస్పష్టమైంది.

సరే ఇంతకూ నేడు అధికశాతం క్రైస్తవుల ద్వారా ఈ లోకంలో దేవునిగా పుట్టారని భావించబడుతున్న యేసును ఎవరు పుట్టించారు? అన్నది గమనిస్తే..

“దేవుడు (యెహోవా) రక్షకుడగు యేసును పుట్టించెను” – అ.పో.కా 13:23

అని బైబిల్లో చూడగలం. పై వాక్యాన్ని బట్టి డిశంబర్ 25 యేసు ఈ లోకంలో దేవునిగా పుట్టినరోజు కాదు.. కానీ, దేవుడు.. యేసును పుట్టించిన రోజు! అది డిశంబర్ 25 కాకపోతే మరొక రోజైనా మొత్తానికి యేసు .. దేవుని ద్వారా పుట్టించబడిన దేవుని సేవకుడు (మత్తయి 12:18) అన్నది మటుకు సుస్పష్టం.

ఇదంతా చదివి అబ్బేబ్బే! మా యేసుబాబు డిశంబర్ 25 న దేవునిగా ఈ లోకంలో పుట్టారని ఎవరైనా అడ్డదిడ్డంగా వాదిస్తే అలాంటి వారందరినీ ఇక ఆ దేవుడే కాపాడాలి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *