“ఖురాన్లో అల్లాహ్ యే దేవుడైతే “నేను, నేనే” అని తన గురించి సంబోధించటానికి బదులు “ఆయన” అంటూ మూడవ వ్యక్తి స్థానం (Third person) లో ఉంటూ అల్లాహ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఖురాన్లో అల్లాహ్ గురించి మాట్లాడుతున్నది ఎవరు? ఇది నేటి కనీస భాషా, వ్యాకరణ నియమాల పరిజ్ఞానం లేని కొందరు క్రైస్తవ బోధకులు అడిగే ప్రశ్నల్లో ఒకటి. ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ అనేక చోట్ల తన గురించి “ఆయన” అంటూ సంబోధించిన వాక్యాలను చూసి ఖురాన్ లో కనీసం పై పై జ్ఞానం కూడా లేని కొందరు అభినవ బోధకులు “ఖురాన్ లో అల్లాహ్ “నేనే దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నాడో చూపించండి?” అని అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటారు. అలా ప్రశ్నిస్తున్న వారికి సమాధానమే ఈ ఆర్టికల్. చదవగలరు.
***
ఏదైనా ఒక గ్రంథాన్ని గానీ పుస్తకాన్ని గానీ చదవాలి అంటే కచ్చితంగా భాషా పరిజ్ఞానంతో పాటు వ్యాకరణ నియమాల పరిజ్ఞానం జ్ఞానం కూడా ఉండటం తప్పనిసరి. అవి లేని క్రైస్తవ బోధకులు మాత్రమే అసలు ఇలాంటి ప్రశ్నలు వేసే సాహసం చేస్తుంటారు. అసలు “ఖురాన్ లో అల్లాహ్ నేనే దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నాడు చూపండి?” అని నేటి కొందరు క్రైస్తవ బోధకులు ఎందుకు అడుగుతూ ఉంటారంటే- బైబిల్లో యేసు దేవుడే ఆయన ఎక్కడైనా “నేనే దేవుడను” అని చెప్పుకున్నట్టు చూపండి అని ఏ ముస్లిం బోధకుడైనా ప్రశ్నించినప్పుడు అది చూపటం వారికి పది జన్మలు ఎత్తినా సాధ్యం కాదన్న విషయం తెలుసు కాబట్టి ఆ ప్రశ్న నుండి తప్పించుకోవటానికి ఏ మాత్రం పొంతన లేని కొన్ని ప్రశ్నలు వేసి తప్పించుకుంటూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారు అడిగే ప్రశ్నే- “ఖురాన్ లో అల్లాహ్ నేనే దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నాడు చూపండి?” అన్నది ఒకటి.
“యేసు నేనే దేవుడని” బైబిల్లో ఎందుకు చెప్పులేదు?” అన్న ప్రశ్నకు “ఖురాన్లో అల్లాహ్ “నేనే అల్లాహ్” అని ఎక్కడ ప్రకటించుకున్నాడు?” అని ఎదురు ప్రశ్నించటం నిజానికి సమాధానం చెప్పలేని స్థితిలో తప్పించుకోవటానికి చూపే కుంటిసాకే అవుతుంది! నిజాన్ని కప్పిపుచ్చాలన్నప్పుడు, సమాధానం తన దగ్గర లేనప్పుడు మనిషి కుంటి సాకులే వెతుకుతూ ఉంటాడు అన్నది వాస్తవం.
ఖురాన్లో ఉన్న ప్రతీ వాక్యంలో ప్రవక్త ముహమ్మద్ (స)తో మాట్లాడుతుంది అల్లాహ్ యే!
భాషా పరిజ్ఞానం లేని అభినవ క్రైస్తవ బోధకుల వాదన ఏమిటంటే- ఖురాన్ స్వయంగా అల్లాహ్ యే బోధిస్తే … “అల్లాహ్ – ఆయన తప్ప ఆరాధ్యదైవం ఎవ్వడూ లేడు” – 2:255 అన్న వాక్యంలో “నేనే అల్లాహ్ ను నేను తప్ప ఆరాధ్యదైవం ఎవ్వడూ లేడు” అని నేరుగా మొదటి వ్యక్తి (First person) స్థానం లో చెప్పుకోవచ్చుగా “ఆయన తప్ప ఆరాధ్యదైవం ఎవ్వడూ లేడు” అంటూ “మూడవ వ్యక్తి (Third person) స్థానంలో ఉండి ఎందుకు మాట్లాడుతున్నాడు? కాబట్టి “మీ ప్రభువు అల్లాహ్ యే” “మీరంతా అల్లాహ్ కు దాస్యం చేయండి” “ఆయన తప్ప ఆరాధ్యదైవం ఎవడూ లేడు” అన్న వాక్యాల్లో మాట్లాడుతుంది అల్లాహ్ యేనా? లేక అల్లాహ్ గురించి మరొకరు మాట్లాడుతున్నారా? దీనిని బట్టి ఎవరో అల్లాహ్ గురించి ఖురాన్లో చెబుతున్నాడు తప్ప అల్లాహ్ స్వయంగా ఖురాన్ లో మాట్లాడటం లేదన్నది.
దీనికి సమాధానం ఏమిటంటే- నిజానికి ఖురాన్లో అల్లాహ్ తన గురించి “నేను” అని సంబోధించుకున్నట్టు అనేక వాక్యాలు ఉన్నాయి. “మేము” “ఆయన” అని సంబోధించిన వాక్యాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా అల్లాహ్ తన గురించి ఉద్దేశిస్తూ సందర్భాన్ని బట్టి మూడు విధాలుగా పరిచయం చేసుకున్నట్టు ఖురాన్ లో చూడగలం. అయితే అనేక సందర్భల్లో అల్లాహ్ తన గురించి “ఆయన” అంటూ మాట్లాడటానికి కారణం- మొదటి వ్యక్తి (First person) స్థానంలో ఉన్న ప్రవక్త, రెండవ వ్యక్తి (Second person) స్థానంలో ఉన్న ప్రజల ముందు, మూడవ వ్యక్తి స్థానం (Third person) లో ఉన్న అల్లాహ్ గురించి చెప్పెటప్పుడు “ఆయన” అనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఖురాన్ లో దాదాపు వాక్యాలన్నీ ప్రవక్త ముహమ్మద్ (స) ప్రజలతో మాట్లాడే సామాన్య భాషలోనే అవతరించాయి. అప్పుడే ప్రజలకు ప్రవక్త తనకు అతీతమైన దైవాన్ని పరిచయం చేస్తున్నాడన్న స్పష్టత ఉంటుంది.
అంతేకాక ఒక అధికారిక హోదాలో ఉండే ఒక రాజు తన ప్రజలతో మాట్లాడే సందర్భంలో “మీ రాజు ఇలా నిర్ణయం చేశాడు” “మీరు మీ రాజు ఆజ్ఞకు కట్టుబడి ఉండాలి” వగైరా అంటూ తన గురించే “ఆయన” అంటూ సంబోధించటం అన్నది భాషా నియమాలలో అదొక అలంకారం అని చెప్పవచ్చు.
ఇక ఖురాన్ లో దాదాపు వాక్యాలన్నీ ప్రవక్త ప్రజలతో మాట్లాడే భాషలోనే అవతరించాయి. అలాగే సందర్భాన్ని బట్టి అనేక చోట్ల అల్లాహ్ స్వయంగా “నేనే దేవుణ్ణి నన్నే ఆరాధించమని” ప్రకటించిన వాక్యాలూ ఉన్నాయి.
“నేను తప్ప మీకు మరొక దేవుడు ఎవ్వడూ లేడు. కనుక మీరు నాకే భయపడండి” – 16:3
“నేనే అల్లాహ్ ను, నేను తప్ప మరొక దేవుడు లేడు, కనుక నీవు నాకే దాస్యం చేయి. నా జ్ఞాపకం కోసం నమాజును స్థాపించు” – 20:14
“మీరు నన్ను మాత్రమే ఆరాధించండి” – 29:56
“నేను జిన్నాతులను మానవులను నా ఆరాధన కొరకు తప్ప మరి దేనికొరకూ సృష్టించలేదు.” – 51:56
“మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి వహీ (శృతి) ద్వారా – “నేను తప్ప వేరొక దేవుడు లేడు. కనుక మీరు నాకే దాస్యం చేయండి” అనే విషయాన్నే తెలియజేశాము” – 21:24
అలాగే కొన్ని సందర్భాల్లో ప్రవక్తతో ప్రజల ముందు ఈ విధంగా ప్రకటించమని చెప్పిన సందర్భాల్లో అల్లాహ్ తన గురించి “ఆయన” అని సంబోధించిన వాక్యాలూ ఉన్నాయి.
“ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైనవాడు ఎవడూ లేడు” – 9:31
“మీ దేవుడు ఒక్కడే. ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు” – 2:163
“అల్లాహ్ – ఆయన తప్ప ఆరాధ్యదైవం ఎవ్వడూ లేడు” – 2:255
***
బైబిల్లో సైతం యెహోవా, యెహోవా గురించి మాట్లాడినట్టు చూడగలం!
ఒక్క ఖురాన్ లో మాత్రమే కాదు బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే అనేక సందర్భాల్లో స్వయంగా యెహోవా తన గురించే “ఆయన” అంటూ “యెహోవా” అంటూ సంబోధించుకున్న వైనం గమనించగలం. ఉదాహరణకు కొన్ని వాక్యాలు ఈ క్రింది గమనించండి.
“ఇస్రాయెలీయులు పవిత్రమైన పాత్రలో నైవేధ్యమును యెహోవా మందిరములో తెచ్చునట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీలమీదను కంచరగాడిదల మీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యేరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేధ్యముగా వారు తీసుకుని వాచ్చేదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు” – యేషయా 66:20
పై వాక్యంలో “నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యేరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేధ్యముగా వారు తీసుకుని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు” అని చెబుతుంది యెహోవాయే! ఈ వాక్యంలో యెహోవా గురించి మాట్లాడుతున్న యెహోవా ఎవరు? అంటే సమాధానం ఏమిటి?
“బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధననతిక్రమించి నా ధర్మశాస్త్రము మీరి యున్నారు. గనుక పక్షీరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునాకు వచ్చునని ప్రకటింపుము” – హోషయ 8:1
పై వాక్యంలో “శత్రువు యెహోవా మందిరమునాకు వచ్చునని ప్రకటింపుము” అంటూ యెహోవా గురించి మాట్లాడుతున్న యెహోవా ఎవరు? అంటే సమాధానం ఏమిటి? అలాగే ఒక్క ఖురాన్ లోనే కాదు బైబిల్లో సైతం యెహోవా “నేనే ఆయనను” అంటే – నేనే ఆ యెహోవాను అని ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి.
“మీరు తెలిసికొని నన్ను నమ్మి “నేనే ఆయననని” గ్రహించునట్లు మీరును నేను ఏర్పర్చుకొనిన నా సేవకుడు నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండదు” – 43:10
పై వాక్యంలోనే కాక బైబిల్లో అనేక వాక్యాల్లో స్వయంగా యెహోవా –“నిన్ను సృష్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” “యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు” అంటూ మూడవ వ్యక్తి (Third person) స్థానంలో ఉంటూ మాట్లాడటాన్ని స్పష్టంగా గమనించగలం.
***
బైబిల్లో సైతం యేసు, యేసు గురించి మాట్లాడిట్టు చూడగలం!
బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే అనేక సందర్భాల్లో స్వయంగా యేసు తన గురించే “ఆయన” “మనుష్య కుమారుడు” “క్రీస్తు” అంటూ సంబోధించిన వైనం గమనించగలం. ఉదాహరణకు కొన్ని వాక్యాలు ఈ క్రింది గమనించండి.
యేసు- “నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం” – యోహాను 17:3
యేసు- “తన మహిమాతో మనుష్య కుమారుడు “ఆయనతో” కూడా సమస్త దూతలును వచ్చునప్పునప్పుడు “ఆయన” తన మహిమాగల సింహాసనము మీద ఆసీనుడై యుండును” – మత్తయి 25:31
పై వాక్యాలలో యేసు- “యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం” / “మనుష్య కుమారుడు వచ్చునప్పుడు” / “ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునప్పునప్పుడు” / “ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై యుండును” అని యేసు చెబుతుంది వేరే యేసు గురించా? అయితే పై వాక్యల్లో మాట్లాడుతున్న యేసు ఎవరు? అంటే మీ సమాధానం ఏమిటి?
ఇంకా అనేక చోట్ల యేసు- “మనుష్యాకుమారుడు సర్వశక్తుని కుడిపార్స్వంలో కూర్చుంటాడు” అని, “మనుష్యాకుమారుడు వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాడు” “ఆయన వచ్చునప్పుడు” అంటూ తన గురించి చెప్పుకున్నట్టు చూడగలం. ఈ వాక్యాలన్నిటిలో యేసే తన గురించి “ఆయన” అని చెబుతున్నారు.
ఈ విధంగా భాషా నియమాల ప్రకారం అధికారిక హోదాలో ఉండేవారు ముఖ్యంగా తమ గురించి, తమ నిర్ణయాల గురించి చెప్పెటప్పుడు “నేను” “మేము” “ఆయన” అంటూ మూడు పద్ధతుల్లో ప్రస్తావించటం జరుగుతుంది. ఈ మూడు పద్ధతుల్లో అల్లాహ్ తన గురించి ఖురాన్లో చెప్పటం జరిగింది.
ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఖురాన్ లో అల్లాహ్ “ఆయన తప్ప ఆరాధ్యదైవం ఎవ్వడూ లేడు” అన్నాడు కాబట్టి అల్లాహ్ గురించి వేరే వ్యక్తి ఎవరో మాట్లాడుతున్నాడు అని చెప్పటం కేవలం భాషా పరిజ్ఞాన లోపం మాత్రమే అవుతుంది. అలా మొండిగా వాదించేటోల్లు యేసు- “ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై యుండును” అన్న వాక్యంలో యేసు మరొక యేసును గురించి చెబుతున్నారని ఒప్పుకోవాల్సి ఉంటుంది. మరి అలా ఒప్పుకోగలరా??
Md Nooruddin
ఖురాన్లో అల్లాహ్ గురించి మాట్లాడుతున్నది ఎవరు?
