ముస్లిముల ఇళ్ళల్లో పుట్టినోల్లు లేదా అబ్దుల్లా అబ్దుర్రహ్మాన్ వగైరా ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్నోళ్ళంతా ముస్లిములన్నది సాధారణంగా అందరిలో ఉండే ఓ సాధారణ భావన! ముస్లిముల ఇంట పుట్టినప్పటికీ ఇస్లాం ఇచ్చే దృక్పధాన్ని అనుసరించక పైకి ఎన్ని ముస్లిం/అరబిక్ పేర్లు తగిలించుకున్నప్పటికీ అతను ధార్మికంగా ముస్లింగా పరిగణించబడడు! అలాగే ఓ వ్యక్తి యూదుల ఇంట పుట్టినా, క్రైస్తవుల ఇంట పుట్టినా, హైందవుల ఇంట పుట్టినా లేక ఏ వర్గంలో పుట్టినా ఇస్లాం ప్రభోధిస్తున్న మౌలిక దృక్పథాన్ని గనుక కలిగి ఉంటే అతను ముస్లింగానే పరిగణించబడతాడన్న ఇస్లామిక్ కాన్సెప్ట్ మీలో ఎంతమందికి తెలుసు!?
ఆ మౌలిక దృక్పథం ఏమిటంటే- “ఈ సర్వసృష్టికి ఒక దేవుడు ఉన్నాడు అన్నది తెలుసుకుని, మరణాంతరం ఒక రోజు ఆయన ముందు నిలబడి సమాధానం చెప్పుకోవలసి ఉందని నమ్మి, మంచి పనులు చేస్తూ ఒక్క దేవునికే లోబడి ఉండటం” అన్నది.
“ఏంటీ! ఈ మాత్రం దానికే ముస్లిములైపోతామా!?” అని ఆశ్చర్యపడేవారు తెలుసుకోవలసింది- శ్రీరాం అని పేరు పెట్టుకున్నా, డేవిడ్ అన్న పేరు పేరు పెట్టుకున్నా లేక ఏ అరబీయేతర పేరు పెట్టుకున్నా సరే పై దృక్పథాన్ని గనుక కలిగి ఉంటే వారంతా ముస్లిములుగానే పరిగణించబడతారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే “ముస్లిం” అన్న పదం “సిల్మ్” అన్న పదం నుండి ఏర్పడింది. దీని అర్థం- సమర్పణ, లొంగిపోవటం, శాంతి అన్న అర్థాలు ఉన్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే- “దైవ విధేయుడు” లేక “దేవునికి స్వయం సమర్పణ చేసుకున్నవాడు” ముస్లిం అంటే అంతే! తప్ప ఇంకొకటి ఏదీ కాదు!!
అంతేకాదు యేసు బోధించిన ధర్మం సైతం “ఇస్లామే”, ఆయన ప్రార్ధించింది కూడా అల్లాహ్ నే ఈ విషయాలను రాబోయే అంశాలలో గమనిద్దాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే యేసు నూటికి నూరుశాతం ఒక నికార్సైన ముస్లిమే అని చెప్పకపోతే అది ఘోరమైన పాపమే అవుతుంది. దానికి కారణం “దేవుడు ఒక్కడే అని ప్రకటించి, ఆయనను మాత్రమే ప్రార్ధిస్తూ, ఆయనకు లోబడి ఉండే వ్యక్తినే “ముస్లిం” అని అంటే ఈ విషయంలో యేసును “ఒక నికార్సైన ముస్లింగా” అభివర్ణించక తప్పదు! ఆశ్చర్యంగా ఉందికదూ! అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే.
యేసు, దేవుడు ఒకే ఒక్కడు అని నమ్మే దైవ విశ్వాసి!
ఈ విషయం కాస్త పరిశీలనగా నాలుగు సువార్తలను ఏ ఒక్కరు చదివినా ఇట్టే కనిపెట్టేయవచ్చు. కాకపోతే పాస్టర్ల బోధకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి బైబిల్ ను నామమాత్రంగా చదవటం కారణంగా యేసు దేవుని దాసుడు అన్న బైబిల్ చెబుతున్న దృక్పథం ప్రక్కకుపోయి, యేసే దేవుడు, దేవుని అవతారం, త్రిత్వంలో ఒక దైవం వగైరా అన్యబోధలు నేడు క్రైస్తవంలో చోటుచేసుకున్నాయి. ఇక యేసు ఒక నికార్సైన ముస్లిం అని ఎలా చెప్పవచ్చో ఈ క్రింది వాక్యాలను బట్టి తెలుసుకుందాం.
1. యేసు, దేవుడు ఒక్కడే అని సాక్ష్యం (షహాద) ఇచ్చారు!
“యేసు- ఓ, ఇస్రాయేలూ వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు” – మార్కు 12:29
“ఆ శాస్త్రి- బోధకుడా (అనగా- యేసు), బాగుగా చెప్పితివి; ఆయన (అనగా- యెహోవా దేవుడు) అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే” – మార్కు 12:32
పై రెండు వాక్యాలను బట్టి యేసు దేవుడు ఒక్కడే అని సాక్ష్యం (అంటే- షహాద) ఇచ్చారన్న విషయం స్పష్టమౌతుంది. ఇది ఒక వ్యక్తి ముస్లింగా పరిగణించబడటానికి కావలసిన మొట్టమొదటి విషయం.
2. యేసు నిత్యం ఆ ఒక్క దేవుణ్ణే వేడుకుంటూ (దువా) చేస్తూ ఉండేవారు!
“యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” – యోహాను 11:41
“ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను” – మత్తయి 11:25
3. యేసు నిత్యం ఆ ఒక్క దేవుణ్ణే ప్రార్ధిస్తూ (నమాజ్ చేస్తూ) ఉండేవారని
మనం సువార్తలలో గమనించగలం.
నిలబడి, మోకాళ్లపై ఆని, ముఖమును నేలపై పెట్టి దేవుని స్తుతించటమే ప్రార్ధన (అరబ్బీలో సలత్ ఉర్దూలో నమాజ్)! నమాజ్ లో ఉండే ముఖ్యమైన మూడు భంగిమల్లో (నిలబడి, మోకాళ్లూని, ముఖమును నేలపై పెట్టి) యేసు ఒక్క దేవుణ్ణి మాత్రమే ప్రార్ధిస్తూ ఉండేవారని మనం సువార్తలలో స్పష్టంగా గమనించగలం.
A. నిలబడి ప్రార్ధన చేయటం:
“మీరు నిలవబడి ప్రార్ధన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి” – మార్కు 11:25
B. మోకాళ్లపై ఆని ప్రార్ధన చేయటం:
“యేసు వారి వద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్లూని దేవుని ప్రార్ధన చేసెను” – లూకా 22:42
C. ముఖమును నేలపై పెట్టి ప్రార్ధన చేయటం:
యేసు కొంతదూరము వెళ్లి, తన ముఖమును నేలపై పెట్టి ప్రార్ధించెను” – మత్తయి 26:39
“And he (Jesus) went a little farther and fell on his face to the ground, and prayed…”- Matthew 26:39
4. యేసు నిత్యం నిర్ధిష్ట సమయాలలో దేవునికి ప్రార్ధన (నమాజ్)
చేస్తూ ఉండేవారు!
వాస్తవానికి ప్రవక్తలందరూ అవలంబించిన నమాజ్ విధానం అన్నది దాదాపుగా ఒకే రకంగా ఉన్నప్పటికీ ప్రార్ధనా సమయాల్లో, సంఖ్యలో కొద్దిపాటి తేడాలు ఉండేవి. ఖురాన్ ప్రకారం అయితే ఐదు పూట్ల నమాజ్ (ప్రార్ధన) నిర్ధారించబడింది. చీకటి ఇంకా ఉండగానే పెండలకడ ప్రార్ధన. మధ్యాహ్నం, సాయంత్రం ప్రారంభం అయ్యేటప్పుడు, చీకటి పడే ముందు, రాత్రి సమయపు ప్రార్ధన. బైబిల్లో యేసు సైతం దాదాపు ఈ సమయాల్లోనే దేవునికి ప్రార్ధన (నమాజ్) చేసేవారని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈ క్రింది వాక్యాల్లో గమనించగలరు.
A. పెండలకడ ప్రార్ధన (ఫజర్ నమాజ్):
“యేసు పెండలకడ లేచి ఇంకనూ చీకటి యుండగానే అరణ్యమునకు వెళ్ళి ప్రార్ధన చేయుచుండెను” – మార్కు 1:35
B. రాత్రి ప్రార్ధనలు (మగ్రిబ్, ఇషా నమాజులు):
“యేసు ప్రార్ధన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్ధించుట యందు రాత్రి గడిపెను” – లూకా 6:12
ఈ విధంగా యేసు పెండలకడ సమయాల్లోనే లేచి ఇంకా చీకటి ఉండగానే దేవునికి ప్రార్ధన చేసినట్టు (ఈ సమయంలో చేసే ప్రార్ధనను ఫజర్ నమాజ్ అని చెప్పటం జరుగుతుంది) చూడగలం. అలాగే రాత్రి అంటే సాయంత్రం చీకటి పడే సమయం (ఈ సమయంలో చేసే ప్రార్ధనను మగ్రిబ్ నమాజ్ అని చెప్పటం జరుగుతుంది) మొదలుకుని, రాత్రి అంతయూ (ఈ సమయంలో చేసే ప్రార్ధనను ఇషా నమాజ్ అని చెప్పటం జరుగుతుంది) దేవుని ప్రార్ధించినట్టు మనం చూడగలం. ఈ విధంగా యేసు సైతం దేవునికి నిర్ధిష్ట సమయాల్లో నమాజ్ (ప్రార్ధన) చేస్తూ ఉండేవారని తెలుస్తుంది.
5. యేసు సున్నతి పొందారు!
“ఆ శిశువు (యేసు) నకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు” – లూకా 2:21
అబ్రాహాము నుండి సకల ప్రవక్తలూ యేసు పాటించిన ఈ సున్నతి ఆచారాన్ని పాటిస్తున్నవారు నేడు ముస్లిములే!
6. యేసు దేవుని కోసం ఉపవాస దీక్ష (రోజా) ఉండేవారు,
ఉండమని ఆదేశించేవారు!
“నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా” – మత్తయి 4:2
“ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము” – మత్తయి 6:17
7. యేసు తీర్పుదినం రోజున ఆ దేవుని ముందు నిలబడి సమాధానం చెప్పుకోవలసి ఉంటుందని హెచ్చరించారు!
“నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును” – మత్తయి 12:36
8. తన తరువాత వచ్చే ప్రవక్త ముహమ్మద్ (స) గూర్చి సాక్ష్యం ఇచ్చారు!
“అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త(లేక,ఉత్తరవాది) మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును” – యోహాను 16:7
“అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును” – యోహాను 16:13
8. యేసు బోధించిన ధర్మం ఇస్లాం మాత్రమే!
ఇది వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా నిజం. ఒకసారి ఈ క్రింది బైబిల్ వాక్యాన్ని గమనించగలరు.
“శాంతిని మీకనుగ్రహించి వెళ్లుచున్నాను. నా శాంతినే మీకనుగ్రహించు చున్నాను” – యోహాను 14:27
ఈ వాక్యంలో ఇస్లాం ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తే ఈ వాక్యాన్ని కాస్త మనం యేసు మాట్లాడిన అరమాయిక్ భాషలో క్రింది విధంగా గమనించగలరు.
“ష్లామ షబఖ్ అనా లకూన్, ష్లామా దీలీ యాహెబ్ అనా లకూన్”
“PEACE (ష్లామ) I leave with you, my PEACE (ష్లామ) I give unto you” – John 14:27
పైన యేసు చెబుతున్న వాక్యంలో
“శాంతి” అంటే = “Peace” దీనిని అరమాయిక్ లో “ష్లామ” అని చెప్పటం జరిగింది. “ఇస్లాం” అన్న పదానికి ధాతువు “సలాం” అనగా “శాంతి” అని అర్థం. వెరసి “ష్లామ” అన్న అరమాయిక్ పదం అరబ్బీలో “ఇస్లాం” అని ఉచ్చరించబడుతుంది.
ఈ విధంగా యేసు బోధించిన మరియు విడిచి వెళ్లింది”ఇస్లాం ధర్మం (శాంతి ధర్మం)” అన్న విషయాన్ని తెలుసుకున్నాం.
9. యేసు, దేవుణ్ణి “అల్లాహ్” అన్న పేరుతోనే పరిచయం చేశారు!
ఈ విషయాన్ని ఈ క్రింది వాక్యాల ద్వారా తెలుసుకుందాం.
“అందుకు యేసు- ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు” – మార్కు 12:29
ఈ వాక్యాన్ని ఇపుడు మనం అరమాయిక్ భాషలో గమనిద్దాం.
“అమర్ లెహ్ యషు’, మద్మే మిన్ కుల్ల్ హూన్ వుఖ్ దనే, షిమ’ ఇశ్రాయేల్, మర్య అల్లాహన్, మర్య హుద్ హు”
పై అరమాయి లిపిలో ” అల్లాహన్” అన్న పదాన్ని గమనించగలం. ఇప్పుడు మరొక వాక్యం గమనించగలరు.
“అందుకాయన (యేసు) మంచి కార్యముల గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే” – మత్తయి 19:17
ఈ వాక్యాన్ని ఇపుడు మనం అరమాయిక్ భాషలో గమనిద్దాం.
“మన ఖర అంత లీ తబ? లేత్ తబ ఇల్లా ఎన్ హద్ అల్లాహ్”
పై అరమాయిక్ వాక్యంలో ఎంతో స్పష్టంగా “ఇల్లా ఎన్ హద్ అల్లాహ్” అన్న వాక్యాన్ని చూడగలం. దానిలో “ఎన్ హద్” అంటే- అరబ్బీలో “అహద్” అంటే= “ఒక్కడు” అని అర్థం. “ఇల్లా ఎన్ హద్ అల్లాహ్” అంటే= “అల్లాహ్ ఒక్కడే” అని అర్థం.
10. యేసు నిత్యం అల్లాహ్ కు మాత్రమే ప్రార్ధన చేసేవారు!
ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ క్రింది తెలుగు బైబిల్ వాక్యాన్ని అరబిక్ బైబిల్ అనువాదం లో చూడాల్సి ఉంటుంది.
“యేసు దేవుని ప్రార్ధించుట యందు రాత్రి గడిపెను” – లూకా 6:12
“వ ఫీ తిల్క వూలా అయ్యామి ఖరజ ఇలవుల్ జబల లియుసల్లి వఖస వులల్లైల కుల్లహు ఫీ “అస్సాలాతిలిల్లాహ్”
పైవాక్యంలో చివరి వాక్య భాగం ఒకసారి గమనిస్తే- “అస్సాలాతిలిల్లాహ్” అని గమనించగలం. ఈ పదం అటు అరమాయిక్ బైబిల్లో అయితే స్పష్టంగా “సలాతలల్లాహ్” అని చదవగలం. అంటే- “అల్లాహ్ కు ప్రార్ధన చేయుచుండెను’ అని అర్థం.
ఇలాంటి ఆధారాలు ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి. స్థలాభావం వల్ల అన్నీ ఇక్కడ పొందుపరచటం కూడా సాధ్యం కాని పని. ఈ విధంగా ఇప్పటివరకు మనం పై వివరణలో గమనించిన విషయాలు యేసు 1. యేసు, దేవుడు ఒక్కడే అని సాక్ష్యం (షహాద) ఇచ్చారు! 2. యేసు నిత్యం ఆ ఒక్క దేవుణ్ణే వేడుకుంటూ (దువా) చేస్తూ ఉండేవారు! 3. యేసు నిత్యం నిర్ధిష్ట సమయాలలో దేవునికి ప్రార్ధన (నమాజ్) చేస్తూ ఉండేవారు! 4. యేసు సున్నతి సైతం పొందారు! 5. యేసు దేవుని కోసం ఉపవాస దీక్ష (రోజా) ఉండేవారు, ఉండమని ఆదేశించేవారు! 6. తన తరువాత వచ్చే ప్రవక్త ముహమ్మద్ (స) గూర్చి సాక్ష్యం ఇచ్చారు! 7. యేసు, ఇస్లాం ధర్మాన్ని మాత్రమే బోధించి వెళ్లారు! 8. యేసు, దేవుణ్ణి “అల్లాహ్” అన్న పేరుతోనే పరిచయం చేశారు! 9. యేసు నిత్యం అల్లాహ్ కు మాత్రమే ప్రార్ధన చేసేవారు!
ఈ విధంగా యేసు, దేవుని విధేయుడు, ఆయనను మాత్రమే బలంగా విశ్వసించే దాసుడు అన్న విషయాన్ని పై వివరణలో తెలుసుకున్నాం. అయినప్పటికీ ఆయన ముస్లిం కాదు అని ఎవరైనా అడ్డంగా వాదించటం మొదలెడితే అది పరోక్షంగా యేసు “దేవుని విశ్వాసి కాడు” “దేవునికి విధేయుడు కాడు” అని చెప్పటమే అవుతుంది. అది ఘోరమైన పాపమే అవుతుంది! అలాంటి ఘోర పాపం మూటకట్టుకోకుండా ఉండాలంటే యేసును ఒక నికార్సైన ముస్లింగా ప్రతి క్రైస్తవుడూ ఒప్పుకుతీరాల్సిందే.
Md Nooruddin
యేసు ఒక నికార్సైన ముస్లిం!
