యథార్థంగా దేవుడు ఆరాధించబడే స్థలం “యెరూషలేము” కాదు!
“అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము మీద నైనను యెరూషలేము లోనైనను మీరు తండ్రిని (దేవుని) ఆరాధింపరు… (21) అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది… (23) – యోహాను 4:21-23
“ఈ పర్వతము మీద నైనను యెరూషలేము లోనైనను మీరు తండ్రిని (దేవుని) ఆరాధింపరు” అన్న వాక్యభాగాన్ని బట్టి సృష్టికర్త అయిన దేవునిని యూదులు- క్రైస్తవులు భవిష్యత్తులో ఆరాధింపరని, అలాగే దేవుడు యదార్థంగా ఆరాధించబడే స్థలం యెరూషలేము కాదని, సృష్టికర్త అయిన దేవుని ఆరాధన వేరే చోట స్థాపించబడాల్సి ఉందని అర్థమవుతుంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ప్రపంచ జనాభాలో నేడు క్రైస్తవులు చెప్పుకోవటానికే పెద్ద వర్గం అయినప్పటికీ అందులో అధికశాతం మంది నిజ దేవునికి బదులు ఆయనను పరిచయం చేయటానికి వచ్చిన యేసును దేవునిగా భావిస్తూ ఆయనను ఆరాధించేవారు కావటమే! ఇక భవిష్యత్తులో మార్గభ్రష్టులైన యూదులకు పట్టనున్న దుర్గతిని సూచిస్తూ యేసు, ఈ క్రింది విధంగా చెబుతున్నారు.
“ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది” – మత్తయి 23:38
నిజానికి ఇహలోకంలో ఆధ్యాత్మిక పాలన (దేవుని రాజ్యం) స్థాపించటం కొరకు దేవుడు, ఇశ్రాయేలీయులను ప్రత్యేక జనంగా ఎన్నుకున్నాక వారు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించటం కొరకు సోలోమోను ద్వారా నిర్మించబడిందే “సోలోమోను మందిరం (A Dome of Rock)”. కానీ, కాలానుగుణంగా యూదులు అహంకారానికి గురై, దైవారాధనను వదిలిపెట్టి దేవుని సందేశాన్ని తిరస్కరించటమే కాక, తమ వద్ద పంపబడిన ప్రవక్తలనే అన్యాయంగా హత్య చేసే స్థాయికి దిగజారిపోయారు. చివరకు వారు దేవుని సందేశాన్ని, ఆయన ఆరాధనను పూర్తిగా విస్మరించి, మార్గభ్రష్టత్వానికి గురైపోయిన సందర్భంలో ఇక భవిష్యత్తులో దైవారాధన యెరూషలేములో జరగదని, దేవుడు యథార్థంగా ఆరాధించబడే స్థలం సైతం యెరూషలేము ఎంతమాత్రం కాదని, కానీ, సృష్టికర్త అయిన దేవుణ్ణి యదార్థంగా ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించే జనాంగం ఒకటి భవిష్యత్తులో ఉద్భవించనుందన్న విషయాన్ని సూచిస్తూ యేసు ముందుగానే చెబుతున్న గొప్ప భవిష్యవాణే పై వాక్యం. ఇదే విషయాన్ని యేసు మరో వాక్యంలో ఈ క్రింది విధంగా చెబుతున్నారు.
“కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను” – మత్తయి 21:43
పై వాక్యాన్ని బట్టి ఒకనాడు దేవుడు ఏ ఆధ్యాత్మిక పాలన (దేవుని రాజ్యం) స్థాపించే బాధ్యతను యూదులకు ఇచ్చాడో అది వారి నుండి తొలగించబడి, వేరే జనాంగానికి ఇవ్వబడుతుందని వారి ద్వారానే దేవుని ఆరాధన స్థాపించబడుతుందని సుస్పష్టమవుతుంది.
అయితే దేవుణ్ణి యథార్థంగా ఆరాధించే ఆ ప్రజలు ఎవరు? సోలోమోను మందిరం తరువాత దేవుడు యథార్థంగా ఆరాధించబడే ఆ మందిరం ఏదీ? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ క్రింది లేఖనం.
“… నీ కొరకు కేదారు గొర్రె మందలన్నియు కూడుకొనును నేబాయేతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలి పీఠము మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను” – యెషయా 60:7
పైవాక్యంలో “కేదారు గొర్రె మందలు, నేబాయేతు పొట్టేళ్లు” అంటే ఇష్మాయేలీయులు” అని అర్థం. కేదారు, నేబాయేతులు ఇద్దరూ ఇష్మాయేలు కుమారులే! భవిష్యత్తులో దేవుని స్తోత్త్రాన్ని ప్రకటించే బాధ్యతను ఇష్మాయేలు కుమారుడైన కేదార్ వంశీయులకు అప్పజెప్పటం జరుగుతుందని సైతం లేఖనంలో ముందే చెప్పబడింది.
“… అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను. సెల నివాసులు సంతోషించుదురు గాక. పర్వత శిఖరముల నుండి వారు కేకలు వేయుదురు. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక, ద్వీపములలో ఆయన స్తోత్త్రము ప్రచురము చేయూదురు గాక” – యెషయా 4210,11
ఈ లేఖనం నెరవేర్పులో భాగంగానే దేవుని ఆరాధన కేదారు వంశీయులైన ఇష్మాయేలీయులచే పారాను అంటే మక్కాలో స్థాపించబడింది.
గమనార్హమైన విషయం ఏమిటంటే- “కేదార్” వంశంలోనే ప్రవక్త ముహమ్మద్ (స) జన్మించింది. ఈ విధంగా కేదారు, నేబాయేతు సంతానం ఆరాధించటానికి కూడుకునే మందిరాన్ని ఉద్దేశిస్తూనే “నా శృంగారమందిరము నేను శృంగారించెదను” అని దేవుడు చెబుతున్నాడు. వాస్తవానికి ఈ వాక్యం ఇంగ్లిష్ బైబిల్లో “I will glorify the hose of glory” అంటే “నా మహిమా మందిరమును నేను మహిమ పరచెదను” అని అనువదించాలి! భవిష్యత్తులో దేవుడు మహిమపరుస్తానని ముందుగానే వాగ్దానం చేస్తున్న ఆ “మహిమా మందిరం” ఎక్కడ ఉంది? దాని పేరేమిటి? ఎవరు దానిని నిర్మించారు? అన్నది ఇప్పుడు ఆధారాలతో సహా తెలుసుకుందాం.
దేవుడు యథార్థంగా ఆరాధించబడే స్థలం “బక్కా (మక్కా)” మందిరం!
“నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యమూ నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా (BACA) లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరివాన దాని దీవెనలతో కప్పును. వారు నానాటికీ బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడును” – కీర్తనలు 84:6,7
పై గమనార్హమైన లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతున్నవిషయాలు ఏమిటంటే…
1.దైవారాధనకు ఎన్నుకోబడనున్న దేవుని మందిరానికి ప్రజలు ప్రపంచ నలుమూలల నుండి “యాత్ర” చేస్తూ వస్తారని …
2.ఆ మందిరంలో నిత్యమూ దేవుడు స్తుతించబడుతూ ఉంటాడని…
3.ఆ మందిర పరిసరాలను అక్కడకు వచ్చేవారు జలమయంగా చేస్తారని…
4.ఆ మందిరం “బాకా (BACA)” లోయలో ఉంటుందని… మనకు తేటతెల్లమవుతుంది.
ఈ సందర్భంలో మక్కాకు ఉన్న పూర్వపు పేరు “బక్కా” అన్నది ప్రతి ఒక్కరూ ముఖ్యంగా క్రైస్తవులు దృష్టిలో ఉంచుకోవాలి. అదే బైబిల్లో “బాకా (BAKA)” అని ప్రస్తావించబడింది. ఈ పాత పేరునే ఖురాన్ సైతం ఒకచోట ఈ క్రింది విధంగా ప్రస్తావిస్తుంది.
“ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా “బాకా” లో ఉన్నదే. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి”- ఖురాన్ 3:96
ఇక పైన మనం గమనించన కీర్తనలు 84:6,7 లేఖనం నెరవేర్పులో భాగంగానే నేడు దైవారాధనకు ప్రపంచ నలుమూలల నుండి “యాత్ర (హజ్)” చేస్తూ కొన్ని కోట్ల మంది తండోప తండాలుగా తరలి వస్తున్న ఏకైక మందిరం, ఎడతెరపి లేకుండా నిజ దేవుని ఆరాధన జరిగే మందిరం మొత్తం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక్క “బాకా (BACA)” లోయలో ఉన్న అనగా “మక్కా(Makkah)” లోయలో ఉన్న “కాబా మందిరమే!” ఆ మందిరం నిజంగానే నేటికీ జలమయమవుతూనే ఉంది! ఎలా అంటే- ఒకానొకప్పుడు ఇష్మాయేలు పసి పిల్లాడుగా ఉండగా హాగరు దేవుని ఆజ్ఞ మేరకు పారాను (ప్రస్తుత మక్కా) ప్రదేశంలో ఒంటరిగా వదిలివేయబడినప్పుడు నీళ్ల కోసం వెతుకున్న సందర్భంలో “దేవుడు ఒక నీళ్ల ఊటను అక్కడ ఏర్పాటు చెయ్యటం జరుగుతుంది (ఆదికాండం 21:19). దేవుని అద్భుతం ఏమిటంటే నీటి చుక్కను ఊహించటానికి సైతం అవకాశం లేని భగ భగ మండే అరేబియా ఎడారిలో దేవుడు ఆనాడు ఇష్మాయేలు దాహం తీర్చటానికి ఏర్పాటు చేసిన కొన్ని వేల సంవత్సరాల క్రిందటి ఆ నీళ్ల ఊట ఈనాటికీ “ఆబే జం జం” పెరట ప్రసిద్ధి కెక్కి, రోజుకూ కొన్ని వందల గేలన్ల నీళ్లను ఇస్తూ ఉబుకుతూనే ఉంది. ఈ విషయం అరేబియా దేశాల్లో నివసించే క్రైస్తవులకు బాగా తెలుసు. కాబా మందిరానికి యాత్ర గా వెళ్లే ప్రతీ ఒక్కరూ ఆ నీటిని తనివితీరా త్రాగుతారు. దానిని తమ వెంట కూడా తీసుకెళతారు. అలా ఆ పరిసరాలన్నీ వారిద్వారా జమాయమవుతూనే ఉన్నాయి. ఆ విధంగా మక్కా మందిరంలో యాత్రగా వచ్చే వారి ద్వారా ఆ మందిర పరిసరాలు జలమయమవుతుందని ముందుగానే లేఖనం ప్రస్తావించటం నిజంగానే అద్భుతం! అయితే.. “వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడును” అన్న వాక్య భాగాన్ని పట్టుకుని కొందరు క్రైస్తవ పండితులు ఈ లేఖనం మక్కా గురించి కాదని గోల చేస్తూ ఉంటారు. కాబట్టి సంక్షిప్తంగా “సీయోను” అంటే ఏమిటో తెలుసుకుందాం!
దేవుని రాజ్యానికి అలంకారిక పదం – సీయోను!
దేవుని శాసనాలు పాలించబడే పరిధిలోనికి వచ్చిన ప్రదేశాన్ని లేక దేవుని రాజ్యాన్ని అలంకారికంగా “సీయోను” అని బైబిల్లో చెప్పటం జరిగింది. దేవుని ఆజ్ఞలు పాలించబడే పరలోక రాజ్యాన్ని సైతం అలంకారికంగా బైబిల్లో సీయోను అని చెప్పబడినట్లు చూడగలం (ప్రకటన 14:1). అయితే ఒకప్పుడు యెరుషలేము సైతం దేవుని రాజ్య పరిధిలో ఉండేది కనుక దానిని సైతం సీయోను అనటంలో తప్పులేదు! అలాగే బైబిల్ ప్రకారమే దేవుని నిజ ఆరాధన, దేవుని రాజ్యం స్థాపించబడటానికి ఎన్నుకోబడ్డ “పారాను (మక్కా)” ప్రదేశం సైతం సీయోను గానే పేరు పెట్టబడనుంది.
క్రొత్త సీయోను- పారాను (మక్కా)!
“యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు (అనగా- ఇష్మాయేలీయులు ఉంటున్న పారానుకు) పేరు పెట్టెదరు” – యెషయ 60:14
దానికి గుర్తుగా భవిష్యత్తులో సీయోను (పారాను) యెరూషలేము పై ప్రభుత్వం చేయనుందని, అలాగే యెరూషలేము, సీయోను (పారాను) క్రింద చెరపట్టబడనుందని ముందుగానే లేఖనాలు చెయ్యబడ్డాయి.
“మందల గోపురమా, సీయోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వం కలుగును” – మీకా 4:8
“… యెరూషలేమా, లేచి కూర్చుండుము “చెరపట్టబడిన సీయోను కుమారి” – యెషయా 52:2
“యెరూషలేము కుమార్తె మీద నీకు (సీయోనుకు) ప్రభుత్వం కలుగును” అన్న వాక్యాన్ని బట్టి మరియు “యేరూషలేమా, చెరపట్టబడిన సీయోను కుమారి” “… O Jerusalem, O Captive daughter of Zion” అన్న రెండవ వాక్యాన్ని బట్టి భవిష్యత్తులో యెరూషలేము, సీయోను ద్వారా చెరపట్టబడుతుందని, యెరూషలేము ప్రజలపై సీయోనుకు ప్రభుత్వం కలుగుతుందని అర్థమవుతుంది. ఒకవేళ సీయోను అంటే యెరూషలేము అనుకుంటే “యెరూషలేము పై సీయోనుకు ప్రభుత్వం కలుగును” అని, అది సీయోను ద్వారా చెరపట్టబడుతుందని బైబిల్ చెప్పటం సాధ్యమేనా? దీనిని బట్టి యెరూషలేము అనంతరం ఏర్పడే క్రొత్త సీయోనే- పారాను (మక్కా) అన్న విషయం తేటతెల్లమైపోయింది. ఇక భవిష్యత్తులో ఏర్పడే క్రొత్త సీయోను నుండి ఒక ధర్మశాస్త్రం సైతం బయలువెళ్ల నుందని చెప్పబడుతున్న ఈ క్రింది లేఖనాన్ని గమనించగలరు.
“ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును” – యెషయా 2:3
యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళితే, సీయోనులో నుండి ధర్మశాస్త్రము బయలు వెళుతుందని పై లేఖనం చెబుతుంది. ఈ లేఖనం అప్పటికే మోషే ధర్మశాస్త్రం వచ్చిన కొన్ని వందల సంవత్సరాల తరువాత చెప్పబడుతుందన్నది గమనించాలి. ఇక మోషే ధర్మశాస్త్రం అనంతరం భవిష్యత్తులో క్రొత్త సీయోను నుండి బయలు వెళ్ళే ధర్మశాస్త్రము అంటే- ప్రవక్త ముహమ్మద్ (స) వారి ద్వారా ఇవ్వబడిన “జ్వాలాభరితమైన ధర్మశాస్త్రం” అయిన- ఖురాన్ గ్రంథం (ద్వితీ 33:2).
దేవుడు యదార్థంగా ఆరాధించబడే స్థలం – మక్కా!
ఇప్పటి వరకు మనం దేవుని ఆరాధన స్థాపించబడే ప్రదేశమైన పారానుకు (మక్కాకు) సీయోను అని పేరుపెట్టబడనుందని, అక్కడే సృష్టికర్త అయిన దేవుని ఆరాధన స్థాపించబడుతుందని తెలుసుకున్నాం. అంతే కాక అంత్యదినాల్లో మక్కాలో ఉన్న కాబా మందిరానికి ప్రజలు ప్రవాహం వచ్చినట్లుగా వస్తారని చెప్పబడుతున్న ఈ క్రింది లేఖనాన్ని గమనించగలరు.
“అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి (యెహోవా మందిరములోనికి) వత్తురు” – మీకా 4:1
అందులో భక్తులు బిగ్గరగా ఆనంద గానము చేస్తారు!
“యెహోవా సీయోనును ఏర్పర్చుకొని యున్నాడు… దానిలోని భక్తులు బిగ్గరగా ఆనంద గానము చేసెదరు” – కీర్తనలు 132:13-16
ఈనాడు ప్రజలు తండోపతండాలుగా యాత్రగా తరలి వచ్చి, దేవుని సన్నిధిలో ఆనందగానం చేస్తున్నది యూదులో, క్రైస్తవులో కాదు ముస్లిములే! ఆ ఆనందగానం- “లబ్బైక్ అల్లాహుమ్మా లబ్బైక్, లబ్బైక లా షరీకలక లబ్బైక్ ఇన్నల్ హామ్ద వన్నీ మతలక వాల్ ముల్క లా షరీకలక” (నేను హాజరయ్యాను, అల్లాహ్ నేను హాజరయ్యాను. నీకు సమానులెవ్వరూ లేరు. నేను హాజరయ్యాను. నిస్సందేహంగా సకల స్తోత్రాలు నీకే. సకల వరాలు ఇచ్చినది నీవే. సార్వ భౌమాధిపత్యము నీదే. నీకు సమానులేవ్వరు లేరు) అని పఠిస్తూ చేస్తున్న ఆనందగానం!
అందులో భక్తులు బిగ్గరగా ప్రదీక్షణ (తవాఫ్) చేయుదురు!
“సీయోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి” – కీర్తనలు 48:12
పై లేఖనం స్పష్టంగా సీయోను (మక్కాలో) లో ఉన్న కాబా మందిరం “చుట్టూ ప్రదీక్షణ చేస్తూ” (అరబ్బీలో తవాఫ్ అంటారు) దేవుణ్ణి స్తుతించే ప్రక్రియను గురించి ప్రస్తావిస్తుంది. పై ఆజ్ఞ ప్రకారం ప్రదీక్షణ చేస్తూ దేవుణ్ణి స్తుతించే ప్రక్రియను అవలంబిస్తుంది సైతం ఇష్మాయేలీయులైన ముస్లిములే! కాస్త చరిత్రను పరిశీలిస్తే ప్రవక్త అబ్రాహాము మొట్టమొదట దైవారాధన ప్రారంభించింది మక్కా (అనగా పారాను) లోనే! వాస్తవానికి ప్రస్తుతం మక్కాలో ఉన్న కాబా మందిరం పునాదులు వేసిందీ, దాని నిర్మాణం చేసింది కూడా ప్రవక్త అబ్రాహామే!
మక్కా (పారానులో) దేవుని ప్రార్ధన ప్రారంభించింది అబ్రాహాము!
“అబ్రాహాము బెయేర్షబా (పారాన్) లో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను” – ఆదికాండము 21:33
పై వాక్యాన్ని బట్టి మొట్టమొదట అరేబియాలో ఉన్న మక్కా (పారాను లేక బెయేర్షబా) లో అబ్రహాము నిత్యదేవుడైన యెహోవాను ప్రార్ధించినట్లు అర్థమవుతుంది. ఇదే విషయం ఖురాన్ లో ఈ క్రింది విధంగా దేవుడు ప్రస్తావిస్తున్నాడు.
“ఈ గృహాన్ని (కాబా మందిరాన్ని) మేము మానవులందరికీ కేంద్రంగానూ, శాంతి నిలయం గానూ చేశాము. ఇబ్రాహీము ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వతమైన నమాజు (దైవారాధన) స్థలంగా చేసుకోవలసిందని ప్రజలను మేము ఆదేశించాము” – ఖురాన్ 2:125
యూదులు, క్రైస్తవులు కాబా మందిరాన్ని తమ సంతానాన్ని గుర్తించే విధంగా గుర్తిస్తారు!
“మేము ఎవరికి గ్రంథాన్ని ప్రసాదించామో, వారు (యూదులు, క్రైస్తవులు) తమ సంతానాన్ని ఏ విధంగా గుర్తిస్తారో అదే విధంగా (ఈ స్థలాన్ని) గుర్తిస్తారు” – ఖురాన్ 2:146
వాస్తవానికి మక్కాలో ఉన్న కాబా మందిరాన్ని మొట్టమొదట అబ్రాహాము నిర్మించారని, దాని తరువాత దాదాపు 1300 సంవత్సరాలకు యేరూషలేము మందిరం సోలోమన్ ప్రవక్త ద్వారా నిర్మించబడిందన్న చరిత్రాత్మక విషయం ఇక్కడ ఉన్న పాస్టర్లకు తెలియకపోవచ్చు కానీ ఇశ్రాయేలు, అరేబియా భూభాగాల్లో నివసించే యూద, క్రైస్తవ విధ్వాంసులకు బాగా తెలిసిన విషయమే! ముఖ్యంగా బైబిల్లో ప్రవక్త ముహమ్మద్ (స) ప్రస్తావనలేదు, ఖురాన్, మక్కా-మదీనాల ప్రస్తావనలు బైబిల్లో లేవు మా బైబిల్లో ఉన్న యేసు వేరు, మీ ఖురాన్ లో ఉన్న ఈసా వేరు, మా యెహోవా వేరు, మీ అల్లాహ్ వేరు వగైరా వాదనలు చేసేది ఇక్కడ ఉండే కొందరు బోధకులే తప్ప మిడిల్ ఈస్ట్ దేశాల్లో నివసించే ముఖ్యంగా బైబిల్ మూలభాషలపై పట్టు ఉన్న హెబ్రూ, గ్రీక్ అరబిక్ భాషలు తెలిసిన యూద, క్రైస్తవ పండితులు అలాంటి చవకబారు వాదనలు చెయ్యరు. ఇక్కడ ఉన్న బోధకులు సైతం మంకు పట్టు ప్రక్కన పెట్టి కాస్త బైబిల్ ని పరిశీలనగా చదివితే పై వాస్తవాలన్నీ బోధపడతాయి.
Md Nooruddin
బైబిల్లో మక్కా ప్రస్తావన
