మదీనా పట్టణంలో ప్రవక్త ముహమ్మద్ (స) రావటానికి ముందు నుండే వందల సంవత్సరాలుగా అనేక యూదుల తెగలు నివాసం ఉండేవారని గానీ, ఆనాటి ప్రాచీన యూదులు తమ వద్ద ఉన్న తోరా, ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడిన లేఖనాల ప్రకారం ఓ విశ్వప్రవక్త ఆవిర్భావం కోసం ఎదురు చూస్తూ ఉండేవారని గానీ, ఆ ప్రవక్త అరేబియాలో ఉన్న “సెల” పర్వత ప్రాంత నివాసి అయి ఉంటాడని గానీ, బైబిల్లో ప్రస్తావించబడిన “సెల” ప్రాంతమే ఈనాటి “మదీనా” అని గానీ, ఆయన “సెల” ప్రాంతంలో నివసిస్తాడన్న ఆధారాలను బట్టి అనేక విధ్వాంసులైన యూదులు మదీనాలోనే అనేక శతాబ్దాలుగా స్థిరపడిపోయి తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఆయనను స్వాగతించటం కోసం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండేవారని గానీ… చరిత్ర అవగాహన ఉన్న యూదులకు తప్ప ఈనాటి చాలా మంది క్రైస్తవ బోధకులకు ఏ మాత్రం తెలియని విషయం. ఇది చరిత్రలో దాగి ఉన్న ఓ రహస్యం. నేటి సామాన్య క్రైస్తవులకు అపరిచితమైన ఓ నిజం.
మక్కా నుండి దాదాపు 250 మైళ్ళ దూరంలో ఈనాడు “మదీనా”గా పిలువబడుతున్న అతి ప్రాచీన చరిత్ర కలిగిన పట్టణం ఒకప్పుడు బాబిలోనియా విడిచి పెట్టి వచ్చిన కొందరు బాబిలోనియన్ల ద్వారా నిర్మించబడి వారి ద్వారా తమ రాజు పేరు మీదే దానికి “యస్రిబ్” గా పేరు పెట్టబడిందని చరిత్ర చెబుతుంది. తరువాత 70 CE లో తీతు రాజుల ద్వారా యేరూషలేము కూల్చబడినప్పుడు అనేక మంది యూదులు యస్రిబ్ పట్టణానికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకోవటం ప్రారంభించారు. ఆ తరువాత క్రీ.శ 132 రోమనులు, యూదులకు జరిగిన యుద్ధంలో అనేక యూద తెగలు తమ పూర్వీకుల ద్వారా నిర్మించబడిన “యస్రిబ్” పట్టణానికి దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలకు తరలి వచ్చి అక్కడే నివాసాలు ఏర్పర్చుకుని తమ వద్ద ఉన్న గ్రంథాలలో వ్రాయబడిన లేఖనాలను బట్టి తమ కష్టాల నుండి బయటపడవేసి, తాము కోల్పోయిన పూర్వ వైభవాన్ని తెరిగి తెచ్చే విశ్వప్రవక్త ఆవిర్భావం కోసం ఎదురు చూస్తూ, వారంతా “యస్రిబ్” పట్టణం లోనే ఉండిపోయారు. ఆ విధంగా యస్రిబ్ యూదుల పట్టణంలా మారిపోయింది. ప్రవక్త ముహమ్మద్ (స) యస్రిబ్ పట్టణానికి వలస వెళ్లిపోయిన తరువాత అక్కడే పరమపదించారు. కనుక పురాతన “యస్రిబ్” పట్టణానికి తరువాత కాలంలో “మదీనా తుల్ అన్-నబవి” (The City Of The Prophet) అని మార్చటం జరిగింది. దాని సంక్షిప్త ఉచ్చరణే “మదీన”. ఇక మదీనాలో అనేక యూద తెగలు వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ స్థిర నివాసం ఉండిపోయారు. మదీనాలో ఆనాటి యూదులలో ముఖ్యమైన తెగలు “బను ఖురైజా” “బను నజీర్” “బను కైనుక” అన్నవి. ఇవిగాక “బను హారిత్” “బను షుతైబా” “బను తలాబా” “బను జూషాం” “బను ఆఫ్” “బను అల్ఫగీర్” వగైరా అనేక యూద తెగలు మదీన పట్టణంలో వందల యేళ్లుగా నివాసాలు ఏర్పర్చుకుని అక్కడే స్థిరపడిపోయారు.
సరే, ఇంతకూ అనేక యూద తెగలు ఎన్నో శతాబ్దాలుగా ఎందుకు స్థిర నివాసాలు ఏర్పర్చుకుని “సెల / యస్రిబ్” ప్రాంతంలో ఉండిపోయారు? అన్న ప్రశ్నకు నేటి సామాన్య క్రైస్తవులకు సమాధానం తెలియదు. కానీ, యూదులకు తెలుసు. ఆ ప్రాంతం నుండి తమ జాతిని యేలే ఓ మహారాజు లాంటి ప్రవక్త తమ కోరకు రానున్నాడని! ఆయనను స్వాగతించటానికే అనేక యూద తెగలు యస్రిబ్ పట్టణంలోనే ఉండిపోవటానికి కారణమైంది. ఇంతకూ “సెల (యస్రిబ్)” ప్రాంతం నుండి ఓ ప్రవక్త రానైయున్నాడని చెప్పటానికి ఏదైనా లేఖనం ప్రస్తుత బైబిల్లో ఉందా? అన్నది అసలు ప్రశ్న. ఏ లేఖనం ఆధారంగా ఆనాటి యూదులు ఓ ప్రవక్త రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండేవారో దానిని ఈ క్రింది గమనించగలరు.
“అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను. “సెల” నివాసులు సంతోషించుదురు గాక పర్వత శిఖరముల నుండి వారు కేకలు వేయుదురు గాక. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక. యెహోవా శూరుని వలె బయలుదేరును. యోధుని వలె తన ఆసక్తి రేపుకొనును. ఆయన హూంకరించుచూ తన శత్రువులను ఎదురించుచు వారి ఎదుట తన పరాక్రమము కనబరుచును” – యెషయా 42:11-13
పై లేఖనంలో “కేదార్” మరియు “సెల” అనే రెండు పదాలు రానైయున్న విశ్వప్రవక్త యొక్క ప్రాంతాన్ని ఎంతో స్పష్టంగా సూచిస్తున్నాయి.
“కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను…”
ఎవరు ఈ “కేదార్?
“కేదార్” ఎవరు? అతని వంశం ఏ ప్రాంతం వారై ఉంటారు? అన్నది గమనిస్తే…
“ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయేతు, కేదారు, అద్బయేలూ, మిస్బాము…” – ఆది 25:13
పై వాక్యాన్ని బట్టి కేదార్ అంటే ఇష్మాయేలు రెండవ కుమారుడు అని తెలుసుకున్నాం. ఇక ఇష్మాయేలు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతనికి ఈజిప్ట్ కు చెందిన స్త్రీని వివాహం చేసుకుని అక్కడే తన నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు (ఆది 21:21) బైబిల్లో చూడగలం.
గమనార్హమైన విషయం ఏమిటంటే కేదార్ వంశీయుడే ప్రవక్త ముహమ్మద్ (స) అన్నది. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ (స) వంశపు మూల పురుషుడు కేదార్ అని చెప్పవచ్చు.
“సెల” మదీనా పట్టణంలో కొలువుదీరి ఉన్న ఓ ప్రాచీన పర్వతం! “సెల” పర్వతాన్ని ప్రస్తుత మదీన పట్టణానికి వెళ్ళే ప్రతీ ఒక్కరూ చూడగలరు. ఈనాటికీ “సెల” (Mount of Sela) పేరుతోనే ఈ అతి ప్రాచీన పర్వతం మదీనాలో ప్రసిద్ధి గాంచి ఉంది.
“అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను. “సెల” నివాసులు సంతోషించుదురు గాక పర్వత శిఖరముల నుండి వారు కేకలు వేయుదురు గాక”
పై లేఖనాన్ని బట్టే తమ కొరకు రానై యున్న విశ్వప్రవక్త అరేబియా భూభాగంలో సరిగ్గా “సెల” పర్వత ప్రాంతంలో తమ కొరకు వస్తాడని ఆనాటి యూదులు కళ్లు కాయలు కాచేలా ఆయన కోసం ఎదురు చూస్తూ యస్రిబ్ లోనే స్థిర నివాసాలు ఏర్పర్చుకుని కొన్ని వందల సంవత్సరాలుగా ఉండిపోయారు.
రానైయున్న విశ్వప్రవక్త ఓ యోధుడిలా తన శత్రువులను ఎదురిస్తాడు!
“యెహోవా శూరుని వలె బయలుదేరును. యోధుని వలె తన ఆసక్తి రేపుకొనును. ఆయన హూంకరించుచూ తన శత్రువులను ఎదురించుచు వారి ఎదుట తన పరాక్రమము కనబరుచును”
పై లేఖనంలో యెహోవా తరఫు నుండి రాబోయే ప్రవక్తకు బదులు అలంకారికంగా యెహోవా బయలు దేరును అని వ్రాయబడింది. ఈ లేఖనంలో రాబోయే విశ్వప్రవక్త యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలను ప్రస్తావించటం జరిగింది. అవేమిటంటే- ఆయన శత్రువులను చూసి పిరికివానిలా దాక్కోడు! పారిపోడు!! శత్రువుల చేతిలో పిరికివానిలా కొరడా దెబ్బలు తినో, ఉమ్ములు వేయుంచుకునో తన శత్రువుల చేతిలో శిక్షించబడడు! కానీ, అతను ఓ శూరుని వలె బయలుదేరతాడు, అతను ఓ యుధుడిలా హూంకరిస్తూ శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటాడు! వారి ఎదుట తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు! అలా ధైర్యంగా శత్రువులను ఓ యోధుడిలా, శూరుడిలా ఎదుర్కొన్నది యేసు అయితే కాదు కదా! యేసు తన శత్రువులను ఎదిరించలేక ఎన్నో రోజులు అనేక చోట్ల దాక్కుంటూ చివరకు రోమా ప్రభుత్వ హయాములోనే శిలువ దండన శిక్షకు గురయ్యారు అన్నది నిర్వివాదం. దానికి పూర్తి భిన్నంగా కేవలం 300 మంది సామాన్య ప్రజలనే సైన్యంగా మలచుకుని, ఓ యోధుడిలా హూంకరిస్తూ, 1000 మంది ఉన్న సైనిక బలగంపై యుద్ధం చేసి వారిని ఓడించిన ఘనత ఒక్క ప్రవక్త ముహమ్మద్ (స) కే ఉంది.
ఈ విధంగా దేవుని తరఫు నుండి రానై యున్న అంతిమ ప్రవక్త “యోధుని వలె” వస్తాడని, “శత్రువులను ధైర్యంగా ఎదురించే పరాక్రమవంతుడని, ఆయన రాకడ జరిగినప్పుడు సెల నివాసులు సంతోషంతో పాటలు పాడతారని” యూదులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండేవారు. పైగా ఆనాటు యూదులు అప్పటి అరబ్బులతో లేఖనాల ప్రకారం మాకోసం రావలసి ఉన్న ప్రవక్త వచ్చినప్పుడు ఆన్యులైన మీ అందరినీ సంహరిస్తాడని ఎత్తిపొడుపు మాటలు సైతం చెబుతూ ఉండేవారు.
కానీ, వారు అనుకున్నది ఒకటైతే దైవం తలచింది వేరొకటి! అదేమిటంటే “సెల” ప్రాంతానికి రావలసి ఉన్న విశ్వప్రవక్త యూదులలో నుండి కాక, తాము ఎంతో నీచంగా చూసే “కేదార్” వాసులలో నుండి ఆవిర్భవించటం! ఈ ఒక్క అంశమే యూదుల తలబిరుసుతనానికి కారణం అయ్యింది. ప్రవక్త ముహమ్మద్ (స) వారిని ప్రవక్తగా అంగీకరించటానికి వారు ఏ మాత్రం ఒప్పుకోలేక పోయారు. నిజానికి ఆనాటి విద్వాంసులైన యూద పండితులకు తెలుసు తమ వద్ద ఉన్న గ్రంధాలలో వ్రాయబడిన లేఖనాల ప్రకారం “సెల” ప్రాంతం నుండి రావలసి ఉన్న ఆ ప్రవక్త- ముహమ్మద్ (స) అని! ఈ విషయాన్ని సూచిస్తూనే దేవుడు-
“మేము ఎవరికి గ్రంథాన్ని ప్రసాదించామో, వారు (యూదులు) తమ సంతానాన్ని ఏ విధంగా గుర్తిస్తారో అదే విధంగా గుర్తిస్తారు” – ఖురాన్ 2:146
అని చెప్పటం జరిగింది. అంటే తమ సంతానాన్ని ఎలా గుర్తిస్తారో అదే విధంగా తమ గ్రంధాల్లో వ్రాయబడిన లేఖనాల ప్రకారం ఆవిర్భవించిన ప్రవక్త ముహమ్మద్ (స) ను గుర్తిస్తారు. అయినప్పటికీ తమ వద్దకు పంపబడిన అనేకమంది ప్రవక్తలను అన్యాయంగా హత్యచేసిన యూదులకు ముహమ్మద్ (స)ను తిరస్కరించటం, ఆయనను అబద్ధీకూడని నింద వేయటం ఓ లెక్క! వారి తిరస్కారానికి సమాధానంగా ప్రవక్త ముహమ్మద్ (స) ప్రస్తావన తోరా, ఇంజీల్ గ్రంధాల్లోనే వ్రాయబడి ఉందని ఆనాడు ప్రవక్త ముహమ్మద్ (స) యూదుల సమక్షంలో ఉండగానే ఖురాన్ ఎంతో స్పష్టంగా ఈ క్రింది విధంగా ప్రకటించింది.
“ఈ సందేసహరుణ్ణి, చదవనూ వ్రాయనూ రాని ఈ ప్రవక్తను అనుసరించేవారు (ఈనాడు ఈ కారుణ్యానికి అర్హులు) అతని ప్రస్తావన వారికి (యూదులు-క్రైస్తవులకు) తమ వద్ద ఉన్న తౌరాత్ (ధర్మశాస్త్రం), ఇంజీలు (సువార్త) గ్రంధాలలో వ్రాయబడి లభిస్తుంది. – 7:157”
పై ఖురాన్ వాక్యానికి ఎంతో విశిష్టత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వాక్యం అవతరించేనాటికి యూదుల సమక్షంలో తోరా, ఇంజీల్ గ్రంథాలు ఒక ప్రక్క ఉన్నాయి. మరో ప్రక్క ప్రవక్త ముహమ్మద్ (స) వారూ ఉన్నారు. నిజంగా తమ వద్ద ఉన్న తోరా, ఇంజీల్ గ్రంధాల్లో ప్రవక్త ముహమ్మద్ (స) ప్రస్తావన లేకపోయి ఉంటే… ఆనాడు గుంటనక్కల్లా ముహమ్మద్ (స)ను ఎప్పుడు అబద్ధీకుడని నిరూపించాలా అని ఎదురు చూస్తున్న యూదులు మరియు మక్కా బహుదైవారాధకులకు ఇదొక్క ఆధారం చాలదా? ఆయనను అబద్ధీకుడని నిరూపించటానికి!? అయినప్పటికీ ఆనాడు మదీనాలో నివశిస్తున్న దుర్మార్గులైన యూదులు మక్కా బహుదైవారాధకులతో కుమ్మక్కై ప్రవక్త ముహమ్మద్ (స) వారి పట్ల అనేక కుట్రలు పన్నటం, అనేకమంది ప్రవక్త శిష్యులను హత్యలు చెయ్యటం ప్రారంభించారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ (స) యూదులపై సైనిక చర్యలు తీసుకోవటం జరిగింది. మదీనా నుండి యూదులందరినీ తన్ని తరిమేయటం జరిగింది.
కానీ, ఖురాన్ లో చెప్పినట్లు గానే ప్రవక్త ముహమ్మద్ (స) ప్రస్తావన వారి గ్రంథాల్లోనే ప్రస్తావించబడి ఉంది. ఆనాటి యూదులు ఏ విధంగానూ ప్రవక్త ముహమ్మద్ (స) ను ఎదిరించలేక, ఆయనను అబద్ధ ప్రవక్త అని నిరూపించలేక నిస్సహాయులైపోయారు. పైగా ముహమ్మద్ (స) అసలు ప్రవక్త అన్న విషయాన్ని లేఖనాల ఆధారంగా ధృవీకరించిందే “వరఖా బిన్ నౌఫిల్” ఓ బైబిల్ పండితుడు! ఈ ఒక్క ఆధారమే ఆనాడు అనేక మంది యూదులు, క్రైస్తవులు, మక్కా అవిశ్వాసులు తండోపతండాలుగా ఇస్లాంలోకి రావటానికి కారణమయ్యింది.
దేవుడు తేమాను (మదీనా) నుండి బయలుదేరుచున్నాడు! పరిశుద్ధ దేవుడు పారాను (మక్కా) నుండి వేంచేయుచున్నాడు!
“దేవుడు తేమాను నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాను నుండి వేంచేయుచున్నాడు” – హుబక్కుకు 3:3
“God comes from Teman, the Holy One from Mount Paran” – Habakkuk 3:3
పై లేఖనం అంతిమ ప్రవక్త అరేబియాలో నుండి రావలసి ఉన్న రెండు ప్రధానమైన ప్రాంతాల గురించి చెప్పటం జరుగుతుంది. 1. తేమాను నుండి 2. పారాను నుండి. “తేమా” అన్నది మదీనాకు ఉత్తరాన ఉన్న ఓ పట్టం పేరు! పైగా తేమా అన్నది ఇష్మాయేల్ కుమారులలో ఒకని పేరు (ఆది 25:15). అతని పేరు మీదే ఈ తేమా పట్టణం ఏర్పడింది. దానిని సూచిస్తూనే “దేవుడు తేమాను నుండి బయలుదేరుచున్నాడు” అని చెప్పటం జరిగింది. బైబిల్ ప్రకారం చూస్తే “సెల” పట్టణానికి దగ్గరలో “తేమ” పట్టణం ఉంది. ఆప్రాంతం మొత్తం మదీనా అని చెప్పవచ్చు.
ఇక “పారన్” అన్నది “మక్కా” ప్రాచీన పేరు. ఈ లేఖనం ప్రకారం రాబోయే ప్రవక్త తేమా ప్రాంతం మరియు పారాన్ ప్రాంత వాసి అయి ఉంటాడని తెలుస్తుంది. ఇది ఓ కాదనలేని వాస్తవం. ప్రవక్త ముహమ్మద్ (స) మదీనా (“సెల” లేదా యస్రిబ్) నుండి బయలుదేరారు. పారాను (మక్కా) లో వేంచేశారు కూడా! అందుకే బైబిల్లో … “ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను” – ఆది 33:2 అని చెబుతూనే పారాన్ (మక్కా) ప్రాంతం నుండి రానైయున్న ప్రవక్త గురించి “సెల (యస్రిబ్)” ప్రజలకు సంబరాలు చేసుకొమంటున్నాడు.
“అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను. “సెల” నివాసులు సంతోషించుదురు గాక పర్వత శిఖరముల నుండి వారు కేకలు వేయుదురు గాక” – యెషయా 42:11
అయితే క్రైస్తవులలో కొందరు లేఖనంలో చెప్పబడ్డ తేమాను వేరు తేమా వేరు అని తెగగోల చేస్తూ ఉంటారు! తేమాను ఏశావు మనవడి పేరు అని దానిపేరు మీద ఎదోమ్ దగ్గర ఏర్పడ్డ నగరం తేమాను అని. తేమాను ఏశావు మనవడి పేరు అయితే అయి ఉండవచ్చు గానీ, ఇష్మాయేల్ కుమారుడైన “తేమా” పేరు మీద ఏర్పడ్డ పట్టణాన్నే ఉద్దేశిస్తూ “దేవుడు తేమాను నుండి బయలుదేరుచున్నాడు” అని చెప్పటం జరుగుతుంది. అయినా తేమాన్ గురించి గోల పెట్టేవారు పారాన్ గురించి ఏం మాట్లాడరు! ఎందుకంటే అది అరేబియాలోనే ఉంది కదా! కాస్త జాగ్రత్తగా చదివితే… “దేవుడు తేమాను నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాను నుండి వేంచేయుచున్నాడు” “సెల” నివాసులు సంతోషించుదురు గాక “ అన్న లేఖన భాగాలను బట్టి రాబోయే అంతిమ ప్రవక్త ప్రాంతం సరిగ్గా అరేబియాలో “సెల (యస్రిబ్ / మదీనా)” “తేమా” మరియు “పారాను (మక్కా)” ప్రాంత వాసి అయి ఉంటాడని తెలుస్తుంది. ఆ ప్రాంత వాసి అయిన ప్రవక్త ఎవరు? నేటి క్రైస్తవులు విమర్శించే ప్రవక్త ముహమ్మదే!
Md Nooruddin
బైబిల్లో మదీనా ప్రస్తావన
