అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్సాకునా? ఇష్మాయేలునా? అన్న ప్రశ్నకు అధికశాతం క్రైస్తవుల వాదన – ఇస్సాకునే అన్నది. కారణం- స్పష్టంగా పరిశుద్ధ గ్రంధంలో “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను” – హెబ్రీ 11:17 అని వ్రాయబడి ఉంది కాబట్టి మేము అలాగే నమ్ముతాము అనేది వారి వాదన! అసలు అబ్రాహాము ఇచ్చిన ఇష్మాయేలు బలిని కుట్రపూరితంగా ఇస్సాకుకు ఎందుకు? ఎలా? అన్వయించటం జరిగిందన్నది గమనించే ముందు – పరిశుద్ధ గ్రంధం ప్రకారం అబ్రహాము ఇష్మాయేలును బలి ఇచ్చేనాటికే అసలు ఇస్సాకు పుట్టుక జరిగిందా? లేదా? అన్నది ముందు తెలుసుకోవాల్సి ఉంది.
అబ్రాహాము, ఇష్మాయేలును బలి ఇచ్చేనాటికి అసలు ఇస్సాకు పుట్టనే లేదు!
పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ ను పరిశీలనగా చదివే అలవాటు ఉన్న వారికి ఇక్కడ బయల్పరచబడే వాస్తవాలను జాగ్రత్తగా గ్రహించగలిగితే ప్రవక్త ముహమ్మద్ (స) వంశ మూలపురుషుడైన ఇష్మాయేలు విశిష్ఠతను కప్పిపుచ్చటానికి ఎన్నెన్ని కుట్రపూరిత ప్రయత్నాలు జరిగాయో అర్థం చేసుకోగలరు. వాస్తవం ఏమిటంటే- అసలు అబ్రాహాము, ఇష్మాయేలును బలి ఇచ్చేనాటికి ఇస్సాకు పుట్టనే లేదు అన్నది! కానీ, ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చటానికి ఎన్ని ప్రయత్నాలు చేసి, బైబిల్ వాక్యాలను తమకు అనువుగా మలుచుకున్నప్పటికీ సత్యం అన్నది మరుగుపడదు కదా!
నిజానికి ఇస్సాకు పుట్టుక జరిగేనాటికి ఇష్మాయేలు వయస్సు పదహారు సంవత్సరాలు!
ఇష్మాయేలీయులకు మరియు ఇశ్రాయేలీయులకు మధ్య వైరం సృష్టించి, క్రైస్తవుల దృష్టి నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) ప్రాముఖ్యతను తప్పించేయ్యటంలో కుట్రలో భాగంగా మరియు ఇష్మాయేలీయులపై ధ్వేషం పుట్టించే ప్రయత్నంలో భాగంగా జాత్యాహంకారులైన యూద పండితులచే బైబిల్లో చేర్చబడిన ఓ కల్పిత కథే శారా, హాగారును ఇంటి నుండి వెళ్ల గొట్టినట్లు బైబిల్లో వ్రాయబడి ఉన్న సంఘటన! కాస్త వివరాల్లోకి వెళితే … అబ్రాహాముకు 86 ఏళ్ల వయస్సులో ఇష్మాయేలు పుట్టాడు (ఆది 16:16). ఆ తరువాత 14 సంవత్సరాల అనంతరం అబ్రాహాము 100 ఏళ్ల వయసులో ఉండగా ఇస్సాకు పుట్టినట్టు చూడగలం (ఆది 21:5). అంతేకాదు ఇస్సాకు పుట్టి, పాలు విడిచే సమయానికి అబ్రాహాము గొప్ప విందు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా బైబిల్లో చూడగలం (ఆది 21:8). అంతేకాదు ఇస్సాకు పుట్టి అతను పాలు విడిచే సమయం దాదాపు రెండేళ్లు ఉంటుంది. దీనిని బట్టి 14+2=16 సంవత్సరాలు అప్పటికి ఇష్మాయేలు వయస్సు అయి ఉంటుందని అర్థమౌతుంది. ఇప్పుడు ఇష్మాయేలు వయస్సును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుండి చెప్పబడే ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా గమనించండి.
ఇంతలోనే పదహారు సంవత్సరాల ఇష్మాయేలు పసిపిల్లాడుగా ఎలా మారిపోయాడు?
ఆడికాండము 21:8-13 వాక్యాలు చదివితే అబ్రాహాము ఇచ్చిన విందు రోజు నాడు ఇష్మాయేలు రెండేళ్ల పసివాడైన ఇస్సాకును చూసి పరిహసించినట్లు దానికి శారాయి తెగ ఫీలైపోయి ఎంతో వేదనకు గురై హాగారును మరియు ఇష్మాయేలును ఇంటి నుండి వెళ్లగొట్టినట్లు అలాగే హాగారు, ఇష్మాయేలును తీసుకుని పారాను అరణ్యానికి వెళ్లిపోయినట్లు చూడగలం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బైబిల్లో శారా, హాగారును వెళ్లగొట్టిన కథనం బైబిల్లో చొప్పించే హడావిడిలో పడి, పాపం ఇష్మాయేలును తీసుకుని హాగరు పారాను అరణ్యానికి వెళ్ళేనాటికి అతను ఓ పసిపిల్లవాడు అన్న యదార్థాన్ని గమనించకపోవటం హాస్యాస్పదం.
నిజంగా అబ్రాహాము ఇచ్చిన విందు రోజునాడు ఇష్మాయేలు రెండేళ్ల పసివాడైన ఇస్సాకును చూసి నవ్విన దానికి శారాయి తెగ ఫీలైపోయి ఎంతో వేదనకు గురైపోయి హాగరును మరియు ఇష్మాయేలును ఇంటి నుండి వెళ్లగొట్టిందన్నదే నిజమైతే అప్పటికి పదహారు వయస్సు ఉండాల్సిన ఇష్మాయేలు, హాగరు పారాను అరణ్యానికి వెళ్లే సమయంలో అకస్మాత్తుగా ఇష్మాయేలు పాలు త్రాగే పసి పిల్లాడుగా ఎలా మారిపోతాడు? ఆశ్చర్యంగా ఉంది కదూ!! నిజమే ఇంతకూ హాగరు, ఇష్మాయేలును తీసుకును పారాను అరణ్యానికి వెళ్ళేనాటికి ఇష్మాయేలు వయస్సు పదహారు సంవత్సరాలు కాదు! అతను కేవలం పాలు త్రాగే పసిపిల్లాడు!! ఈ విషయాన్ని ఈ క్రింది వాక్యాల్లో గమనించగలరు.
1.కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి, ఆహారమును నీళ్ల తిత్తిని తీసికుని ఆ పిల్లవానితో కూడా హాగారునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను – ఆది 21:14
2.ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి… – ఆది 21:15
3…. దేవుడు వాని స్వరమును వినియున్నాడు; నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వాని గొప్పజనముగా చేసేదనని ఆమెతో చెప్పెను. – ఆది 21:17,18
పై మూడు వాక్యాలలో “ఆ పిల్లవానితో కూడా హాగారునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి” “ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి” “ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము” అన్న వాక్య భాగాలను బట్టి హాగరు పారాను అరణ్యమునకు వచ్చినప్పటికి ఇష్మాయేలు కేవలం ఓ పాలు త్రాగే పిల్లవాడు తప్పితే 16 సం. కుర్రవాడు కాదు. పైగా అప్పటికి ఇష్మాయేలు 16 సం.ల కుర్రవాడే అయితే గనుక “ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి” “ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము” వంటి పదప్రయోగాలే చెయ్యబడవు. చివరకు ఆ చిన్నవాడైన ఇష్మాయేలు మొరను ఆలకించి, దేవుడు అక్కడ ఒక నీళ్ల ఊటను ఏర్పాటు చెయ్యగా (ఆది 21:19) “హాగరు, తిత్తిని నీళ్లతో నింపి చిన్నవాడైన పట్టించి త్రాగించినట్లు చూడగలం”. నిజంగా ఇష్మాయేలు అప్పటికి 16 సం.ల కుర్రవాడే అయితే హాగరు చిన్నవాడైన ఇష్మాయేలుకు నీళ్లను పట్టించటంలో అర్థమే ఉండదు. ఆ కుర్రవాడే తన తల్లికి నీళ్లను పట్టించేవాడు కదా!
దేవుడు ఆనాడు చిన్నవాడైన ఇష్మాయేలు కొరకు పారాను (అరేబియా) ఎడారిలో ఏర్పాటు చేసిన ఆ నీళ్ల ఊట ఆనాటి నుండి ఈనాటి వరకూ నిరంతరాయంగా ఉబుకుతూనే ఉంది. “ఆబే జం జం” పేరిట ఈనాటికీ ఆ నీళ్ళ ఊట రోజుకూ కొన్ని వందల గ్యాలన్ల నీళ్లను ఇస్తూ అత్యంత ప్రసిద్ధిగాంచింది. దీనిని బట్టి హాగరు, ఇష్మాయేలును తీసుకుని బెయెర్షబా (అనగా పారాను) అరణ్యానికి వెళ్లింది ఇస్సాకు పుట్టటానికి పద్నాలుగు సంవత్సరాలకు ముందే! అంటే ఇష్మాయేలు పుట్టిన కొద్ది దినాల తరువాత కేవలం పాలు త్రాగే “పసిపిల్లవాడు” గా ఉన్నప్పుడు వెళ్ళటం జరిగింది. వాస్తవం ఇదైనప్పుడు అసలు ఇష్మాయేలు, ఇస్సాకును చూచి పరిహసించటానికి అవకాశం అసలు ఉంటుందా?
దీనిని బట్టి ఇస్సాకును చూచి ఇష్మాయేలు పరిహసించాడని, కనుక హాగరు, ఇష్మాయేలు శారాద్వారాత వెళ్లగొట్టబడ్డారని వ్రాయబడినదంతా కేవలం బైబిల్లో ఇరికించిన ఓ కల్పిత కథ మాత్రమే అన్నది అర్థం కావటం లేదు? పాతనిబంధనలో ఈ కథనం ఇరికించటం మాత్రమే కాదు … అత్యంత హాస్యాస్పదమైన మరియు అజ్ఞాన పూరితమైన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ (స) వంశ మూలపురుషుడైన ఇష్మాయేలు విశిష్ఠతను దెబ్బతీసే కుట్రలో భాగంగా హాగరు, ఇస్సాకు పుట్టటానికి 14 సం.లకు ముందే పాలు త్రాగే పసిపిల్ల వాడైన ఇష్మాయేలును తీసుకెళ్లిందన్న వాక్యాలను గమనించక ఆనాడు ఇష్మాయేలు, ఇస్సాకును పరిహసించి, హింసించేశాడని పౌలు పేరట అతని పత్రికలోనే ఈ క్రింది వాక్యాన్ని ఇరికించటం!
“అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు (ఇష్మాయేలు) ఆత్మను బట్టి పుట్టిన వానిని (ఇస్సాకును) ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది” – గలతీ 4:29
ఈ కల్పిత కథ అల్లి బైబిల్లో ఇరికించటం వెనుక కుట్ర ఏమిటంటే…
ఆదికాండము 22 వ అధ్యాయం నుండి అబ్రాహాముకు అతని కుమారుని బలి ఇచ్చిన సంఘటన ప్రారంభం అవుతుంది. దానికి ముందు ఆద్యాయంలోనే ఇష్మాయేలు, హాగరులు శారాయి ద్వారా వెళ్లగొట్టబడినట్లు ఓ కల్పిత కథ అల్లి ఇరికించటం ద్వారా ఇష్మాయేలు ప్రస్తావన తప్పించేసి, అబ్రాహాము ఇచ్చిన బలిని ఇస్సాకుకు ఆపాదించటం సులువు అవుతుంది. కాబట్టి హాగరు, ఇష్మాయేలును తీసుకుని పారాను అరణ్యానికి వెళ్ళేనాటికి అతను ఓ పాలు త్రాగే పిల్లవాడని బైబిల్ చెబుతున్న వాక్యాలను సరిగా గమనించక, ఇష్మాయేలు పుట్టిన 14 సం.ల తరువాత ఇస్సాకు పుట్టాడన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోక … ఇస్సాకును చూచి ఇష్మాయేలు పరిహసించినట్లు దానికి కలత చెందిన శారాయి హాగరును ఇంటి నుండి వెల్లగొట్టినట్లు ఓ కథ అల్లి బైబిల్లో ఇరికించటం జరిగింది. నిజానికి ఇస్సాకు పుట్టటానికి 14 సం.ల ముందే హాగరు పారాను అరణ్యానికి పంపబడింది శారాయి ద్వారా ధ్వేషించబడి ఎంతమాత్రం కాదు! కానీ ఇది కేవలం దేవుడు, అబ్రాహామును పరీక్షించటానికి మాత్రమే అతను ఎంతగానో ప్రేమించే ఇష్మాయేలును హాగారును బేయర్షబాకు పంపమని ఆజ్ఞాపించటం జరిగింది. దానికి ఆధారం- హాగరు, ఇష్మాయేలును తీసుకుని బెయెర్షబాకు బయలుదేరిన మరుక్షణం నుండే దేవుడు, ఆమెకు మరియు పసిపిల్లవాడైన ఇష్మాయేలుకు తన ప్రత్యేక సహాయ సహకారాలను ఇవ్వటం ప్రారంభిస్తాడు! ఆ విధంగా ఇష్మాయేలు పారాను (అరేబియా) లోనే పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోతాడు (ఆది 21:21). గమనార్హమైన విషయం ఏమిటంటే- అబ్రాహాము సైతం హాగారుతో కలిసి పారానులోనే నివసించేవాడు తప్ప, కనానులో ఉండే శారాయితో ఉండేవాడు కాదు (ఆది 22:19).
“ఒక్కడే అయి ఉన్న కుమారుడు” ఎవరు?
అబ్రాహాము, ఇష్మాయేలును బలి ఇచ్చేనాటికి అసలు ఇస్సాకు పుట్టుక జరగానే లేదు అనటానికి రెండవ ఆధారం- దేవుడు “నీ ఒక్కడే అయ్యున్న నీ కుమారుని (ఆది 22:2, 12, 16)” అని ప్రస్తావించటమే! నిజంగా అప్పటికే ఇస్సాకు పుట్టి ఉంటే దేవుడు – “ఒక్కడే అయ్యున్న నీ కుమారుని” అని ఎందుకు అంటాడు? దీనికి క్రైస్తవ బోధకులు చాకచాక్యంగా “ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును (ఆది 21:12)” అన్న వాక్యాన్ని చూపి, ఇస్సాకే అబ్రహాముకు ఏకైక సంతానంగా పరిగణించబడతాడు అని వాదిస్తూ అదే క్రమంలో దేవుడు, ఇష్మాయేలును గూర్చి చెబుతున్న ఈ క్రింది వాక్యాలను కప్పిపుచ్చుతూ ఉంటారు.
“అయిననూ ఈ దాసీ కుమారుడును (ఇష్మాయేలు) నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసెదనని చెప్పి అబ్రాహాముతో చెప్పెను” – ఆది 21:13
“నీవు లేచి ఆ చిన్నవాని నీ చేత పట్టుకొనుము; వాని గొప్పజనముగా చేసేదనని ఆమెతో చెప్పెను” – ఆది 21:17,18
పై వాక్యాల్లో దేవుడు, ఇస్సాకునే కాదు ఇష్మాయేలును కూడా ఉద్దేశించి “నీ సంతానమే” అంటున్నాడు. పైగా ఇష్మాయేలును సైతం “గొప్పజనముగా చేసేదనని” వాగ్దానం చేసిన వైనం గమనించగలం. దీనిని బట్టి ఇష్మాయేలు కేవలం దాసీ పుత్రుడు గనుక అతను అబ్రాహాముకు కేవలం నామమాత్ర కుమారుడు ఒక్క ఇస్సాకు మాత్రమే అబ్రహాముకు ఏకైక కుమారుడు అన్న భేద భావాన్ని దేవుడు కలిగి లేడని తేటతెల్లమైంది.
దేవుడు, అబ్రాహాముతో అతని కుమారుణ్ణి బలి ఇమ్మని ఆజ్ఞాపించటంలో ఉద్దేశం ఆదికాండం 22:1 వాక్యాన్ని బట్టి “అబ్రాహామును పరిశోధించటం” అంటే- అతని విశ్వాసాన్ని పరీక్షించటం అని తెలుస్తుంది. విశ్వాసానికి పరీక్ష అన్నది ఇద్దరు కుమారులు ఉండగా వారిలో ఒకరిని బలి ఇమ్మంటే అర్థరహితం అవుతుంది. అసలు పరీక్ష ఓ వ్యక్తికి ఒక్కగానొక్క కుమారుడే ఉండి అతనిని స్వయంగా అతని చేతులతోనే బలి ఇమ్మన్నప్పుడే అవుతుంది కదా!
అబ్రాహాము తన కుమారుణ్ణి బలికి తీసుకెళ్లి తిరిగి వచ్చింది కనానుకా? పారానుకా?
అబ్రాహాము బలి ఇవ్వటానికి తీసుకెళ్లింది ఇస్సాకును కాదు ఇష్మాయేలును అని చెప్పటానికి గొప్ప ఆధారం – అబ్రాహాము, ఇష్మాయేలును తీసుకుని బలి ఇవ్వటం కోసం బెయేర్షబా అరణ్యం నుండి మోరియా దేశానికి వెళ్ళి, తిరిగి ఇష్మాయేలును వెంటబెట్టుకుని బెయేర్షబా (పారాను) రావటం! తిరిగి వచ్చి అబ్రాహాము బెయేర్షబాలోనే ఇష్మాయేలు, హాగరుతోనే నివసించాడు (ఆది 22:19). ఇక బెయేర్షబాలో ఉన్నది హాగరు, ఇష్మాయేలులే తప్ప శారాయి, ఇస్సాకులు కాదు అన్నది నిర్వివాదం!
ఒకవేళ అబ్రాహాము బలికి తీసుకెళ్లింది ఇస్సాకును అనుకుంటే అబ్రాహాము, ఇస్సాకును బలి ఇవ్వటానికి కనానులో ఉంటున్న ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్లి, తిరిగి కనానుకు వచ్చి ఉండేవాడే తప్ప బెయేర్షబాలో ఉన్న హాగరు దగ్గరకు తీసుకెళ్లటంలో అర్థం ఉండదు కదా!? పైగా ఇస్సాకు తన తల్లి అయిన శారా చనిపోయే వరకు కనాను లోనే ఉన్నాడు. అలాగే శారా చనిపోయినప్పుడు ఒక్కసారి మాత్రమే అబ్రాహాము, బెయేర్షబా నుండి కనాను దేశంలో కిర్యాతర్బకు సంతాపం తెలియజేయటానికి వచ్చినట్లు బైబిల్లో చదవగలం (ఆది 23:1,2). దీనిని బట్టి అబ్రాహాము బలి ఇవ్వటానికి తీసుకెళ్లింది ఇస్సాకును కాదు ఇష్మాయేలును అన్నది తేలిపోయింది.
అయితే అబ్రాహాము, ఇష్మాయేలును బలి ఇచ్చిన దానిని ఎంతో చాకచక్యంగా ఇస్సాకుకు ఆపాదించటం వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటంటే- అబ్రాహాము, ఇష్మాయేలును బలి ఇవ్వటానికి సిద్ధపడినందుకు గాను దేవుడు అతని విషయంలో చేసిన ఈ క్రింది గొప్ప వాగ్దానమే!
“మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయూ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును” – ఆది 22:18
పై దేవుని గొప్ప వాగ్దానాన్ని బట్టి అబ్రాహాము, ఇష్మాయేలును బలి అర్పించటానికి సిద్ధపడినందుకు గానూ దానికి ప్రతిఫలంగా ఇష్మాయేలు వలన భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడాల్సి ఉంది. దానికి గానూ ఇష్మాయేలు వంశం నుండి ఓ విశ్వప్రవక్త ప్రభవింపజేయబడి, అతని ద్వారా భూలోకంలో సంపూర్ణంగా దేవుని రాజ్యం స్థాపించబడి, దేవుని వాగ్దానం ప్రకారం ఇష్మాయేలీయులు “గొప్పజనముగా” చేయబడి (ఆది 21:18) భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడాల్సి ఉంది.
ఈ విధంగా ఇష్మాయేలు వంశావళి నుండి దేవుని వాగ్దానం ప్రకారం సకల ప్రపంచదేశాల ప్రజల కొరకు రావలసి ఉన్న అంతిమ దైవ సందేశహరుడైన ముహమ్మద్ (స) ప్రస్తావనను కప్పిపుచ్చటానికే కొందరు జాత్యాహంకారులైన యూద పండితులు ప్రవక్త ముహమ్మద్ (స) వంశ మూలపురుషుడైన ఇష్మాయేలు విశిష్ఠతను దిగజార్చటానికి శారాచే హాగరు, ఇష్మాయేలు వెల్లగొట్టినట్లు ఓ కల్పిత కథను బైబిల్లో ఇరికించి, తద్వారా అబ్రాహాముకు ఇచ్చిన ఇష్మాయేలు బలిని ఉద్దేశపూర్వకంగా ఇస్సాకుకు ఆపాదించటం జరిగింది.
Md Nooruddin
ఇష్మాయేలు బలిని ఇస్సాకుకు ఆపాదించటంలో కుట్ర ఏమిటి?
