అసలు ఖురాను గ్రంథం కాల్చి వేయబడిందా!?

నేటి కొందరు క్రైస్తవ బోధకులు భలే గమ్మత్తుగా ఇస్లామియా చరిత్రకు సంబంధించి ఒక్క పేజీ కూడా చదవకుండానే ఎక్కడో గాసిప్పుల్లో విన్న గాలి కాబుర్లు పట్టుకుని కొన్ని స్వంత తీర్మానాలు చేస్తూ ఉంటారు. సామాన్య క్రైస్తవుల దృష్టిలో ఖురాన్ విశిష్టతను దెబ్బతీయటానికి నేటి కొందరు బోధకులు చేసే విఫలయత్నాలలో ఒకటి ఏమిటంటే- “అసలు ఖురాన్ గ్రంధం ఎప్పుడో కాల్చివేయబడింది! ప్రస్తుతం ఉన్నది అసలు ఖురాను కాదు” అన్నది.

ఇలాంటి ప్రచారాలు చేసేవారు కలిగి ఉన్నదల్లా ఇస్లాం పట్ల అక్కసు తప్పితే- వాస్తవ జ్ఞానం కాదు. వీరికి బైబిల్ పట్ల, దాని చరిత్ర పట్లే సరిగా అవగాహన ఉండదు. కానీ తమకు అన్నీ తెలిసినట్లు కొన్ని విషయాలు తీర్మానించేస్తుంటారు.
వాస్తవం ఏమిటంటే- ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ (స) వారిపై 23 సం. లు అవతరింపజేయబడింది. అయితే ప్రవక్త ముహమ్మద్ (స) వారిపై ఖురాన్ అవతరిస్తున్న సమయంలోనే ఆయన తన ఇంట్లో పెంపుడు కొడుకుగా పెంచుకున్న జైద్ (రజి) గారి ద్వారా ఖురాన్ ను ఎప్పటికప్పుడు తన సమక్షంలోనే వ్రాయించేవారు. అంతేకాక అప్పటి నుండే నమాజులో ఖురాన్ చదవాలనే నియమం ఉండటం కారణంగా ప్రవక్త ముహమ్మద్ (స) వారు ఉన్న కాలంలోనే ఆయన ద్వారా తర్ఫీదు పొందిన వేలమంది శిష్యులు పూర్తి ఖురాన్ ను క్రమబద్ధంగా కంఠస్తము చేయటమే కాక, ఖురాన్ సూరాలను వారు చర్మాలపై వ్రాసుకుని భద్రపరచుకునే వారు.

అయితే ప్రవక్త ముహమ్మద్ (స) వారు పరమపదించిన తరువాత ఆయన ప్రధాన శిష్యుడైన అబూబకర్ (రజి) వారు ఖలీఫా (రాజు) గా ఉన్న కాలంలో ఒక యుద్ధం జరుగుతుంది. అందులో ఖురాన్ ను కంఠస్తము చేసిన చాలా మంది ప్రవక్త శిష్యులు దైవ మార్గంలో తమ ప్రాణాలను కోల్పోతారు. ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ (స) శిష్యుడైన హజ్రత్ ఉమర్ (రజి) గారు శిష్యుల వద్ద విడిగా ఉన్న ఖురాన్ భాగాలన్నిటినీ ఒక చోట చేర్చి, గ్రంథస్థం చేయటం మంచిదని మనవి చేస్తారు. అప్పుడు అబూబకర్ (రజి) వారు ఆ పనిని ప్రవక్త ముహమ్మద్ (స) శిష్యుడైన జైద్ (రజి) వారికే అప్పగిస్తారు. ఆ విధంగా విడిగా ఉన్న ఖురాన్ అధ్యాయాలను సంకలనం చేయించి, పూర్తి అసలు ప్రతిని ప్రవక్త ముహమ్మద్ (స) భార్యలలో ఒకరైన హజ్రత్ హఫ్సా (రజి) వారి వద్ద భద్రపరుస్తారు. ఇక్కడ గమనించాల్సింది- ప్రవక్త ముహమ్మద్ (స) వారు ఉన్నకాలం నుండే మొత్తం ఖురాన్ గ్రంధం అధ్యాయాలను క్రమంతో సహా కంఠస్త పట్టిన వేలమంది శిష్యులు బయలు దేరారన్నది. అయితే అబూబకర్ (రజి) చేసింది కేవలం విడిగా ఉన్న అధ్యాయాలను ఒక చోట చేర్చి, గ్రంథస్తము చేయటం మాత్రమే!

ఆ తరువాత హజ్రత్ ఉత్మాన్ (రజి) వారు ఖలీఫా గా ఉన్న కాలంలో ఇతర దేశాల నుండి అరబ్బేతర ప్రజలు కోకొల్లలుగా ఇస్లాంలోకి రావటం మొదలౌతుంది. ఇక్కడ గమనించాల్సింది- అరబ్ లో అప్పటికే 7 రకాల యాసలు (Dialects) చలామణీలో ఉండేవన్నది. ఉదాహరణకు తెలుగులోనే చాలా రకాల యాసలు చూడగలం. తెలంగాణా, ఆంధ్రా, నెల్లూరు, రాయలసీమ యాసలు గమనిస్తే వేరువేరుగా ఉంటాయి. ఇలా ప్రతీ భాషలోనూ ప్రాంతాన్ని బట్టి యాసలు మారిపోతుంటాయి. అలాగే అరబ్బీ భాషలో సైతం ఏడు రకాల యాసలు కలిగిన అరబ్బులు వారి వారి యాసల్లోనే ఖురానును కూడా వ్రాసుకునేవారు! సాధారణంగా జరిగేది కూడా అదే. ఆ విధంగా సిరియా, ఇరాక్, మక్కా ప్రజలు మాట్లాడుకునే యాసల్లో ఎంతో తేడా ఉండేది.
అయితే ఇస్లాం స్వీకరిస్తున్న అరబ్బేతర ప్రజల్లో ఇంతకూ ఖురాన్ ఏ యాసలో చదవటం కరెక్టు? అన్న విషయంలో వారు అయోమయానికి గురయ్యేవారు. అంతేకాదు ఖురాన్ యాసల విషయంలో ప్రజల మధ్య వాదోపవాదాలు మొదలై కలహాలు సైతం ప్రారంభమైపోయాయి. చివరకు ఈ విషయం ఎంతపెద్దదైపోయిందంటే అప్పటి ఖలీఫా ఉత్మాన్ (రజి) వద్దకు చేరుతుంది. హుదైఫా అల్-యామన్ “ఓ విశ్వాసుల నాయకుడా క్రైస్తవులు, యూదులు తమ గ్రంధాల విషయంలో విభేదించినట్టు, విశ్వాసులు విభేదించక పూర్వమే ఈ దేశాన్ని మీరు రక్షించాలని” విన్న వించుకుంటారు. అప్పుడు ఖలీఫా ఉత్మాన్ (రజి) వారు హజ్రత్ హఫ్సా (రజి) వారి వద్ద భద్రపరచబడి ఉన్న అసలు ఖురాన్ ప్రతిని రప్పిస్తారు. ఆ అసలు ప్రతి అచ్చులు (Vowels) లేకుండా వ్రాయబడి ఉంటుంది. ఎందుకంటే వ్రాసేటప్పుడు అచ్చులు లేకుండానే అరబ్బీ వ్రాయటం జరిగేది. అది వారి స్వంత భాషకానుక. ఇప్పుడు ఏ దేశపు అరబ్బేతరుడు ఖురాన్ చదివినా దాని అసలు ఉచ్ఛారణ మారకుండా ఉండటానికి దానికి అచ్చులు చేర్చటం జరిగింది. ఆ తరువాత అసలు ఖురాన్ ప్రతి నుండి స్వచ్చమైన అరబ్బీ భాషలో నకలు (COPY) చేసి, తిరిగి అసలు ఖురాన్ ప్రతిని హజ్రత్ హఫ్సా (రజి) వారికే అప్పగిస్తారు (ఈ విషయాలు అల్ బుఖారీ 33.23 హదీసు నుండి సేకరించబడ్డవి). ఆ విధంగా పటిష్టంగా అచ్చులు చేర్చి, స్వచ్చమైన అరబ్బీ భాషలో నకలు (Copy) చేయబడిన ఖురాన్ ప్రతులను ఖలీఫా ఉత్మాన్ వారు ఇతర ఇస్లామిక్ రాజ్యాలకు పంపి, ఆయా ప్రాంత ప్రజలు తమ స్వంత యాశల్లో చదవటానికి వీలుగా తమ స్వంత యాసల్లో ఖురాన్ చదవటాన్ని రద్దు చెయ్యాటమే కాకుండా తాము భద్రపరచుకున్న ఖురాన్ భాగాలను రద్దు చేస్తారు.

ఆ విధంగా ఆనాడు ఖలీఫా ఉత్మాన్ (రజి) వారు ఇతర అన్నీ ఇస్లామిక్ రాజ్యాలకు పంపిన ఖురాన్ ప్రతులే ప్రపంచవ్యాప్తంగా చదవబడుతున్నాయి. ఆనాటి అసలు ఖురాన్ ప్రతి సైతం ప్రస్తుత “టోప్ కపి మ్యూజియం, ఇస్తాంబుల్, టర్కీ”లో భద్రంగా ఉంది. ఇక్కడ జరిగింది కేవలం విడి భాగాలు ఒకచోట చేర్చటం, చేర్చిన భాగాలు చదివేటప్పుడు ఉచ్ఛారణ మారకుండా అచ్చులు చేర్చటం, అప్పటికే స్వంత యాసల్లో వ్రాసుకున్న ఖురాన్ ప్రతులను రద్దుచెయ్యటం అంతే! ఈ విధంగా ఖలీఫా ఉత్మాన్ (రజి) వారు అసలు ఖురాన్ ప్రతినుండీ స్వచ్చమైన అరబ్బీ భాషలోకి నకలు (Copy) చేసి, అప్పటికే ఉన్న ఇతర అరబ్బీ యాసలను రద్దు చేసారే తప్ప నేడు కొందరు క్రైస్తవ బోధకులు ఇస్లాం పై ఉన్న అక్కసుతో ప్రచారం చేస్తున్నట్టు అసలు ఖురాన్ ప్రతిని కాల్చేయ్యలేదు.

చివరిగా ప్రస్తుతం ఉన్న ఖురాన్ అసలు ఖురాన్ కాదని ప్రచారం చేస్తున్న క్రైస్తవులు, అలాగే ప్రస్తుతం ఉన్న ఖురాన్ అసలు ఖురానా? కాదా? అన్న సందేహం ఉన్న క్రైస్తవులు బాగా ఆలోచన చెయ్యాల్సిన విషయం ఖురాన్ లో – “ఈ గ్రంధం విషయంలో సందేహం ఉన్నవారు దీనిలోని చిన్న సూరా (అధ్యాయం) వంటి అధ్యాయాన్ని రచించి తీసుకురండి” అని విసురుతున్న ఛాలెంజ్ ఇప్పటికీ వ్రాయబడి ఉంది ! అటువంటప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలలో అరబ్బీ భాష వచ్చిన క్రైస్తవులు, యూదులు కూడా తక్కువలేరు! దాదాపు 16 మిలియన్ల పైనే ఉన్నారు. మరి అదేదో ఖురాన్ లో ఉన్న ఓ చిన్న అధ్యాయానికి సరితూగే ఒక అధ్యాయాన్ని ఇన్నాళ్లూ ఈ 1400 సంవత్సరాలలో ఏ ఒక్క అరబ్బీ భాష వచ్చిన క్రైస్తవుడో, యూదుడో రచించేసి ఖురాన్ ను తప్పని నిరూపించేయొచ్చుగా! మరెందుకు ఇన్నివందల సంవత్సరాలలో ఎవడూ ఈ ఛాలెంజ్ ను స్వీకరించలేకపోయాడంటారు? కాస్త ఏకాంతంగా ఉన్నపుడు బాగా ఆలోచించండి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *