యేసు బోధించిన “శాంతి ధర్మాన్నే” ముహమ్మద్ (స) స్థాపించారు!

“నేను మీ యొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ (లేక ఉత్తరవాది) సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. శాంతి (PEACE) మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతి (PEACE) నే మీకనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుట లేదు; మీ హృదయములను కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి” -యోహాను 14:25-27

యేసు చెబుతున్న పై భవిష్యవాణి ప్రకారం- యేసు చెప్పిన సమస్తమునూ జ్ఞాపకం చేయాల్సి ఉన్న వేరొక ఆదరణకర్త ఇచ్చే ధర్మాన్ని సూచిస్తూ, యేసు- ‘శాంతి (PEACE)” మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను’ అంటున్నారు. అంటే- ‘నేను మీకిచ్చిన “శాంతి మార్గాన్నే” (WAY OF PEACE) వేరొక ఆదరణకర్త మీకు ఇస్తారు’ అని అర్థం. దీనిని బట్టి యేసు తాను ఈ లోకంలో ఉండగా ఏ ‘శాంతి (PEACE)’ మార్గాన్నైతే బోధించారో దానినే వేరొక ఆదరణకర్త అయిన ముహమ్మద్‌ (స)బోధిస్తారు అని తెలుస్తుంది. అలాగే ఆయనను అంగీకరించే విషయంలో ‘మీ హృదయములను కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి’ అని యేసు ముందుగానే తాకీదు చేస్తున్నారు.

“శాంతి” అంటే – ISLAM (WAY OF PEACE)
************************************************

‘శాంతి’ ‘PEACE’ అన్న పదానికి ‘నెమ్మది’ ‘సమాధానం’ ‘విశ్రాంతి’ అన్నవి పర్యాయ పదాలన్నది గమనించాలి. అరబ్బీలో ‘శాంతి’ ‘PEACE’ని ‘సలామ్‌’ అని అంటారు. ఈ పదం బైబిల్‌లో అయితే ‘షాలేమ్‌’ (సమాధానం) అని చూడగలం. ఇక ‘శాంతి’ అన్న పదాన్నే అరబ్బీలో అనువదిస్తే ‘ఇస్లాం’ అవుతుంది. ఇక ఇస్లాం అన్న అరబ్బీ పదానికి ధాతువు ‘సలామ్‌’. ‘ఇస్లాం’ అన్న పదానికి ‘దేవునికి తన్ను తాను సమర్పించుకోవటం’ లేక ‘శరణబొందుట’ (COMPLETE SUBMISSION) అన్న అర్థాలు కూడా ఉన్నాయి. ఒక మనిషి తనను తాను పూర్తిగా దైవానికి సమర్పించుకున్నప్పుడే శాంతి లభిస్తుంది. ఈ “శాంతి మార్గాన్నే” లేక “శాంతి ధర్మాన్నే” ఆది నుండీ ప్రతీ దైవ ప్రవక్తా బోధిస్తూ రావటం జరిగింది. ఇదే విషయాన్ని ఖురాన్‌లో దేవుడు ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నాడు.

ఆయన (యెహోవా) నూహ్‌ ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. దానినే (ముహమ్మద్‌) ఇప్పుడు నీ వైపుకు మేము వహీ ద్వారా పంపాము; దానినే మేము ఇబ్రాహీమ్‌కు, మూసాకు, ఈసాకు (యేసుకు) బోధించాము; ఈ ధర్మాన్ని స్థాపించండి అనీ, దానిని గురించి విభేదాలకు లోనుకాకండి అని తాకీదు చేస్తూ. ఈ విషయమే బహుదైవారాధకులకు ఎంతో అసహనం కలిగించింది. దాని వైపునకే నీవు (ముహమ్మద్‌) వారిని ఆహ్వానిస్తున్నావు. -ఖురాన్‌ 42:13

పై వాక్యాన్ని బట్టి చివరి ప్రవక్త ముహమ్మద్‌ (స) బోధించిన ధర్మం గత ప్రవక్తలు మరియు యేసు బోధించిన ధర్మాలకు భిన్నమైన క్రొత్త ధర్మమేమీ కాదు. కానీ ఆది నుండీ నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే, యేసుల ద్వారా ఏ ధర్మాన్నైతే దేవుడు ఇస్తూ వచ్చాడో దానినే ఆయన పునఃస్థాపించటం జరిగిందని తేటతెల్లమవుతుంది. ఇదే విషయాన్ని స్వయంగా ప్రవక్త ముహమ్మద్‌ (స) ఓ హదీసులో ఈ క్రింది విధంగా చెప్పటం జరిగింది.

”నేను యూదత్వాన్నో, క్రైస్తవాన్నో తీసుకురాలేదు. నేను సరళమైన, సులభ సాధ్యమైన ఇబ్రాహీం (అ) ధర్మాన్ని తీసుకొని వచ్చాను.” -ముస్నద్‌, ఇబ్నె హంబల్‌

మరొక గమనార్హమైన విషయం ఏమిటంటే- ప్రవక్త ముహమ్మద్‌ నాటి ఈజిప్ట్‌కు, అలెగ్జాండ్రియాకు రాజైన జరీహ్‌ బిన్‌ మత్తయి అనే క్రైస్తవ రాజువద్దకు తన శిష్యులచే ఒక లేఖను ఇచ్చి పంపుతారు. అందులో సారాంశం- ఇస్లాం ధర్మాన్ని స్వీకరించమన్నది. దానికి ఆ రాజు- ”మాకూ ఒక ధర్మమంటూ ఉంది. దాని కంటే మేలైన ధర్మం మాకు లభించనంత వరకు దానిని (క్రైస్తవ్యాన్ని) త్యజించలేము!” అంటాడు. దానికి ప్రవక్త ముహమ్మద్‌ శిష్యుల స్పందన ఏమిటో ఈ క్రింది గమనించగలరు.

”మేము (ప్రవక్త ముహమ్మద్‌ (స) అనుచరులము) మిమ్మల్ని (క్రైస్తవులను) మెస్సీయ (యేసుక్రీస్తు) ధర్మం నుండి అడ్డుకోవటం లేదు. ఆ ధర్మం బోధిం చిన విషయాన్నే మేమూ బోధిస్తున్నాము”
– (జాదుల్‌ ముఆద్‌అల్‌ ఇబ్నెఖైమ్‌ 3:61 (మహాప్రవక్త జీవిత చరిత్ర, మౌలానా సఫీవుర్రహ్మాన్‌ ముబారక్‌ పూరీ (రహ్మలై) తెలుగు పేజీ నెం. 600)

ప్రవక్త ముహమ్మద్‌ ప్రత్యక్ష శిష్యులచే చెప్పబడుతున్న పై వాంగ్మూంలోని సారాంశం- ఏ ధర్మమైతే యేసు బోధించారో దానినే ప్రవక్త ముహమ్మద్‌ శిష్యులు సైతం బోధించారు తప్ప క్రొత్త ధర్మమేమీ పరిచయం చేయలేదన్నది. దీనిని బట్టి ప్రవక్త ముహమ్మద్‌ ఒక క్రొత్త ధర్మాన్నేమీ పరిచయం చేయలేదు గాని ఆది నుండీ పరంపరగా దేవునిచే సకల ప్రవక్తలకు, యేసుకు ఇవ్వబడిన ధర్మాన్నే ‘ఇస్లాం (WAY OF PEACE)’ అన్న పేరుతో పరిచయం చేశారన్న విషయం తేటతెల్లమైంది.

యేసు విడిచి వెళ్లిన ‘శాంతి’ (PEACE / ISLAM) నే వేరొక ఆదరణకర్త బోధిస్తారు!
*************************************************************************************

అంతిమ ప్రవక్త అయిన వేరొక ఆదరణకర్త ‘ఇస్లాం’ (శాంతి లేక సమాధానము) ‘PEACE’ ధర్మాన్నే ప్రబోధించనున్నారని లేఖనాలలో ముందుగానే చెప్పబడింది. దానిని ఈ క్రింది గమనించగలరు.

“ఇదే నెమ్మది (PEACE) ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తి పెదవుల చేతను అన్యభాష (ANOTHER TONGUE) తోనూ ఈ ప్రజలతో మాటలాడుచున్నాడు” -యెషయా 28:12,13

పై లేఖనాన్ని బట్టి వేరొక ఆదరణకర్త అయిన ముహమ్మద్‌ ‘ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి’ అంటూ శాంతి మార్గాన్ని (ఇస్లాంను) ‘వేరే భాష’ (ANOTHER TONGUE) లో పరిచయం చేయనున్నారని తెలుస్తుంది. ‘వేరే భాష’ అంటే యూదుల మాతృభాష కాని అన్యభాష! అంటే హెబ్రీ, గ్రీకు భాషలు కాని వేరేభాష! ప్రవక్త ముహమ్మద్ (స) యూదులు అన్య భాషగా భావించే అరబ్బీ భాషలోనే ఇస్లాంను బోధించారు. ఇదే విషయాన్ని యెషయా ఈ క్రింది విధంగా ప్రవచించాడు.

“సువార్త ప్రకటించుచు, సమాధానము (PEACE) చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సందరములై యున్నవి” -యెషయా 52:7

పై లేఖనంలో ఎంతో స్పష్టంగా రావలసి ఉన్న వేరొక ఆదరణకర్త అయిన ముహమ్మద్‌ ‘సమాధానము (PEACE) చాటిస్తార’ని యెషయా ప్రవక్త ప్రవచించటం జరిగింది. నహూము ప్రవక్త సైతం భవిష్యత్తులో ‘సమాధానం’ (PEACE) లేక ‘ఇస్లాం (శాంతి)’ని బోధించే అంతిమ ప్రవక్త రాకడ గురించి ఎంతో ఘనంగా కీర్తించటం జరిగింది.

“సువార్త ప్రకటించుచు సమాధాన (PEACE) వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి” -నహూము 1:15

యెహోవా ‘శాంతి మార్గం’ (WAY OF PEACE / ISLAM) నే అనుగ్రహించును!
************************************************************************************

“…యెహోవా తన ప్రజలకు సమాధానము (PEACE) కలుగజేసి వారి నాశీర్వదించును” -కీర్తనలు 29:11

“యెహోవా, నీవు మాకు సమాధానము (PEACE) స్థిరపరచుదువు” -యెషయా 26:12

“ఈ స్థలమందు నేను సమాధానము (PEACE) నిలుపననుగ్రహించెదను” -హగ్గయి 2:9

“ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు “ఇస్లాం” (PEACE) ను మీ ధర్మంగా అంగీకరించాను” -ఖురాన్‌ 5:3

యెహోవా ఆది నుండీ ప్రతీ ప్రవక్తకూ ‘శాంతి మార్గం’ (ఇస్లాం / WAY OF PEACE) నే ఏకైక జీవన మార్గంగా అనుగ్రహించాడన్న విషయాన్ని పై వాక్యాల ద్వారా తేటతెల్లమవుతుంది. ఆ ‘శాంతి మార్గం’ (WAY OF PEACE) నే దేవుడు, ఆది నుండీ వచ్చిన ప్రవక్తలు మొదలుకొని యేసు మరియు ముహమ్మద్‌ వరకు ఇస్తూ వచ్చాడు. ఈ ‘సమాధాన వర్తమానం’ (ఇస్లాం) నే యేసు బోధించి, రానున్న వేరొక ఆదరణకర్త సైతం అదే మార్గాన్ని బోధిస్తారని భవిష్యవాణి చెప్పటమైనది.

‘శాంతి’ (PEACE) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా ‘శాంతి’ (PEACE) నే మీకనుగ్రహించుచున్నాను… -యోహాను 14:27

లేఖనంలో ముందుగా చెప్పినట్లుగానే దేవుడు చివరిగా వచ్చిన వేరొక ఆదరణకర్త అయిన ముహమ్మద్‌ ద్వారా ఆ శాంతి మార్గాన్నే ‘శాశ్వత నిబంధన’గా చేయటం జరిగింది.

అల్లాహ్‌ (యెహోవా) దృష్టిలో అసలు ధర్మం కేవలం ‘ఇస్లాం’ (శాంతి- WAY OF PEACE) మాత్రమే” -ఖురాన్‌ 3:19

‘శాంతి’ అన్నా ‘సమాధానము’ అన్నా ‘ఇస్లాం’ అన్నా ఒక్కటే. ఇంగ్లీషు బైబిల్‌లో అయితే ‘PEACE’ అని చదవగలం. ఇక ఇప్పటి వరకు గమనించిన వివరణను బట్టి దేవుడు ఆది నుండీ తన ప్రవక్తల ద్వారా అందిస్తూ వచ్చిన ధర్మం ఒక్కటే అని, ఆ ధర్మం పేరు ‘శాంతి (సమాధాన) మార్గము’ లేక ‘ఇస్లాం’ (WAY OF PEACE) అని తెలుసుకున్నాం. వేరొక ఆదరణకర్త ఆ “శాంతి మార్గాన్నే” ప్రబోధిస్తారని యేసు ముందుగానే… ‘శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకను గ్రహించుచున్నాన’ని చెప్పారు. అంటే ఏ శాంతి మార్గాన్నైతే యేసు ప్రబోధించారో ప్రజలు దానిని మరచిపోయి ఉన్న సందర్భంలో వేరొక ఆదరణకర్త వచ్చి దానిని తిరిగి ‘జ్ఞాపకము చేయును’ (యోహాను 14:26). కాబట్టి యేసును క్రీస్తుగా నమ్మే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ముహమ్మద్‌ను అంతిమ ప్రవక్తగా నమ్మాల్సి ఉంది. కారణం ఏమిటంటే…

…నేను వెళ్లని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు; నేను వెళ్లిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. -యోహాను 16:8-9

యేసు, వేరొక ఆదరణకర్త రాకడ గురించి చెప్పిన పై భవిష్యవాణిని యేసు అనంతరం ఆరువందల సంవత్సరాల తరువాత ఇష్మాయేలు రెండవ కుమారుడైన కేదారు వంశావళిలో జన్మించిన ముహమ్మద్‌ (స) తనపై అవతరించిన ఖురాన్‌లో ఈ క్రింది విధంగా జ్ఞాపకం చేశారు.

“…మర్యమ్‌ కుమారుడైన ఈసా (యేసు) అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో, ”ఓ ఇశ్రాయీల్‌ సంతతి వారలారా! నేను మీ వద్దకు అల్లాహ్‌ (యెహోవా) చే పంపబడిన సందేశహరుణ్ణి; నాకు పూర్వం వచ్చిన తౌరాత్‌ గ్రంథాన్ని (పాతనిబంధనను) ధ్రువపరు స్తున్నాను; నా తరువాత అహ్మద్‌ (ముహమ్మద్‌) అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను”- ఖురాన్‌ 61:6

ఈ విధంగా యేసు భవిష్యవాణి ప్రకారంగానే ప్రవక్త ముహమ్మద్ (స) యేసు చెప్పిన విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసి, గత ప్రవక్తలు, యేసు బోధించిన అతి ప్రాచీన ధర్మమైన “శాంతి మార్గాన్నే” సంపూర్ణంగా స్థాపించారు. దానినే అరబ్బీలో “ఇస్లాం” అంటారు.


Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *