సరే, ఇంతకూ ఆ సృష్టికర్త ఎవరు?

“గొప్ప కళాఖండం వెనుక ఒక “రూపకర్త” ఉంటాడు
క్రమశిక్షణ ఉన్నచోట ఒక “నిర్వహణకర్త” ఉంటాడు
వ్యవస్థ ఉన్నచోట ఒక “నియంత్రణకర్త” ఉంటాడు
సృష్టించబడేవాటి వెనుక ఒక “సృష్టికర్త” ఉంటాడు”

అన్నవి కామన్ సెన్స్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఒప్పుకుతీరాల్సిన విషయాలే.. అయినప్పటికీ ఎంతో క్రమశిక్షణ (Discipline) తో.. క్రమబద్ధతతో నియంత్రించబడుతున్న, నడుపబడుతున్న ఈ విశ్వవ్యవస్థ ఉనికిలో తేబడటం వెనుక ఏ మేధాశక్తీ లేదు.. ఏ రూపకర్తా లేడు.. ఏ నిర్వహణకర్తా లేడూ.. ఏ సృష్టికర్తా లేడు అదంతా దానికదే “యాధృచ్చికంగా” లేదా “యాక్సిడెంటల్” ఏర్పడిపోయిందన్నది అభినవ నాస్తికవాదం.
****


విశ్వవ్యవస్థ సృష్టించబడటమే కాదు అది ఎంతో క్రమశిక్షణతో నడుపబడుతుంది, నియంత్రించబడుతుంది. అదే ఓ సృష్టికర్త ఉన్నాడన్న దానికి బహిరంగ సాక్ష్యం
అయినప్పటికీ.. విశ్వవ్యవస్థలో వివిధ గ్రహాలు, నక్షత్రాలూ ఏదో గాలివాటంగా ఏర్పడిపోయాయి..
ఆ గ్రహాలన్నీ తమకు తామే ఎంతో తెలివిగా ఎంతెంత పరిణామాల్లో ఉండాలో అవే రూపొందించేసుకున్నాయి..
ఏ గోళం సూర్యునిగా మారి మండుతుండాలో.. ఏ గ్రహం జీవజాలానికి అనువుగా ఉండాలో.. ఏ యే గ్రహం ఎంత వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలో నిర్ణయించేసుకున్నాయి..
చాలా తెలివిగా ఏ యే గ్రహాలు ఏ యే కక్ష్యల్లో ఉండాలో.. వాటి మధ్య ఎంతెంత దూరం ఉండాలో వాటికవే రూపకల్పన చేసేసుకుని..
విశ్వంలో గ్రహాలన్నీ తమంతట తామే ఎంతో క్రమబద్ధంగా అదుపు చేసేసుకుంటుంన్నాయన్నది నేటి అభినవ నాస్తికులు నిత్యం చెబుతూ ఉండే విషయం.

అయితే ఈ సృష్టి నిర్మాణం యాక్సిడెంటల్ గా ఉనికిలోకి వచ్చేసిందా? లేక ఎంతో క్రబద్ధతతో నడుపబడుతున్న ఈ విశ్వవ్యవస్థ వెనుక ఒక “మేధాశక్తి” ఏదైనా ఉండి దానిని ఎంతో క్రమశిక్షణతో నియంత్రిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఒక డీటైల్డ్ ఆర్టికల్ రాయటమైంది. ఆ ఆర్టికల్ చదివి చాలా మంది మిత్రులు అడిగిన ప్రశ్న ఏమిటంటే…
సృష్టించబడేవాటి వెనుక ఒక “సృష్టికర్త” అనేవాడు ఉంటే.. ఈ “సమస్త విశ్వాన్ని ఉనికిలోకి తెచ్చిన ఆ సృష్టికర్త ఎవరు?” అన్నది.

అంతకంటే ముందు ఇక్కడ స్పష్టపరచుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే.. ఈ సృష్టిని పరిశీలించి దానిని సృష్టించి, నియంత్రిస్తున్న ఓ సృష్టికర్త ఉనికిని గుర్తించటానికి ఆధ్యాత్మిక జ్ఞానమో.. ధార్మిక గ్రంథాలో అవసరం లేదు. కేవలం ఆలోచించగలిగే.. బుద్దీ, జ్ఞానాల్ని ఉపయోగించగలిగే అలవాటు ఉండి ఈ సమస్త సృష్టిని పరిశీలిస్తే.. దానిని క్రమబద్ధంగా ఏదో ఒక “మానవాతీత మేధ” నియంత్రిస్తుంది అని ఇట్టే కనిపెట్టవచ్చు.

అయితే ఆయన గుణగణాలు, శక్తి-సామర్థ్యాలు ఏమిటి? ఆయనతో సంబంధం కలిగి ఉండాలంటే చెయ్యల్సిందేమిటి? ఆయన మానవాళికి ఇచ్చిన ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే అప్పుడు ధార్మిక గ్రంథాలు అవసరం అవుతాయి.


ఈ ధార్మిక గ్రంథాలు సైతం ఆ సృష్టికర్త ఎవరు? ఆయన పేరేమిటి? అని ప్రశ్నిస్తే.. ఆయన గుణగణాలు తాలూకు గుణనామాలను మాత్రమే పరిచయం చేస్తున్నాయి.

ఉదాహరణకు: వేదోపనిషత్తులు, గీతా శాస్త్రాలు గమనిస్తే.. “సర్వేశ్వరుడు” అని అంటే “సమస్త వ్యవస్థకు ఈశ్వరుడు” అంటే “అధికారి” అన్న గుణనామమంతో అలాగే “పరబ్రహ్మ” అంటే- “ప్రకృతికి అతీతంగా ఉండే సృష్టికర్త”, “ఆజం” అంటే పుట్టనివాడు, “అవినాశి” అంటే- నాశనం కానివాడు, “అవ్యక్తం” అంటే “వ్యక్తం కానివాడు” లేదా “అగోచరుడు” వగైరా అనేక గుణనామాలతో ఆయన పరిచయాన్ని చూడగలం. కానీ తరువాతి కాలాల్లో హిందూ ధర్మంలో ఆ సృష్టికర్తను పరిచయం చేసిన మహనీయులనే దైవ అవతారాలుగా భావించి, ఆయన పుట్టాడని, చనిపోయాడని ఇలా అనేక కల్పిత విశ్వాసాలు కనిపెట్టి.. చెట్టూ, పుట్టల్నీ, రాళ్లూ రప్పల్నీ దేవుళ్లుగా చేసుకుని అనేక మూఢ నమ్మకాలను సృష్టించుకున్నారు.

బైబిల్ ల్లో గమనిస్తే.. ఆ సృష్టికర్తే.. హిబ్రూలో “యెహోవా” అంటే- “నిత్యమూ ఉండువాడు” అన్న గుణనామంతో పిలువబడినట్లు చూడగలం. అదే బైబిల్లో “ఈల్” అంటే- సర్వశక్తి గల దేవుడని, “ఎలోహ్” అని ఇలా అనేక గుణనామాలతో పిలువబడినట్లు చూడగలం. కానీ తరువాతి కాలాల్లో క్రైస్తవంలో ఆ సృష్టికర్తను పరిచయం చేయటానికి వచ్చిన యేసునే దేవుని అవతారంగా భావించి ఆయన్నే దేవునిగా చేసుకున్నారు.

ఇటు ఖురాన్ లో గమనిస్తే ఆ సృష్టికర్తే.. అరబిక్ లో “అల్లాహ్” అంటే “ఆరాధనకు అర్హుడైనవాడు” అన్న గుణనామంతో పాటు “అర్రహ్మన్” అంటే- “కరుణగలవాడు”, “అల్ ఖుద్దూస్” అంటే అందరికంటే గొప్పవాడు, అల్ ముహైమిన్ అంటే సమస్తాన్ని పరిరక్షించేవాడు వగైరా అనేక గుణనామాలతో పిలువడినట్లు గమనించగలం. ఈ ఖురాన్ జ్ఞానం పూర్తిగా లేని కొందరు ముస్లిములు దర్గాల, వలియల్లాల ఆరాధన కల్పించుకున్నారు.

ఈ విధంగా విశ్వవ్యవస్థను ఉనికిలోకి తెచ్చి క్రమబద్దంగా నడుపుతున్న ఆ సృష్టికర్త తాలూకు అనేక “గుణనామముల”ను ప్రామాణిక ధార్మిక గ్రంథాల్లో చూడగలం. ఆయన్ని ఫలానా పేరుతోనే పిలవాలన్న రూలేమీ లేదని అటు ఖురాన్ లోనే చూడగలం. “ఏకం సత్ విప్రా బహుడావదంతి” – సర్వేశ్వరుడు ఒక్కడే ఆయన్ని ఋషులు అనేక పేర్లతో పిలిచారు (ఋగ్వేదము 1:164:46)” అని హిందూ శాస్త్రాల్లోనూ చదవగలం.
అయితే ఈ ధార్మికగ్రంథాల శాస్త్రీయ ధర్మానికి అతీతంగా మూఢనమ్మకాల ప్రతిపదికన నిర్మించబడిన మతవ్యవస్థ కొందరు స్వార్థపరులైన పండితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. మూఢనమ్మకాల, మూఢ విశ్వాసాల ప్రతిపదికన కొందరు ఆస్తికులుగా చలామణీ అవ్వటం ప్రారంభించారు. అసలు మతవ్యవస్థలో మూఢనమ్మకాలు కలిగి కొందరు చేసే చవకబారు పనులే నాస్తికత్వం అన్న కంపెనీ తయారవటానికి కూడా ప్రధాన కారాణం అని చెప్పవచ్చు.

ఇప్పుడీ టాపిక్కంతా చదివి తమ తమ విశ్వాసాలను డిఫెండ్ చేసుకునేవారు “అబబ్బే! అలగెలా కుదురుద్దీ.. మేము నమ్ముకునే ఫలానా అతనే దేవుడని వాదించవచ్చు. ఇక్కడ వారందరితో సైద్ధాంతిక చర్చ చెయ్యటం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఎవరైనా సత్యం తెలుసుకోవాలన్న కుతూహలంతో కూర్చుకుని ధార్మిక గ్రంథాలు వడబోసేసిన తరువాత అతన్ని ఎవరైనా ధార్మిక పరిభాషలో ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరో ఓ నాలుగు ముక్కల్లో చెప్పమంటే.. పైన మొదటి నుండీ నేను చెప్పిన విషయాలనే అతనూ చెబుతాడు. అవే నేను ఇక్కడ రాసింది.


Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *