మూఢత్వ మతవ్యవస్థ – ధార్మిక గ్రంథాలు

మత వ్యవస్థనూ, మత వ్యవస్థలో మూఢత్వాన్నీ, మూఢ నమ్మకాలను, గుడ్డి నమ్మకాలనూ ఈసడించుకుంటూనే.. మరోప్రక్క ధార్మిక గ్రంథాలనూ, మతవ్యవస్థను కూడా ఒకే గాటన కట్టేసి హేళనగా మాట్లాడే కొందరు అభ్యుదవాదులుగా ఫీలయ్యే వారిని చూస్తుంటే భలే ఆశ్చర్యమేస్తూ ఉంటుంది.

దైవ భావన తాలూకు విశ్వాసాలను సామాన్య పరిభాషలో మత విశ్వాసాలు అన్నప్పటికీ.. ధార్మిక గ్రంథాలు ప్రబోధించే శాస్త్రీయ సనాతన ధర్మానికీ.. కొందరు వంచక పండితులు, బోధకులు, ముల్లాలు కనిపెట్టిన మత వ్యవస్థ తాలూకు విశ్వాసాలకూ పొంతన ఉండదు. అది ధార్మిక గ్రంథాల నిస్పక్షపాత పరిశీలన చేసే వారికే అర్థమవుతుంది.

కానీ సామాన్య ప్రజలు చేసే అతి పెద్ద తప్పేమిటంటే ఒకటి ధార్మిక గ్రంథాలను పరిశీలనగా చదివి వాస్తవ ధార్మిక దృక్పథాలను తెలుసుకోవటానికి సమయం తీయకపోగా.. పైగా మతప్రబోధనలు చేసే పండితుల పాండిత్యాన్నీ వారి భారీ వేషధారణను చూసి వారు చెప్పిందే వేదమనుకుంటూ ఉంటారు. వారు చెప్పేదంతా నూటికి నూరుశాతం కరక్టే అయి ఉంటుందని తమకు తామే జస్టిఫై చేసుకుంటూ ఉంటారు.

ఉదాహరణకు పూర్తి బైబిల్లో “త్రిత్వం” అన్న పదంగానీ.. దేవుడు త్రిత్వమై ఉన్నాడని గానీ, యేసు తనకు తాను దేవుడని చెప్పుకున్నట్టుగానీ ఎక్కడా చూడలేము. పైగా ఈ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బైబిల్లో “దేవుడు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడ”ని కరాకండీగా చెప్పబడిన వైనాన్నీ, యేసు తనకు అతీతంగా యెహోవాగా పిలువబడ్డ దేవుణ్ణి పరిచయం చేస్తున్న వైనాన్నీ చూడగలం. కానీ మిరుమిట్లు గొలిపే భారీ వేదికపై, సూటూ బూటు వేసుకుని హుందాగా తయారై ఎవరన్నా పాస్టరు బైబిల్ చేతపట్టుకుని “యేసు దేవుడై యున్నాడు.. దేవుడు త్రిత్వమై యున్నాడు” అని ఆ కేకలు పెడుతూ చెబితే స్టేజీ క్రింద కూర్చునే పిచ్చి జనాలు పాపం “అయ్యగారు ఎంతో లోతుగా బైబిల్ చదివి చెబుతున్నారు. అయినా ఇంత స్థాయిలో ఉన్న ఆయనకు తెలియదా ఏంటి? ఆయన చెప్పింది నూటికి నూరుశాతం నిజమే అయి ఉంటుందని అతను స్టేజీపై చెప్పిందాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు.

అలాగే ఖురాన్ “ఈ సృష్టికి దేవుడు ఒక్కడే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, మీరు ఆయన్ని తప్ప వేరొకరిని వేడుకోకండి, ఆయన మీ కంఠ రక్త నాళం కంటేకూడా అతి దగ్గరగా ఉన్నాడు. మీరు నేరుగా ఆయన్నే ప్రార్ధించుకోండి” అని కొన్ని వందల వాక్యాల్లో అతి స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఖురాన్ దృక్పథాలకు వ్యతిరేకంగా ఈనాడు వసీల పేరుమీద కడప, ఆజ్మీర్ షరీఫ్ వగైరా దర్గాలకు పోటెత్తే ముస్లిముల సంఖ్య లక్షల మీద ఉంది. అంతేకాదు ముహర్రం వస్తే రక్తమోడేలా బ్లేడులతో రక్కుకోవటాలు, కొరడాలతో కొట్టుకోవటాలు, మిలాదున్నబీ పేరుమీద ఊరేగింపులు, రొట్టెల పండుగలు వగైరా ఇస్లాంలో లేని ఆచారాలన్నీ తలకు పచ్చ రంగు పగిడీలు, పొడవాటి గెడ్డాలు కళ్లలో సుర్మా, సెంట్లు కొట్టుకుని కుర్తా పైజామాలు తొడుక్కుని పైకి పెద్ద ముస్లిం పండితుల వేషాలు ధరించిన కొందరు ముల్లాలు ప్రవేశపెట్టినవే. ఈ ముల్లాలను చూసి అమాయక జనం “వారికి ఎంతో ఖురాన్ జ్ఞానం ఉండబట్టే ఈ ఆచారాలన్నీ తమకు నేర్పుతున్నార”ని అనుకుని వారు చెప్పిందాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు.

“యేకం యెవద్వితీయం” – ఛాందోగ్యఉపనిషత్ 6:2:1 “సర్వేశ్వరుడైన దేవుడు ఒక్కడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు”. “ఏకం సత్ విప్రా బహుదా వదంతి” – ఋగ్వేదం 1:164:46 అన్నది వేదోపనిషత్తుల ప్రకటన.
“ఎవరైతే ప్రాకృతిక వస్తువులను పూజిస్తారో వారు చీకటిలో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతిని పూజిస్తారో వారు మరింత అంధకారంలో ప్రవేశిస్తారు” – యజుర్వేదం 40:9 అన్నది వేదం చేస్తున్న హెచ్చరిక.
అయినప్పటికీ వేదోపనిషత్తులే మాకు మూలం అని చెప్పే హిందువుల్లో అనేక దైవాలరాధన, విగ్రహారాధన ఎంత సర్వ సామాన్యపోయిందంటే.. తాము చేస్తుంది ఎంతవరకు కరెక్టు అన్నది ఒకసారి ఆగి వెనక్కి తిరిగి ఆలోచించలేనంత దూరం వారు వెళ్ళిపోయారు. “మన కళ్ళతో చూడజాలనిది కానీ మన దృష్టిని చూచేది మాత్రమే నిజ దైవము. ఇక్కడ ప్రజలు పూజించేవేవీ దైవము కాదు” – కేనోపనిషత్తు 1:5 అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నప్పటికీ భూమిపై ఉన్నవాటిని పూజించటమే హిందూత్వానికి కేరాఫ్ ఆడ్రస్ గా మారిపోయింది. విగ్రహారాధన, బహుదైవారాధనలను కొందరు కాషాయం ధరించిన పండితులు చెబుతున్నప్పుడు వారిని చూసి అమాయక జనం “వారికి ఎంతో వైదిక జ్ఞానం ఉండబట్టే ఈ ఆచారాలన్నీ తమకు నేర్పుతున్నార”ని అనుకుని వారు చెప్పిందాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు.

ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తుందనే ప్రజలు “శాస్త్రులను” కాక “శాస్త్రాలను” మాత్రమే చదివి అర్థం చేసుకుని నడవాల్సిందిగా హెచ్చరించాయి. “మీ ఇష్ట ప్రకారం నడుచుకోక ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్న సంశయం వచ్చినప్పుడు శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి (గీత 16:24)” అని గీతా శాస్త్రం, “నువ్వు బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథము చదువుచుండవలెను (ద్వితీ 17:22)” అని బైబిల్ .. “మానవులారా మీ దేవుని దగ్గర నుండి స్పష్టంగా మార్గం చూపే గ్రంథం వచ్చేసింది (4:174)” అని ఖురాన్ ముందుగానే హెచ్చరించాయి.

అయినప్పటికీ ఆధ్యాత్మిక రంగంలో అధిక సామాన్య ప్రజలు చేసే అతిపెద్ద తప్పు తాము నమ్మే సిద్ధాంతాలు, విశ్వాసాలూ, నమ్మకాలు కరెక్టా? కావా? అన్నది తేల్చుకోవటానికి స్కేల్ గా మతపండితుల బోధలనే తీసుకుని “ఆఁ.. అవన్నీ చదవబట్టేగా ఆయా పండితులు మాకు బోధిస్తుంది” అని అనుకుని వారు చెప్పే ప్రతీ మూఢ నమ్మకాలనూ, ఆచారాలనూ విశ్వాసాలనూ గుడ్డిగా నమ్మేస్తుంటారు. వారు ప్రదర్శించే మూఢనమ్మకాలనూ, వింత విన్యాసాలనూ చూసి “మతం” అంటే ఇంతే అని అనుకుని మత వ్యవస్థ పట్ల వెగటుతో కొందరు మొత్తానికి నాస్తికులుగా మారిపోయారు.

ఇక్కడ మతాన్నీ, మతవ్యవస్థలో మూఢత్వాన్నీ చూసి ఏవగించుకునేవారు గమనించాల్సింది- నిజానికి సనాతన ధర్మంలో కొందరు వంచక పండితులు చేసే తప్పుడు వివరణలను ప్రక్షాళన చేసి సరైన వివరణ ఇవ్వటానికే ధార్మిక గ్రంథాలు శ్రుతి (వహీ) రూపంలో ప్రవక్తల పై అవతరించటం జరిగిందన్నది. ఉదాహరణకు ఖురాన్ అవతరణ లక్ష్యం ఏమిటో ఈ క్రింది వాక్యంలో గమనిస్తే..

“పూర్వపు ప్రవక్తలకు కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ పంపి ఉన్నాము. ఇప్పుడు ఈ జ్ఞాపిక (ఖురాన్) ను నీపై అవతరింపజేశాము. ఎందుకంటే నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన ఉపదేశాన్ని స్పష్టంగా వివరించటానికి, ప్రజలు స్వతహాగా ఆలోచించగలగటానికి” – 16:44

ఈ విధంగా ప్రజల సమక్షంలో ఉన్న ధార్మిక గ్రంథాల సత్యాలను వివరించటం.. సత్యాసత్యాలను వేరుపరచటమే ఖురాన్ అవతరణ లక్ష్యం. పైగా ఖురాన్ గుడ్డిగా దేన్నీ నమ్మేయక “ప్రజలు స్వతహాగా ఆలోచించాలి” అని చెబుతుంది. అంతేకాదు మరోకచోట “మీ స్వభావంపై స్థిరపడండి (ఖురాన్ 30:30)” అని చెబుతుంది. అంటే మీరు చేసే పని మీ సాధారణ వివేచన (లాజిక్) కు అందితేనే చెయ్యమంటుంది. తప్ప లాజిక్ లేకుండా హేతు విరుద్ధమైన విశ్వాసాలను బలవంతంగా ఎవరో పెద్దలో, పండితులో చెప్పారు కాబట్టి లాజిక్ ను నొక్కిపెట్టి గుడ్డిగా వ్యవహరించమనటం లేదు.

కాబట్టి ధార్మిక గ్రంథాల అవతరణ లక్ష్యం కూడా మతవ్యవస్థలో పేరుకుపోయిన మూఢత్వ విధానాలు, ఆచారాలు ఖండించి ప్రజలను హేబద్ధమైన ఆలోచనా పరులుగా మార్చటమే. చాలా మంది నాస్తిక మిత్రులు మతవ్యవస్థలో పేరుకుపోయిన మూఢత్వ విధానాలను మేము మాత్రమే ఖండిస్తున్నాము అనుకుంటూ ఉంటారు. చిత్రం ఏంటంటే ఆ పని ధార్మిక గ్రంథాలు కొన్ని వందల, వేల సంవత్సరాల ముందు నుండే ఖండించటం మొదలెట్టాయి. ప్రజలను శాస్త్రీయ బద్దమైన ఆలోచనా విధానం వైపు నడపటం మొదలెట్టాయి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *