ప్రారంభంలో వివిధ రకాల వాయువులు (Gases) తో కూడిన అత్యంత దట్టమైన పొగ (Smoke) తో ఒక “ప్రైమరీ నెబ్యూల” శూన్యంలో దానికదే ఏర్పడిపోయి..
ఆ తరువాత ‘మహా విస్ఫోటనం (Big bang)’ జరిగిపోయి..
దాని ఫలితంగా విశ్వంలో అనేక కోట్ల గ్రహాలు, నక్షత్రాలు వాటికవే ఏర్పడిపోయి..
ఆ తరువాత ఆయా గ్రహాలన్నీ ఎంతో తెలివి ఉపయోగించుకుని తమంతట తామే ఎంతెంత పరిమాణాల్లో ఉండాలో అవే రూపొందించుకుని..
ఏ గోళం సూర్యునిగా మారి మండుతూ వెలుగునివ్వాలి .. ఏ గ్రహం జీవజాలానికి అనువుగా ఉండాలన్నది కూడా నిర్ధారించేసుకుని..
పైగా ఆయా గ్రహాలన్నీ ఎంతో మేధస్సును ఉపయోగించి ఎంతెంత వేగంతో తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలో నిర్ణయించేసుకుని..
ఏ యే కక్ష్యల్లో ఉండాలో, వాటి మధ్య దూరం సైతం ఎంతెంత ఉండాలో, ఏ యే కక్ష్యల్లో ఉంటూ ఎంతెంత వేగంతో తిరుగుతుండాలో కూడా వాటికవే చాలా తెలివిగా రూపకల్పన చేసేసుకుని..
ఆయా గ్రహాలన్నీ తమ కక్ష్యల నుండి తప్పిపోకుండా కావలసినంత గురుత్వాకర్షణ శక్తిని కూడా తమకుతాముగా సృష్టించేసుకుని..
విశ్వంలో కోట్లాది గ్రహాలన్నీ ఎంతో క్రమబద్ధంగా తమను తాము అదుపు చేసుకోవటానికి వాటికి ఎంత గొప్ప మేధాస్సూ, తెలివితేటలు ఉండాలి? కదూ!
ఇలా చెబితే వినటానికి చాలా సిల్లీగానూ, జోక్ గానూ అనిపిస్తుంది కదా? అన్నేసి తెలివితేటలు విశ్వంలో ఉన్న గ్రహాలకు స్వతహాగా ఏ విధంగా ఉంటాయండీ? విశ్వంలో గ్రహాలూ, నక్షత్రాలకూ మేధస్సు ఎలా ఉంటుంది మీ పిచ్చి కాకపోతేనూ? అని ఏ కాస్త బుర్రా బుద్ధీ ఉన్నోడైనా ప్రశ్నించక మానడు.
మరి వాటికి స్వతహాగా ఏ మేధాస్సూ లేకుండా అవి ఎలా ఉనికిలోకి వచ్చాయ్? వచ్చి వివిధ పరిమాణాల్లో, ఆకృతుల్లో ఎలా రూపొందించబడ్డాయ్? వాటికి ఏ మేధాస్సూ లేకుండా.. ఏ యే గ్రహం ఏ యే కక్ష్యల్లో ఉండాలో ఎంతెంత వేగంతో తిరగాలో.. ఏ యే గోళాలు మండుతూ ఉండాలో ఏ యే గ్రహాలు జీవజాలానికి అనువుగా ఉండాలో.. ఎలా నిర్ధారించబడ్డాయ్? జీవజాలానికి అనువుగా ఉండే గోళాల్లో ప్రకృతి, దానిలోని సమతూల్యత ఎలా ఏర్పరచ బడ్డాయ్? అవి ఎలా అదుపు (Control) చెయ్యబడుతున్నాయ్?
ఇంతపెద్ద విశ్వ వ్యవస్థ ఇంత పటిష్టంగా కంట్రోల్ చేయబడటం అన్నది ఏ మేధాస్సూ లేకుండా ఎలా సాధ్యం?
విశ్వవ్యవస్థ ఇంత పటిష్టంగా నడపటం వెనుక ఏదో ఒక గొప్ప మేధస్సు ఉండి తీరాల్సిందే! ఆ మానవాతీత మేధస్సే ఈ విశ్వాన్ని అదుపు చేస్తుంది, నడుపుతుంది. తప్పితే విశ్వంలో గ్రహాలేమీ తమ స్వంత తెలివితేటలూ, మేధస్సుతో తమను తాము సృష్టించుకుని అదుపుచేసుకోవటం లేదు. అలా ఊహించుకోవటం, చెప్పటం వెర్రితనం అవుతుందంటారా. కానీ, నేడు నాస్తికులు చెబుతుంది అదే! అలా వెర్రితనంగా మాట్లాడేవారే గొప్ప జ్ఞానులుగా పరిగణించబడటం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్!
కానీ, సకల విశ్వవ్యవస్థ వెనుక ఉండి పటిష్టంగా నియంత్రిస్తున్న ఆ మేధ ఏమై ఉంటుంది? అని ప్రశ్నించే కొందరుంటారు. వారినే ఆలోచనా పరులని అంటారు.
విశ్వవ్యవస్థ వెనుక ఏ మేధాస్సూ పనిచెయ్యటం లేదు!
విశ్వవ్యవస్థ యాక్సిడెంటల్ గానే ఉనికిలోకి వచ్చేసి యాదృచ్ఛికంగా గ్రహాలు నక్షత్రాలు వగైరా ఏర్పడిపోయి వాటికవే నియంత్రించబడుతున్నాయి తప్పితే.. విశ్వవ్యవస్థ వెనుక ఏ మేధాస్సూ పని చెయ్యటం లేదు.. అని నాస్తికులు అలవోకగా తీర్మానించేస్తుంటారు.
కానీ, ఇలాంటి తీర్మానాలిచ్చే చాలా మంది నాస్తికులకే తెలీని నిజం ఏమిటంటే.. ఇప్పటివరకూ అనేకమంది ఖగోళ శాస్త్రవేత్తల ద్వారా అత్యాధునిక టెలిస్కోపుల ద్వారా ఉపగ్రహాల పరిశోధన ద్వారా కనుగొనబడిన విశ్వవ్యవస్థ తాలూకు రహాస్యాలు 4% మాత్రమే!! ఇంకా 96% విశ్వవ్యవస్థ తాలూకు రహాస్యాలు కనుగొనబడక మిస్టరీగానే ఉండిపోయాయి.
వివరంగా చెప్పాలంటే ఇప్పుడున్న ఖగోళశాస్త్రం కేవలం శాస్త్రవేత్తల ద్వారా కనుగొనబడిన విశ్వవ్యవస్థ తాలూకు 4% పరిశోధన మాత్రమే! మిగతా 96 శాతం విశ్వవ్యవస్థ పై పనిచేస్తున్న సూత్రాలేమిటి? విశ్వం పరిధి ఎంత? దాని రహాస్యాలేమిటి? అన్నది నేటి ఆధునిక శాస్త్రవేత్తలకు అవగాహనా పరిధిలోకి ఇంకా రాని ఓ మిస్టరీ. వారి ద్వారా కనుగొనబడని ఆ 96 శాతాన్నే “డార్క్ ఎనర్జీ” లేదా “డార్క్ మేటర్” అని పేర్కొన్నారు.
కాబట్టి ఇంకా 96 శాతం విశ్వ రహాస్యాలు కనుగొనబడకుండానే.. ఇప్పటివరకూ కనుగొనబడిన కేవలం 4 శాతం విశ్వాన్ని చూసే ఈ విశ్వం వెనుక ఏ మేధాస్సూ లేదని పరిమిత జ్ఞానంతో తీర్మానించటం అజ్ఞానం అవుతుంది.
సరే, ఇప్పటివరకూ కనుగొనబడిన కేవలం 4 శాతం విశ్వవ్యవస్థను చూసి మీరెలా ఒక మేధస్సు ఉందని చెబుతున్నారని ప్రశ్నించవచ్చు. దానికి సమాధానం సృష్టిలో కనపడే ఐదు ప్రధాన విషయాలు!
విశ్వంలో అణువు నుండి బ్రహ్మాండం వరకు.. ఐదు ప్రధాన విషయాలు కనపడతాయి 1). “గంభీరమైన క్రమబద్ధత (Discipline)” 2. “చలనం (Motion)” 3. “సమతుల్యత (Balance)”. 4. అర్థవంతమైన ప్రక్రియ (Meaningful process) 5. నిర్దిష్టమైన కొలతలు (Particular Measures).. ఇవన్నీ ఏదో ఒక “మేధాశక్తి (Intelligence)” ఉండి తయారుచేసి, నియంత్రించే వాటిలోనే ఉండే విషయాలు. తప్పితే వాటికవే యాదృచ్ఛికంగాగా ఏర్పడేవాటిలో ఇవేమీ ఉండవు.
సృష్టిలో లభించే ఖనిజాలు, రసాయనాలు, వివిధ లోహాలూ, మూలకాలూ, ద్రావకాలు, ముడి చమురు, ముడి పదార్థాలు వగైరా వాటిని కనిపెట్టి ఆధునిక, సులభతరమైన మరియు వేగవంతమైన జీవన శైలి కోసం సృష్టించుకుంటున్న వస్తువులూ, వసతుల వరకూ శాస్త్రవేత్తల “మేధ (Intelligence)” అన్నది పని చేసినప్పుడు.. ఆ శాస్త్రవేత్తల నియంత్రణ (Control) లో లేకుండానే ఎంతో క్రమబద్ధంగా నిర్వహించబడుతున్న సమస్త విశ్వ వ్యవస్థ వెనుక ఏ “మానవాతీత మేధ (Supernatural Intelligence)” లేదు అనటం మూర్ఖత్వం అవుతుంది.
ఆ “మానవాతీత మేధ లేక శక్తి”ని ఎలా కనుగొనాలి? ఏ పేరుతో పిలవాలి? ఏ యే గుణాలక్షణాల ఆధారంగా గుర్తించాలి? ఆ “మానవాతీత మేధ”తో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి? అన్న ప్రశ్నలకు సైన్స్ ముంగిట సమాధానాలు ఎప్పటికీ ఉండవు. ఎందుకంటే ఆ పని సైన్స్ ది కాదు కనుక. సైన్స్ అన్నది తన పరిధిలో లభించిన పదార్థాలపై పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చెయ్యటమే. కానీ, మానవ గ్రహణపరిధిలోకి రాని ఆ మానవాతీత శక్తికి సంబంధించి పై ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే లక్ష్యంతోనే ధార్మిక గ్రంథాల్లో అవతరించాయి.
కాకపోతే బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రశ్నల తాలూకు సమాధానాలు ప్రజల్లో సర్వసామాన్యం కాకపోవటానికి కారణం ఒకటి- ధార్మిక గ్రంథాల్లో ఉన్న హేతుబద్ధమైన సమాచారాన్ని దాచిపెట్టి మూఢ నమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో కూడిన మతవ్యవస్థను తయారుచేసి మత పండితులు ప్రజల్ని భ్రష్టు పట్టిస్తే.. ఈ మూఢనమ్మకాలతో కూడిన మత వ్యవస్థను, అందులో భ్రష్టత్వాన్నీ చూసి హేతుబద్ధంగా ఆలోచన చెయ్యగలిగేవారంతా నాస్తికులుగా మారిపోయి ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మానికి దూరమైపోవటం.
ఈ విశ్వానికి ఇన్ని తెలివితేటలెక్కడివి?
