మతవ్యవస్థలో ఉన్న మూఢ నమ్మకాలు, హేతువిరుద్ధమైన విధానాల పట్ల వ్యతిరేకత చూపటం వాటిలో లోపాలు ఎత్తిచూపటం, విమర్శించటం.. మత మౌఢ్యం ఏర్పడటానికి కారణం దేవుడిని నమ్ముకోవటమే కాబట్టి దాని నుండి బయటపడాలంటే ఏ దేవుడూ లేడని ఒప్పుకుని నాస్తికవాదాన్ని నమ్ముకోవటమే మేలని చెప్పేంత వరకే నాస్తికవాదం మాట్లాడగగలిగేది.
మతం పేరుమీదే ఎన్నో మారణహోమాలు జరిగాయి. దేవుడు లేడని నమ్ముకునే దేశాల్లో అలాంటి మారణహోమాలు ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఏ దేవుడూ లేడని నమ్ముకోవటానికి మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదన్నది నాస్తికవాదం చెప్పేది.
తప్పితే సమాజాన్ని ఎలా నైతిక పరచాలి? ఎలా ఐక్య పరచాలి? మనిషి భౌతికం (Materialistic) గా అభివృద్ధి చెందినప్పటికీ.. అతని స్వభావంలో సహజంగా ఉండే చెడు ఆలోచనలను అదుపు చేసుకుంటూ.. మంచి ఆలోచన ప్రకారం నడుచుకోవటానికి అవసరమైన నిర్ధిష్ట సూత్రాలు, ప్రణాళికలు ఏమిటి? అన్నప్రశ్నలకు నాస్తిక వాదం దగ్గర నిర్దిష్ట సమాధానాలు ఎప్పటికీ ఉండవు.
ఇక్కడ నాస్తికులను నేను విమర్శించటం లేదు. కారణం ఏ నాస్తికుడినైనా మీరు నాస్తికత్వంలోకి ఎందుకొచ్చేశారని అడిగితే.. మతవ్యవస్థలో హేతువిరుద్ధమైన నమ్మకాలకు మూలమే దేవుళ్లను నమ్ముకోవటం కాబట్టి అసలు ఆ దిక్కుమాలిన గొడవ నుండి బయటపడాలంటే ఏ దేవుడూ లేడని నమ్ముకోవటం కంటే మంచి మార్గం మరొకటి లేదనే చెబుతాడు.. తప్ప నేను మొత్తం విశ్వాన్ని వెతికి చూశాను నాకు ఎక్కడా దేవుడు కనపడలేదు కాబట్టి నాస్తికుడినయ్యానని మాత్రం చెప్పడు. ఎందుకంటే అది జరగని పని కాబట్టి.
కాబట్టి నాస్తిక దృక్పథం అంటూ ఒకటి తయారయ్యింది అంటే దానికి ముఖ్య కారణం మతవ్యవస్థలో కొందరు మతపండితులు కల్పించిన ముఢాచారాలు, మూఢనమ్మకాలే కారణం తప్పితే వారికి మూఢ నమ్మకాలను, మూఢ విశ్వాసాలను తుడుచిపెట్టటానికే సృష్టికర్త తరఫున ధార్మిక గ్రంథాలు అవతరించాయి.. ధర్మానికీ మూఢత్వ మతవ్యవస్థకు సంబంధం లేదు అన్న వాస్తవం వారికి తెలియదు. పైగా వారు ఎప్పుడూ చదవకుండానే ధార్మిక గ్రంథాలే మతమౌఢ్యం ఏర్పడటానికి మూలకారణం అని అపోహపడుతూ మూఢనమ్మకాలనూ, ధార్మిక గ్రంథాలనూ ఒకే గాటన కట్టేసి వ్యతిరేకిస్తుంటారు.
అలాగే.. సర్వసృష్టికర్త అయిన దేవునికీ.. మతవ్యవస్థలో కొందరు కల్పించుకున్న మిధ్యాదేవుళ్లకూ సంబంధం లేదన్న అవగాహన కూడా ఏ నాస్తికుడికీ ఉండదు. అందుకే మతవ్యవస్థలో పూజించబడుతున్న వాటినీ సృష్టికర్త అయిన దైవాన్నీఒకే గాటన కట్టేసి అలవోకగా త్రోసిపుచ్చుతుంటారు.
కాబట్టే ఏ నాస్తికుడినైనా మరి మనుషులు నైతికంగా మార్చటానికి మీ నాస్తికత్వం చెప్పేదేమిటి? అని అడిగితే.. సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచుకుని భౌతికంగా అభివృద్ధి చెందితే చాలు మనిషి నైతికాభివృద్ధి కూడా దానంతట అదే జరిగిపోతుందని చెబుతుంటారు. ఈ సూత్రం ఎటువంటిదంటే “ఈత నేర్చుకుంటే కారు సులభంగా నడిపెయ్యవచ్చు” అని చెప్పటం లాంటిదన్న మాట.
కానీ, వరల్డ్ క్రైమ్ స్టాటిస్టిక్స్ గమనిస్తే.. నేరగణాంకాల్లో కోట్ల కొద్దీ లంచాలు తీసుకునే వారి నుండి అనేక నేరాల్లో ఘోరాల్లో అత్యధికంగా చదువుకున్నవారు పైగా ఉన్నత పదవుల్లో ఉన్నవారే ఉన్నారు. పైగా భౌతికంగా అభివృద్ది చెందిన దేశాలే నేరాల్లోనూ టాప్ టెన్ లో నమోదై ఉన్నాయి.
భౌతికాభివృద్ధి ద్వారా మనిషిలో భౌతిక సామార్థ్యాలు (External abilities) అయితే కచ్చితంగా పెరుగుతున్నాయి. అతను సైంటిక్ నాలెడ్జ్ పెంచుకోగగుతున్నాడు, అనేక భాషల్లో మాట్లాడ గగుతున్నాడు, తాను చదివే చదువులో, తాను చేసే పనిలో నైపుణ్యం పెంచుకోగగుతున్నాడు.. ఆధునికంగా తయారవ్వగలుగుతున్నాడు.. కానీ అతని అంతర్గత సామర్థ్యాలు (Internal abilities) ను అంటే- మంచీ, మానవత్వం, నిస్వార్ధత, త్యాగం, ప్రేమ వగైరా సామర్థ్యాలను పెంపొందించు కోలేకపోతున్నాడు. కాబట్టే సమాజంలో భౌతికాభివృద్ధి జరగటంతో పాటు “నైపుణ్యం కలిగిన ఆధునిక నేరస్తుల” సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. వారిని నైతికంగా ఎలా తీర్చిదిద్దాలి అన్న ప్రశ్నకు నాస్తికుల వద్ద సమాధానం లేదు.
పోనీ, వ్యక్తులు భౌతికంగా అభివృద్ధి చెందితే.. వారిలో నైతికాభివృద్ధి కూడా దానంతట అదే జరిగిపోతుందన్న నాస్తిక దృక్పథంతో గతంలో అలా ఎన్ని మానవసమాజాలు నైతికంగా అభివృద్ధి చెందాయో ఆధారాలు చూపెట్టమంటే నీళ్లు నమలటం తప్ప వారివద్ధ నిర్ధిష్ట సమాధానం ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే “భౌతిక అభివృద్ధి (Materialistic Development)” మరియు “నైతికాభివృద్ధి (Moral Development)” అన్నవి రెండూ వేరు వేరు అంశాలు
*****
మతం పేరుమీదే ఎన్నో మారణహోమాలు జరిగాయి అన్నది కూడా నేటి ఆధునిక నాస్తిక వాదుల అనవగాహనే అని చెప్పాలి. 20 వ శతాబ్దంలో రష్యాతో సహా కమ్యూనిస్ట్ దేశాలు సాగించిన జనహననంలో 100 మిలియన్లకు పైగా ప్రజలు దారుణంగా చంపబడ్డ చరిత్రను తెలిసిన ఎవరైనా కేవలం మతం పేరుమీదే మారణహోమాలు జరిగాయన్న మాట చెప్పలేరు. దేవుణ్ణి, దైవిక విశ్వాసాలను నమ్మని “కమ్యూనిజం” చేసిన ఘోరాల గురించి “ద బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం” పుస్తకం వివరిస్తుంది.
కాబట్టి కొందరు మతం పేరుమీద చేసే మూర్ఖత్వాన్ని చూసి మొత్తానికి ధార్మిక వ్యవస్థానే తప్పుపట్టటం మటుకు చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నేడున్న మత వ్యవస్థకూ ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మానికీ పొంతన లేదన్నది నిర్వివాదం.
మనిషి ఒంటరిగా ఉన్నా తనలో రగిలే చెడు ఆలోచనల వైపుకు వెళ్లకుండా “ఆపగలగటం” మంచి ఆలోచనలవైపుకు “నడపగలగటం” అన్న ప్రక్రియ “ప్రభావవంతమైన ప్రేరకాల” ద్వారానే సాధ్యమవుతుంది తప్ప ఏవో కొన్ని నీతి సూత్రాలు నోటితో వల్లించేసినంత మాత్రానా సాధ్యపడదు. ఆ ప్రేరకాల ద్వారా వ్యక్తులను నైతికంగా మార్చే పనే ధార్మిక గ్రంథాలు చేసేవి. తప్పితే అవి ఇంజినీరింగ్, మెడికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ను నేర్పవు. వాటి లక్ష్యం మనిషి భౌతికసామర్థ్యాలను పెంపొందించటం కాదు అంతర్గత సామర్థ్యాలను పెంపొందించటం. అది తెలుసుకోక మతగ్రంథాలు కూడు పెడతాయా, కడుపు నింపుతాయా? అని మాట్లాడటం కరుడుకట్టిన మూర్ఖత్వం అవుతుంది.
ఏదో కొన్నాళ్లు బ్రతికి మట్టిలో కలిసిపోయే లక్ష్యరహితమైన పనికిమాలిన జీవితం కాదు మనిషిది. ఏ జీవికీ ఇవ్వబడని సామర్థ్యాలను మనిషికి ఇవ్వబడినవి ఒక గొప్ప లక్ష్యం కోసం మాత్రమే అన్న అతని జీవితపు విలువను ధర్మం చెబుతుంది. అంతేకాదు.. మీరు చేసుకునే ప్రతీ మంచి-చెడు పనులకు మీరు జవాబుదారీగా ఉన్నారన్న విషయాన్ని చెబుతుంది. మీ ప్రతీ పనికి ఒకరోజు ఒంటరిగా నిలబడి సమాధానం చెప్పుకోవలసి ఉందని చెబుతుంది.
ఈ తాత్కాలిక లోకంలో మీ విపరీత కోరికలను కొన్నాళ్లు వదిలిపెట్టి కాస్త ఓపిక పట్టి నైతిక విలువలతో కూడిన జీవితం గడిపితే మీకు వందరెట్లు సుఖభోగాలతో కూడిన శాశ్వత జీవితం లభిస్తుంది. అలాకాక, మీరు మీ కోరికలకు లొంగిపోయి మానవతా, నైతిక విలువలను వదిలిపెట్టి ఇష్టానుసారమైన జీవితం గడిపితే ఘోరమైన శాశ్వత శిక్షకు గురికావలసి వస్తుంది. ఈ ప్రభావవంతమైన ప్రేరకాలనే ధర్మం ఇస్తుంది. ఈ బాధ్యతాయుతమైన దృక్పథాన్నే నాస్తికవాదం లేకుండా చేస్తుంది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతేనే నిర్భయంగా రూల్స్ బ్రేక్ చేసే తత్వమున్న మనిషి, తాను రహస్యంగా/బహిరంగంగా చేసే చెడు పనులకు ఎవరి ముందూ జవాబుదారీ కాదు వాటిని ఎవడూ పట్టుకోలేడు, ఎటువంటి శిక్షా ఉండదు అంటే అతనిలో ఉవ్విళ్లూరే విచ్చలవిడి తనాన్ని అదుపు చేసుకునే అదనపు బరువును మనిషి తనపై ఎందుకు వేసుకుంటాడు? మరణానంతరం ఒక జీవితం ఉందీ.. అక్కడ మనిషి రహస్యంగా/బహిరంగంగా చేసిన సకల చెడు/మంచీ పనులు ముందుంచబడతాయి, వాటి విషయంలో ఒంటరిగా నిలబడి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది, దానిని బట్టే శాశ్వత శిక్షా-బహుమానాలు ఇవ్వబడతాయన్న “ప్రభావవంతమైన దృక్పథమే” మనిషిని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చెడు చెయ్యటం నుండి ఆపగలదు, మంచి వైపు నడపగలదు. ఈ చెడు నుండి “ఆపటం”.. మంచివైపు “నడపటం” అన్న పనే ధార్మిక గ్రంథాలు చేస్తున్నాయి.
ఈ విశ్లేషణ చేయకుండా ధర్మాన్నీ, మతవ్యవస్థలో మూఢనమ్మకాల్నీ ఒకే గాటన కట్టేసి ఎంతో హేతుబద్ధమైన ధర్మాన్ని తిరస్కరించే నాస్తికవాదం వల్ల నైతికవిలువలు ఎప్పటికీ సాధ్యంకావు.
